19 May 2015

తెలుగుదేశం విజయయాత్ర హాస్యాస్పదం

అంబటి రాంబాబు ఎద్దేవా
హైదరాబాద్ : ఏడాది పాలన పూర్తి చేశామన్న పేరుతో విజయయాత్ర జరిపే నైతిక హక్కు తెలుగుదేశం ప్రభుత్వానికి లేదని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. ఏడాది పాలనలో ఒక్క వాగ్దానం కూడా అమలు చేయలేదని పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. మంగళవారంనాడు ఆయన హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఏడాది పాలనలో ఏం చేశారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.  రాష్ర్ట పునర్విభజన బిల్లులో ఇచ్చిన హామీలను అమలు చేసేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంలో తెలుగుదేశం ప్రభుత్వం విఫలమయ్యిందని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా సాధించడంలో తెలుగుదేశం ప్రభుత్వం విఫలమయ్యిందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ వైఫల్యాలపై తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జరప తలపెట్టిన రెండు రోజుల దీక్ష యథాతథంగా కొనసాగుతుందని రాంబాబు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా సాధించడంలో చంద్రబాబు విఫలమయ్యారని ధ్వజమెత్తారు. ఈ విషయంలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఎందుకు జాప్యం చేస్తున్నారని రాంబాబు ప్రశ్నించారు. టీడీపీ, బీజేపీలకు ఓటు వేస్తే రాష్ర్ట భవిష్యత్ మారుస్తామన్నారని, ఇప్పుడెందుకు ఇలా చేస్తున్నారని రాంబాబు నిలదీశారు. తాను చేసిన వాగ్దానాలు అమలు చేయడం సాధ్యమేనని, వాటి ప్రభావం తనకు తెలుసునని చంద్రబాబు నాయుడు ఎన్నికల సంఘానికి లేఖ రాశారని రాంబాబు గుర్తు చేశారు. ఒక్క వాగ్దానాన్ని కూడా అమలు చేయకుండానే ఏడాది పాలన సందర్భంగా సంబరాలు చేసుకోవడం హాస్యాస్పదమని రాంబాబు అన్నారు.

No comments:

Post a Comment