9 November 2017

రైతులను ఇంత దారుణంగా మోసం చేస్తారా


  • పంట సాగు చేసేటప్పుడు ఒక ధర.. విక్రయించేటప్పుడు ఒకధర
  • చంద్రబాబు హెరిటేజ్‌ దుకాణంలో వేలకొద్ది ధరలు
  • శనగ సాగు సమయంలో రూ.10,700..ప్రస్తుతం రూ.4 వేలు
  • వైయస్‌ జగన్‌కు మొరపెట్టుకున్న రైతులు
  • మన ప్రభుత్వం రాగానే ప్రతీ పంటకు రేట్‌ కార్డు
  • రైతు పంటకు ధర నిర్ణయించే విధంగా చేస్తాం
  • వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌
వై.కోడూరు: రైతులు పండించిన పంటలను చౌకధరలకు కొనుగోలు చేస్తూ చంద్రబాబు తన హెరిటేజ్‌ దుకాణంలో వేలల్లో అమ్ముకుంటున్నాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. వై.కోడూరులో వైయస్‌ జగన్‌ రైతులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు పంట పండించే ముందు ఒక ధర, పంట విక్రయించేటప్పుడు మరోధర కేటాయిస్తున్నారని రైతులు తమ గోడు చెప్పుకున్నారు. శనిగలు రేటు పంట పండించే సమయంలో రూ. 10,700 ఉండేదని, ప్రస్తుతం పంట చేతికొచ్చాక రూ. 4 వేలు నిర్ణయించారని, ఎకరా సాగుకు పెట్టుబడి, కౌలు కలిపి మొత్తం రూ. 45 వేల ఖర్చు వస్తుందన్నారు. మినుములు గతేడాది రూ. 13,700 ఉంటే పంట దిగుబడి వచ్చే సమయానికి రూ. 3,700లు చేశారన్నారు. పంట సాగుకు రూ. 20 వేల ఖర్చు వస్తుందన్నారు. ధనియాలు రూ. 4 వేలు ఉంటే ప్రస్తుతం రూ.18 వందలు చేశారని రైతులు వైయస్‌ జగన్‌కు మొరపెట్టుకున్నారు. 

రైతుల పంటను బ్రోకర్‌లు కొన్న తరువాత ప్రభుత్వం ధరలను అమాంతం పెంచుతుందని వైయస్‌ జగన్‌ మండిపడ్డారు. ఆరుగాలం కష్టపడి పంట సాగు చేసిన రైతు ఎలా బతకాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రూ. 5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇంత వరకు ఒక్క రూపాయి కూడా పెట్టలేదన్నారు. రుణమాఫీ, ఇన్‌పుట్‌ సబ్సిడీ లేక రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన చెందారు. వెంకట్రామిరెడ్డి అనే రైతుకు రూ. 1.5 లక్షల రుణం ఉంటే బ్యాంక్‌కు వెళితే వెనక్కు డబ్బులు ఇవ్వాలని బ్యాంక్‌ వారే అడిగే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు రైతులు పడే బాధలను అర్థం చేసుకోవాలన్నారు. 

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం వచ్చిన తరువాత పండించిన పంటకు రైతే ధర నిర్ణయించే విధంగా తీసుకొస్తామని వైయస్‌ జగన్‌ వారికి భరోసా ఇచ్చారు. చంద్రబాబు రూ. 5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి అంటే నమ్మి మోసపోయారు. వైయస్‌ఆర్‌ సీపీ రూ. 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని, ప్రతి రైతు పంటకు రేటు కార్డు కూడా పెడతామన్నారు. రాయలసీమ ప్రాంతంలో ఆగస్టు 9వ తేదీ వరకు –22 శాతం, అనంతపురంలో –32 శాతం రెయిన్‌ఫాల్‌ ఉందన్నారు. అయినా ఇప్పటి వరకు కరువు మండలాలను ప్రకటించలేదన్నారు. ఇంత దారుణంగా చంద్రబాబు రైతులను మోసం చేస్తున్నాడని మండిపడ్డారు. 

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన నవరత్నాల గురించి అందరికీ తెలుసా అని రైతులను వైయస్‌ జగన్‌ అడిగారు. పథకాలు బాగున్నాయా.. అందులో ఏమైనా మార్పులు చేస్తే బాగుంటుందా అని ఆరా తీశారు. దీంతో రైతులు చిన్న, సన్నకారులు రైతులు అనే తేడా లేకుండా అందరికీ రూ. లక్షా భరోసా ఇవ్వాలని కోరారు. 

No comments:

Post a Comment