12 February 2016

అవినీతికి, వెన్నుపోటుకు కేరాఫ్ అడ్రస్ టీడీపీ

టీడీపీ మునిగిపోయే పడవ
చంద్రబాబు ఏం చూసి కలలు గంటున్నావ్
హైదరాబాద్ పటంలో టీడీపీ లేకుండా చేశారు
ఏపీలో కూడా బాబుకు మిగిలేది ఇద్దరు ఎమ్మెల్యేలే
నీతికి, నిజాయితీకి నిలువుటద్దం వైఎస్సార్ ఫ్యామిలీ
వైఎస్ జగన్ ఉదయించే సూర్యుడు..బాబు అస్తమించే సూర్యుడు


హైదరాబాద్ః వైఎస్సార్సీపీ నగరి ఎమ్మెల్యే ఆర్ కె రోజా టీడీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు పచ్చపార్టీ తీరు ఉందని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ వాళ్లు తమ పార్టీలోకి వస్తున్నారంటూ చంద్రబాబు భ్రమపడుతున్నారని ఆమె మండిపడ్డారు. రెండు మూడు ఛానళ్లు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఏవైతే వండుతున్నారో..అవే చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబును పల్లకిలో మోస్తున్నామని అనుకోవద్దని..అది రెండేళ్ల తర్వాత పాడె అవుతుందన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. చంద్రబాబు చేసిన తప్పులను కప్పిపుచ్చుతూ..మానసికంగా వైఎస్సార్సీపీని దెబ్బతీసేలా లేనివి ఉన్నట్లు గ్లోబల్ ప్రచారం చేసే ఛానళ్లపై లీగల్ నోటీసులిస్తామన్నారు.

చంద్రబాబు తన పరిపాలనలో మైనస్ 90మార్కులు తెచ్చుకున్నాడు కాబట్టి..ఆయన కళ్లు వైఎస్సార్సీపీ, ఎల్లో మీడియాపై పడిందని రోజా దుయ్యబట్టారు. కౌరవుల సంఖ్య కన్నా ఒకటి ఎక్కువగానే ఉన్నా...పరిపాలించడం చేతగాక, ప్రజలకు మంచి చేయలేక తన అనుకూల ఛానళ్లతో  చంద్రబాబు పిచ్చి ఆలోచనలు చేస్తున్నాడని రోజా నిప్పులు చెరిగారు. వైఎస్ జగన్ ఉదయించే సూర్యుడని, చంద్రబాబు అస్తమించే సూర్యుడని రోజా అన్నారు. అవుడేటెడ్ చంద్రబాబు వెనుకాల వెళ్లాలని ఎవరూ కోరుకోరని చెప్పారు.

అదిగో వస్తున్నారు, ఇదిగో వస్తున్నారంటూ చంద్రబాబు తాను భ్రమ పడుతూ, ప్రజలకు భ్రమలు కల్పించాలని చూశారని అన్నారు. ఏ ఒక్కరూ వెళ్లలేదంటే చంద్రబాబు తాను ఎలాంటి వాడో తెలుసుకోవాలన్నారు. హైదరాబాద్ ను  ప్రపంచపటంలో పెట్టానని లేనిపోనివన్నీ చెప్పినందుకే ..చంద్రబాబు పార్టీని  గ్రేటర్ ప్రజలు హైదరాబాద్ పటంలో లేకుండా చేశారన్నారు. ఏమీ చేయకుండా అన్నీ చేశానంటూ అబద్ధాలు చెప్పినందునే హైదరాబాద్ ప్రజలు బాబుకు బుద్ధి చెప్పారన్నారు.  ఏం చూసి తమ ఎమ్మెల్యేలు వస్తారని కలలు గంటున్నావని బాబును ప్రశ్నించారు. హైదరాబాద్ నం.1 చేశానంటే ఒక్క సీటు ఇచ్చారు. ఏపీలో కూడా చంద్రబాబుకు ఆఖరికి  ఇద్దరే ఎమ్మెల్యేలు మిగులుతారని రోజా చెప్పారు.

