5 February 2018

ప్రతి కులానికి కార్పొరేషన్‌


–మహిళలకు, రైతన్నలకు వడ్డీ లేని రుణాలు
– నెలకు రూ. 2 వేల పింఛన్,  45 ఏళ్లకే పింఛన్లు 
– పిల్లలు పెద్ద చదువులు చదివితేనే తలరాతలు మారుతాయి
– ఎన్ని లక్షలు ఖర్చైనా ప్రభుత్వమే భరిస్తుంది
– ఎలాంటి నాయకుడు కావాలో ఆలోచించండి
– ఎన్నికలప్పుడు మాత్రమే చంద్రబాబుకు ప్రజలు గుర్తుకు వస్తారు
– కేంద్ర బడ్జెట్‌ కేబినెట్‌ ఆమోదం తరువాతే ప్రవేశపెడతారు
– కేబినెట్‌లో మీ ఎంపీలు ఎందుకు ఆమోదం తెలిపారు.
– బహిరంగ సభలో ఆకట్టుకున్న ముద్దాయి కథ

నెల్లూరు: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పేదరికానికి కులం, మతం అన్న తేడా ఉండదని, అన్ని కులాలకు కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి తోడుగా ఉంటానని హామీ ఇచ్చారు. చెడిపోయిన రాజకీయ వ్యవస్థను మార్చేందుకు బయలుదేరిన తనకు మద్దతుగా నిలవాలని వైయస్‌ జగన్‌ పిలుపునిచ్చారు. మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేదలకు ఏం చేయబోతున్నామన్నది వివరించి చెప్పారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో సోమవారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అశేష జనవాహినిని ఉద్దేశించి మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే ..


ఈ రోజు ఎండ కూడా కాస్తా తీక్షణంగానే ఉంది. అయినా కూడా వేలాది మంది నాతో అడుగులో అడుగు వేశారు. ఒకవైపు ఉన్న కష్టాలను చెబుతున్నారు. మరోవైపు అన్నా..మీ వెంటే మేమున్నామని చెబుతున్నారు. ఇక్కడ నడిరోడ్డుపై ఎండలో నిలబడాల్సిన అవసరం లేదు. చిక్కటి చిరునవ్వులతోనే ఆప్యాయతలు చూపుతున్నారు. ఆత్మీయతలు పంచుతున్నారు. మీ అందరి ప్రేమానురాగాలకు పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను.

