3 February 2016

చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం..!

విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి రెండు కళ్ల సిద్ధాంతానికి తెర దీశారు. పరిపాలన మీద ఉవ్వెత్తున ఎగసిపడుతున్న అసహనాన్ని కులాల మధ్య చిచ్చులా మార్చేందుకు ఎడ తెగని ప్రయత్నాలు చేస్తున్నారు.

హామీల మీదే కాపుల పోరు
రిజర్వేషన్ లు కోరుతూ కాపులు చేస్తున్న పోరాటం ఇప్పటిది కాదు. దశాబ్దాల కాలం నుంచి పోరు సాగుతోంది. అయితే మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబు ప్రధానంగా ఇచ్చిన హామీల్లో కాపుల రిజర్వేషన్ ఒకటి. దీంతో పాటు ఐదేళ్ల లో రూ. 5వేల కోట్ల నిధులు ఇస్తామని చెప్పారు. దాదాపు రెండు సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ ఈ విషయంలో చంద్రబాబు స్పష్టత ఇవ్వటం లేదు. దీంతో కాపులు తిరగబడ్డారు. ఉద్యమ పథం తొక్కుతున్నారు.

బీసీల్ని రెచ్చగొట్టిన బాబు
ప్రమాదాన్ని పసిగట్టిన చంద్రబాబు తన పాత అయిడియాను బయటకు తీశారు. మాదిగలు, మాలలకు చిచ్చు పెట్టినట్లుగానే ఇప్పుడు కాపులు, బీసీలు మధ్య చిచ్చు పెట్టేందుకు పథకం రూపొందించారు. హైదరాబాద్ లోని ఎల్బీనగర్ తెలుగుదేశం ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు క్రిష్ణయ్య కు  ఈ పని అప్పగించారు. బీసీలను పూర్తిగా రెచ్చగొట్టి ఆందోళనలకు దిగేట్లుగా పథకాలు రచించారు. కాపులకు రిజర్వేషన్లు ఇస్తే తాము సహించబోమని బీసీల నాయకుల చేత చెప్పించారు.

రెండు కళ్ల సిద్ధాంతం అమలు..
ఇప్పుడు చంద్రబాబు నాయుడు రెండు వర్గాల్ని విభజించు..పాలించు సిద్దాంతాన్ని అమలు చేస్తున్నారు. టీడీపీ లోని నాయకుల్ని స్వయంగా పిలిపించుకొని ఆయా వర్గాలతో మాట్లాడమని పురమాయిస్తున్నారు. సహజంగానే గోదావరి జిల్లాల్లోని అనేక చోట్ల కాపులు, బీసీల మధ్య వైరం ఉంటుంది. దాన్ని ఆసరాగా చేసుకొని రెండు సామాజిక వర్గాల్ని రెచ్చగొట్టే పనికి వ్యూహాత్మకంగా పదును పెడుతున్నారు. 
చంద్రబాబు కులాల మధ్య చిచ్చుపెడుతున్నాడు

దేశంలో ప్రజాస్వామ్యం ఉందా

పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీకే గతిలేదు
ప్రత్యేకహోదా ఉంటే ప్రతి జిల్లా హైదరాబాద్ అవుతుంది
చంద్రబాబు హోదా అవసరం లేదంటాడు
ఫైనాన్స్ కమిషన్ ఒప్పుకోవడం లేదని అబద్ధాలు చెబుతాడు
ఏపీకి వేలకోట్లు ఇస్తే మీకు అడ్డు ఎవరుః వైఎస్ జగన్

శ్రీకాకుళంః వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్..శ్రీకాకుళం యువభేరి సదస్సులో విద్యార్థులు, యువతకు ప్రత్యేకహోదాపై దిశానిర్దేశం చేశారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా వల్ల రెండు రకాల మేలు జరుగుతుందని చెప్పారు. ప్రత్యేకహోదా ఉన్న రాష్ట్రాలకు పన్నుల్లో వాటాతో పాటు గ్రాంట్లు, లోన్ల ద్వారా రాష్ట్రాలకు సొమ్ము అందుతుందన్నారు. గ్రాంట్ అంటే తిరిగి చెల్లించనక్కర్లేని సొమ్ము. అదే లోన్ అయితే సొమ్ము తిరిగి చెల్లించాలి. ప్రత్యేకహోదా ఉన్న రాష్ట్రాలకు 90 శాతం గ్రాంట్లు వస్తాయి, కేవలం 10 శాతమే లోన్ వస్తుంది. అదే హోదా లేకపోతే 30 శాతమే గ్రాంట్లు వస్తాయి. 70శాతం లోన్ ద్వారా ఇస్తారని జననేత వివరించారు.  

ప్రత్యేకహోదా రాష్ట్రాలకు భారీగా పారిశ్రామిక రాయితీలు ఇస్తారని వైఎస్ జగన్ తెలిపారు. దేశంలో ప్రత్యేకహోదా ఉన్న రాష్ట్రాలు 11 ఉన్నాయన్నారు. హోదా ఉన్న రాష్ట్రాల్లో పరిశ్రమలు పెడితే కార్పొరేట్ , ఇన్ కమ్ ట్యాక్స్, ఎక్సైజ్ ట్యాక్స్ కట్టనవసరం లేదు. ట్రాన్స్ పోర్ట్ ఖర్చులు వెనక్కిఇస్తారు. పరిశ్రమలకు 20 ఏళ్లపాటు 50 శాతం రాయితీతో  విద్యుత్ సప్లై చేస్తారు. ఇలాంటి రాయితీలుంటే ప్రతి జిల్లా ఓ హైదరాబాద్ అవుతుంది. పారిశ్రామికవేత్తలను తీసుకొచ్చేందుకు చంద్రబాబు సింగపూర్, చైనా తిరగనవసరం లేదు. ఇక్కడ చలిగా ఉంటుందని దావోస్ వెళ్లనవసరం లేదు. ప్రత్యేకహోదా వస్తే లక్షల కోట్లు పెట్టుబడులు వస్తాయి. ఉద్యోగాలు వస్తాయి. నో వేకెన్సీ బోర్డులు కనిపించవు. ఇవన్నీ తెలిసి కూడా చంద్రబాబు తెలియనట్టు నటిస్తున్నాడని వైఎస్ జగన్ మండిపడ్డారు.  ఉత్తరాఖాండ్ లో రాయితీలివ్వడం వల్ల 490శాతం ఉద్యోగాలు పెరిగినట్లు ఉదహరించారు.  

