9 February 2016

నాయకుల్ని తప్పు దోవ పట్టిస్తున్న చంద్రబాబు

త్వరలోనే నియోజక వర్గాల పునర్ వ్యవస్థీకరణ అంటూ వదంతులు
నాయకుల మధ్య విభేదాలు పుట్టించేందుకు చంద్రబాబు ప్రయత్నాలు
ఎన్నికల సంఘాన్ని కలిసిన వైఎస్సార్సీపీ నాయకులు
2026 దాకా పునర్ వ్యవస్థీకరణ లేదని తేల్చి చెప్పిన అధికారులు

న్యూఢిల్లీ:  రాజకీయ ముఖచిత్రంలో నాయకుల మధ్య విభేదాలు పుట్టించేందుకు చంద్రబాబు, ఆయన మంత్రులు కొత్త ఎత్తుగడకు దిగారు. త్వరలోనే నియోజక వర్గాల పునర్ వ్యవస్థీకరణ జరుగుతుందని, అసెంబ్లీ నియోజక వర్గాలు ఒక్కసారిగా 220 దాకా పెరిగిపోతాయని పుకార్లు పుట్టించారు.

ఎందుకీ పుకార్లు..!
పదేళ్ల క్రితమే నియోజక వర్గాల పునర్ వ్యవస్థీకరణ జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 175 నియోజక వర్గాల్లో ఎమ్మెల్యేలు, లేదా ఎమ్మెల్యే అభ్యర్థుల ఆధారంగానే రాజకీయ శక్తుల ఏకీకరణ జరుగుతోంది. దాదాపుగా టీడీపీ, వైఎస్సార్సీపీ తరపు నుంచి ఆయా నియోజక వర్గాల ఆధారంగానే రాజకీయ కార్యకలాపాలు జరుగుతున్నాయి. అయితే ఈ ముఖచిత్రాన్ని ఛిద్రం చేసేందుకు, నాయకుల్లో అపోహలు పుట్టించేందుకు టీడీపీ పన్నాగం పన్నుతోంది. అందుకే నియోజక వర్గాల పునర్ వ్యవస్థీకరణ జరుగుతోందని పుకార్లు పుట్టించారు. దీంతో నాయకుల్లో కంగారు పుట్టి టీడీపీ అగ్ర నేతల దగ్గరకు పరుగులు తీస్తారని అంచనా వేసుకొని ఎత్తుగడలు పెట్టుకొన్నారు.

ఎన్నికల సంఘంతో వైఎస్సార్సీపీ నేతల భేటీ
ఈ చిల్లర రాజకీయాల్ని పసిగట్టిన వైఎస్సార్సీపీ నేతల బ్రందం న్యూఢిల్లీ వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు. పునర్ వ్యవస్థీకరణ కు సంబంధించి వస్తున్న వదంతుల్ని అధికారుల ముందు ఉంచారు. ఇప్పట్లో పునర్ వ్యవస్థీకరణ ఊసే లేదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. జనాభా లెక్కలు, ఇతర గణాంకాల ఆధారంగా చూసుకొంటే 2026 దాకా నియోజక వర్గాల విషయంలో మార్పు లేదని తేల్చి చెప్పారు. అటు, కేంద్రానికి న్యాయ సలహా అందించే అటార్నీ జనరల్ వర్గాలు కూడా దీన్నే నిర్ధారించాయి.

8 February 2016

నమ్మటం మీ వంతు – ముంచటం మా వంతు..!

రాజధాని రైతులకు మరోసారి బాబు మార్కు షాక్
భూములు ఇవ్వని రైతులపై కోపం తీర్చుకొంటున్న సర్కార్
అదేమంటే మొక్కుబడి జవాబులే గతి

అమరావతి: రాజధాని ప్రాంతంలో భూములు లాక్కొనేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎన్నెన్నో గిమ్మిక్కులు చేసింది. అయినప్పటికీ భూములు వదులుకొనేందుకు ఇష్టపడని రైతుల మీద కక్ష సాధించేందుకు సిద్ధ పడుతోంది. వ్యవసాయ పరికరాలు ధ్వంసం చేయటం, పంటల్ని తగలబెట్టడం, తర్వాత దశలో ఏకంగా పంటను బుల్ డోజర్లతో నాశనం చేయటం వంటి ఘటనల్ని చూశాం. అయినా సరే ఈ ఘటనల మీద ఎటువంటి చర్యలు కనిపించటం లేదు.

