1 February 2018

రాష్ట్రానికి ‘చంద్ర’ గ్రహణం

– రాష్ట్రాన్ని చంద్రబాబు అడ్డగోలుగా దోచేస్తున్నారు
–  అరాచక ఆంధ్రప్రదేశ్‌గా , అప్పుల ఆంధ్రగా మార్చారు.
– గోదావరి పుష్కరాల్లో 29 మందిని బలి తీసుకున్నారు
– ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయారు.
– పార్టీ ఫిరాయింపులను  దగ్గరుండి ప్రోత్సహించారు
– మనందరి ప్రభుత్వం వచ్చాక వ్యవసాయాన్ని పండుగలా చేయిస్తాం
– ప్రతి రైతుకు ప్రభుత్వమే ఉచితంగా బోరు వేయిస్తుంది
– ప్రతి రైతుకు పెట్టుబడులకు రూ.12,500
– రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు
– రూ. 4 వేల కోట్లతో ప్రకృతి వైఫరీత్యాల నిధి
– పెండింగ్‌ ప్రాజెక్టులు యుద్ధప్రాతిపాదికన పూర్తి చేస్తా

నెల్లూరు: నాలుగేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌కు చంద్రబాబు రూపంలో చంద్ర గ్రహణం పట్టిందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి విమర్శించారు. చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారని, పైస్థాయిలో చంద్రబాబు, కిందిస్థాయిలో జన్మభూమి కమిటీలు కమీషన్లు తీసుకొని అవినీతి ఆంధ్రప్రదేశ్‌గా మార్చారని మండిపడ్డారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి రాగానే వ్యవసాయాన్ని పండుగలా జరిపిస్తామని వైయస్‌ జగన్‌హామీ ఇచ్చారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరులో బుధవారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అశేష జనవాహినిని ఉద్దేశించి వైయస్‌జగన్‌ ప్రసంగించారు. ఆయన ఏమన్నారంటే..వైయస్‌ జగన్‌ మాటల్లోనే.. వేలాది మంది నాతో పాటు అడుగులో అడుగులు వేస్తున్నారు. ఏ ఒక్కరికి నడిరోడ్డుపై వచ్చి నిలబడాల్సిన అవసరం లేదు. నాపై ప్రేమానురాగాలు చూపుతున్న ప్రతి ఒక్కరికి పేరు పేరునా కృతజ్ఞతలు.

నిన్నటి కంటే ఇవాళ సంతోషంగా ఉన్నారా? 
 నాలుగేళ్ల చంద్రబాబు పాలన చూశాం. మరో ఏడాదిలో ఎన్నికలు జరుగబోతున్నాయని ఇదే పెద్ద మనిషి చంద్రబాబు తన కార్యకర్తలను ఉద్దేశించి ఊదరగొడుతున్నారు. ఇవాళ మీ అందర్ని అడుగుతున్నాను. ఒక్క సారి మీ గుండెల మీద చేతులు వేసుకోని ప్రశ్నించుకోండి. నాకు తెలిసిన అభివృద్ధి అంటే నిన్నటి కన్న ఈ రోజు సంతోషంగా ఉంటే దాన్ని అభివృద్ధి అంటారు. నాలుగేళ్ల చంద్రబాబు పాలన ఒక్కసారి చూడండి. నిన్నటి కన్న ఈ రోజు మీరు సంతోషంగా ఉన్నారా? . నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో రాష్ట్రానికి చంద్ర గ్రహణం పట్టింది. 

