3 February 2016

దేశంలో ప్రజాస్వామ్యం ఉందా

పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీకే గతిలేదు
ప్రత్యేకహోదా ఉంటే ప్రతి జిల్లా హైదరాబాద్ అవుతుంది
చంద్రబాబు హోదా అవసరం లేదంటాడు
ఫైనాన్స్ కమిషన్ ఒప్పుకోవడం లేదని అబద్ధాలు చెబుతాడు
ఏపీకి వేలకోట్లు ఇస్తే మీకు అడ్డు ఎవరుః వైఎస్ జగన్

శ్రీకాకుళంః వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్..శ్రీకాకుళం యువభేరి సదస్సులో విద్యార్థులు, యువతకు ప్రత్యేకహోదాపై దిశానిర్దేశం చేశారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా వల్ల రెండు రకాల మేలు జరుగుతుందని చెప్పారు. ప్రత్యేకహోదా ఉన్న రాష్ట్రాలకు పన్నుల్లో వాటాతో పాటు గ్రాంట్లు, లోన్ల ద్వారా రాష్ట్రాలకు సొమ్ము అందుతుందన్నారు. గ్రాంట్ అంటే తిరిగి చెల్లించనక్కర్లేని సొమ్ము. అదే లోన్ అయితే సొమ్ము తిరిగి చెల్లించాలి. ప్రత్యేకహోదా ఉన్న రాష్ట్రాలకు 90 శాతం గ్రాంట్లు వస్తాయి, కేవలం 10 శాతమే లోన్ వస్తుంది. అదే హోదా లేకపోతే 30 శాతమే గ్రాంట్లు వస్తాయి. 70శాతం లోన్ ద్వారా ఇస్తారని జననేత వివరించారు.  

ప్రత్యేకహోదా రాష్ట్రాలకు భారీగా పారిశ్రామిక రాయితీలు ఇస్తారని వైఎస్ జగన్ తెలిపారు. దేశంలో ప్రత్యేకహోదా ఉన్న రాష్ట్రాలు 11 ఉన్నాయన్నారు. హోదా ఉన్న రాష్ట్రాల్లో పరిశ్రమలు పెడితే కార్పొరేట్ , ఇన్ కమ్ ట్యాక్స్, ఎక్సైజ్ ట్యాక్స్ కట్టనవసరం లేదు. ట్రాన్స్ పోర్ట్ ఖర్చులు వెనక్కిఇస్తారు. పరిశ్రమలకు 20 ఏళ్లపాటు 50 శాతం రాయితీతో  విద్యుత్ సప్లై చేస్తారు. ఇలాంటి రాయితీలుంటే ప్రతి జిల్లా ఓ హైదరాబాద్ అవుతుంది. పారిశ్రామికవేత్తలను తీసుకొచ్చేందుకు చంద్రబాబు సింగపూర్, చైనా తిరగనవసరం లేదు. ఇక్కడ చలిగా ఉంటుందని దావోస్ వెళ్లనవసరం లేదు. ప్రత్యేకహోదా వస్తే లక్షల కోట్లు పెట్టుబడులు వస్తాయి. ఉద్యోగాలు వస్తాయి. నో వేకెన్సీ బోర్డులు కనిపించవు. ఇవన్నీ తెలిసి కూడా చంద్రబాబు తెలియనట్టు నటిస్తున్నాడని వైఎస్ జగన్ మండిపడ్డారు.  ఉత్తరాఖాండ్ లో రాయితీలివ్వడం వల్ల 490శాతం ఉద్యోగాలు పెరిగినట్లు ఉదహరించారు.  

