13 November 2017

ప్రభుత్వ వైఫల్యానికి అమాయకులు బలి


  • బోటు ప్రమాదంలో 21 మంది మృతి
  • అందులో 16 మంది ఒంగోలు ప్రాంత వాసులే
  • అనుమతులు లేకుండా బోటు నడుపుతుంటే అధికారులు ఏం చేస్తున్నారు
  • లైఫ్‌ జాకెట్‌లు కూడా ఇవ్వకుండా బోటు ఎలా ఎక్కిస్తారు
  • ప్రమాదాన్ని చిన్నగా చూపించేందుకు ప్రభుత్వం కుట్ర
  • పోస్టుమార్టం చేయకుండానే మృతదేహాల తరలింపు
  • ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపించాలి
  • ఒక్కో కుటుంబానికి రూ.20 లక్షల పరిహారం అందించాలి
  • టూరిజం, ఇరిగేషన్, హోంశాఖ మంత్రులు రాజీనామా చేయాలి
  • వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి
విజయవాడ: ప్రభుత్వ వైఫల్యం వల్లే బోటు ప్రమాదంలో 21 మంది చనిపోయారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంట్‌ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి ధ్వజమెత్తారు. అనుమతులు లేకుండా నదిలో టూరిజం వారు బోటు ఆపరేట్‌ చేస్తుంటే అధికారులు, సంబంధిత శాఖ మంత్రి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రమాదం జరిగిన ఫెర్రీ ఘాట్‌ను వైయస్‌ఆర్‌ సీపీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పార్థసారధి, జోగి రమేష్, వెల్లంపల్లి శ్రీనివాసులు, మల్లాది విష్ణు తదితరులు సందర్శించారు. ఈ సందర్భంగా ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ...ఆదివారం సాయంత్రం జరిగిన ఘోర బోటు ప్రమాదంలో 21 మంది మృతి చెందారని అధికారులు చెబుతున్నారని, ఇంకా ఇద్దరి మృతదేహాలు లభ్యం కాలేదన్నారు. ఈ ఘోర ప్రమాదానికి ప్రభుత్వమే ప్రధాన కారణమని మండిపడ్డారు. అసలు ప్రభుత్వం ఉందా.. ఆంధ్రరాష్ట్రంలో అని అనిపిస్తుందన్నారు. 

బోటు ప్రయాణం చేసేవారికి లైఫ్‌ జాకెట్‌లు ఇవ్వకుండా 38 మందిని ఎలా బోటు ఎక్కించారని ఎంపీ ప్రభుత్వాన్ని, అధికారులను ప్రశ్నించారు. బోటుకు లైసెన్స్‌ లేదు. రూట్‌ మ్యాప్‌ సరిగ్గా లేకనే ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారన్నారు. నదుల్లో ఎక్కడ పడితే అక్కడ తవ్వకాలు జరపడం వల్లే బోటు తిరగబడిందన్నారు. ఇంత ఘోరంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. 

చనిపోయిన వారిలో అధికంగా ఒంగోలు పార్లమెంట్‌ వాసులే ఉన్నారని వైవీ సుబ్బారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. యాక్సిడెంట్‌ విషయం తెలుసుకొని రాత్రి బయల్దేరి వస్తే అసలు ఘాట్‌ వద్ద ప్రమాదం జరిగిన ఆనవాళ్లే లేవన్నారు. ఇద్దరు అధికారులు మాత్రమే ఉన్నారని, యాక్సిడెంట్‌ ఎక్కడ జరిగిందంటే మా కార్యకర్తలు తీసుకెళ్లి చూపించారన్నారు. అంటే ఇంత మంది చనిపోతే దాన్ని చిన్నగా చూపించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. బోటు ప్రమాదంపై ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరిపించాలని, ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారం ఏమాత్రం సరిపోదని, ప్రమాదం జరగేందుకు ప్రభుత్వ వైఫల్యమే కారణం కాబట్టి ఒక్కో కుటుంబానికి రూ. 20 లక్షల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. వైయస్‌ఆర్‌ సీపీ అధ్యక్షులు, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌ మృతుల కుటుంబాలను ఏ విధంగా ఆదుకోవాలో దగ్గరుండి చూసుకోవాలని సూచించారన్నారు. ఆ కుటుంబాలను న్యాయం చేసే వరకు పోరాడుతామన్నారు. 

చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చితో ఎంతో మంది అమాయకులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. పబ్లిసిటీతో మాయచేసి చూపించొచ్చు అనే భ్రమలో చంద్రబాబుకు బతుకుతున్నారన్నారు. గోదావరి పుష్కరాల్లో 30 మంది, ఇప్పుడు 21 మంది ప్రాణాలను చంద్రబాబు పబ్లిసిటీ బలితీసుకుందన్నారు. సినిమా సెట్టింగ్‌లు పెట్టించి టెక్నికల్‌ సలహాలు తీసుకోకుండా ఏకపక్షంగా వ్యవహరించడంతోనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఘాట్‌లు, పుష్కరాలు అని చెప్పి వేల కోట్లు ఖర్చు చేశామంటూ దోపిడీకి దిగుతున్నారన్నారు. అర్థరాత్రి ఘాట్‌ను సందర్శించిన అనంతరం ఆసుపత్రికి వెళితే.. అక్కడ 9 మృతదేహాలను పోస్టుమార్టం కూడా చేయకుండా ఒంగోలు పంపించారని చెబుతున్నారన్నారు. ఇంత దారుణమైన ప్రభుత్వాన్ని ఎక్కడ చూడలేదని అసహనం వ్యక్తం చేశారు. అమాయకుల మృతికి కారణమైన అధికారులను తక్షణమే సస్పెండ్‌ చేయాలని, బాధ్యుతలైన టూరిజం, హోంమంత్రి, ఇరిగేషన్‌ మంత్రులు తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. 

No comments:

Post a Comment