చదువు అయిపోయాక ప్రతి పిల్లాడు పట్టా చేతబుచ్చుకొని ఉద్యోగం కోసం హైదరాబాద్ వెళతాడు. 90శాతం  ఐటీ పరిశ్రమలు హైదరాబాద్ లోనే ఉన్నాయి. రాష్ట్రంలో 70 శాతం మానుఫ్యాక్చర్ పరిశ్రమలు హైదరాబాద్ లోనే ఉన్నాయి.  ఆంధ్రప్రదేశ్ కు హోదా ఇస్తామని చెప్పి ..హైదరాబాద్ ను ఏపీకి కాకుండా చేసి అన్యాయంగా విభజించారు. ఆనాడు అధికార, ప్రతిపక్షం ఇద్దరూ కలిసి రాష్ట్రాన్ని విడగొట్టారు. మన్మోహన్ ఐదేళ్లు ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని హామీ ఇస్తే...ఇదే చంద్రబాబు, బీజేపీ ప్రతిపక్షంలో ఉండి పదేళ్లు కావాలని అడిగారు. పార్లమెంట్ సాక్షిగా ఇద్దరూ కలిసి ఒక్కటై రాష్ట్రాన్ని నిట్టనిలువునా చీల్చారు. తిరుపతిలోనూ  బాబు, మోడీ, వెంకయ్యనాయుడు ప్రత్యేకహోదా ఇస్తామని చెప్పారు. మేనిఫెస్టోలో పెట్టారు. ఇవాల మాకు తెలియదంటూ చెవులో పువ్వు పెడుతున్నారని వైఎస్ జగన్ ఫైరయ్యారు. 

నాయకుడి నోట్లోంచి మాట వస్తే నెరవేరుస్తాడని ఆశగా చూస్తాం. పార్లమెంట్ లో ఇచ్చిన మాటకే గతిలేకపోతే దేశంలో ప్రజాస్వామ్యం ఉందా అనిపిస్తోందని వైఎస్ జగన్ మండిపడ్డారు. నాయకులకు విశ్వసనీయత అన్నదే లేకుండా పోయిందని దుయ్యబట్టారు.  ప్రతి పిల్లాడు రాజకీయ నాయకులను నమ్మకపోవడానికి కారణం ఇలాంటి వాళ్లేనని తూర్పారబట్టారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురాకపోగా హోదా వేస్ట్ అంటూ చంద్రబాబు రకరకాల అబద్ధాలు చెబుతున్నాడని జననేత నిప్పులు చెరిగారు. కేంద్రం గనుక హోదా ఇస్తామని చెబితే....చంద్రబాబు విశాఖలో మీటింగ్ పెట్టి మావల్లే వచ్చిందంటూ దేశ,విదేశాలనుంచి అందరినీ పిలిచి గొప్ప కార్యక్రమని చేసేవాడంటూ ఎద్దేవా చేశారు.  

హోదాకు ఫైనాన్స్ కమిషన్ ఒప్పుకోవడం లేదు, హోదా ఉన్న రాష్ట్రాలకు డబ్బులు తక్కువగా ఇస్తారు అంటూ చంద్రబాబు పచ్చి అబద్ధాలు ఆడుతూ వాస్తవాలను వక్రీకరిస్తున్నాడని వైఎస్ జగన్ విరుచుకుపడ్డారు. ప్రత్యేకహోదా అన్నది క్యాబినెట్ నిర్ణయమని, క్యాబినెట్ చైర్మన్ ప్రధాని గనుక ఆయన తలచుకుంటే హోదాకు అడ్డుపడేది ఎవరని జననేత ప్రశ్నించారు. హోదా ఉన్న రాష్ట్రాలకు ఎంత డబ్బులు ఇవ్వాలన్న దానిపై ఫార్ములా లేదన్నారు. నరేంద్రమోడీ జమ్ముకాశ్మీర్ కు 70 వేల కోట్లు ప్యాకేజీ రిలీజ్ చేశారు. కోటి 25 లక్షల జనాభా ఉన్న జమ్ముకాశ్మీర్ కు అంత ఇస్తే ..ఐదు కోట్లు జనాభా ఉన్న ఆంధ్రకి వేల కోట్ల ప్యాకేజీకి ఎవరు అడ్డని ప్రశ్నించారు. ప్రత్యేకహోదా సమసిపోయిందంటూ బాబు అబద్ధాలు చెబుతున్నారు. మా ఎంపీ వైవి సుబ్బారెడ్డి పార్లమెంట్ లో మంత్రికి లేఖ రాస్తే...అదే పార్లమెంట్ సాక్షిగా హోదా ఉందని ఆమంత్రి నుంచి రిప్లై వచ్చిందన్నారు. 

విద్యార్థులతో వైఎస్ జగన్ ముఖాముఖి

శ్రీకాకుళంః పట్టణంలోని టౌన్ హాలులో నిర్వహించిన యువభేరి సదస్సు  విజయభేరిలా మారుమోగింది. జైజగన్ నినాదాలతో యువభేరి ప్రాంగణం హోరెత్తింది.  ప్రతిపక్ష నాయకుడు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రత్యేకహోదా సహా అనేక అంశాలపై విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. చంద్రబాబుపై ఒత్తిడి తీసుకొచ్చి అందరం ఒక్కటై ప్రత్యేకహోదాను సాధించుకుందామని విద్యార్థులు,యువతకు పిలుపునిచ్చారు. ఈసందర్భంగా జననేత వారితో నిర్వహించిన ముఖాముఖి ఇలా సాగింది. 

యోగేశ్వరరావు..
పులివెందుల పులిబిడ్డ వైఎస్ జగన్,  ఆచార్యులు, పెద్దలకు నమస్కారం. ప్రత్యేకహోదా రాకపోతే రాష్ట్రం అమ్ముడుపోతోంది. చంద్రబాబుది ఏం పోయింది సార్.  రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి సింగపూర్ వెళ్లిపోతాడు. 

వైఎస్ జగన్..
రాష్ట్రాన్ని అమ్మేసి సింగపూర్ పోతున్నాడని మాకు డౌట్ ఉంది. సింగపూర్ లో ఇళ్లు కట్టుకున్నాడని ఎవరో చెప్పారు. అందుకే రాష్ట్రాన్ని పట్టించుకోకుండా అబద్ధాలు ఆడుతున్నాడు.

హిమలక్ష్మి..
వైఎస్సార్ హయంలో చాలామంది పాజిటివ్ రిజల్ట్స్ తీసుకున్నారు. 2 సంవత్సరాలైంది బాబు వచ్చి.  ఆయన మాకు స్మార్ట్ సిటీస్ ఇవ్వనవసరం లేదు. విద్యార్థుల్లో ఉన్న స్మార్ట్ ట్యాలెంట్ గుర్తిస్తే చాలు.  ఆయనేం చేయడని మాకు అర్థమైంది. మీకు మా సపోర్ట్ ఉంటుంది. మీ నాయకత్వంలో హోదా కోసం పోరాడుతాం జగన్ అన్న. 

వైఎస్ జగన్
ఒకరికి ఒకరం తోడుగా కలిసికట్టుగా హోదాను సాధించుకుందాం తల్లి.

దేవి...
రుణమాఫీ ఇస్తానన్నాడు. మాకు డ్వాక్రా రుణాలు మాఫీ కాలేదు. చదువుకు ఇబ్బంది అవుతోంది. 

