11 November 2017

తక్షణమే పార్టీ మారిన వారిపై చర్యలు తీసుకోవాలి


  • లేకపోతే చరిత్ర హీనులుగా మిగిలిపోతారు..
  • ప్యారడైజ్ పేపర్స్ పై  జగన్ సవాల్ స్వీకరించండి 
  • ప్రతిపక్షం లేకుండా శాసనసభ నిర్వహించటం సిగ్గుచేటు
  • బాబు అవినీతి వల్లే రాష్ట్రానికి పరిశ్రముల రావటం లేదు
  • పారిశ్రామికవేత్తలు తమకు లాభం ఉంటేనే వస్తారు
  • జపాన్ మాకీ ఆరోపణలు గుర్తులేవా బాబూ
  • జగన్ పై బాబు ఆరోపణలపై తీవ్రంగా మండిపడ్డ బొత్స 
హైదరాబాద్ః చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాల కన్నా వ్యక్తిగత ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని వైయస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రతి పనిలో కమీషన్లు ఆశిస్తున్నారని ధ్వజమెత్తారు. హైదరాబాద్ లో పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో బొత్స మాట్లాడారు. చంద్రబాబు టక్కుటమార విద్యలతో ఏపీ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని, ఎల్లకాలం ఆయన ఆటలు సాగవని బొత్స అన్నారు. చట్టసభల్ని చుట్టాలుగా మార్చుకొని చంద్రబాబు ఏవిధంగా వ్యవహారిస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారన్నారు. తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇటువంటి ముఖ్యమంత్రి, స్పీకర్, సభను ఎప్పుడూ చూడలేదని,  చరిత్ర హీనులుగా మిగిలిపోతారని బొత్స దుయ్యబట్టారు.  ఇకనైనా బాబు ఆలోచన ధోరణి మార్చుకోవాలన్నారు. భావితరాలకు ఇది మంచి సంప్రదాయం కాదన్నారు.  చట్టసభలకున్న గౌరవాన్ని కాపాడి రాజ్యాంగాన్ని పరిరక్షించాలన్నారు.

ఒక పార్టీ గుర్తు మీద ఎన్నికయ్యాక పార్టీ మారాలంటే ముందు  రాజీనామా చేయాలి. దీనిపై స్పీకర్ చర్యలు తీసుకోవాలి. ఇది అవునా ? కాదా? అని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. కనీసం పార్టీ మారిన ఎమ్మెల్యేలకు తాఖీదులైనా ఇచ్చారా? దీని తాలూకా వివరణ ఆ ఎమ్మెల్యేల నుంచి తీసుకున్నారా? మీపై (పార్టీ మారిన ఎమ్మెల్యేలు) అభియోగాలు వస్తున్నాయని స్పీకర్ ఏనాడైనా వివరణ అడిగారా అని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. అందరూ చూస్తుండగా మంత్రులుగానూ ప్రమాణ స్వీకారం చేయించారు.  దీనికి స్పీకర్ వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. శాసనసభలో వ్యక్తిపూజ చేసుకోవాల్సిన అవసరం ఉందా అని చంద్రబాబును ఉద్దేశించి బొత్స ప్రశ్నించారు. జరుగుతున్న తంతును ప్రజలు చూస్తున్నారన్నారు.  చంద్రబాబు  చరిత్ర హీనుడుగా మిగిలిపోతారని బొత్స హెచ్చరించారు. ఇప్పటికైనా స్పీకర్, ముఖ్యమంత్రి ఆలోచనా విధానం మార్చుకోవాలన్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించాలన్నారు. చట్టసభలకు ఉన్న గౌరవాన్ని కాపాడాలన్నారు. వెంటనే పార్టీ ఫిరాయించిన వారిని తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. 

