9 November 2017

ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటే అసెంబ్లీకి వస్తాం


ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి
టీడీపీ ప్రభుత్వం, స్పీకర్‌ ఆత్మ విమర్శ చేసుకోవాలి
హైదరాబాద్‌: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలిచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటే ఈ నెల 10వ తేదీ నుంచి జరిగే ఏపీ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతామని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఇంకా 24 గంటల సమయం ఉందని ఆలోగా చర్యలు తీసుకుంటే మేం శాసన సభ సమావేశాలకు వచ్చేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన స్పష్టం చేశారు. గురువారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శ్రీకాంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు అనైతికంగా తన పార్టీలో చేర్చుకున్నారన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు ఫిర్యాదు చేసినా ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో తాము అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్నామన్నారు. ఇప్పటికైనా ఆ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తే తాము అసెంబ్లీకి వస్తామని వెల్లడించారు. మేం ప్రతిపక్షంలో ఉన్నాం. మాకు సమాధానం చెప్పాల్సింది అధికార పక్షం. అయితే మా పార్టీ తరఫున గెలిచిన వారు అటువైపు చేరి సమాధానం చెప్పడం ఇదెక్కడి న్యాయమన్నారు. ఇదేనా ప్రజాస్వామ్యమని ప్రశ్నించారు. ఫిరాయింపుల అంశం కోర్టులో ఉంది. స్పీకర్‌ మాట్లాడటం రాజ్యాంగ విరుద్ధం. చంద్రబాబు పదేపదే సింగపూర్‌ తరహాలో ప్రతిపక్షం లేకుండా చేస్తామని చెబుతున్నారని, సింగపూర్‌ను దత్తత తీసుకుంటామని మోడీతో ఒప్పించే సత్తా మీకు ఉందా చంద్రబాబు అని ప్రశ్నించారు. స్పీకర్‌ రాజ్యాంగాన్ని గౌరవిస్తే అసెంబ్లీకి వస్తామన్నారు.   శాసన సభ అంటే టెంపుల్‌ ఆఫ్‌ డెమెక్రసీ అన్నారు. మంత్రి ఆదినారాయణరెడ్డి స్పీకర్‌ పార్మేట్లో రాజీనామా చేశామని చెబుతున్నారు. ఆయనపై స్పీకర్‌ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో అర్థం కావడం లేదన్నారు. అది డ్రామానా? నిజమో అర్థం కావడం లేదు. ఎదురుదాడి అన్నది మీ సిద్ధాంతమా అని టీడీపీని నిలదీశారు. మీరు చట్టపరంగా ఉండండి,. కచ్చితంగా మేం ప్రజల తరఫున నిలబడతామని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యాన్ని విరుద్ధంగా వెళ్లి మాపై నిందలు మోపితే సహించబోమని హెచ్చరించారు.  ప్రతిపక్షం ప్రజల్లోనే ఉందని, ఎక్కడికి పారిపోలేదని గుర్తు చేశారు. ఇప్పటికైనా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. వారిపై అనర్హత వేటు వేస్తే రేపు ఉదయమే శాసన సభకు వస్తామని చెప్పారు. ప్రతిపక్షం హక్కులను స్పీకర్‌ కాపాడటం లేదు. చంద్రబాబు ప్రభుత్వం, స్పీకర్‌ ఆత్మవిమర్శ చేసుకోవాలని శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. 

No comments:

Post a Comment