నాలుగేళ్ల బాబు పాలన ఎలా ఉందంటే..
రిపబ్లిక్‌ డే రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు కనిపించడు. నాలుగేళ్ల పరిపాలన ఎలా ఉందంటే..సాక్షాత్తు మన సీఎం అక్రమ నివాసంలో ఉంటారు. వేరే ఎవరైనా అక్రమ నివాసంలో ఉంటే బలవంతంగా తొలగిస్తారు. అదే సీఎం భార్య రిపబ్లిక్‌డే రోజు అక్రమ నివాసంలో జెండా వందనం చేస్తున్నారు. నాలుగేళ్లుగా చంద్రబాబు విదేశాలకు వెళ్తారు. ఆ సమయంలో ఆయన బావమరిది సీఎం సీట్లో కూర్చుంటారు. రాష్ట్రానికి చంద్రగ్రహణం ఏ స్థాయిలో పట్టిందంటే..అర్చకులకు బదులు తాంత్రికులు పూజలు చేస్తున్నారు. ప్రతి పక్ష ఎమ్మెల్యేలను నిసిగ్గుగా రూ.30 కోట్లు పెట్టి కొనుగోలు చేస్తారు. వారిని అనర్హులుగా ప్రకటించడం లేదు. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన వ్యక్తులు దగ్గరుండి తూట్లు పొడుస్తున్నారు. రాష్ట్రపతి మన రాష్ట్రానికి వస్తే అనుమతి లేని అక్రమ బోటులో ఆయన కుటుంబాన్ని తిప్పుతున్నారు. నాలుగేళ్ల చంద్రబాబు పాలన ఎలా ఉందంటే..29 మందిని అక్షరాల చంద్రబాబు పుష్కరాల్లో షూటింగ్‌ కోసం భక్తులందరినీ ఆపి సీఎం స్నానం అయిపోయిన తరువాత గేట్లు తెరచి తొక్కిసలాటలో అమాయకులను బలి తీసుకున్నారు. రాష్ట్రానికి చంద్రగ్రహణం ఏస్థాయిలో పట్టిందంటే..పక్క రాష్ట్రంలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ సీఎం ఆడియో, వీడియోలతో దొరికిపోయారు. ఎవరైనా లంచం తీసుకుంటూ పట్టుబడితే అలాంటి వ్యక్తిని ఉద్యోగం నుంచి తొలగిస్తారు. అదే సీఎం ఆధారాలతో సహా దొరికిపోయిన ఎలాంటి కేసులు ఉండవు. లంచాల సొమ్ముతో దొరికిపోయిన సీఎం ఆ తరువాత రాష్ట్రాన్ని అమ్మేశారు. చంద్రగ్రహణం ఏస్థాయిలో పట్టిందంటే..మనకు రావాల్సిన హక్కులను కేంద్రాన్ని అడిగే పరిస్థితి నెలకొంది. సీబీఐ విచారణ చేపడుతారని ప్రత్యేక హోదాను అమ్మేశారు. ప్రత్యేక ప్యాకేజీ అని ఆ రోజు అన్నారు. ఇవాళ ఇదే పెద్ద మనిషి ఏమంటారు? ఒక్క రూపాయి కూడా దాని వల్ల మేలు జరగడం లేదని నిసిగ్గుగా అంటున్నారు. ఇవాళ బైకులు ఉన్న వారు పెట్రోలు పోయించుకునేందుకు వెళ్తే జేబుకు చిల్లులు పెడుతున్నారు. పక్క రాష్ట్రాల్లో పెట్రోలు రేట్లు తక్కువగా ఉన్నాయి. నాలుగేళ్లుగా దేశంలో ఏ రాష్ట్రంలో లేని రేట్లు మన రాష్ట్రంలో ఉన్నాయి. 