దగ్ధం ఘటనల్లో చర్యలు శూన్యం..!
ప్రభుత్వానికి భూములు ఇవ్వని రైతుల పొలాల్లోని వ్యవసాయ పరికరాల్ని తెలుగుదేశం గూండాలు ధ్వంసం చేశారు. దీని మీద బాధిత రైతులు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి ప్రయోజనం లేదు. తర్వాత గద్దె చంద్రశేఖర్ అనే రైతుకి చెందిన చెరకు తోటను దగ్దం చేశారు. దీనికి కారణం స్థానిక తెలుగుదేశం నాయకులే అని చంద్రశేఖర్ ఎంత మొత్తుకొంటున్నా వినకుండా, పై పెచ్చు ఆయన కుటుంబసభ్యుల్నే తీసుకొని వెళ్లి పోలీసులు చిత్రహింసలు పెట్టారు. టీడీపీ నాయకుల మీద ఎటువంటి కేసులు లేకుండా జాగ్రత్త పడ్డారు.

అరటి తోట నాశనం చేసినా అంతే సంగతులు..!
అమరావతిలో భూ సమీకరణకు సహకరించని లింగాయపాలెం వాసులు గుండపు రాజేష్, ఆయన సోదరుడు గుండపు చంద్రశేఖర్‌కు చెందిన 7.3 ఎకరాల అరటి తోటను  డిప్యూటీ కలెక్టర్ సీతారామ్మూర్తి పర్యవేక్షణలో మూడు బుల్డోజర్లతో తొలగించిన విషయం తెలిసిందే.

భూ సమీకరణకు అంగీకరించబోమని, పొలాన్ని సాగు చేసుకుంటామని రాజేష్ సోదరులు తేల్చిచెప్పడం వల్లే ప్రభుత్వం వారి అరటి తోటను నాశనం చేసింది. దీని మీద పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగటంతో.. నష్టపరిహారం చెల్లిస్తామని అధికారులు చెప్పారు. ఒకట్రెండు రోజుల్లో పరిహారం అందుతుందని రాజేష్ సోదరులు భావించారు.

కానీ, అందుకు విరుద్ధంగా జరుగుతోంది. పంట ధ్వంసమైన పొలాన్ని అధికారుల బృందం తనిఖీ చేస్తుందని, ఎంత నష్టం జరిగిందో అంచనా వేయడానికి విచారణ చేపడుతుందని పేర్కొంటూ బాధితులకు సీఆర్‌డీఏ తాజాగా లేఖ రాసింది.  రాజేష్ సోదరుల భూమిలో తొలగించిన అరటి చెట్లు ఇప్పుడు మట్టిలో కలిసిపోయాయి. అక్కడ అరటి తోట ఉందనే ఆనవాళ్లు కూడా ప్రస్తుతం కనిపించడం లేదు. రెండు నెలల తర్వాత వస్తే నష్టపరిహారం ఎలా నిర్ణయిస్తారని బాధితులు ప్రశ్నిస్తున్నారు. జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి, పరిహారం చెల్లించడానికి ఇంకెంత సమయం పడుతుందోనని ఆందోళన చెందుతున్నారు.

రైతుల్ని వేధించటమే లక్ష్యంగా..!
మొత్తం మీద భూములు అప్పగించని రైతుల్ని వేధించటమే లక్ష్యంగా చంద్రబాబు ప్రభుత్వం పనిచేస్తోంది. ఇందులో అధికార యంత్రాంగం, టీడీపీ నాయకత్వం తమదైన పాత్ర పోషిస్తున్నాయి. అతిమంగా రైతులు మాత్రం బాధ పడుతున్నారు. 

