17 March 2016

అంకెల బడ్జెట్ లెక్కలు తేల్చండి

  • ముఖ్యమైన సమయంలో ఆర్థికమంత్రి లేకపోవడం శోచనీయం
  • బడ్జెట్ లో చూపించిన లెక్కల సంగతి తేల్చండి
  • మీరు చెప్పేది వాస్తవమేమా..? లేక అంకెలనే చూపిస్తున్నారా..?
  • రూ.38 వేల కోట్ల ఖర్చు మాటేమిటి ఆర్థికమంత్రిః బుగ్గన
అసెంబ్లీః ఏపీ బడ్జెట్ అంతా కాకిలెక్కలాగే ఉందన్న విషయాన్ని వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పష్టంగా చూపించారు. అంకెల్లో ఏమాత్రం పొంతన లేకపోవడాన్ని ఆయన ఎత్తి చూపించారు. 2016-17 ఆర్థిక సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఎలా ప్రవేశపెట్టారో.. అందులో అంశాలు ఎలా ఉన్నాయో అంతా సమగ్రంగా వివరించారు. ముందుగా మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలామ్‌, తొలి గవర్నర్ జనరల్ చక్రవర్తుల రాజగోపాలాచారిల ప్రసంగాలను ఆయన ప్రస్తావించారు. రాజకీయం, ప్రజాసేవ రెండూ వేర్వేరు కావన్న సిద్ధాంతాలు కలిగిన వైఎస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ తరఫున.... బడ్జెట్ మీద చర్చలో పాల్గొనేందుకు అవకాశం కల్పించిన అందరికీ ధన్యవాదములు తెలిపారు. ఇంత ముఖ్యమైన సమయంలో ఆర్థికమంత్రి లేకపోవడం గమనార్హమని ఎత్తిచూపారు.

బడ్జెట్‌లో బెంచిమార్కు ఉంటుందని, అక్కడి నుంచి మొదలుపెట్టుకోవాలని అన్నారు.  బడ్జెట్ బుక్కులో ఆడిట్స్ లేవన్నారు. ఎందుకు లేవన్నది ఓ ప్రశ్నగా మిగిలిందన్నారు. తమకు బడ్జెట్ వివరాలను కొంత ట్యాబ్‌లోను, మరికొంత పెన్ డ్రైవ్‌లోను ఇచ్చారని గుర్తు చేశారు. బడ్జెట్ అంటే అన్నీ అంచనాలేనని, అయితే అయిపోయిన అంశాలకు సంబంధించి కూడా సరైన వివరణ లేదని చెప్పారు. 2015-16 లో రెవెన్యూ ఖర్చు 54,574 కోట్లు ...పూర్తి ఖర్చులు 32,688 కోట్లుగా చూపించారు. మిగిలిన 22 కోట్లు పబ్లిక్ డిపార్ట్ మెంట్ గా కట్టామని చూపిస్తున్నారు. 22 వేల కోట్లు ఆవిధంగా చూపించాలంటే ఎలాంటి పర్మిషన్ తీసుకున్నారని ప్రశ్నించారు. దీనికి ఎఫ్ఆర్‌బీఎం అనుమతులు తీసుకున్నామా లేదా అనే విషయం చూడాలని అన్నారు. 

అలాగే, రాబడి 90 వేల కోట్లు అన్నారు, అందులో గ్రాంట్ ఇన్ ఎయిడ్ 21,779 కోట్లు ఉందని చెప్పారు. రెవెన్యూ ఖర్చు 1.14 లక్షల కోట్లుగా చెప్పడంతో.. రెవెన్యూలోటు భారీగా 24,314 కోట్లుగా ఉందని అన్నారు. అలాగే కేపిటల్ వ్యయం 11,409 కోట్లు ఉన్నట్లు చెప్పారు. మొత్తమ్మీద 35వేల కోట్ల లోటు కనిపిస్తోందని, ఇది జీఎస్‌డీపీలో 7 శాతం వరకు ఉంటోందని అన్నారు. అయితే ఎఫ్‌ఆర్‌బీఎం మాత్రం ఇది 3 శాతానికి మించకూడదని చెబుతోందని.. అలాంటప్పుడు ముందుగా అనుమతి తీసుకున్నారా లేదా అనే విషయాన్ని నిర్ధారించుకోవాలన్నారు. పబ్లిక్ డిపాజిట్లు 22 వేల కోట్లు ఎప్పుడు, ఎందుకు వాడారు, దానికి అనుమతులు తీసుకున్నారా అనేది చూడాలని తెలిపారు.

