30 September 2015

ముక్కుసూటి బీజేపీ మంత్రికి చంద్రబాబు వైఖరి నచ్చటం లేదా..


రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు వరదాయిని అయిన పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు తన స్వార్థం కోసం పక్క దారి పట్టిస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా మిత్రపక్షం బీజేపీ చెబుతోంది.పోలవరం పనులు నత్త నడకన నడుస్తున్నాయని మంత్రిమండలిలో సభ్యుడైన బీజేపీ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు కుండ బద్దలు కొట్టారు.

తెలివిగా పక్కదారి
పట్టిసీమ పేరుతో  తెలివిగా పోలవరం పనుల్ని నత్త నడకన నడిపించాలని చంద్రబాబు నిర్ణయించారు. ఇందుకు కేంద్రం నుంచి నిదులు, సహకారం అందడం లేదని డ్రామా సాగించారు. పట్టిసీమ కోసం పోలవరాన్ని అటక ఎక్కించి చేతులు దులుపుకొన్నారు. ఈ విషయాన్ని బీజేపీ పార్టీ పెద్దలు పసిగట్టారు. స్వయంగా బీేజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు హరిబాబు, తర్వాత మంత్రి మాణిక్యాలరావు బహిరంగంగా వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి కేంద్రం వైపు నుంచి ఎటువంటి ఇబ్బంది లేదని తేల్చి చెప్పారు. అంతా చంద్రబాబు సర్కారులోనే ఉందని చెప్పకనే చెప్పారు. కేంద్ర వైపు నుంచి ఇబ్బందే లేదని, అసలు సమస్య అంతా ఇక్కడే ఉందని మంత్రి మాణిక్యాల రావు కుండ బద్దలు కొట్టి చెప్పారు. పనులకు సంబంధించిన అంచనాలు తయారుచేసి కేంద్రానికి నివేదిక ఇస్తే నిదుల్ని విడుదల చేస్తారని చెప్పారు. ఈ విషయాన్ని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి స్వయంగా చంద్రబాబుకి స్పష్టం చేశారని చెప్పారు. అటువంటప్పుడు కేంద్రం నుంచి లోపం లేదని వివరించారు. 



కొత్త రాజధాని శంకుస్థాపన వెనుక కిటుకు ఏమిటంటే..!


విజయవాడ) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పనులన్నీ పక్కకు పెట్టేశారు. వచ్చే నెలలో జరగబోయే రాజధాని శంకుస్థాపన పనుల మీద ఎక్కువ శ్రద్ధ కనబరుస్తున్నారు. దీంతో ప్రభుత్వ యంత్రాంగం కూడా సింగపూర్ నామస్మరణలో మునిగి తేలుతోంది.




ప్రారంబోత్సవం నుంచి హైప్ 
అక్టోబర్ 22న రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేయాలని ప్రభుత్వం సూత్రప్రాయం గా నిర్ణయించింది. దీనికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ తో పాటు అనేక మంది కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల గవర్నర్ లు, ముఖ్యమంత్రుల్ని ఆహ్వానిస్తున్నారు. దాదాపుగా 15 వందల మంది వీ వీఐపీలకు ఆహ్వానాలు వెళుతున్నాయి. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు న్యాయమూర్తులు, ఉన్నతాధికారుల్ని పిలుస్తున్నారు. ఇంతమంది వస్తుంటే ఆ ఖర్చంతా రాష్ట్ర ప్రజల మీదనే పడుతుందనటంలో సందేహం లేదు. ఇంతమంది తో భారీగా శంకుస్థాపన చేయించటం ద్వారా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం సాధించాలని ప్రయత్నిస్తున్నారు. 

పెట్టుబడుల కోసం ప్రణాళిక
ఈ స్థాయిలో ప్రచారం చేసేందుకు నేషనల్ చానెల్స్ తో ఒప్పందాలు చేసుకొన్నారు. తద్వారా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడుల్ని ఆకర్షించాలన్నది చంద్రబాబు ఎత్తుగడ. ఇప్పటికే రాజధాని లో రైతుల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తామని ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించారు. అందుచేత ఆ దిశగానే పెట్టుబడుల్ని ఆకర్షిస్తారని తెలుస్తోంది. అంటే ఆయా కంపెనీల కార్యకలాపాలు ఎలా ఉన్నప్పటికీ అడ్డగోలుగా విలువైన భూముల్ని 99 సంవత్సరాలకు గాను లీజుకు ఇచ్చేసేందుకు రంగం సిద్ధం అయింది. దీంతో రాజధాని పూర్తిగా సింగపూర్ చేతుల్లో పెట్టేసేట్లుగా పావులు కదుపుతున్నారు.