25 February 2016

బాబుకు వైఎస్ జగన్ బహిరంగ సవాల్

ఆఫర్లు ఇచ్చి మరీ అవినీతి సొమ్ముతో..
దొడ్డిదారిన ఎమ్మెల్యేలను లాక్కుంటున్నాడు
హామీలు నెరవేర్చని బాబును ప్రజలు తిట్టిపోస్తున్నారు
ప్రజల్లోకి వెళ్లే ధైర్యం లేక..ప్రతిపక్షం గొంతు నొక్కుతున్నాడు
చంద్రబాబుకు దమ్మూ,ధైర్యం ఉంటే..
ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలి

వైఎస్సార్ జిల్లాః అవినీతి సొమ్ముతో దొడ్డిదారిన ఎమ్మెల్యేలను కొంటూ చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారని...ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మండిపడ్డారు. ఆనాడు అధికారం కోసం ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి ఎమ్మెల్యేలను లాక్కున్నాడని, ఇవాళ పదవులు, డబ్బులు ఎర చూపి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నాడని ధ్వజమెత్తారు. వైఎస్సార్ జిల్లా పర్యటనలో భాగంగా బద్వేల్ కు వచ్చిన వైఎస్ జగన్...అక్కడ మీడియాతో మాట్లాడారు. 


చంద్రబాబుకు ఏమాత్రం దమ్మూ, ధైర్యం, సిగ్గు,లజ్జ ఉన్నా...ప్రలోభాలతో చేర్చుకున్న ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించాలని జననేత సవాల్ విసిరారు. అప్పుడు ఎన్నికలకు వెళ్దాం,  ప్రజలు ఎవరి వైపున నిలబడతారో తెలుస్తోందన్నారు. తన సవాల్ ను  ఛాలెంజ్ గా తీసుకునే సత్తా ఉందా అని బాబును ప్రశ్నించారు. ఎమ్మెల్యేలను కొంటే ప్రభుత్వాలు నిలబడవని, ప్రజల గుండెల్లో స్థానం సంపాదిస్తేనే ప్రభుత్వాలు నిలబడతాయన్నారు. ప్రజల ఆదరాభిమానాలే తనను నిలబెడుతున్నాయని, ఎక్కడికెళ్లినా నీకు మేమున్నామంటూ భరోసా కల్పిస్తున్నారని వైఎస్ జగన్ ఉద్విఘ్నంగా మాట్లాడారు. 


పార్టీ పెట్టిన రోజు నేను, అమ్మ మాత్రమే ఉన్నామని వైఎస్ జగన్ చెప్పారు. ఆతర్వాత రాజీనామా చేసి ఎన్నికలకు పోయి 18 మంది ఎమ్మెల్యేలను సంపాదించుకున్నామన్నారు. ఆ 18 ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ప్రజల అండతో ఎన్నికల్లో  గెలిచామన్నారు. అలా ఇద్దరం 18 మంది, 18 నుంచి 67 మంది ఎమ్మెల్యేలం అయ్యామన్నారు. నలుగురైదుగురు పోయినంత మాత్రాన పార్టీకి ఏమీ కాదన్నారు. టీడీపీలోకి వెళ్లిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో అంతకంటే మెరుగైన నాయకులు వస్తారని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.  

పట్టిసీమ నుంచి బొగ్గుదాక, ఇసుక నుంచి మట్టి దాకా, జెన్ కో టెండర్లు, ప్రాజెక్ట్ లలో విచ్చలవిడిగా చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని వైఎస్ జగన్ ఫైరయ్యారు. అలా వచ్చిన అక్రమ సొమ్ముతో ఎమ్మెల్యేలను ఎర వేస్తున్నారని దుయ్యబట్టారు. ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 20 నుంచి 30 కోట్లు, మంత్రి పదవులు, మైనింగ్ ఆఫర్లు ఇస్తున్నాడని తూర్పారబట్టారు. ఇంకో ఏడాదిపోతే టీడీపీ ఎమ్మెల్యేలే తమ పార్టీలోకి వస్తారని...అప్పుడు నైతికంగా రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్తామన్నారు. 

రైతులు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ అన్నాడు, బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు రావాలన్నాడు. ఇంటికో ఉద్యోగమన్నాడు. ఉద్యోగం లేని వారికి నెలకు రూ. 2వేల నిరుద్యోగ భృతి అన్నాడు. ఇలా ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానం నెరవేర్చకుండా చంద్రబాబు ప్రజలను మోసగించారని వైఎస్ జగన్ నిప్పులు చెరిగారు. ప్రజలు చంద్రబాబును తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారన్నారు.  ప్రజల్లోకి వెళ్లే ధైర్యం లేకనే....ప్రజల ఘోష వినిపిస్తున్న ప్రతిపక్షం గొంతు నొక్కుతున్నాడని బాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

No comments:

Post a Comment