4 February 2016

బాబు కుటిల రాజకీయాలు

చంద్రబాబు రాచరిక పాలనను తలపిస్తున్నాడు
కులాల మధ్య చిచ్చుపెట్టి ..
రాజకీయ లబ్దిపొందాలని చూస్తున్నాడు
కృష్ణయ్య అక్కడ ఎందుకు నోరెత్తలేదో చెప్పాలిః బొత్స

హైదరాబాద్ః చంద్రబాబు కులాల మధ్య చిచ్చుపెడుతూ రాజకీయ లబ్దిపొందాలని చూస్తున్నారని వైఎస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తుని సభకు అనుమతి ఇచ్చామని ముఖ్యమంత్రి, ఇవ్వలేదని జిల్లా ఎస్పీ చెబుతున్నారని బొత్స అన్నారు. ఎవరి మాటలు నమ్మాలని ఆయన నిలదీశారు.  తూర్పుగోదావరి జిల్లాకు బయటి వ్యక్తులు ఎవరూ రావద్దంటూ పోలీసులు ఆంక్షలు విధించడంపై బొత్స ఫైరయ్యారు. చంద్రబాబు రాచరిక పరిపాలనను తలపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

చంద్రబాబు తన మోసపూరిత గుణంతో ప్రజలను మరోసారి మభ్యపెడుతున్నారని ధ్వజమెత్తారు. బీసీలను రెచ్చగొడుతూ బాబు మరో నాటకానికి తెరలేపారని దుయ్యబట్టారు. కులాల మధ్య వైరం సృష్టిస్తున్న చంద్రబాబు కుట్రరాజకీయాలు, ద్వంద్వ వైఖరిని ప్రజలు గుర్తించాలన్నారు. కాపులను బీసీల్లో చేర్చవద్దంటూ ధర్నాలు చేస్తున్న టీడీపీ బీసీ ఎమ్మెల్యే కృష్ణయ్య...తెలంగాణలో 23 కులాల్ని బీసీ జాబితా నుంచి తొలగిస్తే ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నావని నిలదీశారు. గతంలో బీసీ రిజర్వేషన్ నుంచి తమను తొలగించారని... తిరిగి పునురుద్ధరించాలని, ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కాపులు అడుగుతుంటే చంద్రబాబు కుటిల రాజకీయాలు చేస్తున్నారని బొత్స మండిపడ్డారు. 

ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని చేతగానితనంతోనే చంద్రబాబు ఇదంతా చేస్తున్నారని బొత్స ఫైరయ్యారు. పైపెచ్చు పెట్టుబడులకు ఆటంకం సృష్టిస్తున్నారంటూ అవతలి పార్టీలపై అభాండాలు వేస్తున్నారని నిప్పులు చెరిగారు. పుష్కరాల్లో చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చికి 29మంది చనిపోతే ఆయనపై ఇంతవరకు ఒక్క కేసు నమోదు కాలేదన్నారు. తప్పు చేశానన్న చింతన కూడా బాబుకు లేకపోవడం దుర్మార్గమన్నారు. తునిలో జరిగిన విధ్వంసం ప్రభుత్వ కుట్ర అని  కాపు ఉద్యమనాయకుడు ముద్రగడ పద్మనాభమే చెప్పారన్నారు. దానికి  సమాధానం చెప్పలేక కేసులు పెడితే భయపడిపోతారని బాబు అరాచకం సృష్టిస్తున్నారన్నారు. కాపులు అమాయకులని మాటల్లో చెప్పిన చంద్రబాబు..చేతల్లో మాత్రం వారిపై కేసులు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. ఓ కులాన్ని టార్గెట్ చేసి బైండోవర్ లు పెట్టడం దారుణమన్నారు. 

కాపులకు ఐదేళ్లలో రూ. 5 వేల కోట్లు కేటాయించడంతో పాటు, బీసీలకు నష్టం జరగకుండా కాపులను బీసీల్లో చేర్చుతానని ...చంద్రబాబు మేనిఫెస్టోలో విషయాన్ని బొత్స  పూసగుచ్చారు. ఇచ్చిన వాగ్దానం నెరవేర్చని కారణంగానే న్యాయపరమైన డిమాండ్ల కోసం కాపులంతా ఉద్యమిస్తున్నారని చెప్పారు.  రైతులు, డ్వాక్రా మహిళలకు రుణాలు మాఫీ చేయకుండా వారి పొట్టగొట్టారని... బాబు వస్తే జాబు వస్తుందని చెప్పి, ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా యువకుల్ని మోసం చేశారని బొత్స బాబుపై విరుచుకుపడ్డారు. నక్కజిత్తుల కార్యక్రమాలు మాని తక్షణమే కార్యాచరణ రూపొందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అవాంచనీయ సంఘటనలను వైఎస్సార్సీపీ ఉపేంక్షిదని బొత్స స్పష్టం చేశారు. కానీ, దాన్ని రాజకీయం చేసి చంద్రబాబు అన్యాయంగా కేసులు పెడితే మాత్రం సహించేది లేదని హెచ్చరించారు. 

No comments:

Post a Comment