చదువు అయిపోయాక ప్రతి పిల్లాడు పట్టా చేతబుచ్చుకొని ఉద్యోగం కోసం హైదరాబాద్ వెళతాడు. 90శాతం  ఐటీ పరిశ్రమలు హైదరాబాద్ లోనే ఉన్నాయి. రాష్ట్రంలో 70 శాతం మానుఫ్యాక్చర్ పరిశ్రమలు హైదరాబాద్ లోనే ఉన్నాయి.  ఆంధ్రప్రదేశ్ కు హోదా ఇస్తామని చెప్పి ..హైదరాబాద్ ను ఏపీకి కాకుండా చేసి అన్యాయంగా విభజించారు. ఆనాడు అధికార, ప్రతిపక్షం ఇద్దరూ కలిసి రాష్ట్రాన్ని విడగొట్టారు. మన్మోహన్ ఐదేళ్లు ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని హామీ ఇస్తే...ఇదే చంద్రబాబు, బీజేపీ ప్రతిపక్షంలో ఉండి పదేళ్లు కావాలని అడిగారు. పార్లమెంట్ సాక్షిగా ఇద్దరూ కలిసి ఒక్కటై రాష్ట్రాన్ని నిట్టనిలువునా చీల్చారు. తిరుపతిలోనూ  బాబు, మోడీ, వెంకయ్యనాయుడు ప్రత్యేకహోదా ఇస్తామని చెప్పారు. మేనిఫెస్టోలో పెట్టారు. ఇవాల మాకు తెలియదంటూ చెవులో పువ్వు పెడుతున్నారని వైఎస్ జగన్ ఫైరయ్యారు. 

నాయకుడి నోట్లోంచి మాట వస్తే నెరవేరుస్తాడని ఆశగా చూస్తాం. పార్లమెంట్ లో ఇచ్చిన మాటకే గతిలేకపోతే దేశంలో ప్రజాస్వామ్యం ఉందా అనిపిస్తోందని వైఎస్ జగన్ మండిపడ్డారు. నాయకులకు విశ్వసనీయత అన్నదే లేకుండా పోయిందని దుయ్యబట్టారు.  ప్రతి పిల్లాడు రాజకీయ నాయకులను నమ్మకపోవడానికి కారణం ఇలాంటి వాళ్లేనని తూర్పారబట్టారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురాకపోగా హోదా వేస్ట్ అంటూ చంద్రబాబు రకరకాల అబద్ధాలు చెబుతున్నాడని జననేత నిప్పులు చెరిగారు. కేంద్రం గనుక హోదా ఇస్తామని చెబితే....చంద్రబాబు విశాఖలో మీటింగ్ పెట్టి మావల్లే వచ్చిందంటూ దేశ,విదేశాలనుంచి అందరినీ పిలిచి గొప్ప కార్యక్రమని చేసేవాడంటూ ఎద్దేవా చేశారు.  

హోదాకు ఫైనాన్స్ కమిషన్ ఒప్పుకోవడం లేదు, హోదా ఉన్న రాష్ట్రాలకు డబ్బులు తక్కువగా ఇస్తారు అంటూ చంద్రబాబు పచ్చి అబద్ధాలు ఆడుతూ వాస్తవాలను వక్రీకరిస్తున్నాడని వైఎస్ జగన్ విరుచుకుపడ్డారు. ప్రత్యేకహోదా అన్నది క్యాబినెట్ నిర్ణయమని, క్యాబినెట్ చైర్మన్ ప్రధాని గనుక ఆయన తలచుకుంటే హోదాకు అడ్డుపడేది ఎవరని జననేత ప్రశ్నించారు. హోదా ఉన్న రాష్ట్రాలకు ఎంత డబ్బులు ఇవ్వాలన్న దానిపై ఫార్ములా లేదన్నారు. నరేంద్రమోడీ జమ్ముకాశ్మీర్ కు 70 వేల కోట్లు ప్యాకేజీ రిలీజ్ చేశారు. కోటి 25 లక్షల జనాభా ఉన్న జమ్ముకాశ్మీర్ కు అంత ఇస్తే ..ఐదు కోట్లు జనాభా ఉన్న ఆంధ్రకి వేల కోట్ల ప్యాకేజీకి ఎవరు అడ్డని ప్రశ్నించారు. ప్రత్యేకహోదా సమసిపోయిందంటూ బాబు అబద్ధాలు చెబుతున్నారు. మా ఎంపీ వైవి సుబ్బారెడ్డి పార్లమెంట్ లో మంత్రికి లేఖ రాస్తే...అదే పార్లమెంట్ సాక్షిగా హోదా ఉందని ఆమంత్రి నుంచి రిప్లై వచ్చిందన్నారు. 

No comments:

Post a Comment