బాబు ఎప్పుడు సీఎం అయినా..
ఈ రోజు ఈ నియోజకవర్గంలో తిరుగుతున్నప్పుడు రైతన్నలు నా వద్దకు వచ్చారు. ఆ రైతన్నలు నాతో చెప్పిన మాటెంటో తెలుసా? మా కొవూరు నియోజకవర్గంలోని కొవూరు చక్కెర ఫ్యాక్టరీ 1979వ సంవత్సరం నుంచి నడుస్తోందన్నా..1996లో చంద్రబాబు సీఎం అయ్యారు..ఆ తరువాత ఈ ఫ్యాక్టరీ మూతపడిందన్నా అని చెప్పారు. ప్రభుత్వానికి సంబంధించిన ఏ పరిశ్రమ కనిపించినా కూడా చంద్రబాబు దగ్గరుండి వాటిని మూత వేయిస్తున్నారు. ఆ తరువాత పప్పులు, బెల్లానికి ఆ పరిశ్రమ పరికరాలు అమ్ముతున్నారని చెప్పారు. తన బినామీ సీఎం రమేష్‌కు చంద్రబాబు అప్పనంగా అమ్మేశారని ఇదే రైతులు చెప్పారు. కొవూరు చక్కెర ఫ్యాక్టరీని కూడా అమ్మేందుకు చంద్రబాబు విశ్వ ప్రయత్నాలు చేశారని, కోర్టుకు కూడా వెళ్లామన్నారు. ఆ తరువాత దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి అధికారంలోకి రాగానే మూతపడ్డ చక్కెర ఫ్యాక్టరీ తెరిపించారని ఆ రైతన్నలు అంటుంటే చాలా ఆనందమనిపించింది. ఆ తరువాత నాన్నగారు చనిపోవడం, మన ఖర్మ కొద్ది చంద్రబాబు సీఎం అయ్యారు. కొవూరు మూతపడింది.  ప్రజలను ఏ స్థాయిలో మోసం చేస్తారని చెప్పడానికి సాక్షాత్తు కొవూరుకు వచ్చి ఆ చక్కెర ఫ్యాక్టరీ తెరిపిస్తామని మాట ఇచ్చి నాలుగేళ్లు అవుతున్నా..ఇవాల్టికి కూడా చక్కెర ఫ్యాక్టరీ మూతపడి ఉంది. రైతులకు బకాయిలు చెల్లించలేదు. దాదాపు 14 మండలాల్లో దాదాపు 5 వేల మంది రైతులకు ఈ చెక్కర ఫ్యాక్టరీ తోడుగా ఉండేది. చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో రైతులంతా కూడా కన్నీరు పెడుతున్నామని వాపోతున్నారు. ఇదే కొవూరు నియోజకవర్గంలో ఎరువుల తయారీ కోసం ఇఫ్కో సంస్థతో ఫర్టిలైజర్‌ ఫ్యాక్టరీ పెట్టాలని కదలికలు జరిగాయి. నాన్నగారు ముఖ్యమంత్రి అయిన తరువాత నాలుగుఅడుగులు ముందుకు వేసింది. ఇఫ్కో సంస్థతో మాట్లాడి..కిసాన్‌ సెజ్‌ కింద తీసుకునేందుకు ప్రతిపాదనలు చేశారు. దురదృష్టవశాత్తు నాన్నగారు మనమధ్య నుంచి వెళ్లిపోయారు. ఇవాళ ఇక్కడ రబీలో పండే వరి పంట రాష్ట్రంలోనే నెల్లూరు జిల్లానే టాప్‌. ఇలాంటి జిల్లాకు ఎరువుల పరిశ్రమ వస్తే రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది. ఇవాళ చంద్రబాబు లంచాలు తీసుకొని కొక్కోకోలా ఫ్యాక్టరీకి భూములు ఇప్పిస్తారు. ఆ ఫ్యాక్టరీకి రైతుల నుంచి నీళ్లు దోచేసి ఇస్తున్నారు. లంచాలు కోసం కక్కుర్తి పడి ఒక ముఖ్యమంత్రి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నాడని చెప్పడానికే ఇదే నిదర్శనం. ఇదే నియోజకవర్గంలోని సంగం భ్యారేజ్, నెల్లూరు బ్యారేజ్‌ కనిపిస్తున్నాయి. నాన్నగారి పాలనలో ఈ ప్రాజెక్టులకు దాదాపు 80 శాతం పనులు పూర్తి అయ్యాయి. ఇవాళ మిగిలిపోయిన 20 శాతం పనులు ఎక్కడివిక్కడే ఉన్నాయి. నాన్నగారు బతికి ఉన్నప్పుడు సబ్‌మర్సిబుల్‌ పనులకు ప్రతిపాదనలు తయారు చేశారు. నాన్నగారు చనిపోయాక ఈ పనులు నిలిచిపోయాయి.

ఇంత దారుణమైన పాలన ఎక్కడా లేదు..
ఇక్కడికి వచ్చేసమయంలో ఆక్వా రైతులు నన్ను కలిశారు. కరెంటోళ్లు ఏసీడీ అని పెట్టారన్నా..మమ్మల్ని బాదుడే బాదుడు అని అక్వా రైతులు మొత్తుకుంటున్నారు. రైతులు వాడుకున్న దానికన్న ఎక్కువ వాడుకుంటే లక్షల్లో ఫెనాల్టీలు వసూలు చేస్తూ..డబ్బులు కట్టకపోతే లాక్కెతున్నారని చెబుతున్నారు. ఇంతదారుణంగా పాలన సాగుతోంది.