ఆర్థికమంత్రి చెప్పిన మరో అబద్ధాన్ని కూడా రాజేంద్రనాథ్ రెడ్డి ఎత్తి చూపించారు. దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో తాము మొత్తం 99 శాతం విజయవంతంగా ఖర్చు పెట్టామన్నారని అన్నారు. కానీ మొత్తం బడ్జెట్ 1.18 లక్షల కోట్లు అయితే.. మొత్తం ఖర్చు 70వేల కోట్లుగా చూపించారని, అంటే ఈ ఆర్థిక సంవత్సరంలోనే రూ.38వేల కోట్లు ఇంకా ఖర్చుపెట్టాల్సి ఉందని.. మరి ఆర్థికమంత్రి చెప్పినది వాస్తవమేనా, కేవలం అంకెలు మాత్రమే ఇస్తున్నారా అని నిలదీశారు. 

16 March 2016

అల్టిమేటమ్ ఇవ్వగలరా..!

హైదరాబాద్) ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు నాలుకల వైఖరిని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ అసెంబ్లీ వేదికగా కుండ బద్దలు కొట్టారు. ప్రత్యేక హోదా మరియు విభజన చట్టం హామీల అమలు మీద శాసనసభలో తీర్మానం చేసిన సందర్బంగా వైఎస్ జగన్ మాట్లాడారు. ఇక్కడ బీద అరుపులు అరుస్తున్న చంద్రబాబు, అక్కడ మాత్రం పొగడ్తలతో ముంచెత్తుతున్నారని ఎండగట్టారు. రెండేళ్లుగా ఎదురు చూస్తున్నప్పటికీ ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఒకటే ప్రశ్న వేస్తున్నామని, తీర్మానం వరకు బాగానే ఉందని చెబుతూనే, ప్రభుత్వం చేయవలసిన పనిని దిశానిర్దేశం చేశారు. ‘‘నెల రోజులు గడువు ఇస్తాం. మీరు హామీలన్నీ అమలు చేయండి లేకపోతే కేంద్రం నుంచి మా మంత్రుల్ని వెనక్కి తీసుకొంటాం ’’ అని అల్టిమేటమ్ ఇవ్వగలరా అని వైఎస్ జగన్ నిలదీశారు. రెండేళ్లుగా ఎదురు చూస్తూనే ఉన్నామని, అక్కడ నుంచి మాత్రం సరైన స్పందన కనిపించటం లేదని పేర్కొన్నారు. దీని మీద అధికార పక్షం పెడర్థాలు తీస్తూ వెళ్లింది. దీంతో పాటు తీర్మానం ప్రతిలో వెనుకబడిన జిల్లాలను ప్రస్తావించారని, ఇందులో రాయలసీమ జిల్లాలతో పాటు ప్రకాశం జిల్లా ను కూడా కలపాలని కోరారు. 

15 March 2016

రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తారా బాబూ..!

  • రాజ్యాంగ విలువలకు పాతరేస్తున్న పచ్చ ప్రభుత్వం
  • స్పీకర్ తొలగింపు అంశం మీద రాజ్యాంగం చెబుతున్నా పట్టించుకోరా
  • ప్రభుత్వాన్ని నిలదీసిన జన నేత వైఎస్ జగన్

