19 January 2016

రోహిత్ కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ జగన్

హైదరాబాద్ః  హెచ్ సీ యూ లో ఆత్మహత్య చేసుకున్న దళిత విద్యార్థి రోహిత్ కుటుంబసభ్యులను ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పరామర్శించారు. యూనివర్సిటీలో జరిగిన ఘటనపై వైఎస్ జగన్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. రోహిత్ తల్లిదండ్రులను వైఎస్ జగన్ పరామర్శించి ఓదార్చారు. ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు .

యువ పరిశోధకుడైన రోహిత్ ఆత్మహత్యకు దారితీసిన దురదృష్టకర పరిణామాలను వైఎస్ జగన్ తీవ్రంగా పరిగణించారు. రోహిత్ ఆత్మహత్యకు కారకులైన వారు.... ఎంతటి వారైనా, ఏ స్థాయిలో ఉన్న వారైనా  కఠినంగా శిక్షించాలని  వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు.  దుండగులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టవద్దని ప్రభుత్వానికి సూచించారు. రోహిత్ మృతి పట్ల వైఎస్ జగన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ..అతని కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

హెచ్‌సీయూ వీసీ అప్పారావు  ఐదుగురు విద్యార్థులను సస్సెండ్ చేశారు. వీరిలో గుంటూరుకు చెందిన వేముల రోహిత్ అనే పీహెచ్‌డీ విద్యార్థి కలత చెంది ఆదివారం ఆత్మహత్య చేసుకున్నారు. 

18 January 2016

అరాచకాలకు అంతే లేదా...!

ప్రజా క్షేత్రంలో పరువు కోల్పోతున్న చంద్రబాబు సహనం కోల్పోతున్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను చీటికి మాటికి అరెస్టు చేయింటం, వేధించటంలో తన రికార్డుల తానే తిరగరాస్తున్నారు. తాజాగా ఒకే రోజు ఇద్దరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను చాలా చిన్న కారణాలతో అరెస్టు చేయించటం ఇదే విషయాన్ని వెల్లడిస్తోంది

శ్రీనివాసరెడ్డి మీద కక్ష
గుంటూరు జిల్లా రాజకీయాల్లో నర్సరావు పేటది ప్రత్యేక స్థానం. అక్కడ మొదట నుంచి చక్రం తిప్పుతున్న తెలుగుదేశం పెద్ద నాయకుడు తర్వాత కాలంలో పక్క నియోజక వర్గానికి తరలి వెళ్లారు. ఇక్కడ ప్రజల మనిషిగా గుర్తింపు పొందిన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వైఎస్సార్సీపీ తరపున గెలుపొందటమే కాకుండా తెలుగుదేశం అరాచకాల మీద పోరాట సాగిస్తున్నారు. దీంతో కక్ష పెంచుకొన్న పచ్చ చొక్కాల  నేతలు..ఆయన్ని ఇబ్బంది పెట్టేందుకు రక రకాల మార్గాలు వెదకుతున్నారు. రైతుల తరపున ప్రజా ఉద్యమంలో పాల్గొన్న శ్రీనివాసరెడ్డి మీద అధికారుల విధులకు ఆటంకం కల్గిస్తున్నారంటూ కేసు పెట్టి అరెస్టు చేయించారు.

చెవిరెడ్డి మీద పగ
చిత్తూరు జిల్లా లో చంద్రబాబు సొంత గ్రామం నారావారి పల్లె  ఉన్న చంద్రగిరి నియోజక వర్గం ఎమ్మెల్యేగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రజా ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. చంద్రబాబు నాయుడు సొంత ఊరికి చుట్టుపక్కల ఎక్కడా తెలుగుదేశం జెండా ఎగిరే  పరిస్థితి అంతకంతకూ తగ్గిపోతోంది. దీంతో కక్ష పెంచుకొన్న చంద్రబాబు ప్రభుత్వం వెదకి వెదకి .. పాత కేసుల్ని వెలికి తీసింది. సమైక్య రాష్ట్రం ఉద్యమం సమయంలో పెట్టిన కేసును ఇప్పుడు బయటకు తీసి ఆయన్ని అరెస్టు చేసి నెల్లూరు జిల్లా జైలుకి తరలించారు.