ఇదే పెద్ద మనిషి ఎన్నికలకు ముందు ఏమన్నారు..
కరెంటు బిల్లు చూస్తే షాక్‌ కొడుతోంది. చంద్రబాబు పాలనలో ఇవాళ చంద్రగ్రహణం ఏస్థాయిలో పట్టిందంటే..చివరికి ప్రభుత్వ ఉద్యోగులకు రెండు డీఏలు బాకీ పడ్డారు. ఏ రైతుకు కూడా గిట్టుబాటు ధర రావడం లేదు. ఇదే పెద్ద మనిషి ఎన్నికల సమయంలో రైతుల రుణాలు పూర్తిగా మాఫీ చేస్తామన్నారు. నాలుగేళ్ల పాలనలో ఆయన చేసిన రుణమాఫీ వడ్డీలకు సరిపోవడం లేదు. అక్కా చెల్లెమ్మల రుణాలు మాఫీ కావడం లేదు. బ్యాంకుల నుంచి నోటీసులు వస్తున్నాయి.
– జాబు రావాలంటే బాబు రావాలన్నారు. ఇవాళ పరిస్థితి ఏంటంటే జాబు ఉండాలంటే..బాబు పోవాలని అంటున్నారు. జాబు ఇవ్వకపోతే ప్రతి ఇంటికి రూ.2 వేలు నిరుద్యోగ భృతి అన్నారు. ఇంతవరకు రూపాయి కూడా ఇవ్వలేదు. ప్రతి ఇంటికి రూ.90 వేలు బాకీ పడ్డారు. 
– పైన చంద్రబాబు ఇసుక నుంచి మట్టి దాక, బోగ్గు, కాంట్రాక్టర్లు, కరెంటు కోనుగోలు, రాజధాని భూములు, గుడి భూములు వరకు ఏది వదలకుండా లంచాలు తీసుకుంటున్నారు. కింద గ్రామ స్థాయిలో జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేశారు. వారు ఏ స్థాయిలో మేస్తున్నారంటే పింఛన్‌ కావాలన్నా..మరుగుదొడ్డి కావాలన్నా..లంచాలు తీసుకుంటున్నారు. 

ఒక్క  ఇటుక కూడా కట్టిన పాపాన పోలేదు
రాజధాని అని మాటిమాటికి అంటారు. చంద్రగ్రహణం పట్టిన రాష్ట్రంలో నాలుగేళ్ల కాలంలో కనీసం ఒక్క ఇటుక కూడా కట్టిన పాపాన పోలేదు. రాష్ట్రానికి చంద్రబాబు ఏం మిగిల్చిరో తెలుసా? అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా మార్చారు. అవినీతి ఏపీగా మార్చిన చరిత్ర, ఘనత బాబుదే. నాలుగేళ్ల పాలనలో అరాచకాంధ్రప్రదేశ్‌గా మార్చారు. రాజ్యాంగం అమలు కాని రాష్ట్రంగా మార్చారు. చట్టం అన్నది ఎక్కడా కూడా అమలు కాని రాష్ట్రంగామార్చారు. మహిళలకు రక్షణలేని రాష్ట్రంగా మార్చారు. ఏ ఒక్కరికి రక్షణ లేని రాష్ట్రంగా మార్చారు. బహుషా..ఈ చంద్రగ్రహణం కొద్ది గంటల్లో వీగి పోతుంది. ఈ రాష్ట్రానికి పట్టిన చంద్రబాబు చంద్రగ్రహణం రాష్ట్రాన్ని పూర్తిగా నాశనం చేసేంత వరకు కూడా పోయోలా లేదు.

కృష్ణపట్నం పోర్టు సంగతి ఎలా ఉందంటే..
మన జిల్లాలోనే కృష్ణపట్నం పోర్టు కనిపిస్తుంది. గతంలో చంద్రబాబు 9 ఏళ్లు సీఎంగా ఉన్నప్పుడు కృష్ణపట్నంకు టెంకాయలు కొట్టారు. ఆయన చేయకపోతే దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి అప్పట్లో అక్కడ మొక్కలు నాటారు. నాన్నగారు ముఖ్యమంత్రి అయిన తరువాత ఆ పోర్టు కార్యరూపం దాల్చి అణిముత్యంలా మారింది. ఇదే కృష్ణపట్నం పోర్టు ఎలాంటి పురోగతి దాల్చిందో చూడండి. అక్కడున్న మత్య్సకారులను ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. నాలుగేళ్ల చంద్రబాబు పాలన చూశాం. ఇవాల్టికి కూడా అక్కడున్న ఉప్పు రైతులకు పరిహారం అందడం లేదు. మత్స్యకారులకు అందాల్సిన ప్యాకేజీ నిధులు అందడం లేదు. చేపలు పట్టే వారే కాకుండా, సముద్రంపై బతికే వారిని నాన్నగారు గుర్తించి ప్రతి ఒక్కరికి రూ.40 వేలు ఇవ్వాలని భావించి అప్పట్లో రూ.8 కోట్లు సాయం చేశారు. ఇవాళ వారిని పట్టించుకోవడం లేదు. పోర్టు వస్తే జిల్లా బాగుపడుతుందని అందరం భావించాం. నాన్నగారి హయాంలో అక్కడే ఫిషింగ్‌ హర్భర్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ పట్టించుకోవడం లేదు. పోర్టు వచ్చినా..ఎస్‌ఈజెడ్‌ వచ్చినా మనందరం భూములు ఇస్తాం. ఎందుకంటే ఇవన్నీ వస్తే మనకు ఇక్కడే ఉద్యోగాలు వస్తాయని ఆశపడుతాం.  ఇవాళ పోర్టు వచ్చినా..ఎస్‌ఈజెడ్లు వచ్చినా ఉద్యోగాలు మనకు రావడం లేదు. వేరే రాష్ట్రాల వారికి వస్తున్నాయి. 