వైఎస్ జగన్..
లోన్ మాఫీకాలేదు. అమ్మ ఇబ్బందులు పడుతోంది. రుణాలు మాఫీ చేయకుండానే అన్నీ చేశానంటూ అబద్ధాలు ఆడుతున్నాడు. చంద్రబాబుకు నీ ఆవేదనతోనైనా  జ్ఞానోదయం అవుతుందని ఆశిస్తున్నాం. ఈఅంశంపై కూడా పెద్ద ధర్నాలు చేద్దాం తల్లి. 
సౌజన్య.
మేకిన్ ఇండియా, మేకిన్ ఆంధ్రా అన్నారు. మన ఆంధ్రాలో ఇంజినీర్లు లేరా. సింగపూర్ లోనే ఉంటారా. చంద్రబాబు డాక్టర్లను కూడా అక్కడినుంచే తీసుకొస్తారా సార్.

వైఎస్ జగన్..
మన దేశంలో పుట్టిన ఇంజినీర్లు ఎంతోమంది పెద్ద పెద్ద ప్రాజెక్ట్ లు కట్టారు. బాబు ఇళ్లు కూడా ఇక్కడి వాళ్లే డిజైన్ చేశారు. ఆయన సింగపూర్ నుంచి ఎందుకు తెచ్చుకుంటున్నాడంటే ఎలాంటి టెండర్లు లేకుండానే లంచాల కోసం అక్కడి కంపెనీలకు భూములిస్తున్నాడు. అందుకోసం సింగపూర్ జపం చేస్తున్నాడు. 
గాయత్రి..
స్కాలర్ షిప్, ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వడం లేదు సార్. 

వైఎస్ జగన్..
చంద్రబాబు వచ్చాక ఫీజు రీయింబర్స్ మెంట్ ను అటకెక్కించాడు. ఈసంవత్సరం సంగతి దేవుడెరుగు. పోయిన సంవత్సరం కూడా పెండింగ్ లో పెట్టాడు. ఇచ్చే వాటిలో కూడా సగానికి తగ్గించే కుట్ర చేస్తున్నాడు. బాబుకు  ఉసురు తగులుతుంది. ఖచ్చితంగా ఒత్తిడి తెద్దాం. గట్టిగా పోరాడుదాం. నేను ఒక్కటే హామీ ఇస్తున్నా. మనం అధికారంలోకి వచ్చాక ఫీజు రీయింబర్స్ మెంట్ ను రెవల్యూషనైజ్ చేస్తానని జననేత చెప్పారు.

పవిత్ర...(బీఎస్సీ సెకండ్ ఇయర్)
ఇంటికో ఉద్యోగమంటే నమ్మి ఓట్లేశాం. ఒక్క నోటిఫికేషన్ లేదు. ఇలాంటి నైతిక విలువలు లేని వ్యక్తికి పాలించే అర్హత ఎక్కడ ఉంది. 

వైఎస్ జగన్..
ఇంటికో ఉద్యోగం, ఉద్యోగం లేని వారికి నెలకు రూ. 2వేలు నిరుద్యోగ భృతి అన్నాడు. రాష్ట్రంలో కోటి 75 లక్షల మంది బాబు మాటలు నమ్మి ఓట్లేసి బాధపడుతున్నారు. వీళ్లంతా నిలదీస్తున్నారు. ఉద్యగమన్నా, నిరుద్యోగభృతి అన్నా ఇవ్వమని అడిగితే...సిగ్గులేకుండా నేనెప్పుడు చెప్పానని చంద్రబాబు మాట్లాడుతున్నాడు. ఇలాంటి వాళ్లకు పాలించే అర్హత లేదు. పలానా వాడు మా ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి సిగ్గుపడే పరిస్థితి తెచ్చాడు. మీ మాటతోనైనా రాజీనామా చేస్తాడేమో చూద్దాం. 

సందీప్..
ఇంతవరకు ఒక్క నోటిఫికేషన్ లేదు. బాబు వచ్చాడు జాబులు మాత్రం పోతున్నాయి. మీవెన్నంటి పోరాడుతాం జగన్ అన్న. 

వైఎస్ జగన్..
చంద్రబాబు అన్యాయమైన మైండ్ సెట్ లో ఉన్నాడు. రాష్ట్రం విడగొట్టే నాటికి లక్షా 42 వేల 828 ఉద్యోగాలున్నాయని లెక్కగట్టారు. బాబుకు సిగ్గుండాలి.  కచ్చితంగా ఒత్తిడి తెద్దాం.  మనమంతా హోదా వదిలేశామంటే ఎవరూ ఇవ్వరు. ఎవరూ పట్టించుకోరు. ఇవ్వాలన్న ఆలోచన కేంద్ర, రాష్ట్రాలకు ఉండదు. హోదా ఎవరిస్తారో వాళ్లనే ప్రధానమంత్రి పదవిలో కూర్చోబెడదాం.

గురుమూర్తి
ప్రత్యేకహోదాపై యూనివర్సిటీల్లో చర్చలు పెట్టుకునేందుకు అనుమతి ఇవ్వడం లేదు. అదే చంద్రబాబు తన కొడుకు లోకేష్ తో యూనివర్సిటీల్లో బర్త్ డే కేక్ కట్ చేయిస్తున్నాడు. 

వైఎస్ జగన్..
 ప్రత్యేకహోదా  తీసుకొచ్చి పిల్లల జీవితాలు చిరునవ్వులతో చూడాలి. అవగాహన కలిగించాలి. ప్రతి యూనివర్సిటీకి పోయి అవగాహన కల్పించాలి. కానీ చంద్రబాబు హోదాకు అడ్డుపడుతున్నాడు. యూనివర్సిటీల్లో కేకులు కట్ చేయిస్తాడు. దానికి వీసీలు కూడా పోతరు. చంద్రబాబు  దిక్కుమాలిన రాజకీయాలు విద్యార్థిలోకం చూస్తోంది. బంగాళాఖాతంలో కలిపేస్తారు. చంద్రబాబు కులాల మద్య కూడా చిచ్చుపెడుతున్నాడు. ఉసురు తగులుతుంది. 

మౌనిక..
టూరిస్ట్ ప్లేస్ లు ఎందుకు అబివృద్ది చేయం లేదు. పుష్కరాల్లో ఆడవాళ్లు చనిపోయారు. చంద్రబాబు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు.

వైఎస్ జగన్..
ప్రత్యేకహోదా వస్తే ఎన్నోపెట్టుబడులు వస్తాయి. ఉద్యోగఅవకాశాలు పెరుగుతాయి. అభివృద్ధి వాటంతట అదే జరుగుతుంది. చంద్రబాబు పుష్కరాల్లో సినిమా షూటింగ్ కోసం పూజలు చేస్తున్నట్లు కన్పించాలని ...ఘాట్ లో మనుషులను ఆపాడు. దాంతో తొక్కిసలాట జరిగి  29 మంది చనిపోయారు. పుష్కరాల్లో 29 మంది చావుకు కారణమైన చంద్రబాబునే జైల్లో పెట్టాలి. 

