17 November 2017

బోటు ప్రమాదానికి దేవినేని ఉమానే బాధ్యుడు


–22 మంది ప్రాణాలు కోల్పోవడం చిన్న విషయమా?
– ఏది జరిగినా అధికారులను బాధ్యులను చేస్తున్నారు
– మంత్రులు, టీడీపీ నేతలు అవినీతికి పాల్పడుతున్నారు
– వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి పార్థసారధి

కృష్ణా నదిలో బోటు ప్రమాదానికి ఇరిగేషన్‌ శాఖ మంత్రి దేవినేని ఉమానే బాధ్యుడు అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి పార్థసారధి అన్నారు. ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఈ దుర్ఘటనను మసి పూసి మారడికాయ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. బోటు ప్రమాదం జరిగిన ప్రాంతం ఇరిగేషన్‌ శాఖ మంత్రి సొంత నియోజకవర్గ పరిధిలోకి వస్తుందన్నారు. కూత వేటు దూరంలో ముఖ్యమంత్రి ఇల్లు ఉన్నా, ఇరిగేషన్‌ శాఖ ప్రధాన కార్యాలయం ఉన్నా బోటు ప్రమాదంపై చర్యలు తీసుకోకపోవడానికి కారణం ఏంటని ఆయన ప్రశ్నించారు. శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్థసారధి మీడియాతో మాట్లాడారు. బోటు ప్రమాదంలో 22 మంది అమాయకులు చనిపోతే ప్రభుత్వానికి ఈ విషయం చిన్నదిగా కనిపిస్తుందా అని నిలదీశారు. ఈ ఘటనపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బోటు ఓనర్‌ దొరికారు. టూరిజమ్‌ జీఎంను సస్పెండ్‌ చేశామని ప్రభుత్వం చేతులు దులుపుకుంటుందని ధ్వజమెత్తారు. అనధికారికంగా నడుపుతున్న బోటుకు ప్రభుత్వం అండ ఉందని పేపర్లో వచ్చిందని గుర్తు చేశారు. ప్రమాదం ఇరిగేషన్‌ శాఖ మంత్రికి సంబంధించిన నియోజకవర్గంలో జరిగింది కాబట్టి నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు.అధికారులు అనధికార బోట్లపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఫైర్‌ అయ్యారు. బోటు మార్గంపై ఇరిగేషన్, టూరిజమ్‌ శాఖలు రూట్‌ మ్యాప్‌ వేయాల్సిన అవసరం ఉందా? లేదా? అన్నారు.  కూతవేటు దూరంలో సీఎం నివాసం ఉన్నా, అధికారుల కార్యాలయం ఉన్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. 

ఇరిగేషన్‌ శాఖ మంత్రికి ముడుపులు
ఈదుర్ఘటనకు బోటు, బోటు డ్రైవరేనా? దీనికి బాధ్యుడు ఇరిగేషన్‌ శాఖ మంత్రినే అని పార్థసారధి ఆరోపించారు. ఆయనకు నెల నెల ముడుపులు ముడుతున్నాయి కాబట్టి అనధికార బోట్లు తిరుగుతున్నా కళ్లప్పగించి చూస్తున్నారని ఆక్షేపించారు. మంత్రికి సంబంధించిన చెంచాలు ఇసుక దోచుకుంటున్నారని, మట్టిని వదలడం లేదన్నారు. ఆయన అనుయాయులకే నీరు–చెట్టు కింద 150 పనులకు కాంట్రాక్టులు ఇచ్చారన్న సమాచారం ఉందన్నారు. గుంటకాడి నక్కలా దోచుకుంటున్న మంత్రినే ఈ దుర్ఘటనను పక్కదోవ పట్టించే కార్యక్రమాలు చేపడుతున్నారని విమర్శించారు. 

ప్రజలను మోసం చేస్తున్న చంద్రబాబు
బోటు ప్రమాదంపై ప్రభుత్వ వైఫల్యం ఉందని, అందుకే ఇంతవరకు ఎలాంటి విచారణ చేపట్టడం లô దని పార్థసారధి అన్నారు.  చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. టూరిస్టుల రక్షణ కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు. కనీసం స్వీమ్మర్స్, మోటర్‌ బోట్లు, లైఫ్‌ జాకెట్లు ప్రోవైడ్‌ చేయకుండా టూరిస్టు స్పాట్‌ అని ప్రజలను ఎందుకు మోసం చేశారని చంద్రబాబును నిలదీశారు. మీ మాటలు నమ్మి ప్రజలు ప్రాణాలు పోగోట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇరిగేషన్‌ శాఖ నిర్లక్ష్యం కారణంగానే ఈ బోటు ప్రమాదం జరిగిందన్నారు. మొట్టమొదటి నుంచి ఈ ్రçపమాదం ప్రజలకు తెలియకుండా మనిపూసి మారడి కాయ చేసే ప్రయత్నం చేస్తున్నారు. రక్షణ చర్యలు చేపట్టేందుకు వచ్చిన వైయస్‌ఆర్‌సీపీ నేతలపై విమర్శలు చేయడం ఎంటని ప్రశ్నించారు. మృతదేహాలను బంధువులకు చూపకుండా పోస్టు మార్టం చేయాల్సిన అవసరం ఏముందని నిలదీశారు. ఇరిగేషన్‌ శాఖ మంత్రి ఎలాంటి సమీక్షలు నిర్వహించకుండా, ఇరిగేషన్‌ కమిటీ మీటింగులు ఏర్పాటు చేయకుండా ముడుపులు దండుకోవడమే లక్ష్యంగా దేవినేని ఉమా పని చేస్తున్నారని ఆరోపించారు. 

అవినీతిలో టీడీపీది నాలుగో స్థానం
ప్రపంచంలోనే అత్యంత అవినీతికర పార్టీల్లో టీడీపీ నాలుగో స్థానంలో ఉందని పార్థసారధి తెలిపారు. తాను ఇటీవల ఓ సోషల్‌ మీడియా ఆర్టికిల్‌ చూశానని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అవినీతిమయమైందని, మంత్రులు, టీడీపీ నేతలు అవినీతిలో కూరుకుపోయారని విమర్శించారు. బోటు ఘటనపై జూడిషియల్‌ కమిటీ ఏర్పాటు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పార్థసారధి డిమాండ్‌ చేశారు.

No comments:

Post a Comment