హైదరాబాద్: శాసనసభ కార్యకలాపాల్లో రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మండిపడ్డారు. రాజ్యాంగంలోని 179(సీ) స్పీకర్ తొలగింపు విధానాల్ని స్పష్టంగా చెబుతోందని ఆయన వివరించారు. 14 రోజుల వ్యవధిని పాటించాలని రాజ్యాంగం చెబుతోందన్న అంశాన్ని జన నేత కోట్ చేశారు. స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానం సందర్భంగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ జోక్యం చేసుకొన్నారు.
హుందాగా వ్యవహరించాం..!
       అసెంబ్లీ లో చర్చ సందర్బంగా విప్ జారీ గురించి మాట్లాడితే..అందుకోసమే అవిశ్వాస తీర్మానం తెచ్చాం అన్నట్లుగా వక్రీకరించారు. విధాన ప్రక్రియలో భాగంగా విప్ జారీ చేయాల్సి ఉంటే, దాన్ని అడ్డుకొంటున్న విధానం అన్యాయంగా అనిపించటం లేదా అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. స్పీకర్ గా కోడెల శివప్రసాద్ ఎన్నిక సమయంలో నేను అన్న మాటలను బీజేపీ సభ్యులు ఉదహరించారు. ఆ మాటల్ని మేం అంగీకరిస్తున్నాం. అప్పుడు మేం ఆయన మీద నమ్మకం ఉంచాం కాబట్టి అంత గౌరవంగా ఏకగ్రీవ ఎన్నికకు సహకరించాం. కానీ ఆయన స్పీకర్ గా ప్రవర్తించటం లేదు. తెలుగుదేశం ఎమ్మెల్యేగా ప్రవర్తిస్తున్నారని వైఎస్ జగన్ మండిపడ్డారు. అంత గౌరవంగా మేం స్పీకర్ స్థానంలో కూర్చోబెడితే ఆయన ప్రవర్తన మాత్రం బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు.
తప్పుడు మార్గాలు..!
       ఇతర పార్టీల బీ ఫామ్ ల నుంచి గెలిచిన వారిని ప్రలోభాలకు గురి చేసి, కొనుగోలు చేస్తున్నారు. వారిని అనర్హులుగా గుర్తించి వేటు వేయాల్సిన స్థానంలో ఉండి... ఆ పని చేయటం లేదు. విప్ జారీ చేసే విషయంలోనూ దారుణంగా వ్యవహరించారని వైఎస్ జగన్ పేర్కొన్నారు. సోమవారం ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం కు సంబంధించి తేదీ నిర్ణయించి  ప్రకటిస్తే మేం విప్ జారీ చేసి ఉండేవాళ్లం, ఓటింగ్ జరిగి ఉండేది. కానీ అలా జరగనివ్వలేదని వైఎస్ జగన్ వివరించారు. ప్రగతిని చూసి పార్టీలు మారుతున్నారని చెబుతున్నారని, అటువంటప్పుడు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలంతా ఎక్కడ ఉన్నారని, ఎందుకు ఓటు వేయటం లేదని ప్రశ్నించారు. ఆ సభ్యుల చేత రాజీనామా చేయించి ప్రజల దగ్గరకు వెళ్లి ఎన్నికలకు పోయే ధైర్యం చంద్రబాబుకి లేదని వైఎస్ జగన్ అన్నారు.
రాజ్యాంగాన్ని పట్టించుకోరా..!
ప్రతిపక్ష నేతగా నేను మాట్లాడుతుంటే అధికార పక్షం నుంచి 3 లేక 5 నిముషాలకు ఒకసారి అంతరాయం కల్గిస్తారని, ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారని వైఎస్ జగన్ పేర్కొన్నారు. అటువంటివి కనీసం ఆపే ప్రయత్నాలు కూడా చేయరని చెప్పారు. నిబంధనావళి 340 (2) ప్రకారం రూల్ ను అధిగమించి ఎమ్మెల్యే రోజా ను సస్పెండ్ చేయటం జరిగింది. ఈ విషయం మీద జవాబు చెప్పటం లేదని వైఎస్ జగన్ వివరించారు. అటు రూల్ 71 ను సస్పెండ్ చేస్తూ అధికారం లేకపోయినా నిర్ణయం తీసుకొన్నారని చెప్పారు. అసలు ఇవన్నీ రాజ్యాంగంలోని 179(సీ) అధికరణ కిందకు వస్తాయని వైఎస్ జగన్ చెప్పారు. అందులో స్పీకర్ తొలగింపు అంశం ఎలా చేపట్టాలో రాసి ఉందని చదివి వినిపించారు. 14 రోజుల వ్యవధి ఉండాలన్న నిబంధనను కోట్ చేశారు. తర్వాత 208 అధికరణ కింద ఆయా శాసనసభ ల వ్యవహారాలు నిబంధనావళి ప్రకారం సాగాలని, అదే సమయంలో రాజ్యాంగానికి లోబడి ఉండాలని గుర్తు చేశారు. అటువంటప్పుడు రాజ్యాంగం ఇచ్చిన స్ఫూర్తిని తుంగలోకి తొక్కి స్పీకర్ గా కోడెల శివప్రసాద్ రావు  వ్యవహరించారని వైఎస్ జగన్ అభిప్రాయ పడ్డారు.

14 March 2016

అసెంబ్లీలో ప్రజలపక్షంగా ప్రతిపక్షం

అన్నింటా ప్రభుత్వ వైఫల్యం..!
హైదరాబాద్ : అన్నిరంగాల్లో చంద్రబాబు ప్రభుత్వం వైఫల్యం చెందిందని ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మండిపడ్డారు. ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి  తర్వాత మాట తప్పారని సోదాహరణంగా వివరించారు. అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం మీద చర్చ సందర్బంగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మాట్లాడారు.