ఇది చంద్రబాబు పాలనా తీరు
రాష్ట్రంలో చంద్రబాబు చేస్తున్న పరిపాలన తీరును  ఒక్కసారి చూడండి. ఇదే పెద్ద మనిషి నాలుగేళ్ల పాలన చూశాం. మరో ఏడాదిలో ఎన్నికలు రాబోతున్నాయి. ఒక్కసారి మీ గుండెలపై చేతులు వేసుకొని ఆలోచన చేయమని కోరుతున్నాను. చంద్రబాబు పాలనను గమనించమని కోరుతున్నాను. ఇదే పెద్ద మనిషి ఎన్నికల సమయంలో అన్న మాటలు ఏంటీ? మాట మీద నిలబడ్డాడా? రేపు పొద్దున ఎన్నికలు జరిగితే అబద్ధాలు చెప్పేవాడు నాయకుడు కావాలా? అనిఅడుగుతున్నాను. మోసం చేసేవాడు మీకు నాయకుడు కావాలా? అని అడుగుతున్నాను. రెండు మూడు రోజులుగా టీవీలు చూసేవారికి చంద్రబాబు తీరుపై ఆశ్చర్యమనిపిస్తోంది. ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ చూసిన చంద్రబాబు విలవిలలాడిపోయారట. నాలుగేళ్లుగా చంద్రబాబు ఎన్‌డీయేలో భాగస్వామిగా ఉన్నారు. ఆయనకు సంబంధించిన ఎంపీలు కేంద్రంలో మంత్రులుగా ఉన్నారు. బడ్జెట్‌ ప్రవేశపెట్టే ముందుకు కేంద్ర క్యాబినెట్‌ అంతా కూర్చొని ఆమోదిస్తారు. ఆ తరువాత బడ్జెట్‌ను పార్లమెంట్లో ప్రవేశపెడుతారు. మొన్న నరేంద్రమోడీ బడ్జెట్‌ ప్రవేశపెడితే అన్యాయం జరిగిపోయిందని చంద్రబాబు గింజుకుంటున్నారు. కేంద్ర క్యాబినెట్లో మీ మంత్రులు ఉండి బడ్జెట్‌కు ఎందుకు ఆమోదం తెలిపారని ప్రశ్నిస్తున్నారు. ఇదే చంద్రబాబు నాలుగేళ్లు నిరీక్షించామని, విసిగిపోయామని లీకులు ఇచ్చారు. నీ మంత్రులు ఆమోదం తెలిపిన తరువాతే కదా బడ్జెట్‌ ప్రవేశపెట్టింది. ఎన్నికలప్పుడే చంద్రబాబుకు ప్రజలు గుర్తుకు వస్తారు. ప్రజలకు తానే అన్యాయం చేశానని ఆయనకు గుర్తుకు వస్తుంది.

