11 May 2015

ఆర్టీసీని మూసేసే కుట్ర

2001లోనూ బాబు హయాంలో 24 రోజుల సమ్మె
రెండు నెలలుగా చర్చల పేరుతో తాత్సారం
ఇపుడు కేబినెట్ కమిటీ పేరుతో నాటకం
గుర్తింపు సంఘాల రద్దు బాబు మార్కు నిరంకుశత్వం
కార్మికులపై అంత కాఠిన్యం ఎందుకు?
సమ్మె చేస్తున్నందుకు నిందలు వేస్తారా?
పరిష్కరించకుండా మొండిగా వ్యవహరిస్తున్నది మీరు కాదా?
 
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుగారు మొండిగా వ్యవహరించడంలో మహా దిట్ట. ముఖ్యంగా రైతులు, కార్మికుల విషయంలో ఆయన ఎంత మొండిగానైనా వ్యవహరించగలరు. రైతులను రకరకాలుగా ఈసడించిన చంద్రబాబు ఇపుడు కార్మికులను అవే కళ్లతో చూస్తున్నారు. సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులపై ఆయన మండిపడుతున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె రోజు రోజుకూ ఉధృతమవుతుంటే పరిష్కరించే దిశగా ఎలాంటి ఆలోచనలూ చేయని చంద్రబాబు సమ్మె చేస్తున్న కార్మికులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆదాయం ఎక్కువగా వచ్చే సీజన్లో కార్మికులు ఉద్దేశపూర్వకంగా సమ్మెకు దిగారని ఆరోపణల వర్షం కురిపించారు.
 
అరెస్టులు.. బెదిరింపులు.. నిర్బంధం..
సమ్మె చేస్తున్న కార్మికులపై ఎస్మాను ప్రయోగించిన చంద్రబాబు సర్కారు అక్కడితో ఆగలేదు. నిరసన ప్రదర్శనలు చేస్తున్న కార్మికులను ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు. విధులకు హాజరు కాకుండా సమ్మెలో పాల్గొంటున్న కాంట్రాక్టు డ్రైవర్లు, కండక్టర్లను బెదిరిస్తున్నారు. విధులకు హాజరు కాకపోతే రెగ్యులర్ చేయబోమని, తొలగిస్తామని బెదిరిస్తూ ఆర్టీసీ రీజినల్ మేనేజర్ల చేత ప్రకటనలు చేయిస్తున్నారు. మరోవైపు గతంలో సస్పెండయిన, తొలగించబడిన కార్మికులను తిరిగి విధుల్లోకి చేర్చుకోవడం ద్వారా సమ్మె చేస్తున్న కార్మికులకు చెక్ చెప్పాలనే పథకాలను చంద్రబాబు సర్కారు రచిస్తున్నది. తాత్కాలిక సిబ్బందిని నియమించి అద్దె బస్సులను తిప్పేందుకు కూడా ప్రయత్నాలు సాగుతున్నాయి. మరోవైపు సమ్మెను సాకుగా చూపిస్తూ చంద్రబాబు సర్కారు నిర్బంధాన్ని మరింత ఉధృతం చేసింది. ఆర్టీసీ కార్మికులకు వెన్నుదన్నుగా ఉన్న కార్మిక సంఘాల గుర్తింపును రద్దు చేసింది. కార్మికుల వేతనాల నుంచి కార్మిక సంఘాల సభ్యత్వ రుసుం వసూలుకు స్వస్తి చెప్పింది. అంతేకాకుండా యూనియన్ కార్యకలాపాలలో ఉండే నేతలకు ఆన్‌డ్యూటీతో పాటు ఇతర సౌకర్యాలను నిలిపేస్తూ నిర్ణయం తీసుకుంది. 
 