భయపెట్టడమే ఏకైక లక్ష్యమా..!
తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న అరాచకాల్ని ప్రజల తరపున ప్రశ్నిస్తుంటే చంద్రబాబు సేన తట్టుకోలేక పోతోంది. అందుకే ప్రతిపక్ష ఎమ్మెల్యేల మీద కేసులు పెట్టిస్తోంది. ఎకా ఎకిన అరెస్టులు చేయించాలని, భయపెట్టించాలని పదే పదే ప్రయత్నిస్తోంది. ఇప్పటికే రాజంపేట వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డిని విమానాశ్రయంలో అరెస్టు చేయించి హడావుడి చేస్తోంది. చిత్తూరు జిల్లాలో మొదట నుంచి చంద్రబాబు అరాచకాల్ని నిలవరిస్తూ వచ్చిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబసభ్యుల్ని అరెస్టు చేయించి కక్ష సాధించాలని ప్రయత్నిస్తోంది.

వాస్తవానికి ప్రజల తరపున పోరాడుతూ, ప్రజల గురించి ఉద్యమిస్తున్న పార్టీ గా వైఎస్సార్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా పేరు తెచ్చుకొంది. అటువంటి పార్టీ నాయకుల్ని కక్ష సాధింపు కోసం చిన్న చిన్న కారణాలతో అరెస్టు చేయించటం ద్వారా పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నట్లు అర్థం అవుతోంది.

పచ్చసర్కార్ కుట్రలు

పచ్చసర్కార్ అరాచకాలు పెచ్చురిల్లుతున్నాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకొని చంద్రబాబు  ప్రతిపక్ష సభ్యులపై కక్షసాధింపు ధోరణి ప్రదర్శిస్తున్నారు.  ప్రతిపక్షాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కోలేక చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారు.  ప్రజల పక్షాన నిలబడి అలుపెరగని పోరాటం చేస్తున్న వైఎస్సార్సీపీని అణిచేసేందుకు కుట్ర రాజకీయాలు చేస్తున్నారు.  వైఎస్సార్సీపీ సభ్యులపై అక్రమంగా కేసులు బనాయిస్తూ అరెస్ట్ లు చేస్తున్నారు.  ప్రజాస్వామ్యయుతంగా నిరసన వ్యక్తం చేసినా, ఆందోళన చేసినా సహించలేకపోతున్నారు. 

వైఎస్సార్సీపీ  ఎంపీ మిథున్‌రెడ్డిపై అక్రమ కేసు బనాయించడమే కాక లొంగిపోవడానికి వెళ్తున్న ఆయన్ను అరెస్టు చేసి జైలుకు తరలించడం అధికారపార్టీ రాజకీయ అసహనానికి పరాకాష్ట. ఒకవైపు ప్రతిపక్ష నాయకులను, ప్రజాస్వామిక ఉద్యమకారులను ఉక్కుపాదంతో అణచివేయడానికి ప్రయత్నిస్తున్న ముఖ్యమంత్రి ....సొంతపార్టీవారు తప్పు చేస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయినా వెనకేసుకొస్తున్నారు. 