టీడీపీ కార్యాలయం కోసం ఇళ్లు ఖాళీ

చిలకలూరిపేట ఎన్‌ఎస్‌పి ఉద్యోగులకు బెదిరింపులు
ఇళ్లు ఖాళీ చేయాలంటూ పచ్చనేతల హల్చల్ 
ఇళ్లకు నీరు, కార్యాలయానికి కరెంట్ కట్
రోడ్డున పడేయడంపై ఉద్యోగుల ఆందోళన
పనులు నిలిపేయాలని హెచ్చరిక

గుంటూరు : ఇప్పటికే రాజధాని పేరుతో రైతుల భూములు లొక్కోవడం మొదులు ఇళ్లను తొలగించేందుకు సిద్ధమైన తెలుగుదేశం పార్టీ...ఇప్పుడు పార్టీ కార్యాలయాల కోసమూ  పలు ప్రాంతాల్లో ఇళ్లు తొలగించేందుకు వెనుకాడడం లేదు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ పచ్చనేతలు ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం కోసం తమ ఇళ్లు ఖాళీ చేయాలని బెదిరింపులకు పాల్పడుతున్నారని.... చిలకలూరిపేటలోని ఎన్‌ఎస్‌పి ఓఅండ్‌ఎమ్ క్యాంప్ కాలనీ వాసులు లింగంగుంట్ల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ యం.ఆర్ మోహిద్దీన్‌కు మొరపెట్టుకున్నారు. ఏపీ ఇరిగేషన్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులతో కలసి భాధితులు  ఈఈని కలిసారు.

ఎన్‌ఎస్‌పి ఓఅండ్‌ఎమ్ సెక్షన్‌లో పనిచేస్తూ... క్యాంప్ కాలనీలో అనేక ఏళ్ళగా నివసిస్తున్నామని బాధితులు తెలిపారు.  కాగా ఈ నెలలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఉందంటూ క్యాంప్ ఆవరణలో నిర్మాణాలు చేపడుతున్నారని వివరించారు. ఇప్పటికే డ్రెయిన్‌లతో పాటు పైలాన్ నిర్మాణం జరుగుతుందని పేర్కొన్నారు. తాము నివసిస్తున్న ఇళ్ళను కూల్చివేస్తామని, ఖాళీ చేయాలని బెదిరిస్తున్నరన్నారు.  ఇళ్ళకు తాగునీరు సరఫరాతో పాటు కార్యాలయానికి కరెంటు కట్‌చేశారని వాపోయారు. దీంతో, కాలనీలో నివసించే 10 కుటుంబాలు బిక్కుబిక్కుమంటూ గడపుతున్నట్టు యూనియన్ నాయకులు వివరించారు.

ఎన్‌ఎస్‌పికి చెందిన స్థలంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు....అధికారుల దృష్టికి తీసుకువచ్చినా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.  తమ జీతంలో ప్రతి నెలా  ఇంటి అద్దెను మినహాయిస్తున్నామన్నారు. ఎన్‌ఎస్‌పి స్థలంలో ఎటువంటి ఆధారాలు లేకుండా ఎలా నిర్మాణాలు చేపడతారని ప్రశ్నించారు. పార్టీ కార్యాలయం కోసం మమ్మల్ని రోడ్లు పాలు చేస్తున్నారంటూ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా సంవత్సరం మధ్యలో ఉన్న సమయంలో ఇళ్లు ఖాళీ చేయమంటే ఎక్కడకు వెళ్లాలని విలపించారు. 

దీనిపై స్పందించిన ఈఈ చిలకలూరిపేట మున్సిపల్ కమిషనర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. అధికారులతో చర్చించి సమస్యను మీరే పరిష్కరించుకోవాలంటూ ఆయన యూనియన్ నాయకులకు సలహా ఇచ్చాడు. ఈ సందర్బంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ.. తమ శాఖల నుండి ఎటువంటి ఉత్తర్వులు లేకుండా ఇండ్లను ఎలా ఖాళీ చేయిస్తారని వారు ప్రశ్నించారు. మున్సిపాలిటి చేపట్టిన పనులను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 10వ తేదీలోపు తమ సమస్యను పరిష్కరించాలని లేకుంటే ఎన్‌జీవొ నాయకులతో కలసి ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో యూనియాన్ నాయకులు ఎన్.నాగరాజు, సి.కొండారెడ్డి, యం.మరియదాసు, ఎ.శివ, కోటిరెడ్డి, బండి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

6 February 2016

కులాల కుంపటి రాజేస్తున్న చంద్రబాబు

కాపుల్ని ఇరుకొని పెట్టేందుకు వ్యూహాలు
బీసీ లను రెచ్చగొడుతున్న చంద్రబాబు
పనిలో పనిగా తన పబ్బం గడుపుకొంటున్న బాబు

విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం తప్పించుకొని తిరుగువాడు ధన్యుడు సుమతీ అన్న సూక్తిని బాగా ఫాలో అవుతుంటారు. ఇందుకోసం ఎవరిని బలి పెట్టడానికైనా వెనుకంజ వేయనే వేయరు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అదే సూత్రాన్ని అమలు చేస్తున్నారు.