చైతన్య..
మీలాంటి ధైర్యవంతులు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి. బాబు ఓడిపోవడమే మా జీవిత లక్ష్యం సార్. 

వైఎస్ జగన్..
తప్పకుండా చైతన్య. థ్యాంక్యూ

సౌమ్య
సార్ మా దగ్గర రైల్వేస్టేషన్, బస్ స్టాపే బాగాలేదు. ఎయిర్ పోర్ట్ తెస్తానని చంద్రబాబు మాట్లాడుతున్నాడు. ముందు ఉన్నవి బాగుచేయమని బాబును అడుగుతున్నాం. 

వైఎస్ జగన్..
ఎయిర్ పోర్ట్ పేరుతో భూములు లాక్కుంటాడు. ప్రైవేటు వాళ్లకు ఇస్తారు. పక్కన్నేఆయన  బినామీలు భూములు కొంటారు. ఎక్కువ రేటుకు అమ్ముకుంటారు. అందరం ఏకమై బాబుపై ఒత్తిడి తీసుకొద్దాం. కలిసికట్టుగా హోదాను సాధించుకుందాం. 

2 February 2016

కుంభకోణాల బాబును హోదాపై నిలదీద్దాం

చంద్రబాబు తన స్వార్థం కోసం..
ఆంధ్రుల జీవితాలను తాకట్టు పెట్టాడు
విచ్చలవిడిగా స్కాంలకు పాల్పడుతున్నాడు
ఇసుక నుంచి బొగ్గుదాకా, కల్తీమద్యం నుంచి కాంట్రాక్ట్ లదాకా అవినీతి
నల్లధనంతో ఎమ్మెల్యేలను కొంటూ అడ్డంగా దొరికాడు
అందరం కలిసికట్టుగా హోదాను సాధించుకుందాంః వైఎస్ జగన్



శ్రీకాకుళంః ప్రతిపక్ష నాయకుడు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ శ్రీకాకుళం యువభేరి సదస్సులో గర్జించారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన విద్యార్థులు,యువతకు వైఎస్ జగన్ ప్రత్యేకహోదా ఆవశ్యకత గురించి దిశానిర్దేశం చేశారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా రాకుండా అడ్డుపడుతున్న చంద్రబాబుపై వైఎస్ జగన్ నిప్పులు చెరిగారు. ప్రత్యేకహోదాపై చంద్రబాబు మోడీని ఎందుకు నిలదీయడం లేదని, మంత్రులను ఉపసంహరించుకుంటామని ఎందుకు అడగడం లేదని జననేత ప్రశ్నించారు. 

కుంభకోణాల బాబు..
విచ్చలవిడిగా కుంభకోణాలకు పాల్పడి వచ్చిన నల్లధనంతో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మేల్యేలను కొంటూ... చంద్రబాబు ఆడియో, వీడియో టేపులతో అడ్డంగా దొరికిపోయాడని వైఎస్ జగన్ అన్నారు. బ్లాక్ మనీతో ఓటుకు కోట్లు కేసులో దొరికిపోయిన చంద్రబాబు ఆకేసులనుంచి బయటపడేందుకు అగచాట్లు పడుతున్నాడని ధ్వజమెత్తారు. బాబు తన స్వార్థం కోసం ఐదుకోట్ల మంది ఆంధ్రుల జీవితాలను కేంద్రం వద్ద తాకట్టుపెట్టాడని, కనీసం మంత్రులను ఉపసంహరించుకుంటానని చెప్పే దమ్మూ, ధైర్యం కూడా లేకుండా పోయిందని వైఎస్ జగన్ ఫైరయ్యారు. 

విచ్చలవిడిగా అవినీతి..
రాష్ట్రంలో అవినీతి ఏస్థాయిలో ఉందంటే ఇసుక నుంచి బొగ్గు దాకా...కల్తీమద్యం నుంచి కాంట్రాక్ట్ ల దాకా చంద్రబాబు కుంభకోణాలకు పాల్పడుతున్నాడని వైఎస్ జగన్ తూర్పారబట్టారు. ముఖ్యమంత్రి, ఆయన కొడుకు, మంత్రులు, ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు  విచ్చలవిడిగా ఇసుకమాఫియా నడిపిస్తున్నారని, కల్తీమద్యం సప్లై చేస్తున్నారని, కాల్ మనీ సెక్స్ రాకెట్ మాఫియాకు పాల్పడుతున్నారని  జననేత మండిపడ్డారు. గ్రామాల్లో వేలం వేసి మరీ చంద్రబాబు లిక్కర్ అమ్ముతున్నాడని విమర్శించారు. 

విద్యార్థులు,యువత జీవితాలతో ఆటలు..
విజయవాడలో కాల్ మనీ సెక్స్ రాకెట్ చంద్రబాబు ఆధీనంలో జరుగుతోందన్నారు.  కాంట్రాక్టర్లకు సంగం నాకు సగమంటూ చంద్రబాబు అన్నిటికీ  రేట్లు పెంచి కుంభకోణాలకు పాల్పడుతున్నారని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. చంద్రబాబు మీస్వార్థం కోసం మా జీవితాలతో ఆడుకోవడం అన్యాయం కాదా అని నిలదీయాలని వైఎస్ జగన్ విద్యార్థులకు పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ ప్రత్యేక హోదాపై పూర్తి అవగాహన పెంచుకోవాలని సూచించారు. లేకపోతే చంద్రబాబు ఈవిషయంపై అబద్ధాలు చెప్పి మోసం చేయాలని చూస్తాడని అన్నారు. 

ఒక్క జగన్ తో సాధ్యం కాదు..
ప్రత్యేకహోదా  జగన్ ఒక్కడితో సాధ్యం కాదని, అందరూ కలిసి కట్టుగా సాధించుకుందామని విద్యార్థిలోకానికి పిలుపునిచ్చారు. హోదా గురించి కంప్యూటర్ లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ స్పెషల్ స్టేటస్ అని కొడితే అవగాహన వస్తుందన్నారు. వైఎస్సార్సీపీ కాంగ్రెస్ పార్టీ వెబ్ సైట్ లోనూ ప్రత్యేకహోదాకు సంబంధించిన  కరపత్రం ఉందని...అందులో పూర్తి సమాచారం లభిస్తుందని చెప్పారు. 