ఇదంతా పచ్చబాబు పన్నాగమే...
విమానాశ్రయ మేనేజరుపై చేయి చేసుకున్నారంటూ వైఎస్సార్సీపీకి చెందిన రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డిపై అక్రమ కేసు బనాయించారు. సీసీ కెమెరాల నిరంతర నిఘా, పటిష్టమైన సీఐఎస్‌ఎఫ్ భద్రత ఉండే విమానాశ్రయంలో మేనేజర్ వంటి ఉన్నతాధికారిపై చేయి చేసుకుంటే ఎవరికీ తెలియకుండా పోతుందా? ఒకవేళ చేయిచేసుకున్నారన్న వాదనే నిజమనుకుంటే ఆ రోజు సీసీ కెమెరాల ఫుటేజిని ప్రభుత్వం ఎందుకు విడుదల చేయడం లేదు?  ‘ఈ ఘటనకు మసిపూసి మారేడు కాయ చేయడానికి సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగారు... ఆ ఘటన జరిగిన రోజు రాత్రి తిరుపతికి చేరుకున్న చంద్రబాబు నేరుగా పోలీసులతో మాట్లాడారు. 

రాత్రికి రాత్రి విమానాశ్రయ అధికారిని ఆసుపత్రిలో చేర్పించి మిథున్‌రెడ్డిపై తప్పుడు కేసు ఫైల్ చేయించారు. మిథున్‌రెడ్డి చేయిచేసుకుని ఉంటే విమానాశ్రయంలోనే పోలీసులు అరెస్టు చేసేవారు. కానీ చంద్రబాబు ఆదేశించిన తర్వాతనే వారు నాటకీయ పరిణామాలకు తెరలేపారు. 
 
ప్రతిపక్ష నాయకులే టార్గెట్
ప్రజా సమస్యలపై పోరాడడం, నిరసన వ్యక్తం చేయడం బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పార్టీ విద్యుక్తధర్మం. అధికారంలో ఉన్నవారు వాటిని సహించలేకపోవడం ప్రతిపక్షంపై కత్తిగట్టడం నీచమైన పని అని మేధావులు ప్రభుత్వాన్ని తూర్పారబచ్టారు.  ప్రతిపక్ష పార్టీ నాయకులను టార్గెట్ చేస్తూ వారిపై అనేక అక్రమ కేసులను బనాయించడం చూస్తే రాష్ర్టంలో పరిపాలన ఎలా సాగుతుందో అర్ధం చేసుకోవచ్చు. మచ్చుకు మరికొన్ని ఉదాహరణలు పరిశీలిస్తే...
 
* వైఎస్సార్‌కాంగ్రెస్ మహిళా విభాగం అధ్యక్షురాలు, నగరి ఎమ్మెల్యే రోజాపై శాసనసభలోనూ, వెలుపలా జరిగిన దాడిని రాష్ర్టమంతా చూసింది. చరిత్రలో మున్నెన్నడూ లేనివిధంగా నిబంధనలకు విరుద్ధంగా, అప్రజాస్వామికంగా రోజాను శాసనసభ నుంచి ఏడాదిపాటు సస్పెండ్ చేశారు.

* వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిపై పలు సందర్భాలలో అనేక అక్రమ కేసులను బనాయించారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఆయనపై హత్యాయత్నం కేసు పెట్టారు. ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. మరో సందర్భంలో కేసు బనాయించడమే కాక రౌడీషీట్ తెరిచారు.

* వైఎస్సార్ కాంగ్రెస్‌కి చెందిన చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిపై రకరకాల కేసులు బనాయించడమే కాక అధికారపార్టీ ప్రోద్బలంతో ఆయన వాహనాన్ని పోలీసులు తమవాహనంతో ఢీకొట్టిన ఘటన రాజకీయవర్గాలను నివ్వెరపరిచింది. ప్రాణాపాయం నుంచి ఆయన తప్పించుకున్నా తీవ్రంగా గాయపడ్డారు.

* గుంటూరుజిల్లా ముప్పాళ్ల ఎంపీపీ ఎన్నికల సందర్భంగా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ముస్తఫా, పార్టీ అధికారప్రతినిధి అంబటి రాంబాబుపై అధికారపార్టీకి చెందిన వారు దారికాచి దాడిచేశారు. కారు ధ్వంసం చేశారు. ఈ దాడిలో పలువురికి గాయాలయ్యాయి.