కాపు రిజర్వేషన్ లకు బీసీల పేరుతో అడ్డు
ఎన్నికల వేళ కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని చంద్రబాబు హామీలు గుప్పించారు. ఉభయ గోదావరి జిల్లాల్లో అన్ని పార్టీ వేదికల మీద ఇదే విషయాన్ని ఊదర గొట్టారు. ఓట్లు వేయించుకొన్నాక, ఎప్పటిలాగే మోసం చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కానీ అది ఫలించక పోవటంతో రూట్ మార్చారు. బీసీలను రెచ్చగొట్టడం మొదలెట్టారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే క్రిష్ణయ్య ను హైదరాబాద్ నుంచి పిలిపించి మరీ రంగంలోకి దింపారు. బీసీలను కూడగట్టి ప్రకటనలు ఇప్పించటంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా బీసీల్లో విష బీజాలు నాటే పనిలో పడ్డారు.

బీసీలు, కాపులకు కొట్లాట
చంద్రబాబు నాయుడు కోరుకొంటున్న దిశగా పావులు కదిపారు. ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా ఎగువ కోస్తా ప్రాంతంలో చాలా చోట్ల కాపులు, బీసీలకు గ్రామాల్లో, పట్టణాల్లో ఆధిపత్య పోరు నడుస్తుంటుంది. దీన్ని వేదికగా చేసుకొని రెండు సామాజిక వర్గాల మధ్య  చిచ్చు రగిల్చారు. దీంతో అన్నిచోట్ల వాతావరణం వేడెక్కింది.

చప్పుడు కాకుండా పనులు షురూ...!
రెండు సామాజిక వర్గాల్ని రెచ్చగొట్టిన చంద్రబాబు తన వ్యూహాలను అమలు చేసుకొంటున్నారు. గడచిన 20 నెలల పరిపాలన కాలంలో ప్రధాన హామీలు అయిన రైతుల రుణమాఫీ, డ్వాక్రా మహిళల రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం వంటి వాటికి తూట్లు పొడిచారు. వీటిని గాలికి వదిలేసి, ప్రజల గురించి ఏమాత్రం పట్టించుకోకుండా రాజధాని పేరుతో అంతటినీ సింగపూర్ బినామీ కంపెనీలకు అమ్మేసేందుకు రంగం సిద్ధం చేసుకొంటున్నారు. ఈ ప్రయత్నాల నుంచి ప్రజల ఆలోచనల్ని పక్కకు మళ్లించేందుకు ఈ సామాజిక కుంపటి ని వాడుకొంటున్నారు. కానీ, చంద్రబాబు స్వార్థం కోసం ఇటువంటి రెచ్చగొట్టే రాజకీయాలకు పాల్పడటం సరైన చర్య కాదనే మాట మాత్రం బలంగా వినిపిస్తోంది. 

గ్రేటర్ ఫలితాలు.. ఆంధ్రప్రదేశ్ పై ప్రభావం

గ్రేటర్ లో చతికిలపడిన తెలుగుదేశం
టీడీపీ తో దోస్తీతో వెనుకబడిన బీజేపీ
కాంగ్రెస్ ను నమ్మని ప్రజానీకం

హైదరాబాద్: రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా నిలిచిన హైదరాబాద్ లో గ్రేటర్ ఫలితాలు విడుదల అయ్యాయి. తెలంగాణలో అధికార పక్షం టీ ఆర్ ఎస్ కు పూర్తి స్థాయిలో ఓటరు పట్టం కట్టాడు. దీంతో పాటు రెండో స్థానంలో నిలిచిన ఎమ్ ఐ ఎమ్ లను మినహాయిస్తే మిగిలిన పార్టీలకు రెండు రాష్ట్రాల్లోనూ శాఖలు ఉన్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్ ఎడతెరగని ప్రచారం చేసినప్పటికీ, షో మాత్రం అట్టర్ ప్లాప్ అయింది.