ఆనాడు ఉద్యమకారుని చంపేశావ్

చంద్రబాబుది క్రిమినల్ బుద్ధి
రాష్ట్రంలో అలజడి సృష్టిస్తున్నాడు
కులాల మధ్య చిచ్చుపెడుతున్నాడు
బాబు చరిత్రంతా అబద్ధాలు, మోసాలు, వెన్నుపోటు
కాపుల సక్సెస్ ను ఓర్వలేక..మోహనరంగాను చంపించాడు

హైదరాబాద్ః  కాపుల మీటింగ్ జరిగితే ఉద్యమకారులకు, ప్రతిపక్ష పార్టీలకు మంచి పేరు వస్తుందన్న కక్షతో..చంద్రబాబు ఇతర పార్టీలకు చెడ్డపేరు ఆపాదిస్తున్నారని  ప్రతిపక్ష నాయకుడు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మండిపడ్డారు. ఇందుకోసం బాబు రాష్ట్రంలో అలజడి సృష్టిస్తున్నాడని ఫైరయ్యారు. కాపుల మీటింగ్ ఆపాలని చంద్రబాబు విశ్వప్రయత్నం చేశాడని దుయ్యబట్టారు. మీటింగ్ కు ఎవరూ హాజరుకావొద్దని బాబు కాపు టీడీపీ నేతలను హైదరాబాద్ కు పిలుపించుకున్నారన్నారు. కాపులకు అరకొరగా బస్సులు ఇచ్చి...మీటింగ్ కు 7,8 కి.మీ. దూరంలో వాటిని ఆపేసి..చంద్రబాబు వారిని రకరకారలుగా ఇబ్బందులు పెట్టారని జననేత విమర్శించారు. 

క్రిమినల్ బుర్ర నీది కాదా బాబు..
కాపులను మీటింగ్  దగ్గరకు  వెళ్లనీయకుండా వారి ప్రస్టేషన్ తో ఆడుకున్నావ్.  నీలో అసలు మానవత్వం  అంటూ వైఎస్ జగన్ చంద్రబాబుపై ధ్వజమెత్తారు. ఆరోజు ఏం జరిగిందో మీకు తెలియదా బాబు.  ముద్రగడ పద్మనాభం మాట్లాడినవెంటనే భావాద్వోగేల మధ్య రైల్ రోకోకు పిలుపునిచ్చారు. ఆయనతో పాటు అందరూ  రైల్వేస్టేషన్ దగ్గరకు వెళ్లారు. ప్రతి ఛానల్ టెలికాస్ట్ చేసింది.  కానీ ఆరు ఛానల్ లు మాత్రమే టెలికాస్ట్ చేశాయంటూ మాట్లాడుతున్నాడు.  రేపు పొద్దున్న కాపుల ఉద్యమాన్ని కవరేజ్ చేయకూడదని బాబు మీడియాను బెదిరిస్తున్నాడు. క్రిమినల్ బుర్ర నీది కాదా బాబు అని జననేత ఫైరయ్యారు. 

రంగాను చంపేశారు..
1984లో తెలుగుదేశానికి వ్యతిరేకంగా విజయవాడలో కాపునాడు సభ జరిగింది. అదే సభ 88లోనూ జరిగినప్పుడు ...ఆ సక్సెస్ ను తట్టుకోలేక చంద్రబాబు వంగవీటి మోహనరంగాను చంపించాడని జననేత తెలిపారు. చంద్రబాబు ప్రమేయంతోనే  హత్య జరిగిందని... అప్పుడు క్యాబినెట్ లో ఉన్న మంత్రి హరిరామ జోగయ్య పుస్తకం రాశాడన్నారు. మోహన రంగాను చంపిన ఇద్దరు ముద్దాయిలు ఇప్పుడు పదవిలో ఉన్నారన్నారు. కోడెల శివప్రసాదరావు స్పీకర్ పోస్ట్ లో ఉంటే దేవినేని ఉమ మంత్రి పోస్ట్ లో ఉన్నాడని, మరొకరు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారని వైఎస్ జగన్ కుండబద్ధలు కొట్టారు.  దుర్మార్గపు ఆలోచనలు చేస్తున్న చంద్రబాబుదే క్రిమినల్ బుద్ది అని వైఎస్ జగన్ తూర్పారబట్టారు. ఇవేనా బాబు నీ రాజకీయాలు. రాజకీయాలంటే స్ఫూర్తినిచ్చేవిగా ఉండాలి అని చెప్పారు. 

కులాల మధ్య చిచ్చు పెడుతున్నావ్..
బీసీలకు నష్టం జరగకుండా కాపులకు బీసీ రిజర్వేషన్ కల్పిస్తానని మేనిఫెస్టోలో పెట్టలేదా చంద్రబాబు..? ఇప్పుడు బీసీలు ఒప్పుకోవడం లేదని మీ పార్టీ బీసీ ఎమ్మెల్యే కృష్ణయ్యతో స్టేట్ మెంట్ ఇప్పించడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు.  మీ మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు కృష్ణ య్య లేడా బాబు అని నిలదీశారు . చంద్రబాబు కాపులకు, బీసీలకు మధ్య చిచ్చుపెడుతున్నాడని... గతంలోనూ ఎస్సీ వర్గీకరణ అని చెప్పి మాల, మాదిగల  మధ్య చీలిక తెచ్చాడని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. రాజకీయాల కోసం అందరి మధ్య చిచ్చుపెట్టేది చంద్రబాబు అయితే ..ఆనింద వేరేవాళ్లపై వేస్తున్నాడని విరుచుకుపడ్డారు. నాయంత గొప్ప నాయకుడు లేడంటాడు. సెల్ ఫోన్లు నేనే తెచ్చానంటాడు.ఇవన్నీ వినాల్సిరావడం మా కర్మ అని వైఎస్ జగన్ బాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 

అబద్ధాలు, మోసం, వెన్నుపోటు..
చంద్రబాబు పాలనలో ఏపీ ఐటీ ఎగుమతుల్లో 8.66 పర్సంట్ షేర్ ఉంటే ....వైఎస్సార్ హయాంలో 14.93 పెరిగింది. ఉద్యోగుల విషయానికొస్తే బాబు ఉన్నప్పుడు  85,945 పనిచేస్తే ...రాజన్న హయాంలో 2 లక్షల 64 వేల 737 వేల మంది పెరిగారు. అది రాజశేఖర్ రెడ్డి గొప్పతనం. ఇక టర్నోవర్  2003-4 లో 58వేల కోట్లు అయితే ..వైఎస్సార్ హయాంలో 2,41, 950 కోట్లకు పెరిగింది. ఇవన్నీ వాస్తవాలు ఇయితే చంద్రబాబు వాటిని వక్రీకరించి అబద్ధాలు చెబుతున్నాడని వైఎస్ జగన్ మండిపడ్డారు. ఇవన్నీ వినాల్సిరావడం ప్రజల కర్మ,  మాకర్మ అని వైఎస్ జగన్ వాపోయారు. అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబుని మించిన వారెవరు లేరని,  నోరు తెరిస్తే అబద్ధాలు, మోసాలు, వెన్నుపోటులేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపులకు డిమాండ్ కు సంపూర్ణంగా మద్దతిస్తున్నామని, బీసీలకు నష్టం జరగకుండా కాపులకు రిజర్వేషన్ ఇచ్చే విషయంలో... మద్దతిచ్చే పార్టీల్లో వైఎస్సార్సీపీ ముందుంటుందని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. 