* బాక్సైట్‌ను వ్యతిరేకిస్తూ ప్రజాస్వామ్యయుతంగా కలెక్టరేట్ వద్ద ఆందోళన చేస్తున్న పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిపై ముఖ్యమంత్రిని విమర్శించారన్న సాకుతో కేసు బనాయించారు.

* గుడివాడలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లేకుండా చేయడం కోసం రకరకాల కుట్రలు సాగాయి. ఎమ్మెల్యే కొడాలి నానిపై దౌర్జన్యం చేయడమే కాక ఆయనపైనే అక్రమంగా కేసు పెట్టారు.

* బందరు పోర్టు భూసేకరణను వ్యతిరేకిస్తూ ధర్నా చేస్తున్న వైఎస్సార్‌సీపీ అధికారప్రతినిధి పేర్ని నానిని అరెస్టు చేసి పలు అక్రమ కేసులు బనాయించారు.

* వైఎస్సార్‌సీపీ ఎంపీపీని తెలుగుదేశం వారు హత్య చేయడానికి నిరసనగా ప్రదర్శనలు జరగనుండడంతో మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డిని హైదరాబాద్‌లో అరెస్టు చేసి నిర్బంధించారు.

* చిత్తూరుజిల్లాకు చెందిన ప్రజాదరణ గలిగిన నాయకుడు, వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనయుడు కనుకనే మిథున్‌రెడ్డిని టార్గెట్ చేశారని పార్టీ నేతలు అంటున్నారు. 

తప్పు చేసినా తమ్ముళ్లపై చర్యలు శూన్యం 
ప్రతిపక్షనాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్న చంద్రబాబు నాయుడు తప్పు చేస్తూ సాక్ష్యాలతో సహా దొరికిపోయిన సొంత పార్టీ నేతలపై మాత్రం ఈగ కూడా వాలనివ్వడం లేదు. ఇసుక మాఫియాలో కీలకంగా ఉన్న ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తన దందాను అడ్డుకున్నారన్న కారణంగా తహశీల్దార్ వనజాక్షిపై దాడి చేయడంతో ఆమె మీడియా ఎదుట కన్నీరుమున్నీరయ్యారు. చంద్రబాబు మాత్రం ఆ అధికారిణిదే తప్పని తేల్చారు. విజయవాడ కేంద్రంగా  కాల్‌మనీ - సెక్స్ రాకెట్‌లో సూత్రధారులు అన్ని ఆధారాలతో సహా దొరికినా అధికారపార్టీకి చెందినవారు కావడం, చంద్రబాబుకు సన్నిహితులు కావడంతో వారిపై ఎలాంటి కేసు లేదు, చర్యలు లేవు. రేయ్ చంపుతా.. పాతరేస్తా.. అంటూ అసెంబ్లీలో బండబూతులు తిట్టిన బోండా ఉమామహేశ్వరరావు వంటివారిపైనా ఎలాంటి చర్యలూ ఉండవు. 

కానీ ప్రజాసమస్యలపై పోరాడుతున్న వైఎస్సార్సీపీ సభ్యులపై మాత్రం అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ లు చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు గొడ్డలిపెట్టులాంటిదని ప్రజా, మహిళా సంఘాలు, మేధావులు, విశ్లేషకులు, ప్రతిపక్షాలు  ప్రభుత్వంపై మండిపడుతున్నాయి. అసెంబ్లీలోనూ, వెలుపలా ప్రతిపక్షాన్ని టార్గెట్ చేస్తూ చంద్రబాబు చేస్తున్న నీచ రాజకీయాలు ఇంకెంతో కాలం సాగవని వైఎస్సార్సీపీ నాయకులు 
హెచ్చరిస్తున్నారు. 

16 January 2016

అడ్డ‌దిడ్డంగా తిప్పేద్దామా..!