ఆంధ్రప్రదేశ్ సంబంధీకులమీద టీడీపీ కన్ను
వాస్తవానికి హైదరాబాద్ శివారు ప్రాంతాలైన కూకట్ పల్లి, మియాపూర్, మాదాపూర్, శేరిలింగంపల్లి, సూరారం, మల్కాజ్ గిరి, ఏఎస్ రావు నగర్, వనస్థలిపురం, ఎల్ బీ నగర్ ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ సంబంధీకులే ఎక్కువగా ఉంటారు. ఈ ప్రాంతాల్లో ప్రచారం చేసుకొంటే 30, 40 డివిజన్ల దాకా తమ వైపు తిప్పుకోవచ్చని టీడీపీ స్కెచ్ వేసింది. అందుకే హైదరాబాద్ ను తామే అభివ్రద్ది చేశామని, ఐటీను తామే డెవలప్ చేశామని, ప్రపంచ పటంలో తామే పెట్టామని చంద్రబాబు గొప్పలు చెప్పారు. వాటినే ప్రచారం చేసుకొన్నా కానీ చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ చతికిలపడ్డారు.
 
అబద్దాలే కొంపముంచాయి
హైదరాబాద్  పేరుతో చంద్రబాబు చెబుతున్నవన్నీ అబద్దాలే అని ప్రజలు నెమ్మదిగా గ్రహిస్తున్నారు. మరి ముఖ్యంగా ఆయన కాలంలో ఐటీ  ఏ మాత్రం ఉరకలు వేయలేదని, తర్వాత దివంగత మహానేత వైఎస్సార్ హయంలోనే చక్కటి ప్రగతి కనిపించిందని అర్థం చేసుకొన్నారు. మరో వైపు, ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్ లో అందరికీ రుణమాఫీ చేస్తున్నామని చంద్రబాబు తెగ గొప్పలు చెప్పారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని, దిగువ తరగతి వర్గాలకు ఇళ్లు కట్టిస్తామని నమ్మ బలికారు. తర్వాత  అధికారంలోకి వచ్చాక ఈ హామీలకు తూట్లు పొడిచారు. ముఖ్యంగా హైదరాబాద్ లో ఆధార్ కార్డు ఉన్న వారికి ఎవ్వరికీ రుణమాఫీ చేయకూడదని నిర్ణయాన్ని అమలు చేశారు. ఒక్కటంటే ఒక్క హామీ ను అమలు చేయకపోగా రాష్ట్రాన్ని తెగనమ్మేందుకు ప్రణాళికలు అమలు చేస్తూ పోతున్నారు. దీంతో చంద్రబాబుకి గట్టిగా బుద్ది చెప్పాలని ఆంధ్రప్రదేశ్ సంబంధీకులు తలచారు. అందుకే ఒక్క కేపీహెచ్ బీ మినహా మిగిలిన అన్ని సీట్లలో టీడీపీ పూర్తిగా చతికిల పడింది.

టీడీపీ తో దోస్తీ యే కొంపముంచిందా..!
వాస్తవానికి హైదరాబాద్ లో బీజేపీ కి కాస్తో, కూస్తో క్యాడర్ ఉంది. ముఖ్యంగా ఆర్ ఎస్ ఎస్, వీహెచ్ పీ ని నేరుగా మద్దతిచ్చే అభిమానులు, సహజంగానే బీజేపీని నమ్ముకొన్న కార్యకర్తలు ఉన్నారు. అయితే చంద్రబాబు తో పొత్తులు పెట్టుకొన్నప్పటి నుంచి సహజసిద్దంగా ఉండే క్యాడర్ దూరం అవుతూ వచ్చారు. వీరంతా పూర్తిగా పార్టీకి దూరం అయినట్లు గ్రేటర్ ఎన్నికల ఫలితాలు నిగ్గు తేల్చాయి. తెలుగుదేశం అరాచకాలు తమకు చుట్టుకొన్నాయని కమల నాథులు వాపోతున్నారు.