అది వైఎస్సార్ గొప్పతనం..
1910-1956 దాకా  కాపులు బీసీల్లో ఉన్నారు. ఆ తర్వాత మూడేళ్లకే కాపులను జీవో ద్వారా తొలగించారు. తిరిగి బీసీల్లో చేర్చాలని కాపులు చేస్తున్న పోరాటం సహేతుకమని వైఎస్ జగన్ తెలిపారు. తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్లు ఉన్నాయి.  నీవు మద్దతిస్తున్న బీజేపీ కేంద్రంలో ఉంటే...ఏం చేస్తున్నావని  చంద్రబాబును వైఎస్ జగన్ సూటిగా ప్రశ్నించారు.  అసెంబ్లీలో  తీర్మానం చేసి  కేంద్రం దగ్గర పెడితే... బీసీలకు నష్టం రాకుండా కాపులకు రిజర్వేషన్ ఇవ్వవచ్చన్నారు.ఇక  కమిషన్ వల్ల ఎలాంటి లాభాలు లేవని,  బాబు వేసిన కమిషన్ కు దశ, దిశ లేదని జననేత ఎద్దేవా చేశారు.  చంద్రబాబు కమిషన్ కు మార్గదర్సకాలు ఇవ్వాల్సిందిపోయి..కమిషన్, రిపోర్ట్ వ్యతిరేకంగా వస్తే తానేమీ చేయలేననడం  దుర్మార్గమన్నారు.  మేనిఫెస్టోలో పెట్టిన ఏ హామీ నెరవేర్చడు. చివరకు మంత్రులను కూడా ఉపసంహరించుకునే దమ్మూ, ధైర్యం చేయడంలేదని బాబుపై మండిపడ్డారు. చంద్రబాబు చరిత్ర అంతా నోరు తెరిస్తే అబద్ధం, చేసేవన్నీ మోసాలేనని అన్నారు.  

ఏపీలో గ్రోత్ రేట్ 11.76 పర్సంట్  ఉంది. 15 శాతం తీసుకుపోతామన్న ఇదే చంద్రబాబు... జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు చాలా ఇబ్బందులున్నాయని మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. కేంద్రమే ఆర్నెళ్ల కాలానికి 7.3 పర్సంట్ జీడీపీ చూపించిందని జననేత తెలిపారు. తానేం చెప్పినా ప్రజలు నమ్ముతారన్న రీతిలో చంద్రబాబు అబద్ధాలు ఆడుతుంటారని వైఎస్ జగన్ ఆగ్రహించారు. 

కబడ్డీలో తొడగొట్టి..అమరావతిలో ఒలింపిక్స్ అంటాడు..
చంద్రబాబు వైజాగ్ కు పోతాడు. తొడగొట్టి అమరావతికి ఒలింపిక్స్ తెస్తానంటడు. చైనాలో ఒలింపిక్స్ జరిపించడం కోసం చైనీస్ గవర్నమెంట్ 42 బిలియన్ డాలర్లు(మూడున్నర లక్షల కోట్లు) ఖర్చుపెట్టింది. జీతాలిచ్చేందుకు డబ్బులేలేవన్న చంద్రబాబు అమరావతిలో ఒలింపిక్స్ పెడతాననడం విడ్డూరమన్నారు. సింగపూర్ పోతాడు, వస్తాడు. అమరావతిని సింగపూర్ చేస్తానంటడు.  చైనాకు పోతాడు, వస్తాడు. అమరావతిని బీజింగ్ చేస్తానంటడు. దావోస్ పోయివచ్చి స్విట్జర్లాండ్ చేస్తానంటడు. ఇంకా నయం రెండు కొండలు పెట్టి మంచు కురిపిస్తాననలేదంటూ బాబుపై వ్యాంగ్యాస్త్రం సంధించారు. ఇంత దారుణంగా  అబద్ధాలు ఆడే వ్యక్తిని తాను ఇప్పటివరకు చూడలేదని వైఎస్ జగన్ అన్నారు.  అందరూ కలిసికట్టుగా సాధించేదిశగా సంయమనంతో ముందుకు పోదామని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. ఏం జరిగినా చంద్రబాబు చెడ్డపేరు ఆపాదిస్తారని జననేత వ్యాఖ్యానించారు.  

1 February 2016

చంద్రబాబు క్రిమినల్ నం.1

బాబు చెప్పేవన్నీ అబద్ధాలు,చేసేవన్నీ మోసాలు
చంద్రబాబు తన వ్యాఖ్యలకు సిగ్గుపడాలి
నేరాలన్నీ చంద్రబాబు చేస్తూ..
ప్రతిపక్షాలపై అభాండాలు వేస్తున్నాడు

హైదరాబాద్ః రాజకీయ అవసరాల కోసం చంద్రబాబు రాష్ట్రంలో అన్ని వర్గాల మధ్య చిచ్చుపెడుతున్నారని ప్రతిపక్ష నేత వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తూర్పుగోదావరి జిల్లా తునిలో జరిగిన కాపు గర్జన ఘటనపై చంద్రబాబు, మంత్రులు మాట్లాడిన తీరు దారుణంగా ఉందని వైఎస్ జగన్ నిప్పులు చెరిగారు. తప్పులన్నీ చంద్రబాబు చేస్తూ ఆనెపం ప్రతిపక్షాలపైకి నెట్టేందుకు ఈస్థాయిలో రాజకీయాలు చేయడం దారుణమన్నారు. తలతోక లేకుండా మాట్లాడుతూ చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని వైఎస్ జగన్ మండిపడ్డారు. 

నోరు తెరిస్తే అబద్ధాలే..
కాపు రిజర్వేషన్లు సహా అనేక అంశాలపై చంద్రబాబు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలు, చేసేవన్నీ మోసాలేనని హైదరాబాద్ లోటస్ పాండ్ లోని పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో జననేత ఫైరయ్యారు. ప్రెస్ మీట్ లో చంద్రబాబు తాను చేసిన వ్యాఖ్యలకు సిగ్గుపడాలన్నారు.  చంద్రబాబు రకరాకల ఆరోపణలు చేశారు. కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య ప్రతిపక్షాలు  చిచ్చు పెడుతున్నాయంటూ అంభాడాలు వేస్తున్నాడు.  ఆరు ఛానళ్లకు మాత్రమే ఎలా తెలిసిందంటూ కాపుల ఉద్యమాన్ని కవర్ చేయకూడదని మీడియాను బెదిరిస్తున్నారు. 