ఆర్టీసిని మూసేసే కుట్రలు
కుక్కను చంపాలంటే దానిపై పిచ్చిదనే ముద్ర వేయాలన్న సూత్రాన్ని చంద్రబాబు తూచా తప్పకుండా పాటిస్తుంటారు. ఇదే సూత్రాన్ని పాటించి ఆయన గతంలో అనేక ప్రభుత్వ రంగ సంస్థలకు మంగళం పాడేశారు. అలాగే ఆర్టీసీనీ ప్రయివేటీకరించేందుకు గత తొమ్మిదేళ్ల హయాంలో చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు. ఆర్టీసీ ఆధ్వర్యంలో ఉన్న బస్టాండ్లు, ఇతర స్థలాలను అమ్మేయాలని, లేదా లీజుకివ్వాలని కూడా ఆయన ప్రయత్నించారు. ఇపుడు మరలా అదే కుట్రకు చంద్రబాబు తిరిగి పదును పెడుతున్నారు. అందుకే ఫిట్‌మెంట్ బెనిఫిట్ వ్యవహారంలో అంత మొండిగా వ్యవహరిస్తున్నారన్న వాదనలున్నాయి. ఆర్టీసీ కార్మికుల వేతన సవరణ విషయంలో చంద్రబాబు సర్కారు రోజుకో డ్రామా అడుతోంది. కార్మికులు తమ న్యాయమైన హక్కుల కోసం సమ్మెకు దిగితే మొండిగా వ్యవహరించడం, ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తామంటూ బెదిరించడం చూస్తుంటే కార్మికులపై చంద్రబాబుకు ఎటువంటి ప్రేమ ఉన్నదో అర్ధమౌతుంది. ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్ బెనిఫిట్ ఇచ్చి... రెండేళ్లుగా ఫిట్‌మెంట్ బెనిఫిట్ ఇవ్వకపోయినా వేచి ఉండి సంస్థ మనుగడ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ఆర్టీసీ కార్మికులకు ఇపుడు మొండి చేయి చూపడం సమంజసమేనా? ఆర్టీసీ కార్మిక సంఘాలతో రెండు నెలల నుంచి అనేక సార్లు రవాణాశాఖ మంత్రి చర్చలు జరిపారు. అదే విధంగా ఆర్టీసీ ఎండీ కూడా చర్చలు జరిపారు. ఇన్నాళ్లూ ఏమీ తేల్చ కుండా ఇపుడు కేబినెట్ సబ్ కమిటీ వేశామంటూ మాయమాటలు చెప్పడం చూస్తుంటే ఆర్టీసీ కార్మికులు సమ్మె చేయడం వల్లే నష్టాలు వస్తున్నాయంటూ సంస్థను మూసేసేందుకు కుట్ర పన్నుతున్నట్లుగా కార్మికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 
 
ముఖ్యమంత్రి మాట్లాడాల్సింది ఇలాగేనా?
ముఖ్యమంత్రి వంటి బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి సమ్మె చేస్తున్న కార్మికులను ఉద్దేశించి పరుషమైన వ్యాఖ్యలు చేయడం సబబేనా..? టికెట్ల రేట్లు పెంచుకోవడం, ఆర్టీసీ ఆస్తులు అమ్ముకోవడం ద్వారా పే స్కేల్స్ ఇచ్చుకోండి అని చంద్రబాబు వ్యాఖ్యానించడం చూస్తే ఆయన ఎంత నిర్దయగా మాట్లాడగలరో అర్ధమౌతుంది. సమయం చూసి సమ్మెకు దిగారంటూ చంద్రబాబు కార్మికులపై నిందలు వేస్తున్నారు. ఇపుడు సీజన్ కాబట్టి ఇపుడు సమ్మె చేస్తే సంస్థకు నష్టం వస్తుంది అని కార్మికులు ఉద్దేశపూర్వకంగా సమ్మెకు దిగినట్లు చంద్రబాబు వ్యాఖ్యలు చేస్తున్నారు. నిజానికి ఈ వ్యవహారంలో ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలి. రెండు నెలలుగా ఆర్టీసీ కార్మికులు ఫిట్‌మెంట్ బెనిఫిట్ గురించి అడుగుతున్నా తాత్సారం చేసింది ఎవరు? ప్రభుత్వం కాదా?
 