అమ‌రావ‌తి రాజ‌ధాని ఇన్న‌ర్ రింగ్ రోడ్డు న‌మూనా ను అడ్డ‌దిడ్డంగా తిప్పేసేందుకు తెలుగుదేశం నేత‌లు స్కెచ్ వేశారు. అమరావతి నుంచి విజయవాడ చుట్టూ తిప్పి గుంటూరు జిల్లాలోని కొంత ప్రాంతాన్ని కలుపుతూ తిరిగి అమరావతి వరకు 75 మీటర్ల వెడల్పుతో నిర్మించే 85 కిలోమీటర్ల దీన్ని నిర్మించ‌నున్నారు. రెండు ఇన్నర్ రింగ్‌రోడ్లు ఒకే ప్రాంతంలో కలపడం వెనుక అధికారపార్టీ నేతల స్వప్రయోజనం ఉందనేది స్థానికుల వాదన. ఒక రింగ్‌రోడ్డు రామవరప్పాడు వద్ద కలుస్తున్నప్పుడు రెండో రింగ్‌రోడ్డును ప్రసాదంపాడు వద్ద కలిపితే ప్రయోజనకరంగా ఉండేదని వారు చెబుతున్నారు.
రామవరప్పాడు రింగ్‌రోడ్డుకు సమీపంలో ఒక దినపత్రిక కార్యాలయ నిర్మాణం జరుగుతోంది. దాని ముందు భాగం నుంచి రామవరప్పాడులో కలుపుతున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. గొల్లపూడి బైపాస్ వద్ద ప్రస్తుత ఇన్నర్ రింగ్‌రోడ్డుకు, ప్రతిపాదిత ఇన్నర్ రింగ్‌రోడ్డుకు మధ్య ఆరు కిలోమీటర్ల వరకు దూరం ఉంది. రామవరప్పాడు సమీపానికి వచ్చేసరికి ఒకటిన్నర కిలోమీటరు దూరం మాత్రమే ఉంది. ప్రారంభంలో ఎంత దూరం ఉందో అంతే దూరంతో ఐదో నంబరు జాతీయ రహదారిలో కలిపితే బాగుండేదని, ఎవరి స్వార్థం కోసమో ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం మంచిది కాదనేది పలువురి వాదన.
ఇప్పటికే ఇన్నర్ రింగ్‌రోడ్డు కోసం కొంత భూమిని తీసుకున్నారు. మెట్రో ప్రాజెక్టు కోసం నిడమానూరులో 60 ఎకరాలు డిపోకు తీసుకుంటున్నారు. గన్నవరం ఎయిర్‌పోర్టుకు ఇప్పటికే కొంత భూమిని ప్రభుత్వం తీసుకుంది. ఇప్పుడు మరో ఇన్నర్ రింగ్‌రోడ్డు పేరుతో మరికొంత భూమి పోనుంది. ఎవరి కోసమో తాము బలికావాల్సి వస్తోందని భూములు కోల్పోతున్న వారు వాపోతున్నారు.
 తాడిగడప-ఎనికేపాడు మధ్య ఉన్న 100 అడుగుల రోడ్డుకు ఐఆర్‌ఆర్‌ను కలపాలనేది ప్రతిపాదన. అక్కడి నుంచి వీజీటీఎం-ఉడా హయాంలో మొదలైన రామవరప్పాడు రింగ్ వద్ద నిర్మాణంలోని ఐఆర్‌ఆర్‌కు కలిపి గొల్లపూడి వరకు తీసుకువెళ్లాలనేది ఆలోచన. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే ఇంతకన్నా అశాస్త్రీయ, అసంబద్ధత మరొకటి ఉండదనేది నిపుణుల అభిప్రాయం. బెజవాడ ఇక అభివృద్ధి చెందదు అనే ఉద్దేశంతోనే ఐఆర్‌ఆర్ ప్రతిపాదనలు ఉన్నట్లు వారు చెబుతున్నారు.