అవతలి వారిపై అభాండాలు..
తలతోక లేని మాటలన్నీ మాట్లాడాడు. పట్టిసీమ నుంచి కాల్ మనీ దాకా మాట్లాడాడు. నేరస్తులు, కరప్షన్,  డబ్బులు స్పాన్సర్ అంటాడు. కాపులు 5 శాతమే పాల్గొన్నారని నోటికొచ్చినట్లు మాట్లాడతాడు. పులివెందులలో జరిగినా పర్వాలేదు. ఈస్ట్ గోదావరిలో ఇలా జరగడం బాధాకరమంటాడు. బీసీలు ఒప్పుకోవడం లేదంటాడు. జీతాలు ఇవ్వలేకపోతున్నామంటాడు. వేసిన కమిషన్ ఒప్పుకోకపోతే కాపులకు రిజర్వేషన్ ఇవ్వకపోతే మేము ఏమీ చేయలేమంటాడు. కానీ, కాపులకు పలానా చేస్తానన్న మాట ఎక్కడా చెప్పలేదు. ఆశ్చర్యమనిపించింది. చేసిన నేరాన్ని తప్పించుకునేందుకు అవతలివారిపై అంభాడాలు వేయడం చంద్రబాబుకు అలవాటైపోయింది

నీవు కాదా బాబు హామీ ఇచ్చింది..?
కాపులకు రిజర్వేషన్ విషయమై ప్రత్యేక కమిషన్ నియమించి నిర్ణీత కాలవ్యవధిలోనే బీసీలకు నష్టం జరగకుండా పరిష్కరిస్తామని ఎన్నికల ముందు నీవు కాదా బాబు చెప్పిందని వైఎస్ జగన్ తూర్పారబట్టారు. ఏడాదికి రూ. వేయి కోట్ల చొప్పున  ఐదేళ్లలో రూ. 5 వేల కోట్లు ఖర్చు చేస్తామన్నారు. చంద్రబాబు నీవు అధికారంలోకి వచ్చి 20 నెలలయిపోయింది. హామీలు ఎందుకు అమలు చేయడం లేదని కాపులు ఉద్యమబాట పడితే..... దానికి సమాధానం చెప్పకుండా అవతలి వాళ్లపై అభాండాలు వేయమేంటని దుయ్యబట్టారు. అసలు ఈయన ముఖ్యమంత్రేనా అని అనిపిస్తోందని వైఎస్ జగన్ ఎద్దేవా చేశారు. 

బాబుపై ప్రజల్లో అసహనం..
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం వల్ల, అబద్ధాలు చెప్పి మోసం చేసినందుకు ...చంద్రబాబుపై అన్ని కులాలు, మతాలు, ప్రాంతాల్లోని ప్రజల్లో ప్రస్టేషన్ ఉందని వైఎస్ జగన్ అన్నారు. రైతులు, డ్వాక్రాలకు రుణాలు భేషరతుగా మాఫీ చేస్తానని చెప్పలేదా బాబు. టీవీలు, పత్రికల్లో  ప్రకటనలు ఇవ్వలేదా బాబు..?  మరి నీవు మోసం చేసినప్పుడు క్రిమినల్ నం.1 అని ఎందుకు అనకూడదని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. బాబు వస్తే జాబు వస్తుందని చెప్పావ్. ఉన్న ఉద్యోగాలు తీసేస్తున్నావ్. ఉద్యోగం లేని వారికి నెలకు రూ. 2వేల నిరుద్యోగ భృతి అన్నావు. ఒక్కరికీ కూడా ఇవ్వలేదు. మరి అలాంటి నిన్ను క్రిమినల్ అని ఎందుకు అనకూడదు చంద్రబాబు అంటూ నిప్పులు చెరిగారు. 

క్రిమినల్ నం.1 చంద్రబాబు..
బీసీలకు నష్టం జరగుకుండా కాపులను బీసీల్లో చేరుస్తానని ఎన్నికల ముందు చెప్పావ్.  ఇవాళ చేయడం లేదు. అలాంటి  నిన్ను క్రిమినల్ నం.1 అని ఎందుకు అనకూడదు చంద్రబాబు. అనంతపురం వెళ్లి బోయలను ఎస్టీల్లో చేరుస్తానన్నావ్. ప్రతి కులానికీ, వర్గానికీ, ప్రాంతానికీ మోసం చేశావు. రాజధాని ప్రాంతంలో రైతుల నుంచి బలవంతంగా భూములు సేకరిస్తున్న విధానాన్ని తాము వ్యతిరేకిస్తే..కేపిటల్ కు వ్యతిరేకమని అంభాండాలు వేస్తున్నావ్. అదే మీ మంత్రి నారాయణ, సుజనా చౌదరి, ఎంపీ మురళీ మోహన్ భూములను మాత్రం తీసుకోరు. రైతులు, ఎస్సీ, ఎస్టీలపై  ఒత్తిడి తెచ్చి బలవంతంగా భూములు లాక్కుంటున్నారు.... పైగా  వైఎస్సార్సీపీకి ఇష్టం లేదని అభాండాలు వేస్తున్నారు.

చెంప చెల్లుమనిపిస్తారనే..
పోలవరం ముద్దు పట్టిసీమ వద్దు అంటే.. కమిషన్లు, లంచాల కోసం పట్టిసీమను తీసుకొచ్చారు. దానిపై నిలదీసినందుకు  రాయలసీమకు వైఎస్సార్సీపి వ్యతిరేకమని అభాండాలు వేస్తున్నారు. కాల్ మనీ సెక్స్ రాకెట్ లో చంద్రబాబు, ఆయన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. డీజీని కలిసిన ఫోటోలు ఉన్నాయి. ఆడియోలు, వీడియోలతో సహా ఆధారాలు ఉన్నాయి. సెక్స్ రాకెట్ లో  మీ అందరి ప్రమేయం ఉంది. ఐనా, అరెస్ట్ చేయరు. పైగా స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపిస్తున్నారు. బలంవంతంగామహిళల  జీవితాలను నాశనం చేస్తున్నావని ప్రశ్నిస్తే..వీళ్లు విజయవాడకు వ్యతిరేకమంటూ వైఎస్సార్సీపీపై బురద జల్లుతున్నారు. కాపులు పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరూ కదిలారు. మేనిఫెస్టో పెట్టిన హామీ ఎందుకు అమలు చేయడం లేదని నిలదీశారు. బీజేపీ కన్నా లక్ష్మినారాయణ కూడా వచ్చారు. ఐనా, చంద్రబాబు బీజేపీ వాళ్లను ఏమైనా అంటే చెంపచెల్లుమనిపిస్తారని..కావాలనే ఇతర పార్టీలపై బురజల్లుతున్నారని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కాపుల ఉద్యమ ప్రస్థానం..!