ఆర్టీసీని భ్రష్టు పట్టించిన చంద్రబాబు
చంద్రబాబు ముఖ్యమంత్రిగా 1995లో గద్దెనెక్కే నాటికి ఆర్టీసీ రు.45 కోట్ల లాభాల్లో ఉంది. 1994-95, 1995-96 లలో కూడా లాభాల్లో నడిచింది. లాభాల్లో ఉన్న ఆర్టీసీని దెబ్బ కొట్టడం కోసమే చంద్రబాబు నాయుడు సర్కారు ఆర్టీసీ నుంచి రూపాయి చార్జీకి 15శాతం పన్నులు వసూలు చేసింది. అదే విధంగా రాయితీ పాసులకు సంబంధించి రాష్ర్ట ప్రభుత్వం రీయింబర్స్ చేయాల్సిన మొత్తాన్ని చెల్లించకుండా ఆపేశారు. దాంతో ఆర్టీసీ 3 వేల కోట్ల అప్పు చేయాల్సి వచ్చింది. దాని మీద వడ్డీలు కలుపుకుని రు.5 వేల కోట్లకు చేరుకుంది. దానికి ఇప్పటికీ 9.5శాతం వడ్డీ చెల్లిస్తున్నారు. 2001 అక్టోబర్ 15 నుంచి నవంబర్ 7 వరకు ఆర్టీసీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 24 రోజుల పాటు సమ్మె జరిగింది. అది కూడా చంద్రబాబు నాయుడి హయాంలోనే. ఆ సమయంలో కార్మికులు, కార్మిక నాయకులపై కేసులు పెట్టించి బయటి వ్యక్తులతో డ్యూటీ చేయిస్తే వారు ఆర్టీసీ సొమ్ము దోచేశారు. 

ఆర్టీసీలో బాబు ఘనకార్యాలు
  • తొమ్మిదేళ్లలో ఆరుసార్లు చార్జీలు పెంచారు
  • నష్టాల సాకుతో ప్రైవేటీకరించేందుకు విస్తృతంగా ప్రయత్నించారు.
  • రు. 480 కోట్ల మేర భారం వేశారు.
  • 1995లో అరకొరగా క్యాజువల్ పద్ధతిలో డ్రైవర్లు, కండక్లరను తీసుకుని ఆ తర్వాత ఉద్యోగాల భర్తీకి బ్రేక్ వేశారు. క్యాజువల్ వర్కర్లను పర్మినెంట్ చేయరాదని చట్టం-2 ఆదేశాలు జారీ చేశారు.
  • వేతనాలు పెంచాలంటూ 24 రోజుల పాటు నిరవధికంగా సమ్మె చేసిన కార్మికులపై చంద్రబాబు ఉక్కుపాదం మోపారు. వారిపై కేసులు పెట్టించారు. ఉద్యమం తీవ్ర రూపం దాల్చడంతో 9.5శాతం పెంచి చేతులు దులుపుకున్నారు.
  • పదివేల మంది కార్మికులను ఇంటికి పంపారు. 
  • ఔట్ సోర్సింగ్ అనేక కాంట్రాక్టు పద్ధతిని ప్రవేశపెట్టడమే కాకుండా ఉద్యోగులను తగ్గించి ప్రైవేటుకు బాటలు పరిచారు. 
 
వైఎస్ హయాంలో లాభాల బాట
  • మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఆర్టీసీ రు.117 కోట్ల లాభాలను ఆర్జించింది. 
  • ఆర్టీసీని ప్రైవేటీకరిస్తానని చంద్రబాబు హూంకరించడం వల్ల కార్మికుల్లో ఏర్పడిన అభద్రతా భావాన్ని వైఎస్ తొలగించారు.
  • 2007, 2008, 2009 సంవత్సరాలలో కండక్టర్, డ్రైవర్ పోస్టులను భర్తీ చేశారు.
  • చంద్రబాబు చేసిన చట్టం - 2ను ఎత్తేసి 240 రోజుల సర్వీసు పూర్తి చేసిన 12 వేల మంది కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్ చేయించారు.
  • వేతనాలు పెంచి ఉద్యోగుల మన్ననలు పొందారు.
  • వైఎస్ పాలనలో ఒక్కసారి కూడా ఆర్టీసీ చార్జీలు పెరగలేదు.
  • ఆర్టీసీ నష్టాల నివారణకు బడ్జెట్‌లో ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. రు. 500 కోట్లు మంజూరు చేశారు.
  • పన్ను భారాన్ని రెగ్యులర్ సర్వీసులపై 12.5 నుంచి 7 శాతానికి, సిటీ సర్వీసులపై 10 నుంచి 5 శాతానికి తగ్గించి ఆర్టీసీకి రు. 250 కోట్ల మేర ఆర్ధిక సాయం అందించారు.
  • పల్లె వెలుగు సర్వీసులు ప్రవేశపెట్టి ఆర్టీసీని గ్రామీణులకు దగ్గర చేశారు. 

No comments:

Post a Comment