గ్రేటర్ ఫలితాల సంకేతాలు
గ్రేటర్ ఎన్నికల ఫలితాలు భవిష్యత్ రాజకీయాల్ని సూచిస్తున్నాయని పరిశీలకులు అంటున్నారు. ముఖ్యంగా చంద్రబాబు మోసపూరిత వైఖరి బట్టబయలు అయిందని అంటున్నారు. దీన్ని బట్టి చూస్తే ఆంధ్రప్రదేశ్ సంబంధీకులు హైదరాబాద్ లో ఇచ్చిన తీర్పునే ,, ఏపీ లోనూ ఇవ్వటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. చంద్రబాబు కట్టిన అబద్దాల కోటకు పూర్తి స్థాయిలో బీటలు వారుతున్నాయని అర్థం అవుతోంది. 

5 February 2016

తుపాకీలు, లాఠీలున్నాయని ప్రజలను భయపెట్టొద్దు

కులాల మధ్య చంద్రబాబు చిచ్చుపెడుతున్నాడు
బీసీలు బాబు చౌకబారు రాజకీయాలను తిప్పికొట్టాలి
ఆర్భాటాలు ఆపండి..రెచ్చగొట్టి సమస్యను జఠిలం చేయొద్దు
సమాజంలో అశాంతి సృష్టించే ప్రయత్నం చేయొద్దు
కాపుల డిమాండ్లపై ముద్రగడతో చర్చించి న్యాయం చేయాలి
ముద్రగడ దీక్షకు బేషరతుగా మద్దతు ప్రకటిస్తున్నాంః అంబటి

హైదరాబాద్ః మాయమాటలతో చంద్రబాబు కాపు సమాజాన్ని మోసం చేయాలని చూస్తున్నాడని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. కాపులకు సంబంధించిన డిమాండ్లపై బాబు చిన్నచూపుతో వ్యవహరిస్తున్నారని, మోసం చేయాలన్న దృక్పథంతో బాబు వ్యవహరిస్తున్నారన్నది తేటతెల్లం అవుతోందన్నారు. బీసీలను రెచ్చగొట్టి కాపులు, బీసీల మధ్య చంద్రబాబు చిచ్చుపెడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.  చిల్లర రాజకీయాలు మానుకోవాలని బాబుకు హితవు పలికారు. ముద్రగడ పద్మనాభం దీక్షకు బేషరతుగా మద్దతు ప్రకటిస్తున్నామని హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో అంబటి రాంబాబు స్పష్టం చేశారు. 

చౌకబారు రాజకీయాలను తిప్పికొట్టండి..
అర్థాంగి సమేతంగా కాపులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ముద్రగడ పద్మనాభం నిరాహార దీక్ష ప్రారంభించారని అంబటి చెప్పారు. చంద్రబాబు తన ఎమ్మెల్యేలను పంపితే,  ముద్రగడతో చర్చలు జరిపి దీక్ష విరమింపజేస్తారన్న ఆశతో కాపులంతా ఎదురుచూశారని...కానీ అది ఓతంతుగా ముగియడం దురదృష్టకరమన్నారు. చంద్రబాబు కాపుల  సమస్యను మరింత జఠిలం చేస్తూ ...సమాజంలో అశాంతి సృష్టించే ప్రయత్నం చేస్తున్నాడని, దాన్ని వేరేవాళ్లపై రుద్దాలని చూస్తున్నాడని  అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు మాసాల్లోనే కాపులకు ఇచ్చిన వాగ్దానం నెరవేరుస్తానంటూ ..2014 మేలో జరిగిన మహానాడులో చంద్రబాబు చెప్పారని అంబటి గుర్తుచేశారు. కానీ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఓవైపున కాపులను ఎగదోసే కార్యక్రమం చేస్తూ..మరోవైపున కాపులు, బీసీల మధ్య మంటపెట్టి చలికాచుకుంటున్నాడని ధ్వజమెత్తారు. చంద్రబాబు చౌకబారు రాజకీయాలను బీసీ సోదరులు గుర్తించి, తిప్పికొట్టాలన్నారు.