అన్నీ దొంగ ఏడుపులే..
‘అనగనగా ఒక ముద్దాయి.. ఆ ముద్దాయి కోర్టు బోనులో నిలబడ్డాడు. కాసేపటికి జడ్జ్‌ వచ్చాడు. జడ్జ్‌ రాగానే ముద్దాయి బిగ్గరగా ఏడ్వడం మొదలుపెట్టాడు. ‘తల్లిదండ్రీ లేనివాడిని.. నేను అనాథను.. నాకు దిక్కెవరు లేరు సార్‌’ అంటూ తనను విడ్చిపెట్టాలని జడ్జ్‌గారిని వేడుకున్నాడు. జడ్జ్‌గారు.. ఈ ముద్దాయి తల్లీదండ్రీ లేని అనాథ అంటున్నాడు. పోలీసులు ఎందుకు తీసుకొచ్చారని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ను అడిగారు. ఏమిటి ఇతడు చేసిన తప్పు అని ప్రశ్నించారు. దానికి.. ‘ఇతనివన్నీ దొంగ ఏడ్పులు. నమ్మకండి సార్‌. తల్లిదండ్రీని చంపి.. బోనులో నిలబడి.. ఇప్పుడు దొంగ ఏడ్పులు ఏడుస్తున్నాడు’ అని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ తెలిపారు.. అచ్చం ఆ ముద్దాయి తరహాలోనే ఇప్పుడు చంద్రబాబు ఉంది’ అని వైఎస్‌ జగన్‌ వివరించారు. రాష్ట్రం విడిపోవడానికి, ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవడానికి చంద్రబాబే కారణమని, దుగ్గరాజపట్నం పోర్టు  ఇవ్వకపోయినా పర్లేదని కేంద్రానికి చెప్పింది బాబేనని, పోలవరం ప్రాజెక్టు ఇంత అధ్వాన్నంగా అగోరించడానికి కారణం కూడా ఆయనేనని నిప్పులు చెరిగారు. ఇన్ని పాపలు, నేరాలు చేసిన బాబుకు, కోర్టులో ఏడ్చిన ఆ ముద్దాయికి ఏమైనా తేడా ఉందా? అని ప్రశ్నించారు. దారుణంగా అబద్ధాలు చెప్పి.. వాటిని నమ్మించే ప్రయత్నం చేయడం, తనకు అనుకూలంగా ఉన్న మీడియా వ్యవస్థను అందుకు వాడుకోవడం బాబు నైజమని మండిపడ్డారు.
ఓటుకు రూ. 3 వేలు ఇస్తారు..
ఇవాళ చంద్రబాబు నాలుగేళ్ల పాలన చూశారు. ఇటువంటి అన్యాయమైన, మోసం చేసే పాలనను క్షమిస్తే..రేపొద్దున ఇదే పెద్ద మనిషి పెద్ద పెద్ద అబద్ధాలు చెబుతారు. పొదుపు సంఘాల అక్కా చెల్లెమ్మల రుణాలు పూర్తిగా మాఫీ చేస్తామంటే వారు నమ్మరని చంద్రబాబుకు తెలుసు. కాబట్టి చంద్రబాబు రేపొద్దున ఏం చెబుతారో తెలుసా? ఇంతకంటే పైస్థాయిలోకి వెళ్తారు. ప్రతి ఇంటికి కేజీ బంగారం అంటాడు. మీరు నమ్ముతారా? నమ్మరు కాబట్టి కేజీ బంగారానికి బోనస్‌ అంటూ ప్రతి ఇంటికి బెంజి కారు కొనిస్తా అంటాడు. నమ్ముతారా అని అడుగుతున్నాను. నమ్మరు అన్న సంగతి తెలిసి..ఓటుకు రూ.3 వేలు కూడా ఇస్తాడు. డబ్బు ఇస్తే వద్దు అని చెప్పవద్దు..కారణం ఏంటో తెలుసా..ఆ డబ్బు మనది..మనల్ని దోచేసి ఆయన సంపాదించారు. డబ్బు తీసుకొని ఈ మనిషికి బుద్ధి చెప్పండి. ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థ మారాలి. విశ్వసనీయత, నిజాయితీ అన్న పదాలకు అర్థం రావాలి. చెప్పిన మాట నెరవేర్చకపోతే ఆ నాయకుడు తన పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లాలి. ఈ వ్యవస్థలో నిజాయితీ అన్న పదానికి అర్థం రావాలంటే ఒక్క వైయస్‌ జగన్‌ వల్ల కాదు..మీ అందరి తోడు కావాలి. అప్పుడు ఈ వ్యవస్థలో మార్పు తీసుకొని వస్తా.

సలహాలు ఇవ్వండి..
మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మనం ఏం చేస్తామన్నది నవరత్నాలు ప్రకటించాం. అందులో ఏవైనా మార్పులు, చేర్పులు ఉంటే నాకు సలహాలు, సూచనలు ఇవ్వమని మిమ్మల్ని కోరుతున్నాను. ఇవాళ నవరత్నాల్లో నుంచి పేద వాడి కోసం ఏం చేస్తామన్నది చెబుతున్నాను.