స్థానికులకే ఉద్యోగాలు ఇప్పిస్తా
రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మనందరి ప్రభుత్వం వచ్చాక ప్రతి పరిశ్రమలో స్థానికులే ఉద్యోగాలు ఇస్తాం. ప్రతి పరిశ్రమకు నోటీసులు ఇస్తాం. పోర్టులు కావాలన్నా..ఎస్‌ఈజెడ్లు కోసం మనందరం ఎదురు చూస్తాం. ఒకవైపున ప్రత్యేక హోదా రాకుండా ఎగురగొట్టారు. మరోవైపు స్థానికులకు పరిశ్రమల్లో ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేస్తున్నారు.

కండలేరు ప్రాజెక్టు ఏమైంది?
కండలేరు హై లెవల్‌ కెనాల్‌ ద్వారా పొదలకూరు మండలానికి మేలు జరుగుతుందని లిప్ట్‌ పెట్టేందుకు రూ.22 వేల కోట్లు మంజూరు చేశారు. నాన్నగారు చనిపోయిన తరువాత ఆ కాంట్రాక్ట్‌ రేటు రూ.50 వేల కోట్లకు రేట్లు పెంచారు. ఇవాళ ఆ లిప్టులు పని చేయడం లేదు. ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతున్నాను. ఇదే చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో ఇక్కడికి వచ్చారు. ఎమ్మెల్సీగా ఎన్నికైన చంద్రమోహన్‌రెడ్డి మంత్రిగా ఎన్నికయ్యారు. ఈ నియోజకవర్గ ప్రజల తరఫున డుగుతున్నాను..ఏమైంది ఈ ప్రాజెక్టు అని అడుగుతున్నాను. ఇలాంటి చిన్న చిన్న ప్రాజెక్టులను కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇదే నియోజకవర్గంలో మేలు జరిగేందుకు పెన్నా నదిపై చేపట్టిన పనులు అడుగు కూడా ముందుకు సాగడం లేదు.

నిమ్మ రైతుల పరిస్థితి దారుణం
ఇదే నియోజకవర్గంలో నిమ్మరైతులు నా వద్దకు వచ్చారు. రోడ్డుపై నిమ్మకాయలు పోసి వారి గోడు చెప్పుకున్నారు. నియోజకవర్గంలో 20 వేల ఎకరాల్లో నిమ్మకాయలు పండిస్తారు. ఇవాళ నిమ్మకాయలకు గిట్టుబాటు ధర లేదని రైతన్నలు అంటున్నారు. ఒక్కసారి ఆలోచన చేయండి. ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర రావడం లేదు. కారణం సీఎం అనే వ్యక్తి రైతులకు తోడుగా ఉండాలి. మన ఖర్మ ఏంటో తెలుసా సీఎం అనే వ్యక్తి దళారిగా మారాడు. చంద్రబాబుకు హెరిటేజ్‌ షాప్‌ ఉంది. తాను కూడా దళారులకు తోడై రైతులను మోసం చేస్తున్నారు. రైతుల వద్ద ఉన్నప్పుడు తక్కువ ధరలకు కొనుగోలు చేసి ఆ తరువాత ఎక్కువ రేట్లకు అమ్ముకుంటున్నారు.