* దశాబ్దాలుగా సాగుతున్న రిజర్వేషన్ ఉద్యమం
* కొంత కాలం రిజర్వేషన్లు అనుభవించిన కాపులు
* ఎన్నికల ముందు హామీలు ఇచ్చి, తర్వాత తుంగలోకి తొక్కిన చంద్రబాబు
* రిజర్వేషన్ల అమలు కోసం కదం తొక్కుతున్న కాపులు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కాపుల రిజర్వేషన్ల సాధన కోసం ఏర్పాటైన  సభలో పరిణామాలు చక చకా చోటుచేసుకొన్నాయి. సభ నిర్వాహకుడు ముద్రగడ పద్మనాభం పిలుపుతో రాస్తారోకో, రైలు రోకో కు కార్యకర్తలు దిగటం, పోలీసులు అడ్డుకొనే క్రమంలో ఆందోళన అదుపు తప్పటం జరిగిపోయాయి. పోలీసు స్టేషన్లు, రైళ్లు తగలబెట్టడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన కాపు ఉద్యమం ప్రస్థానాన్ని ఇప్పుడు చూద్దాం.
కోస్తాలో ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలు, గుంటూరు ప్రకాశం జిల్లాల్లో కాపులు బలమైన సామాజిక వర్గంగా పేరు తెచ్చుకొన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఈ వర్గం జనాభా కూడా ఆంధ్రప్రదేశ్ లో అధికంగా ఉన్నట్లు తేటతెల్లమైంది. అయితే జనాభా అధికంగా ఉన్నా, కాపులు మరియు సంబంధిత కులాలు అయిన బలిజ, ఒంటరి, తెలగ వంటి కులాల్లో విద్యాదికులు, ఉన్నత ఉద్యోగులు తక్కువగా ఉన్నారు. అందరి సమున్నత ప్రగతి కోసం రిజర్వేషన్లు కావాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది.
నాటి నుంచి నేటి దాకా..
వాస్తవానికి బ్రిటీష్ వారి పరిపాలనలోనే కాపులు సామాజికంగా, ఆర్థికంగా వెనుకబాటుకి గురయ్యారని గుర్తించారు. దీంతో కొన్ని రాయితీలతో కూడిన పరికల్పనలు కేటాయించారు. కానీ స్వాతంత్ర్యం తర్వాత నీలం సంజీవరెడ్డి పరిపాలనలో వీటిని  తొలగించి ఓసీల్లో కలిపారు. తర్వాత కాలంలో దామోదరం సంజీవయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాపులకు తిరిగి బీసీ హోదా కల్పించారు. అనంతరం కాసు బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం వీటిఅమలుకు బ్రేకులు వేసింది. తర్వాత కాలంలో దీని మీద అడపా దడపా వినతి పత్రాలు సమర్పించటం, నిలదీయటం జరుగుతూ వచ్చింది.
కానీ, 1993 లో అప్పుడు శాసనసభ్యుడిగా ఉన్న ముద్రగడ పద్మనాభం పదవికి రాజీనామా చేసికాపు ఉద్యమ బాట పట్టారు. పెద్ద ఎత్తన ఆమరణ నిరాహార దీక్షకు దిగటంతో ప్రభుత్వం దిగి వచ్చింది. కోట్ల విజయభాస్కర్ రెడ్డి ప్రభుత్వం కాపు రిజర్వేషన్ల కోసం జీవో నెంబర్ 30ని విడుదల చేసింది. కాపులతో పాటు సంబంధిత కులాలకు రిజర్వేషన్లు దక్కాయి.
        కానీ, తర్వాత కాలంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక దీని అమలు మూలన పడింది. చంద్రబాబు తెర వెనుక నడిపిన మంత్రాంగంతో కొందరు కాపుల రిజర్వేషన్ల మీద కోర్టుకి వెళ్లారు. దీంతో రిజర్వేషన్లకు బ్రేకులు పడ్డాయి. తర్వాత కాలంలో ఉన్నత న్యాయస్థానం ఫుల్ బెంచ్ కలగచేసుకొన్నప్పటికీ, రిజర్వేషన్లు మాత్రం అమలు కాలేదు. ఇదంతా కాల గమనంతో పాటు ఉద్యమ రూపురేఖలు మారుతూ వచ్చాయి.
చంద్రబాబు మోసం
        ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ జనాభాలో ఎక్కువ భాగం ఆక్రమించిన కులాల్లో కాపులు ఒకటిగా చంద్రబాబు గుర్తించారు. దీంతో వేగంగా పావులుకదిపారు. అధికారంలోకి వస్తూనే కాపులకు బీసీ రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చారు. రూ. 5వేలకోట్లనుకాపుల సమున్నత ప్రగతి కోసం కేటాయిస్తామని నమ్మబలికారు. ఈ మాటలు నమ్మి పెద్ద ఎత్తున కాపులు తమ ఓట్లను చంద్రబాబుకి వేసినట్లు ఓట్ల గణాంకాలు చెబుతున్నాయి. అధికారంలోకి వచ్చాక అనేక హామీలకు తూట్లు పొడిచినట్లుగానే కాపులకు వెన్నుపోటు పొడిచారు. రిజర్వేషన్ల మాట పక్కన పెట్టేశారు. కార్పొరేషన్ విషయం గాలికి వదిలేశారు.
        రోజులు, వారాలు గడిచాయి. నెలలు, సంవత్సరాలు మారుతున్నాయి. పరిస్థితి గమనించి కాపులు లోలోన కుమిలిపోసాగారు. దీంతో కాపుల రిజర్వేషన్ల అమలుకోసం మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చంద్రబాబు ప్రభుత్వానికి లేఖలు రాశారు. వీటికి ఎటువంటి సమాధానం లేదు. పైగా కాపుల్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేయించారు. దీంతో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ముద్రగడ పద్మనాభం తుని వేదికగా బహిరంగసభకు పిలుపు ఇచ్చారు.
సభ మీద కుట్రలు
        దీనికి రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్సీపీ, ఇతర పార్టీలు మద్దతు ఇచ్చాయి. రాజకీయాలకు అతీతంగా నిర్వహిస్తున్న సభకు తరలి రావాలని పిలుపు ఇచ్చాయి. కానీ, ఈ సభను అడ్డుకొనేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్రలు అమలుచేసింది. ఫ్లెక్సీల్ని తొలగించటం, బస్సులు అందకుండా చేయటం, తాగునీటి సదుపాయం కల్పించటానికి నిరాకరించటం వంటి చర్యలకు పాల్పడింది. అక్కడకు వెళ్లవద్దని అంతర్లీనంగా ప్రచారం చేయించింది.
        ఈ పరిణామాలపై మండిపోయిన కాపులు, ముద్రగడ పద్మనాభం నాయకత్వంలో జాతీయ రహదారి మీద రాస్తారోకో కు దిగారు. మరో వైపు రైల్వే స్టేషన్ కు దూసుకెళ్లారు. కొందరు రత్నాచల్ ఎక్సు ప్రెస్ కు, స్థానిక పోలీసు స్టేషన్ కు నిప్పు పెట్టారు. హింస ప్రజ్వరిల్లుతున్నప్పటికీ, సంయమన చర్యలు చేపట్టేందుకు తెలుగుదేశం ప్రభుత్వం ముందుకురాలేదు. కానీ, దీన్ని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కు అంటించేందుకు కుట్రలు చేసింది. ఈ కుటిల మంత్రాంగాన్ని వైఎస్సార్సీపీ ఖండించింది. హింస సరైన పంథా కాదని, శాంతియుతంగా ఉద్యమించాలని పిలుపు ఇచ్చింది. అదే సమయంలో దీనికి అంతటికీ బాధ్యత చంద్రబాబు, తెలుగుదేశం పార్టీదే అని అభివర్ణించింది. మరోవైపు కాపుల రిజర్వేషన్ ల మీద సమగ్ర నిర్ణయం కోసం సోమవారం సాయంత్రం దాకా ప్రభుత్వానికి అల్టిమేటమ్ ఇస్తూ ముద్రగడ తన ఆందోళన ని విరమించారు.