13 January 2016

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు వైఎస్సార్సీపీ దూరం

గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేయరాదని తెలంగాణ వైఎస్సార్సీపీ నిర్ణయించింది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, మద్దతుదారులతో సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసుకోవడంపై వైఎస్సార్సీపీ దృష్టిసారించింది. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్, టీడీపీ-బీజేపీ, కాంగ్రెస్ లు డబ్బులతో పీఠం నెగ్గాలని చూస్తున్నాయి. అయితే వైఎస్సార్సీపీ అందుకు పూర్తిగా వ్యతిరేకం. ప్రజల పక్షాన నిలిచి, వారికి అవసరమైన సమయంలో అండగా నిలిచేందుకు వైఎస్సార్సీపీ ఎప్పుడూ వెనకాడదని పార్టీ ప్రకటించింది. ఈ మేరకు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు.




ఏపీలో అధికారంలో ఉండి అవినీతి వ్యవహారాల్లో లెక్కకు మించి డబ్బు సంపాదిస్తోన్న టీడీపీ, కేంద్రంలో అధికారాన్ని చూసుకుని బీజేపీ, పొరుగు రాష్ట్రం కర్ణాటక ప్రభుత్వ మద్ధతుతో కాంగ్రెస్ పార్టీ, ఇక తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అందుకోసం ఎంతైనా డబ్బు ఖర్చు చేసేందుకు ఆ పార్టీలు వెనుకాడటం లేదన్నారు.

ఆ పార్టీలు ఈ పోటీలో డబ్బుతోనే నెగ్గాలని చూస్తున్నాయని ఆరోపించారు. మరోవైపు పార్టీని బలోపేతం చేయాలని, అప్పటి వరకు వేచి చూడాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. ఈ కారణాలతోనే ఫిబ్రవరి 2న జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయరాదని నిర్ణయించుకున్నట్లు పొంగులేటి వివరించారు. 2009లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పోటీ చేయలేదన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ప్రజల పక్షాన నిలిచి, వారికి అవసరమైనప్పుడు అండగా ఉండేందుకు వైఎస్ఆర్ సీపీ క్షణం కూడా వెనుకాడదన్నారు.

చంద్రబాబు మోసాల చిట్టా..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పరిపాలన మొత్తం మోసాల చుట్టూ తిరుగుతోందని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ అభివర్ణించారు. వారం రోజుల పాటు సాగిన రైతు భరోసా యాత్రలో వైఎస్ జగన్.. చంద్రబాబు పరిపాలన తీరుని ఎండగట్టారు. ఈ పర్యటనలో ఆయన ప్రసంగంలోని ముఖ్యాంశాలు..

1.     చంద్రబాబు నిర్వాకంతోనే అక్కచెల్లెమ్మలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి
2.      ఎన్నికల సమయంలో చంద్రబాబు బాగా గొప్పలు చెప్పారు. మహిళలు బ్యాంకులకు ఒక్క రూపాయి కూడా కట్టొదు. బ్యాంకు అధికారులు అడిగితే కట్టేది లేదని నిక్కచ్చిగా చెప్పండని ఎన్నికల ముందు చంద్రబాబు గొప్పగా హామీలు గుప్పించారు. తీరా పీఠమెక్కాక హామీలన్నింటినీ అటకెక్కించారు.
3.     అక్కచెల్లెమ్మలకు ఇవ్వాల్సిన రుణమాఫీ ఇవ్వటమే లేదు.
4.     కనీసం ఆత్మహత్యలు చేసుకొంటున్నవారిని ఆదుకోవటం లేదే..!నేను వస్తున్నానని తెలిసే వాళ్లు ఆర్థిక సాయం ఇస్తామని చెబుతుంటారు.. తీరా నేను వెళ్లిపోయాక సమస్య మళ్లీ మొద టికొస్తుంది
5.     బాబు చేసిన నిర్వాకం వల్లే అందరిపైనా వడ్డీ భారం పడింది.
6.     మంచి రోజులు వస్తాయి.. అంతవరకు ఓపికపట్టండి.
7.     ఈ ప్రభుత్వం మీకు సాయం చేయకపోయినా మా ప్రభుత్వం వచ్చాక మీకు ఆర్థిక సాయం అందిస్తాం.
8.      పింఛన్లపై కోర్టులో కేసు వేసి మీకు న్యాయం జరిగేలా చూస్తా.
9.     ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఆత్మహత్య చేసుకొన్నవారి కుటుంబసభ్యులకు పరిహారం అందే లా చూస్తాం.
10.   రైతులు, చేనేత కార్మికులు, ఇతర ఆపన్నులకు అండగా ఉంటామని చెప్పి జన నేత వైఎస్ జగన్ తన పర్యటనను ముగించారు.

