1 February 2018

రాజకీయ బాహుబలి - వైఎస్సార్

రాజకీయ బాహుబలి వైఎస్సార్ 
ఇలపావులూరి మురళిమోహనరావు రచన 

దివంగత ముఖ్యమంత్రి తన పరిపాలనలో ఎన్నెన్ని ఘనకార్యాలు సాధించాడో, చంద్రబాబు తొమ్మిదేళ్ల దుష్పరిపాలనలో దివాళా తీసిన ఆంధ్రప్రదేశ్ ను ఏవిధంగా అభివృద్ధి పధంలో పరుగులెత్తించాడో, విద్యా, వైద్య, ఆరోగ్య, ఐటి, పరిశ్రమలు, సాగునీటి ప్రాజెక్టులు, ఉపాధికల్పన, రంగాలలో ఎంత శ్రద్ధ చూపించాడో ఈనాటి తరానికి పెద్దగా తెలియక పోవచ్చు. 
అయిదేళ్ల వైఎస్సార్ సువర్ణ పరిపాలనలో జరిగిన, సాధించిన విశేషాలను సీరియల్ గా తెలుసుకుందాము.  

నమ్మలేని నిజాలను తెలుసుకోవడానికి సిద్ధంగా  ఉండండి.

పాతికేళ్ల వయసు లోపలివారికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ గూర్చి తెలియని అనేక విశేషాలు, అరవై మూడు నెలల స్వల్పకాలంలో ఆయన సాధించిన అనల్ప విజయాలు...శత్రువుల తో సైతం కన్నీళ్లు పెట్టించిన ఆయన హృదయవిదారక మరణం గూర్చిన కధనాలు....


రాజకీయ బాహుబలి వైఎస్సార్ - 1 

                   
ఆయన అమితాబ్ బచ్చన్ లా ఆరడుగుల ఆజానుబాహుడు కాడు.

ఎన్టీఆర్ లా మన్మధుడు కాడు 

ఎస్వీ రంగారావులా భారీకాయుడు కాడు 

చిరంజీవిలా గ్లామర్ కలిగినవాడు కాడు 

అయితేనేం?  కేవలం అరవై మూడు మాసాల సుపరిపాలనతో పదికోట్లమంది తెలుగువారి హృదయమందిరాల్లో శాశ్వతంగా కొలువై వున్నాడు.  

ఆయన మరణించాక హైదరాబాద్ లో వినాయక నిమజ్జనం జరిగినపుడు విఘ్నేశుడి విగ్రహం తో పాటు వైఎస్సార్ ఫోటో కూడా ఊరేగించి నిమ్మజ్జనం చేశారు.  అంతటి గౌరవం అంతకుముందు ఆ తరువాత మరే నాయకుడికీ దక్కలేదు.  

ఆయన్ని అణగదొక్కాలని కాంగ్రెస్  సీనియర్ నాయకులు చెయ్యని ప్రయత్నం లేదు.  ఇందిరాగాంధీకి ఆప్తుడు.  రాజీవ్ గాంధీకి ప్రాణసఖుడు   సోనియాకు సన్నిహితుడు.  అయినా సరే...తనకో అవకాశం కోసం ఆయన ఒక రోమన్  గ్లాడియేటర్ లా పాతికేళ్ల  పోరాటం చెయ్యాల్సి వచ్చింది.  అవకాశం వచ్చాక వామనుడు అనుకున్నవాడు త్రివిక్రముడై చెలరేగిపోయాడు.  రాష్ట్రంలో కాంగ్రెస్ అంటే వైఎస్సార్... వైఎస్సార్ అంటే కాంగ్రెస్ అనే విధంగా రాజకీయాల్లో మేరుశిఖరంగా మెరిసిపోయాడు.  రాజకీయాలను కొనగోటితో, కంటిచూపుతో శాసించాడు.  వృద్ధ కాంగ్రెస్ నాయకులతో సఖ్యతగా ఉంటూనే వారిని నియంత్రించాడు.  ఆయనమీద పితూరీలు చెప్పడానికి వెంకటస్వామి, హనుమంతరావు, పాల్వాయి, ఉప్పునూతల పురుషోత్తం రెడ్డి ఢిల్లీ వెళ్లి వారం రోజులు బస చేసినా, సోనియా గాంధీ దర్శనం దొరకలేదు.  ఈలోపల వైఎస్సార్ ఢిల్లీ వెళ్లి సోనియా గాంధీని కలిసి కావలసిన కార్యాలను సాధించుకుని వచ్చాడు.  చెన్నారెడ్డి, జలగం వెంగళరావు లాంటి ధీరులను, వీరులను ఎదిరించిన మహా మహా నాయకులు సైతం వైఎస్సార్ సూర్యతేజం  ముందు మిణుగురుపురుగులు అయ్యారు!!