బంగారానికి బోనస్‌ బెంజి కారు అంటాడు..
 ఇలాంటి అన్యాయమైన, మోసం చేసే పాలనను క్షమిస్తే రేపొద్దున ఇదే చంద్రబాబు మీ వద్దకు వచ్చి ..ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తానంటారు. నమ్ముతారా?..కేజీ బంగారుకు బోనస్‌ అంటాడు. ప్రతి  ఇంటికి బెంజీ కారు కొనిస్తా అంటాడు. నమ్ముతారా? ప్రతి ఒక్కరిని అవినీతితో సంపాదించిన డబ్బుతో కొనుగోలు చే సే ప్రయత్నం చేస్తారు. ఆ డబ్బులు తీసుకోండి. ఆ డబ్బంతా మన వద్ద నుంచి దోచుకున్నదే. చెడిపోయిన రాజకీయ వ్యవస్థలోకి నిజాయితీ అన్న పదం రావాలి. ఎవరైనా నాయకుడు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ఇంటికి పోవాలి. ఈ వ్యవస్థను బాగుపరిచేందుకే పాదయాత్రగా బయలుదేరాను. ఈ వ్యవస్థను మార్చడం నా ఒక్కరి వల్ల కాదు..జగన్‌కు మీ అందరి చల్లని దీవెనలు కావాలి. అప్పుడే ఈ వ్యవస్థలోకి విశ్వసనీయత, నిజాయితీ అన్న పదాలకు అర్ధం వస్తుంది.
రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నవరత్నాలు ప్రకటించాం. ఈ పథకాలతో ప్రతి పేద వాడి ముఖంలో చిరునవ్వు చూడాలని నవరత్నాలు ప్రకటించాం.  అందులో ఏదైనా మార్పులు చేర్పులు చేయాల్సి వస్తే మీ అందరూ కూడా సలహాలు, సూచనలు ఇవ్వండి. ప్రతి సభలో నవరత్నాల గురించి చెబుతున్నాను. నవరత్నాల నుంచి నేను చెప్పబోయే అంశం రైతన్నలకు ఏం మేలు చేస్తామన్నది చెబుతున్నాను.

రైతుకు పెట్టుబడులు తగ్గించేందుకు..
రైతుల గురించి ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ మనం ఎలా ఉన్నామో ఆలోచన చేయండి. రైతు అనే వాడు ఏం చేయాలి. రైతులకు మొట్ట  మొదట పెట్టుబడులు తగ్గాలి. రైతులు పండించిన పంటకు మంచి గిట్టుబాటు ధర ఉంటే అప్పుడు రైతుల ముఖాల్లో చిరునవ్వులు ఉంటాయి.  దిశగా అడుగులు వేస్తూ..
1. రెతులకు పెట్టుబడులు తగ్గించేందుకు మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఏం చేస్తామంటే..ప్రతి రైతుకు 9 గంటల పాటు పగటి పూట ఉచిత విద్యుత్‌ ఇచ్చి తోడుగా ఉంటాం.
2.  రైతులకు ఇవాళ బ్యాంకుల నుంచి వడ్డీ లేని రుణాలు రావడం లేదు. వడ్డీ లెక్కలు రాష్ట్ర ప్రభుత్వం రైతుల తరఫున బ్యాంకులకు కట్టినప్పుడే వడ్డీ లేని రుణాలు ఇస్తారు. ఇవాళ చంద్రబాబు సీఎం అయ్యాక మన ఖర్మ ఏంటో తెలుసా? రైతులకు సంబంధించిన వడ్డీ లెక్కలు బ్యాంకులకు కట్టడం మానేశారు. ఇవాళ ఏ బ్యాంకులు కూడా వడ్డీ లేని రుణాలు ఇవ్వడం లేదు. రైతులకు పెట్టుబడులు తగ్గించేందుకు..మనందరి ప్రభుత్వం వచ్చాక ప్రతి రైతుకు వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తాం. దీని వల్ల రైతులకు బ్యాంకుల నుంచి డబ్బులు వస్తాయి. రైతులకు పెట్టుబడి తగ్గుతుంది.
3. రేపొద్దున దేవుడి దయ వల్ల మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి రైతుకు మే మాసంలో రూ.12,500 ఇచ్చి తోడుగా ఉంటామని చెబుతున్నాను. ఒక ఎకరా ఉన్న రైతుకు దాదాపు 90 శాతం పెట్టుబడి ఖర్చులు వస్తాయి. ఈ కార్యక్రమాల వల్ల రైతులకు పెట్టుబడి భారం తగ్గుతుంది.