5 November 2015

ప్రభుత్వ మోసాలపై టాప్ టెన్ కామెంట్స్




పులివెందుల) రైతుల ఆత్మహత్యల్ని నివారించి, రైతుల్లో  భరోసా కల్పించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తిగా విఫలమయ్యారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. 
పులివెందుల పర్యటనలో వైఎస్ జగన్ చేసిన పవర్ ఫుల్ కామెంట్స్..
1.     పబ్లిసిటీ వస్తే తప్ప... చంద్రబాబు పెద్దగా స్పందించరు. ఇంత మంది రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నా.. పట్టించుకోని చంద్రబాబు ఏదైనా పబ్లిసిటీ వస్తుందంటే.. ముందు వరుసలో ఉంటారు
2.    పులివెందుల ప్రాంతంలో రైతు ఆత్మహత్య చేసుకొని 18రోజులు గడిచాయి... పురుగుల మందు తాగి రాజశేఖరన్న చనిపోతే గవర్నమెంటోళ్లు ఈ పక్కకు తిరిగి చూడలేదంటే ఏమనాలి?’
3.    వ్యవసాయంపై చేసిన అప్పులు తీర్చే దారిలేక చాలామంది రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. సంఘటన జరిగిన తర్వాతనైనా ఒక్క అధికారి రాడు.. ఎందుకు రావడంలేదో నాకైతే అర్థం కావడంలేదు.
4.     చనిపోయిన రైతు రైతుగా కనిపించడంలేదా.. లేక చనిపోయింది పులివెందులలో కాబట్టి వివక్ష చూపుతూ రాలేదా
5.    పేద రైతు కుటుంబాలు ఎలా బ్రతుకుతాయన్న ఆలోచన కూడా బాబుకు రాకపోవడం శోచనీయం.
6.    అనంతపురంలో 46మంది ఆత్మహత్యలు చేసుకున్న రైతుల ఇళ్లకు వెళ్లా.. అందులో 20కి పైగా ఇళ్లకు గవర్నమెంటోళ్లు పోలేదు.
7.    ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.5లక్షలు పరిహారం అందిస్తున్నట్లు గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు ఆచరణలో ఏమీ అందించడంలేదు.
8.    రూ.1.50లక్షలు అప్పులోళ్లకిచ్చి మిగిలిన రూ.3.50లక్షలు బ్యాంకులో వేస్తామంటారు.. తీరా చూస్తే అకౌంటులో మాత్రం ఏమీ ఉండదు.. ఇలా ఎంతమంది రైతు కుటుంబాలను మభ్యపెడతారు
9.    అసలు ప్రభుత్వం ఏమి చేస్తోంది? ఎందుకు చేయలేకపోతోంది.. చనిపోయిన రైతులకు ఎందుకు పరిహారం ఇవ్వడం లేదో చెప్పాలి
10.  ఇప్పటికైనా కళ్లు తెరిచి ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోవాలి. పబ్లిసిటీ వస్తుందంటేనే పరిహారం ఇవ్వాలన్న ఆలోచనను పక్కనపెట్టి ఆత్మహత్య చేసుకున్న ప్రతి రైతు కుటుంబానికి పరిహారం అందించి న్యాయం చేయాలి.