కాకి కలకాలం జీవిస్తుంది... రాజహంస ఆరుమాసాలు మాత్రమే జీవిస్తుంది.. కాకి నూరు సంవత్సరాలు జీవించినా నిష్ఫలం.  రాజహంస ప్రతిఒక్కరినీ ఆకర్షిస్తుంది.  తన వయ్యారపు నడకతో మురిపిస్తుంది.  కాకిని అందరూ అసహ్యించుకుంటారు.  మరాళాన్ని ముద్దాడతారు.  వైఎస్సార్ రాజహంస...

వైఎస్సార్ అచ్చమైన తెలుగువాడికి తెలుగు'వాడి'కి నిలువెత్తు ప్రతిరూపం.  తెల్లని పంచెకట్టులో నడుస్తూ.. అపుడపుడు నడుము వద్ద జారుతున్న పంచెను సర్దుకుంటూ.. నవ్వుతూ నడుస్తుంటే మూర్తీభవించిన తెలుగుతనం అడుగులు వేస్తున్నట్లుంటుంది.  

పంచె కట్టుటలో మొనగాడు 
అన్ని మూసలలోన అట్టే ఒదిగినవాడు 
పంచభక్ష్యాలు తన కంచాన వడ్డించ 
గోంగూర కోసమై గుటకలేసువాడు
ఎవడయ్య వాడు ఇంకెవడయ్య తెలుగువాడు 

మంచి మనసెదురైన   మాలలిచ్చేవాడు
భాయి భాయి అన్న చేయి కలిపేవాడు 
తిక్క రేగిందంటే డొక్క చీల్చేవాడు 
చిక్కులెరుగని వాడు 
చిత్తాన పసివాడు 
ఎవడయ్య వాడు ఇంకెవడయ్య తెలుగువాడు 

గురుదేవులు డాక్టర్ సి. నారాయణరెడ్డి గారి విరచిత కవితా పంక్తులు  గుర్తుకు వస్తాయి వైఎస్సార్  ను చూస్తే.  కాదంటారా?  

వైఎస్సార్ అభయం దొరికితే... వాడిని యమధర్మరాజు కూడా ఏమీ చెయ్యలేడు.
వైఎస్సార్ కన్నెర్రకు గురైతే..వాడిని బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడు.  

మనం అలాంటివారిని చూసాము. ఇలాంటివారిని చూసాము.  చిరునవ్వు ఆయనలో బయటకి కనిపించే ఆయుధం.  ఆ చిరునవ్వుతోనే అసెంబ్లీలో చంద్రబాబును చెడుగుడు ఆడుకున్నాడు... "నవ్వవయ్యా.. నవ్వు...నవ్వడం ఒక యోగం...నవ్వించడం ఒక భోగం.. నవ్వకపోవడం ఒక రోగం" అని నవ్వుతూనే కవ్విస్తూ "చంద్రబాబు...నిన్ను కడిగిపారేస్తాను... నేను మా అమ్మ కడుపున ఎందుకు పుట్టానా అని సిగ్గుతో చితికిపోయేలా చేస్తాను" అని సెటైర్ వెయ్యడం కూడా ఆయనకే చెల్లింది!  

వైద్యశాస్త్రాన్ని చదివారు.. ఆసుపత్రిని పెట్టి రూపాయికే వైద్యం చేశారు.  పుట్టుకతో కోటీశ్వరుడు.  జన్మతహా ధర్మదాత.. ఆ వదాన్యతా గుణమే  ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నపుడు  మరింత శోభస్కరంగా భాసించింది.  

(సశేషం)

No comments:

Post a Comment