రాష్ట్ర బ్రాండ్ నేమ్ అమరావతి అనేది ప్రతిపక్ష నేత వల్ల పోతోందని చంద్రబాబు అనటంపై బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్ని సమ్మిట్ లు పెట్టారు. కోట్ల ధనం నీళ్లలా ఖర్చు పెడుతున్నారు. విదేశాలు తిరిగారు. ఒక్కటంటే ఒక్క పరిశ్రమైనా వచ్చిందా అని బొత్స ప్రశ్నించారు. ఏ పరిశ్రమ అయినా ఆ రాష్ట్రంలో ఉన్న వనరులు ఏంటి? తమ పరిశ్రమకు వచ్చే లాభాలేంటో బేరీజు వేసుకుంటారన్నారు.  ఏ ప్రభుత్వమైనా.. రాష్ట్రానికి ఆదాయం వస్తుందా లేదా అన్నది చూస్తుందన్నారు. కానీ, వ్యక్తిగా చంద్రబాబు తనకు  ఏ ఆదాయం వస్తుందో చూసుకుంటున్నారన్నారు. ఆ జాయింట్ వెంచర్లలో చంద్రబాబు లాభాలు వేసుకుంటున్నారని ఇది వాస్తవమని బొత్స స్పష్టం చేశారు. ఇది కాదని చంద్రబాబు చెప్పగలరా అని ప్రశ్నించారు. ఉదాహరణలతో సహా వివరిస్తామని బొత్స సత్యనారాయణ అన్నారు. జపాన్ సంస్థ ‘మాకి అండ్ అసోసియేట్స్’ రాష్ట్ర ప్రభుత్వం తీరును ఆ లేఖలో ఎండగట్టిందన్నారు. ఎయిర్ పోర్టు విషయంలోనూ ఇలాగే వ్యవహరించారని బొత్స అన్నారు. ఇలాంటివి ఒకటి, రెండు కాదు.. ఎన్నో ఉదాహరణలు ఉన్నాయన్నారు. చంద్రబాబు ముఖం చూసో.. ఇంకొకరు ముఖం చూసో పారిశ్రామికవేత్తలు రారన్నారు. తమకు వచ్చే లాభాలను చూసుకునే సంస్థలు స్థాపిస్తారన్నారు.  జగన్ వల్లే బ్రాండ్ నేమ్ పోతోందని చంద్రబాబు ఆరోపించటం సిగ్గుచేటన్నారు. 

ప్యారడైజ్ లో ఏముంది?
ప్యారడైజ్ పేపర్స్ లో ఏముందో టీడీపీ నేతలకు తెల్సా అని బొత్స ప్రశ్నించారు. వీళ్లే కావాలని కథనాలు రాయించి.. మంత్రులతో  జగన్ పై విమర్శలు చేయిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై  జగన్ సవాల్ విసిరాక.. టీడీపీ నేతలు తప్పించుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. పనామా పేపర్స్ లీక్ లో హెరిటేజ్ డైరెక్టర్ మోటుపర్తి శివరామ ప్రసాద్ పేరు ఉందన్నారు. ప్రతిపక్షం లేకుండా సభ పెట్టడానికి చంద్రబాబు ప్రభుత్వానికి సిగ్గు లేదా అని బొత్స ఎద్దేవా చేశారు. ప్రతిపక్షం లేకపోతే బాధగా ఉందని స్పీకర్ మాట్లాడడం సరికాదన్నారు. నిష్పాక్షికంగా వ్యవహరించి తనను తాను నిరూపించుకోవాలని కోడెలకు బొత్స సూచించారు. పైగా ఈ ఒక్క రాష్ట్రంలోనే కాదు 13 రాష్ట్రాల్లోనూ పార్టీల ఫిరాయింపులు ఉన్నాయని స్పీకర్ అనటం సిగ్గుచేటని, దీనిపై కోర్టులో ఉందని తప్పించుకోవాలని చూస్తున్నారని బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిరాయింపులపై స్పీకర్ గంటకో మాట మారుస్తున్నారని మండిపడ్డారు. ఇదేమైనా మంచి ఘనకార్యక్రమమా అని బొత్స ప్రశ్నించారు. తనను తాను పొగుడుకుంటూ చంద్రబాబు మాట్లాడుతున్నారని,  ఇలాంటి పరిస్థితి ఎక్కడా లేదన్నారు. 

No comments:

Post a Comment