ఎందుకీ ఆర్భాటం..
తూర్పుగోదావరి జిల్లాలోని పరిసర ప్రాంతాలన్నీ ఆరుగురు డీఎస్పీలు,  24 మంది సీఐలు, 50 మంది ఎస్ ఐలు, 200 మంది ఏఎస్ ఐ, 700 మంది కానిస్టేబుళ్లు, వందమంది పారామిలటరీ దళాలు, ఎస్పీ, ఐజీ, డీజీపీ పర్యవేక్షణలో ఉన్నాయని అన్నారు. అసలు  అక్కడ ఏం జరుగుతుందని ఆర్భాటం చేస్తున్నారని అంబటి ప్రభుత్వాన్ని నిలదీశారు. నిజంగా మీకు శాంతిభద్రతల మీద చిత్తశుద్ధి ఉంటే మిలటరీ దళాలను దింపి ఎందుకు రెచ్చగొడుతున్నారని ప్రశ్నించారు. ముద్రగడకు అనుకూలంగా దీక్షలు చేస్తే కేసులు పెడతామంటూ పోలీసులు కాపులను బెదిరించడం మంచి పద్దతి కాదన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న హత్యలు, అన్యాయాలు చంద్రబాబుకు అనుకూలంగా జరుగుతుంటే వాళ్లపై ఎందుకు కేసులు పెట్టడం లేదని నిలదీశారు.  తుపాకీలు, లాఠీలు ఉన్నాయని దుర్వినియోగం చేయొద్దని... ఆర్భాటాలు చేయడం ఆపాలని ముఖ్యమంత్రి, హోంమంత్రి, డీజీపీలను అంబటి   హెచ్చరించారు.  

శత్రువుగా చూడొద్దు..
కర్నాటకలో  ఓ వర్గాన్ని  ఒక్కనెలలోనే బీసీ జాబితాలో  చేర్చానని అక్కడ కమిషన్ నిర్వహించిన ద్వారకానాథ్ చెబుతుంటే...చంద్రబాబు మాత్రం 3 నెలలు, 9 మాసాలంటూ కాపులను మభ్యపెట్టి మోసగిస్తున్నారని అంబటి ధ్వజమెత్తారు. చంద్రబాబు ఇచ్చిన  వాగ్దానాన్నే కాపులు కోరుతున్నారని, వారు కొత్తగా ఏమీ అడగడం లేదన్నారు. ముద్రగడ నిరాహార దీక్షను విరమించేవిధంగా చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు. ముద్రగడతో చర్చలు జరిపి తక్షణమే రూ. 2 వేల కోట్లు ప్రకటించడంతో పాటు, మూడు మాసాల్లోనే పూర్తిచేస్తామనే హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో విషపరిణామాలు చోటుచేసుకుంటాయని హెచ్చరించారు.  తెలుగుదేశంలోని కాపునేతలు సమస్య పరిష్కారం దిశగా వెళ్లాలని, ముద్రగడను శత్రువుగా చూడొద్దన్నారు. 

బాబు ఆత్మవిమర్శ చేసుకో..
చంద్రబాబు చెప్పేదొకటి, చేసేది మరొకటి అని అంబటి ధ్వజమెత్తారు. కాపులు శాంతికాములు అంటూనే ..వారిపై ఎందుకు కేసులు పెడుతున్నారని, ఇంతమంది పోలీసులను ఎందుకు మొహరిస్తున్నారని ప్రశ్నించారు. ముద్రగడ చుట్టూ పోలీసులను పెడితే  సమస్య పరిష్కారం కాదని,  చర్చలకు పిలిచి వారి డిమాండ్లు నెరవేర్చాలన్నారు.  ఎవ్వరూ కాపుల మీటింగ్ కు వెళ్లవద్దని కట్టడి చేసిన చంద్రబాబు ...మీ మంత్రులు కులమీటింగ్ లలో పాల్గొన్నప్పుడు ఎందుకు ఈపని చేయలేదన్నారు. మీకో పద్దతి, వారికో పద్దతా. ఎందకీ వివక్ష చూపుతున్నారో ఆత్మవిమర్శ  చేసుకోవాలన్నారు.

4 February 2016

బాబు కుటిల రాజకీయాలు

చంద్రబాబు రాచరిక పాలనను తలపిస్తున్నాడు
కులాల మధ్య చిచ్చుపెట్టి ..
రాజకీయ లబ్దిపొందాలని చూస్తున్నాడు
కృష్ణయ్య అక్కడ ఎందుకు నోరెత్తలేదో చెప్పాలిః బొత్స