ప్రజలకు ఎన్నెన్నో సమస్యలు
ఎన్నికలకు ముందు ఇంటింటికీ వెళ్లి మ్యానిఫెస్టో లో అంశాల్ని కరపత్రాలుగా పంచారు. ఎన్నికలకు ముందు టీవీ ఆన్ చేస్తే ఒకటే కనిపించేది. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి. రైతుల రుణాలన్నీ స్వచ్ఛందంగా పూర్తిగా మాఫీ కావాలంటే బాబు అధికారంలోకి రావాలి. చంద్రబాబు స్వయంగా సంతకాలు పెట్టి పంపించాడమ్మా అంటూ తెలుగుదేశం కార్యకర్తలు ఇంటింటికీ పంచారు. రైతుల రుణాలన్నీ మాఫీ అవుతున్నాయంటూ చంద్రబాబు చెప్పిన మాటల్ని పూర్తిగా నమ్మి ఓట్లేసి, అప్పులు కట్టడం మానేశారు. అప్పటి దాకా సకాలంలో అప్పు తీరిస్తే వడ్డీ ఏమాత్రం పడేది కాదు. కానీ, ఇప్పుడు చంద్రబాబు పుణ్యమా అని అప్పు కట్టకపోతే, అపరాధ వడ్డీ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. 14 నుంచి 18 దాకా అపరాధ వడ్డీ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడటంతో 87 వేల 612 కోట్ల రూపాయిల   అసలు మీద వడ్డీ 24 వేల కోట్ల రూపాయిల దాకా పడుతోంది. దీనికి గాను చంద్రబాబు కేటాయించిన రుణమాఫీ రూ. 7,300 కోట్ల రూపాయిలు కేటాయించారు. ఏ రకంగానూ మొత్తం వడ్డీలో మూడో వంతుకి కూడా సరిపోవటం లేదని చెబుతున్నారు.  చేనేతకు సంబంధించి ఏ హామీలు ఇవ్వలేదు. ధర్మవరం వెళితే 12 కుటుంబాల్ని పరామర్శించాను. ఏ కుటుంబానికి సరైన పరిహారం ఇవ్వలేదు.
మహిళలకు కుచ్చు టోపీ
మహిళల పరిస్థితి అంతే. బ్యాంకుల్లో పెట్టిన బంగారం తిరిగి రావాలంటే చంద్రబాబు అధికారంలోకి రావాలని ప్రచారం చేశారు. ఇప్పుడు బంగారం తిరిగి రాలేదు. కానీ వేలం వేస్తున్నారని ప్రతీ రోజూ పేపర్ లో ప్రకటనలు వస్తున్నాయి. దీని మీద మాట్లాడే పరిస్థితి లేదు.  డ్వాక్రా అక్క చెల్లెమ్మల పరిస్థితి చూసుకొంటే... దాదాపు 25 శాతం దాకా స్వయం సహాయక బ్రందాలు చేతన స్థితిలో లేవని తేలింది. దీన్ని చూస్తే దాదాపు పావు వంతు సంఘాలు చతికిలపడుతున్నాయి అని అర్థం అవుతోంది. ప్రభుత్వ అధికారిక సంస్థ సెర్ప్ వెబ్ సైట్ లో పరిస్థితి చూస్తే..  ఆరు లక్షల 85 వేల గ్రూపులు ఉంటే.. బాగా పనిచేస్తున్న గ్రూపుల శాతం 12 ఉన్నాయి. చివరి స్థాయిలో ఉన్న గ్రూపుల శాతం 54 ఉంది . అంటే చంద్రబాబు మాటలు నమ్ముకొన్నందుకు గాను మహిళా స్వయం సహాయక గ్రూపులు చతికిలపడుతున్నాయి.
       ఛివరకు చంద్రబాబు నమ్ముకొన్నందుకు గాను రైతులు, మహిళలకు రుణాలు మాఫీ కాలేదు. దీంతో అప్పులు కట్టలేకపోయారు. దీంతో అప్పులు రెన్యూవల్ కాలేదు. అంతిమంగా క్రాప్ ఇన్సూరెన్స్ కాలేదు. బ్యాంకులలో సున్న వడ్డీ కి, పావలా వడ్డీ కి అప్పు లు దొరికే పరిస్థితి లేనే లేదు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక కరువు మళ్లీ మొదలైంది. వరదలు వచ్చిపడ్డాయి. కష్టాల్లో ఉన్న రైతుల్ని ఆదుకొనేందుకు ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వాల్సి ఉంది. అందులోనూ చంద్రబాబు ప్రభుత్వం దివాళాకోరుతనం బయట పడింది.  
కేంద్ర నిధుల మళ్లింపు
       2013..14 లో రైతులకు 1,650 కోట్లు ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వాల్సి ఉంది. దాన్ని ఇచ్చేది లేనే లేదని తేల్చి చెప్పారు. తర్వాత 2014..14 లో మొత్తంగా 566 మండలాల్లో దుర్భిక్షం నెలకొందని జిల్లాల కలెక్టర్లు నివేదికలు ఇచ్చారు. మొత్తం 15 వందల కోట్ల రూపాయిలు దాకా సహాయం చేయాలని అడిగారు. కానీ దీనికి రక రకాల వంకలు పెట్టి దుర్భిక్ష మండలాల్ని 238 కు కుదించారు. అప్పుడు రూ. 1,067 కోట్లకు తగ్గించారు. తర్వాత జూలై సమావేశంలో తగ్గించి రూ. 692 కోట్లకు మాత్రమే చేశారు. పైగా అందులో రూ. 80 కోట్లను పెండింగ్ పెట్టారు.
       తర్వాత 2015..16 ఆర్థిక సంవత్సరంలో కరవు, వరదలు వచ్చాయి. దాదాపుగా రూ. 1,021 కోట్లు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటి దాకా దమ్మిడీ ఇవ్వనే లేదు. రైతులకు పరిస్థితి దారుణంగా తయారైంది. స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేస్తామని చెప్పారు. అంటే ఆ సిఫార్సుల ప్రకారం చూస్తే రైతులు పెట్టిన పెట్టుబడి లో దాదాపు 50శాతం పెంచి మద్దతు ధర ను ఇవ్వాల్సి ఉంటుంది.
ఉద్యోగాలేవి బాబూ
ప్రతీ ఇంటికీ ఉద్యోగం ఇస్తామని చెప్పారు. జాబ్ లేదంటే భ్రతి ఇస్తామని కూడా చెప్పారు. దీని కోసం కోటీ 75 లక్షల ఇళ్లు ఎదురు చూస్తున్నాయి. డీ ఎస్సీ రాసి 18 నెలలుగా మెరిట్ లిస్టుల కోసం ఎదురు చూస్తున్నారు. అక్కడ ఉద్యోగాల కోసం జనం ఎదురు చూస్తుంటే క్లస్టర్ స్కూల్స్ పెట్టి పాఠశాలల్ని కుదించారు. దీంతో 7వేల దాకా పోస్టులు అదనంగా ఉన్నట్లు లెక్క తేలుస్తున్నారు. మొత్తంగా చూస్తుంటే రిక్రూట్ మెంట్ క్యాలండర్లు లేనే లేవు.
కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు దాదాపు 2 లక్షల మంది దాకా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు ఉద్యోగాలు పోతాయో అని భయపడుతూ బతుకుతున్నారు. మ్యానిఫెస్టో లో అందరినీ రెగ్యులరైజ్ చేస్తామని పిలుపు ఇచ్చారు. ఇప్పుడు మాత్రం పరిశీలిస్తాం అని ప్లేటు ఫిరాయిస్తున్నారు.  ఆరోగ్య మిత్ర, ఆదర్శ రైతుల్ని తొలగించారు. గోపాల మిత్రలను తొలగించారు. అంగన్ వాడీ, ఆశ వర్కర్లు జీతాలు పెంచమంటే ఉక్కు పాదంతో అణచివేస్తున్నారు.
ఎన్నికల మ్యానిఫెస్టో లో ఇచ్చిన హామీలన్నీ అలాగే వదిలేశారు. వాటిని అమలు చేయకుండా మోసాలు చేస్తున్నారని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ నిలదీశారు. 

