8 February 2016

నమ్మటం మీ వంతు – ముంచటం మా వంతు..!

రాజధాని రైతులకు మరోసారి బాబు మార్కు షాక్
భూములు ఇవ్వని రైతులపై కోపం తీర్చుకొంటున్న సర్కార్
అదేమంటే మొక్కుబడి జవాబులే గతి

అమరావతి: రాజధాని ప్రాంతంలో భూములు లాక్కొనేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎన్నెన్నో గిమ్మిక్కులు చేసింది. అయినప్పటికీ భూములు వదులుకొనేందుకు ఇష్టపడని రైతుల మీద కక్ష సాధించేందుకు సిద్ధ పడుతోంది. వ్యవసాయ పరికరాలు ధ్వంసం చేయటం, పంటల్ని తగలబెట్టడం, తర్వాత దశలో ఏకంగా పంటను బుల్ డోజర్లతో నాశనం చేయటం వంటి ఘటనల్ని చూశాం. అయినా సరే ఈ ఘటనల మీద ఎటువంటి చర్యలు కనిపించటం లేదు.

దగ్ధం ఘటనల్లో చర్యలు శూన్యం..!
ప్రభుత్వానికి భూములు ఇవ్వని రైతుల పొలాల్లోని వ్యవసాయ పరికరాల్ని తెలుగుదేశం గూండాలు ధ్వంసం చేశారు. దీని మీద బాధిత రైతులు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి ప్రయోజనం లేదు. తర్వాత గద్దె చంద్రశేఖర్ అనే రైతుకి చెందిన చెరకు తోటను దగ్దం చేశారు. దీనికి కారణం స్థానిక తెలుగుదేశం నాయకులే అని చంద్రశేఖర్ ఎంత మొత్తుకొంటున్నా వినకుండా, పై పెచ్చు ఆయన కుటుంబసభ్యుల్నే తీసుకొని వెళ్లి పోలీసులు చిత్రహింసలు పెట్టారు. టీడీపీ నాయకుల మీద ఎటువంటి కేసులు లేకుండా జాగ్రత్త పడ్డారు.

అరటి తోట నాశనం చేసినా అంతే సంగతులు..!
అమరావతిలో భూ సమీకరణకు సహకరించని లింగాయపాలెం వాసులు గుండపు రాజేష్, ఆయన సోదరుడు గుండపు చంద్రశేఖర్‌కు చెందిన 7.3 ఎకరాల అరటి తోటను  డిప్యూటీ కలెక్టర్ సీతారామ్మూర్తి పర్యవేక్షణలో మూడు బుల్డోజర్లతో తొలగించిన విషయం తెలిసిందే.

భూ సమీకరణకు అంగీకరించబోమని, పొలాన్ని సాగు చేసుకుంటామని రాజేష్ సోదరులు తేల్చిచెప్పడం వల్లే ప్రభుత్వం వారి అరటి తోటను నాశనం చేసింది. దీని మీద పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగటంతో.. నష్టపరిహారం చెల్లిస్తామని అధికారులు చెప్పారు. ఒకట్రెండు రోజుల్లో పరిహారం అందుతుందని రాజేష్ సోదరులు భావించారు.

కానీ, అందుకు విరుద్ధంగా జరుగుతోంది. పంట ధ్వంసమైన పొలాన్ని అధికారుల బృందం తనిఖీ చేస్తుందని, ఎంత నష్టం జరిగిందో అంచనా వేయడానికి విచారణ చేపడుతుందని పేర్కొంటూ బాధితులకు సీఆర్‌డీఏ తాజాగా లేఖ రాసింది.  రాజేష్ సోదరుల భూమిలో తొలగించిన అరటి చెట్లు ఇప్పుడు మట్టిలో కలిసిపోయాయి. అక్కడ అరటి తోట ఉందనే ఆనవాళ్లు కూడా ప్రస్తుతం కనిపించడం లేదు. రెండు నెలల తర్వాత వస్తే నష్టపరిహారం ఎలా నిర్ణయిస్తారని బాధితులు ప్రశ్నిస్తున్నారు. జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి, పరిహారం చెల్లించడానికి ఇంకెంత సమయం పడుతుందోనని ఆందోళన చెందుతున్నారు.

రైతుల్ని వేధించటమే లక్ష్యంగా..!
మొత్తం మీద భూములు అప్పగించని రైతుల్ని వేధించటమే లక్ష్యంగా చంద్రబాబు ప్రభుత్వం పనిచేస్తోంది. ఇందులో అధికార యంత్రాంగం, టీడీపీ నాయకత్వం తమదైన పాత్ర పోషిస్తున్నాయి. అతిమంగా రైతులు మాత్రం బాధ పడుతున్నారు. 

No comments:

Post a Comment