27 February 2018

భూమి ఇవ్వని రైతుపై దాడిచేస్తారా

కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తున్న టీడీపీ సర్కార్‌
అక్రమంగా రైతు రాంప్రసాద్‌ భూమిలో నిర్మాణాలు
అడ్డుకునేందుకు ప్రయత్నించగా రైతు బట్టలూడదీసి దాడి
సీఐఐ సదస్సుతో లక్షల కోట్లు పెట్టుబడులంటూ బాబు ఆర్భాటం
రోజుకు 20 లక్షల ఉద్యోగాలు అంటూ గొప్పలు
నాలుగేళ్లుగా ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగాలు, ఎన్ని పరిశ్రమలు పెట్టారు
సమాధానం చెప్పాలని వైయస్‌ఆర్‌ సీపీ అధికార ప్రతినిధి పార్థసారధి డిమాండ్‌
హైదరాబాద్‌: రాజధాని నిర్మాణానికి భూమి ఇవ్వడానికి నిరాకరించిన రైతుపై టీడీపీ నేతలు, అధికారులు, పోలీసులు దాడి చేయడం ఎంతవరకు సమంసజం అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారధి ప్రశ్నించారు. కోర్టు ఉత్తర్వుల ప్రకారం నడుచుకోవాల్సిన బాధ్యత ప్రజలతో పాటు ప్రభుత్వంపై కూడా ఉందనే సంగతి మీకు తెలియదా చంద్రబాబూ అని ప్రశ్నించారు. రైతు రాంప్రసాద్‌ అనే వ్యక్తికి సంబంధించిన భూమిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని కోర్టు ఆదేశాలు ఇచ్చినా అధికారులు దాన్ని ఉల్లంఘించారన్నారు. నిర్మాణాలను అడ్డుకోవడానికి వెళ్లిన రూతును బట్టలు ఊడదీసి దాడి చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్థసారధి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజధాని నిర్మాణం కోసం చంద్రబాబు సేకరించిన 33 వేల ఎకరాలు నిరుపయోగంగా ఉన్నాయన్నారు. వాటిల్లో 2–3 వందల్లో మాత్రమే తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ కట్టారన్నారు. మిగిలిన భూముల్లో టీడీపీ ఎమ్మెల్యే లారీల్లో తన గేదెలను తీసుకువచ్చి మేపుకున్న దుస్థితి నెలకొందన్నారు. 

చట్టబద్ధంగా వ్యవహరించాల్సిన పోలీసులు మంత్రులు అండతో ప్రజలపై హింసకు దిగుతున్నారని పార్థసారధి మండిపడ్డారు. తమ భూమి ఇవ్వనని స్పష్టంగా చెప్పిన రైతుపై దాడి చేయడం ఏంటని ప్రశ్నించారు. అంటే రాష్ట్రంలో ఎలాంటి పాలన రాజ్యమేలుతుందో అర్థం చేసుకోవాలన్నారు. కోర్టు ఆదేశాలు ఉల్లంఘించిన పోలీసులు, నిర్మాణాలు చేపట్టిన అధికారులు, వారి వెనుక ఉన్నవారిపై ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 

పాట్నర్‌షిప్‌ సమ్మిట్‌ల ద్వారా ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చారో.. రాష్ట్రంలో ఎన్ని కోట్ల పెట్టుబడులు వచ్చాయో చంద్రబాబు సమాధానం చెప్పాలని పార్థసారధి డిమాండ్‌ చేశారు. సీఐఐ సదస్సులని విశాఖలో బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నారని, ఇప్పటికే నాలుగు సంవత్సరాల్లో రూ. 15 లక్షల కోట్లకు సంబంధించిన ఎంఓయూలు కుదుర్చుకున్నట్లుగా సంతకాలు పెట్టి ఫొటోలకు ఫోజులు ఇచ్చారన్నారు. గతంలో 10.5 లోల ఉద్యోగాలు వస్తాయన్న చంద్రబాబు ఇప్పుడు కొత్తగా 20 లక్షల ఉద్యోగాలు, రోజుకు రూ. 50 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని చెబుతున్నారన్నారు. ఇంతకు ముందు జరిగిన పాట్నర్‌షిప్‌ సమ్మిట్‌లలో ఎన్ని లక్షల కోట్లతో పెట్టుబడులు పెట్టారో... ఎంత మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలన్నారు. కాకిలెక్కలు కాకుండా కేంద్ర ప్రభుత్వ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇండస్ట్రీయల్‌ పాలసీ ధ్రువీకరించిన లెక్కలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. 

No comments:

Post a Comment