టీడీపీ ప్రభుత్వంపై అవిశ్వాసం

హైదరాబాద్ః ప్రజావ్యతిరేక పాలన సాగిస్తున్న ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ అవిశ్వాస తీర్మానం పెడుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయకుండా ప్రజలను మోసగించిన చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని కోరారు. 

అమ్జద్ బాషా 
రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అమ్జద్ బాషా అన్నారు. వందలాది ఉచిత హామీలు గుప్పించిన చంద్రబాబు...అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ప్రజలకు ఇంతవరకు ఏ ఒక్కటి అమలు చేసిన పాపాన పోలేదని మండిపడ్డారు.  రైతులకు వ్యవసాయ రుణాలు ఎక్కడ మాఫీ చేయలేదు. ఇంటికో ఉద్యోగమన్నారు. నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఇప్పుడు ఆపథకమే లేదని మంత్రి చెబుతుండడం దుర్మార్గమని అమ్జద్ బాషా ఆగ్రహం వ్యక్తం చేశారు.  వైఎస్సార్సీపీ ప్రజల పక్షాన ప్రభుత్వంపై పోరాడుతుందని అమ్జద్ బాషా స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి, మంత్రులు  ధనార్జనే ధ్యేయంగాకుంభకోణాలకు పాల్పడుతున్నారు.  రాజధానిలో రైతులను మోసం చేసి విచ్చలవిడిగా దోపిడీకి పాల్పడ్డారు. ప్రజల విశ్వాసం కోల్పోయినందునే టీడీపీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతున్నామని అమ్జద్ బాషా తెలిపారు.  అవిశ్వాస తీర్మానానికి ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాలని కోరారు.  