మనందరి ప్రభుత్వం వచ్చాక..
రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర వస్తే రైతు ముఖంలో చిరునవ్వులు ఉంటాయి. ఇవాళ ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర వస్తుంది. మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పంట వేసే ముందే గిట్టుబాటు ధర ప్రకటించి ఆ పంటను కొనుగోలు చేస్తాం. ఇందుకోసం రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి తోడుగా ఉంటాం. రైతు ఒక్క వ్యవసాయంపై బతికితే గిట్టుబాటు కాదు. పాడి పరిశ్రమ వల్ల రైతులకు మేలు జరుగుతుంది. మీరు కో–ఆపరేటివ్‌ రంగంలోని డయిరీలకు పాలు పోస్తే లీటర్‌కు రూ.4 సబ్సిడీ ఇస్తుంది. ఆ తరువాత ప్రైవేట్‌ రంగంలోని డయీరీలు కూడా రూ.4 ఇచ్చి పాలు కొనుగోలు చేస్తారు. నిమ్మ పండిస్తున్నారు కానీ, కోల్డు స్టోరేజీలు లేవు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు లేవు. ప్రతి మండల కేంద్రంలో కోల్డు స్టోరేజీలు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌లు ఏర్పాటు చేస్తాం. ఏ రైతు కూడా కరువు, అకాల వర్షాలతో బాధపడుకుండా ఉండేందుకు రూ.4 వేల కోట్లతో ప్రకృతి వైఫరీత్యాల నిధి ఏర్పాటు చేసి తోడుగా ఉంటాను. వ్యవసాయం అన్నది ఒక పండుగలా చేసుకునే పరిస్థితి తీసుకువస్తాను. 

రైతులు అప్పులపాలు కాకూడదు..
రైతులకు సాగునీరు చాలా అవసరం. ఇవాళ రైతులు ఎక్కువ శాతం ఆత్మహత్యలు చేసుకునేందుకు ఎందుకో తెలుసా..నీటి కోసం బోర్లు వేసుకొని అప్పులపాలు అవుతున్నారు. రేపొద్దున మనందరి ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రతి రైతుకు ఉచితంగా బోరు వేయిస్తాం. జలయజ్ఞాన్ని చంద్రబాబు ధనయజ్ఞంగా మార్చారు. కాంట్రాక్టర్ల నుంచి డబ్బులు దండుకునే కార్యక్రమాలు చేస్తున్నారు తప్ప నీరు తీసుకురావడం లేదు. ప్రతి ప్రాజెక్టును యుద్ధప్రాతిపాదిక పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేస్తాను. రైతు బాగుంటునే రాష్ట్రం బాగుంటుంది. నవరత్నాల్లో ఏదైనా మార్పులు, చేర్పులు చేయాల్సి వస్తే సలహాలు, సూచనలు ఇవ్వమని మీ అందరిని కోరుతున్నారు. ఎవరైనా నన్ను కలువవచ్చు. ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థను బాగు చేసేందుకు పాదయాత్రగా బయలుదేరిన మీ బిడ్డను ఆశీర్వదించమని పేరు పేరున కోరుతూ..సెలవు తీసుకుంటున్నాను.

No comments:

Post a Comment