హైదరాబాద్ః చంద్రబాబు కులాల మధ్య చిచ్చుపెడుతూ రాజకీయ లబ్దిపొందాలని చూస్తున్నారని వైఎస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తుని సభకు అనుమతి ఇచ్చామని ముఖ్యమంత్రి, ఇవ్వలేదని జిల్లా ఎస్పీ చెబుతున్నారని బొత్స అన్నారు. ఎవరి మాటలు నమ్మాలని ఆయన నిలదీశారు.  తూర్పుగోదావరి జిల్లాకు బయటి వ్యక్తులు ఎవరూ రావద్దంటూ పోలీసులు ఆంక్షలు విధించడంపై బొత్స ఫైరయ్యారు. చంద్రబాబు రాచరిక పరిపాలనను తలపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

చంద్రబాబు తన మోసపూరిత గుణంతో ప్రజలను మరోసారి మభ్యపెడుతున్నారని ధ్వజమెత్తారు. బీసీలను రెచ్చగొడుతూ బాబు మరో నాటకానికి తెరలేపారని దుయ్యబట్టారు. కులాల మధ్య వైరం సృష్టిస్తున్న చంద్రబాబు కుట్రరాజకీయాలు, ద్వంద్వ వైఖరిని ప్రజలు గుర్తించాలన్నారు. కాపులను బీసీల్లో చేర్చవద్దంటూ ధర్నాలు చేస్తున్న టీడీపీ బీసీ ఎమ్మెల్యే కృష్ణయ్య...తెలంగాణలో 23 కులాల్ని బీసీ జాబితా నుంచి తొలగిస్తే ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నావని నిలదీశారు. గతంలో బీసీ రిజర్వేషన్ నుంచి తమను తొలగించారని... తిరిగి పునురుద్ధరించాలని, ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కాపులు అడుగుతుంటే చంద్రబాబు కుటిల రాజకీయాలు చేస్తున్నారని బొత్స మండిపడ్డారు. 

ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని చేతగానితనంతోనే చంద్రబాబు ఇదంతా చేస్తున్నారని బొత్స ఫైరయ్యారు. పైపెచ్చు పెట్టుబడులకు ఆటంకం సృష్టిస్తున్నారంటూ అవతలి పార్టీలపై అభాండాలు వేస్తున్నారని నిప్పులు చెరిగారు. పుష్కరాల్లో చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చికి 29మంది చనిపోతే ఆయనపై ఇంతవరకు ఒక్క కేసు నమోదు కాలేదన్నారు. తప్పు చేశానన్న చింతన కూడా బాబుకు లేకపోవడం దుర్మార్గమన్నారు. తునిలో జరిగిన విధ్వంసం ప్రభుత్వ కుట్ర అని  కాపు ఉద్యమనాయకుడు ముద్రగడ పద్మనాభమే చెప్పారన్నారు. దానికి  సమాధానం చెప్పలేక కేసులు పెడితే భయపడిపోతారని బాబు అరాచకం సృష్టిస్తున్నారన్నారు. కాపులు అమాయకులని మాటల్లో చెప్పిన చంద్రబాబు..చేతల్లో మాత్రం వారిపై కేసులు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. ఓ కులాన్ని టార్గెట్ చేసి బైండోవర్ లు పెట్టడం దారుణమన్నారు. 

కాపులకు ఐదేళ్లలో రూ. 5 వేల కోట్లు కేటాయించడంతో పాటు, బీసీలకు నష్టం జరగకుండా కాపులను బీసీల్లో చేర్చుతానని ...చంద్రబాబు మేనిఫెస్టోలో విషయాన్ని బొత్స  పూసగుచ్చారు. ఇచ్చిన వాగ్దానం నెరవేర్చని కారణంగానే న్యాయపరమైన డిమాండ్ల కోసం కాపులంతా ఉద్యమిస్తున్నారని చెప్పారు.  రైతులు, డ్వాక్రా మహిళలకు రుణాలు మాఫీ చేయకుండా వారి పొట్టగొట్టారని... బాబు వస్తే జాబు వస్తుందని చెప్పి, ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా యువకుల్ని మోసం చేశారని బొత్స బాబుపై విరుచుకుపడ్డారు. నక్కజిత్తుల కార్యక్రమాలు మాని తక్షణమే కార్యాచరణ రూపొందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అవాంచనీయ సంఘటనలను వైఎస్సార్సీపీ ఉపేంక్షిదని బొత్స స్పష్టం చేశారు. కానీ, దాన్ని రాజకీయం చేసి చంద్రబాబు అన్యాయంగా కేసులు పెడితే మాత్రం సహించేది లేదని హెచ్చరించారు.