చాంద్ బాషా
ప్రజాసమస్యలు పక్కనబెట్టి ఏవిధంగా దోచుకోవాలి, దాచుకోవాలన్న దానిమీదనే టీడీపీ ప్రభుత్వం పనిచేస్తోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చాంద్ బాషా నిప్పులు చెరిగారు. అమలు కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం..ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకుండా ప్రజలను మోసగించిందని దుయ్యబట్టారు. ప్రజావ్యతిరేక పాలన సాగిస్తున్న ప్రభుత్వ బాధ్యతను తెలియజెప్పేందుకే అవిశ్వాస తీర్మానం పెడుతున్నట్లు చెప్పారు. తుఫాన్ బాధితులను ఆదుకోవడంలో ప్రబుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. అనంతపురం జిల్లాలో వేరుశనగ రైతులు అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయారన్నారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు జిల్లాకు వచ్చినప్పుడు వేరుశనగ రైతులను ఆదుకుంటామని చెప్పారని, హెక్టారుకు రూ.5 వేలు ఇస్తామని చెప్పి....నివేదికలో అనంతపురం జిల్లా పేరు చేర్చకపోవడం దారుణమన్నారు. జిల్లాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా మొండిచేయి చూపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని రకాలుగా వైఫల్యం చెందినందునే ప్రభుత్వంపై అవిశ్వాసం పెడుతున్నామన్నారు.  

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
భారతదేశంలోనే ఇంత దుర్మార్గమైన అనైతిక పాలన ఎక్కడా లేదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి టీడీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో మోసపూరిత పాలన సాగిస్తున్నారని విరుచుకుపడ్డారు.  అదీ చేస్తాం, ఇదీ చేస్తామంటూ ప్రజలను నమ్మించి నిండా ముంచారని ఫైరయ్యారు. రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, మహిళలు, విద్యార్థులు అందరినీ చంద్రబాబు మోసం చేశారని చెవిరెడ్డి మండిపడ్డారు. ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకుండా అందరి నోట్లో మట్టి కొట్టాడన్నారు. చంద్రబాబు దుర్మార్గపు పాలనను ప్రజల దృష్టికి తీసుకెళ్లేందుకే అవిశ్వాస తీర్మానం పెడుతున్నట్లు చెవిరెడ్డి తేల్చిచెప్పారు.  ప్రజల కోరిక తమ అధ్యక్షులు వైఎస్ జగన్ ప్రభుత్వానికి
వ్యతిరేకంగా అవిశ్వాసం పెట్టాలని నిర్ణయించారన్నారు.  అదేవిధంగా పార్టీ వీడిన ఎమ్మెల్యేలకు విప్ జారీ చేస్తామని చెవిరెడ్డి చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయని ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందన్నారు. 

సుజయకృష్ణ
అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు చంద్రబాబుపై అసంతృప్తితో ఉన్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు తెలిపారు. ప్రభుత్వ విధానంపై ఏమాత్రం సంతోషంగా లేరన్నారు. ప్రభుత్వానికి వ్యతేరికంగా అవిశ్వాస తీర్మానంలో వారు కూడా ఓటేస్తారని చెప్పారు.ఇక  టీడీపీ కండువా కప్పుకున్న ఎమ్మెల్యేలను ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారని సుజయకృష్ణ తెలిపారు. వారు ఏవిధంగా వ్యవహరిస్తారన్నది అవిశ్వాసంలో తేలిపోతుందన్నారు. 

కొరుముట్ల శ్రీనివాసులు..
ప్రభుత్వం అన్నిరంగాల్లోనూ అవినీతికి పాల్పడిందిని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు అన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసగించిన...చంద్రబాబు ప్రజావ్యతిరేక పాలనపై అవిశ్వాస తీర్మానం పెడుతున్నట్లు కొరుముట్ల మీడియాకు వివరించారు. 