ఒక్కసారి ఆలోచించండి..
మన పిల్లల చదువుల గురించి చెబుతున్నాను. ఒక్కసారి మీరు మీ గుండెలపై చేతులు వేసుకొని ఆలోచన చేయమని కోరుతున్నాను. మన పిల్లల్ని ఇంజినీర్లు, డాక్టర్లుగా చదివించగలమా? ఫీజులు చూస్తే ఏడాదికి లక్షల్లో ఉన్నాయి. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ముష్టి వేసినట్లు రూ.35 వేలు ఇస్తున్నారు. మిగిలిన డబ్బులు చెల్లించేందుకు తల్లిదండ్రులు అప్పులపాలు అవుతున్నారు. నాన్నగారి పాలన ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని అడుగుతున్నాను. నాన్నగారి పాలనలో పేదవారి పిల్లలు ఇంజినీరింగ్, డాక్టర్‌ చదవాలన్నా ఒక భరోసా ఉండేది. ఎన్ని లక్షలు ఖర్చైనా నేను భరిస్తా అని వైయస్‌ఆర్‌ తోడుగా ఉండేవారు. ఇ దే చంద్రబాబుకు బీసీలపై ప్రేమ అంటే నాలుగు కత్తెర్లు, ఇస్త్రీ పెట్టెలు ఇవ్వడమే. నిజంగా పేదవారిపైన ప్రేమ చూపించింది దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి అని గర్వంగా చెబుతున్నారు. నాన్నగారు పేదవారి కోసం ఒక అడుగు ముందుకు వేశారు. వైయస్‌ జగన్‌ అదే పేదవారి కోసం రెండు అడుగులు ముందుకు వేస్తున్నాను. మన పిల్లల్ని ఇంజినీర్లు, డాక్టర్లుగా చదివేందుకు హాస్టల్‌లో ఉండి మెస్‌ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. అలాంటి ప్రతి తల్లిదండ్రులకు చెబుతున్నాను. వారి హాస్టల్‌ ఖర్చుల కోసం ప్రతి ఏటా రూ.20 వేలు చెల్లిస్తాం. చదువుల విప్లవం తీసుకువచ్చేందుకు చిన్న పిల్లల పునాదులు వేసేందుకు అమ్మ ఒడి కార్యక్రమాన్ని ప్రవేశపెడతాం. చిన్న పిల్లలను బడికి పంపించినందుకు తల్లి ఖాతాలో రూ.15 వేలు ఇస్తామని చెబుతున్నాను. 

అవ్వ, తాతల జీవితాల్లో వెలుగులు నింపుతా..
ధరలు ఇవాళ పెరుగుతున్నా చంద్రబాబుకు పింఛన్లు పెంచడానికి మనసు రాదు. కాంట్రాక్టర్లకు మాత్రం పెంచుతారు. అదే అవ్వతాతలకు ఇచ్చే పింఛన్లు మాత్రం పెంచడం లేదు. దీనికి కారణంగా కాంట్రాక్టర్లు లంచాలు ఇస్తారు కాబట్టి వారికి పెంచుతారు. పింఛన్లు పెంచితే జన్మభూమి కమిటీల వద్దే నిలిచిపోతాయని, తనకు లంచాలు రావని పెంచడం లేదు. అదే మనందరి ప్రభుత్వం వచ్చాక పింఛన్‌ రూ.2 వేలు పెంచుతాం. అంతేకాదు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు పనులకు వెళ్తే కానీ కడుపు నిండని పరిస్థితి ఉంది. వారం రోజులు పనులకు వెళ్తకపోతే పస్తు ఉంటున్నారు. వారందరికీ చెబుతున్నాను. . పింఛన్‌ వయసు 45 ఏళ్లకే తగ్గిస్తున్నానని చెబుతున్నాను. ఇవాళ చంద్రబాబు పాలనలో పింఛన్‌ వయసు 65 ఏళ్లు ఉంది. మనం అధికారంలోకి వచ్చాక పింఛన్‌ వయసు 60 ఏళ్లకే తగ్గిస్తాం.