నీతికి, నిజాయితీకి మారుపేరు...ఇచ్చిన మాట కోసం ఎన్ని కష్టాలైన పడే నిబద్ధత గల నాయకులు వైఎస్సార్ , వైఎస్ జగన్ ఆయన కుటుంబం అని రోజా అన్నారు. అవినీతికి, వంచనకు, వెన్నుపోటుకు, విశ్వాసఘాతుకానికి కేరాఫ్ అడ్రస్ టీడీపీ అని ధ్వజమెత్తారు. అలాంటి పార్టీలోకి ఎవరైనా వెళ్లాలంటే రాక్షస సంతతికి చెందిన వాళ్లే వెళ్తారు తప్ప ఎవరూ వెళ్లరన్నారు. రుణాలు మాఫీ చేస్తానని రైతులు, డ్వాక్రా అక్కచెల్లెల్లని మోసం చేశావ్. ఉద్యోగాలిస్తానని చెప్పి నిరుద్యోగులను మోసం చేశావ్. ఇలా అందరినీ మోసం చేస్తూ చంద్రబాబు కులాల మధ్య, మతాల మధ్య చిచ్చుపెడుతున్నాడని రోజా విరుచుకుపడ్డారు.

టీడీపీ మునిగిపోయే నావ అని రోజా ఎద్దేవా చేశారు. 18 నెలల్లో ఇంతగా మునిగిపోయిన పడవ మరే రాష్ట్రంలో లేదన్నారు. బాబు పాలనను ప్రజలంతా చీదరించుకుంటున్నారని రోజా చెప్పారు. అందుకే వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను ఏవిధంగానైనా లాక్కోవాలని అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి బాబు కలలు గంటున్నాడని మండిపడ్డారు. దాంట్లో భాగంగానే ఓడిపోయిన టీడీపీ నాయకుల్ని, రౌడీల్ని జన్మభూమి కమిటీల్లో వేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ...ప్రజాప్రతినిథుల హక్కులు కాలరాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల నిధులను ఓడిపోయిన టీడీపీ నేతలకు తరలించడం దుర్మార్గమన్నారు. ప్రజల పక్షాన పోరాడుతున్న వైఎస్సార్సీపీపై బాబు అక్రమ కేసులు పెట్టడం, రూల్స్ కు విరుద్ధంగా తనను సస్పెండ్ చేయడం దేశమంతా చూస్తోందన్నారు.

 ప్రలోభాలు పెట్టో, బెదిరించో పార్టీలో చేర్చాలని అనుకున్నా..టీడీపీలోకి ఎవరూ రాలేదంటే చంద్రబాబు నీవెంటో నీ నాయకత్వం ఏంటో తెలుసుకోవాలని రోజా హితవు పలికారు. వైఎస్  జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఆయన వెనకాల ఉన్నవాళ్లం కాదని, తన తండ్రిలాగా ప్రజలకు మంచి చేయాలన్న జననేత తపన చూసి ఆయన వెనకాల నడిచాం, నడుస్తామని రోజా తేల్చిచెప్పారు. ప్రజలు ఇచ్చే తీర్పును గౌరవించి ప్రజాసమస్యలపై పోరాడుతున్నామన్నారు. భారతదేశంలో ప్రజాసమస్యలపై పోరాడిన ప్రతిపక్షమేదైనా ఉందంటే అది వైఎస్సార్సీపీ మాత్రమేనన్నారు. ప్రజలను తండ్రిలాగా అభిమానిస్తూ..రాజన్న పరిపాలన తీసుకురావాలన్న ఆలోచనతో ముందుకు వెళ్తున్న వైఎస్ జగన్ నాయకత్వంలో పనిచేస్తున్నందుకు తామంతా గర్వంగా ఫీలవుతున్నామన్నారు.

No comments:

Post a Comment