ద‌మ్ము, ధైర్యం ఉంటే ప‌ద‌వికి రాజీనామా చేయాలి

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వ‌రి
హైదరాబాద్) వైఎస్సార్సీపీ తరపున ఎంపీగా గెలిచి, పార్టీ జెండా మార్చి, టీడీపీలో చేరిపోయిన అరకు ఎంపీ కొత్తపల్లి గీత కుల బండారం బయట పడిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా ఆమె పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 
గిరిజ‌నుల‌కు ఉండే అవ‌కాశాలు చాలా త‌క్కువని, అలాంటి కుల‌ధృవీక‌ర‌ణ ప‌త్రాన్ని అడ్డుపెట్టి అక్ర‌మాల‌కు పాల్ప‌డ‌డం అత్యంత దారుణ‌మైందని, ఎప్ప‌టికైనా ధర్మ‌మే గెలుస్తుంద‌న్నారు. 1993లో జేసీ మంగ‌ప‌తిరావు త‌న‌ది గిరిజ‌న కులం కాద‌ని చెప్పారు. దానిపై కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నాన‌ని, ఎమ్మార్వో, అధికారుల‌ను ప్ర‌లోభాలకు గురిచేసి కొత్త‌ప‌ల్లి గీత న‌కిలీ గిరిజ‌న కుల‌దృవీక‌ర‌ణ ప‌త్రాన్ని సంపాదించార‌ని ఆరోపించారు. కొత్త‌ప‌ల్లి గీత త‌మ్ముడు కొత్త‌ప‌ల్లి వివేకానంద‌కుమార్ ఎల్ఐసీలో ప‌ని చేస్తున్నప్పుడు2008లో గిరిజ‌నుడు కాద‌ని కేసు న‌మోదైన‌ట్లు ఆమె తెలిపారు. న‌కిలీ కుల‌ధృవీక‌ర‌ణ ప‌త్రాల‌తో ఉద్యోగం చేస్తున్నార‌న్న ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయ‌ని చెప్పారు. ఉత్త‌రాంధ్ర‌లో ఆదివాసి గిరిజ‌నుల ఉద్యోగ సంఘం వారు సైతం గీత కులంపై కేసు వేశారు.  ఈ మేర‌కు ఆ కేసు మీద ఈ నెల 10న తూర్పుగోదావ‌రి జిల్లా క‌లెక్ట‌ర్ కొత్త‌ప‌ల్లి గీత‌ సోదరుడు గిరిజనుడు కాద‌ని నిర్థారించార‌న్నారు. ఇప్ప‌టికే ఎన్నోమార్లు కోర్టుకు హాజ‌రుకావాల్సిన గీత అబ‌ద్దాలు చెబుతూ కోర్టుకు హాజ‌రుకాకుండా త‌ప్పించుకుంటున్నార‌ని విమ‌ర్శించారు. గ‌తంలో సైతం శోభ‌హైమ‌వ‌తికి ఇటువంటి ప‌రిస్థితే ఎదురైంద‌ని గుర్తు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున గెలిచిన  కొత్త‌ప‌ల్లి గీత నైతికంగా పార్టీకి, ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేశారు. ఇప్ప‌టికే కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు గిరిజ‌నుల‌ను చుల‌క‌న‌గా చూస్తున్నార‌ని, గిరిజ‌నుల‌కు వ‌చ్చేట్టువంటి అవ‌కాశాల‌ను ప‌క్క‌దారి ప‌ట్టిస్తున్నార‌ని మండిప‌డ్డారు.  కొత్త‌ప‌ల్లి గీత‌కు ద‌మ్ము, ధైర్యం ఉంటే ముందు రాజీనామా చేసి చూపించాల‌ని స‌వాల్ విసిరారు. లేనిప‌క్షంలో గిరిజ‌నుల‌తో క‌లిసి గీత‌పై న్యాయ‌పోరాటం చేస్తామ‌ని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వ‌రి తెలిపారు.

12 March 2016

టీడీపీ టక్కరి బడ్జెట్

రాష్ట్ర ప్రజలను తీవ్ర నిరాశపర్చిన బడ్జెట్
ఎన్నికల హామీలు అమలు చేయకుండా మోసం
బడ్జెట్ లో నిధులు కేటాయింపులో మోసం
అన్ని వర్గాల ప్రజలను మోసగించిన టీడీపీ