అక్కాచెల్లెమ్మలకు తోడుగా ఉంటా
చంద్రబాబు పొదుపు రుణాలు మాఫీ చేస్తామని ,రుణాలు కట్టొద్దని చెప్పడంతో అక్కా చెల్లెమ్మలు అస్తవ్యస్తంగా ఉన్నారు. చంద్రబాబు రాకముందుకు పొదుపు సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందేవి. ప్రభుత్వాలు బ్యాంకులకు వడ్డీ డబ్బులు కట్టేవి. చంద్రబాబు వచ్చాక ప్రభుత్వం తరఫున వడ్డీ డబ్బులు కట్టకుండా ఎగురగొట్టారు. ప్రతి అక్కకు చెల్లెమ్మకు చెబుతున్నాను. ఎన్నికల నాటి వరకు మీకు ఎంతైతే అప్పు ఉందో ఆ డబ్బంతా మీకే నేరుగా ఇ స్తానని మాట ఇస్తున్నాను. మరో వైపు మీ వడ్డీ డబ్బులు ప్రభుత్వమే కడుతుంది. వడ్డీ లేని రుణాలు ఇచ్చి ఆదుకుంటాను.
– నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో ఒక్క ఇల్లు కూడా కట్టించలేదు. ప్రతి పేద వాడికి మూడు సెంట్ల స్థలం ఇస్తా అన్నాడు. నాన్నగారి పాలనను గుర్తుకు తెచ్చుకోండి. దేశంతో పోటి పడి మన రాష్ట్రంలో 48 లక్షల ఇల్లు కట్టించిన ఘనత వైయస్‌ఆర్‌ది. మనందరి ప్రభుత్వం వచ్చాక ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిచ్చి ఇస్తాను. అంతమాత్రమే కాదు ఆ ఇంటిని అక్కా చెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్‌ చేయిస్తాను. అది వారికి ఆస్తిగా ఉండబోతుంది. ఎప్పుడైనా డబ్బులు అవసరమైతే ఆ ఇంటికి తాకట్టుపెట్టి పావలా వడ్డీకే రుణాలు పొందే వీలు కల్పిస్తాను.

ఆ చిట్టి తల్లి మాటలు కదిలించి వేశాయి..
నిన్న ఆర్యవైశ్యుల ఆత్మీయ సమ్మేలనం జరిగింది. సభ అయిపోయిన తరువాత ఒక చిన్నపాప నావద్దకు వచ్చి..అన్నా..మేం ఓసీలం అన్నా..మాకు కూడా కార్పోరేషన్‌ఇస్తే మాకు కూడా లోన్లు ఇస్తారు కదన్నా అని ఆ చిన్న చిట్టి తల్లి అనింది. ఆమె అన్న మాటలు నన్ను కదిలించి వేసింది. కార్పొరేషన్‌ అన్నది ఏ కులానికైనా ఆ కులానికి అప్పులు ఇచ్చేందుకు ఏర్పాటు చేస్తారు. ఆ డబ్బులతో కాస్తోకూస్తో అవసరాలు తీరుతాయి. పేదరికానికి కులం లేదు..మతం లేదు. ఆ కులాలన్నింటికి కూడా మేలు జరిగేందుకు కమ్మ, రెడ్డిలు, రాజులకు కూడా కార్పొరేషన్‌ఏర్పాటు చేస్తాం. అందరికి రుణాలు ఇస్తేనే పరిస్థితులు మారుతాయి. ప్రతి ఒక్కరికి తోడుగా ఉండేందుకు ప్రతి కులానికి కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి తోడుగా ఉంటానని హామీ ఇస్తున్నాను. మాట్లాడిన ప్రతి మాటకు ఏదైనా సలహాలు, సూచనలు ఇవ్వాలనుకుంటే నావద్దకు రావచ్చు. నేను ఎక్కడికి వెళ్తున్నానో అందరికి తెలుసు. బయలుదేరిన మీ బిడ్డకుతోడుగా ఉండమని పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను.

No comments:

Post a Comment