టీడీపీ ప్రభుత్వం ముచ్చటగా మూడోసారి ప్రవేశపెట్టిన బడ్జెట్ కూడా ప్రజలను తీవ్ర నిరాశపర్చింది.  తొలుత మంత్రి యనమల బడ్జెట్ ప్రసంగ పాఠం మొదలు నిధుల కేటాయింపువరకు అంతా మోసపూరిత విధానాన్నే అవలంభించారని  ప్రతిపక్షాలు, మేధావులు, విశ్లేషకులు విమర్శిస్తున్నారు. ఎన్నికల హామీల మాదిరే ఏపీ సర్కార్ మరోసారి బడ్జెట్ పేరుతో ప్రజలను నయవంచనకు గురిచేస్తోందని దుయ్యబడుతున్నారు. ప్రజలు బడ్జెట్ ను విమర్శిస్తారన్న భయంతోనే యనమల ఇంగ్లీష్ లో చదివారని చురక అంటించారు. 

ఎన్నికల సమయంలో వందలాది వాగ్దానాలు ఇచ్చిన చంద్రబాబు...తీరా పీఠం దక్కాక వాటిని తుంగలో తొక్కిన సంగతి తెలిసిందే. అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా ప్రజలను మోసగించారు. అదే సీన్ మళ్లీ రిపీట్ చేస్తున్నారు.  2016-17 బడ్జెట్ లో అన్ని వర్గాల ప్రజలకు మొండిచేయి చూపించారు. యనమల బడ్జెట్ అంతా మాటల మూటలు..అంకెల గారడీగానే ఉంది తప్ప ఎక్కడా కూడా రాష్ట్ర ప్రజలకు మేలు చేసేలా లేదని మేధావులు అభిప్రాయపడ్డారు. 

బడ్జెట్ లో పేజీలు పెరిగాయి తప్ప ఎక్కడ కూడా ప్రాధాన్యత రంగాలకు కేటాయింపులు పెరగలేదు. ముఖ్యంగా రైతులు, నిరుద్యోగులు, డ్వాక్రా మహిళలను తీవ్ర నిరాశ పర్చారు. అధికారంలోకి వస్తే బేషరతుగా రుణాలు మాఫీ చేస్తామని డంబాలు పలికిన టీడీపీ...పదవి దక్కాక వడ్డీలకు సరిపడా రుణాలు కూడా మాఫీ చేయలేదు. ఎలాంటి రుణమాఫీ చేయకుండానే అన్నీ చేశామని చెప్పుకుంటూ రైతులను నిండా ముంచేస్తున్నారు.  దానిలో భాగంగానే బడ్జెట్ లో రైతులకు అరకొర నిధులు కేటాయించి చేతులు దులుపుకున్నారు. 

జాబు రావాలంటే బాబు రావాలంటూ ...ఎన్నికల ముందు టీవీల్లో, పత్రికల్లో గొప్పగా ప్రకటనలు గుప్పించారు.  గోడల మీద రాతలు రాయించారు.  బాబు ఎక్కడ మీటింగ్ పెట్టినా కూడా జాబు బాబు అంటూ ఊదరగొట్టారు. అంతేకాదు ఉద్యోగం లేని వారికి నెలకు రూ.2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని కూడా చెప్పారు. కానీ,  అధికారం చేపట్టాక ఉద్యోగాలు ఇవ్వడం సంగతి దేవుడెరుగు ఉన్న ఉద్యోగాలు ఊడబెరుకుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో దాదాపు 30 వేల మంది ఉద్యోగులను తీసేశారు. రెండేళ్ల పాలనలో చంద్రబాబు ఒక్క అటెండర్ పోస్ట్ కూడా ఇచ్చిన పాపాన పోలేదు. ఇక నిరుద్యోగల ఊసేలేదు. బడ్జెట్ లోనూ నిరుద్యోగలకు పైసా విదిల్చకుండా మరోసారి మంగళం పాడారు. 

చేనేత కార్మికులకు రూ. వేయి కోట్లతో నిధి ఏర్పాటు చేస్తామనే హామీని విస్మరించారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు బడ్జెట్ లో రూ. వేయి కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామన్న హామీకి తూట్లు పొడిచారు.  అంతేకాదు డ్వాక్రా మహిళలు, రైతులకు వడ్డీ లేని రుణాలకు సంబంధించి...వితంతువులు, వికలాంగులు, వృద్ధులు, బడుగు బలహీన వర్గాలకు అత్తెసరు నిధులతో సరిపెట్టి మమ అనిపించారు. గత బడ్జెట్ లో కేటాయించిన నిధులనే ఖర్చుచేయని ప్రభుత్వం...ఇప్పుడు కొత్తగా కేటాయించిందేమీ లేదని, బడ్జెట్ నిధులను మరోసారి నొక్కేసే ప్రయత్నం చేస్తోందని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.