9 May 2015

మనసు లేని పాలకుడు


అన్నదాతలంటే బాబుకు ఎప్పుడూ చిన్నచూపే
కళ్లెదుటే రైతు ఆత్మహత్యా యత్నం
అయినా పట్టించుకోని వైనం
కనీసం అధికారులను పురమాయించరా?
మంచి వైద్యం అందించాలని ఆదేశించరా...

అన్నదాతలంటే నారా చంద్రబాబునాయుడుగారికి ఎప్పుడూ చిన్నచూపే.. వ్యవసాయం దండగ అని సూత్రీకరించిన చంద్రబాబుకు రైతులంటే దండగమారిగానే కనిపించడం సహజమే కదా. అంతేకాదు గతంలోనూ అనేక సందర్భాలలో రైతులను ఆయన ఈసడించారు. సహకార సంఘాల బకాయిలు కట్టని రైతులకు సంకెళ్లు వేయించారు. ఆస్తులు, ఇళ్లు జప్తులు చేయించారు. కరెంటు బిల్లులు కట్టకపోతే మోటార్లు పీకించారు. కరెంటు చార్జీల భారం మోపి నడ్డి విరగ్గొట్టారు. ఆత్మహత్యలు చేసుకుంటుంటే పరిహారం కోసం చనిపోతున్నారంటూ ఎద్దేవా చేశారు. ఇపుడు కళ్లెదురుగా ఓ రైతు ఆత్మహత్య చేసుకుంటుంటే పట్టనట్టు ఊరుకున్నారు. ఇలాంటి మనసులేని పాలకుడు భూతద్దం వేసి వెదకినా ప్రపంచంలో మరెక్కడా కనిపించరు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయనగరం జిల్లానర్సీపురం సభలో రైతులకు, డ్వాక్రా మహిళలకు తాను ఎంతో చేశానని, రైతుల రుణాలు మాఫీ అయిపోయాయని, డ్వాక్రా మహిళలను కూడా ఆదుకుంటామని చెబుతున్న సమయంలోనే రాము అనే రైతు అదే ముఖ్యమంత్రి సాక్షిగా పురుగు మందు తాగాడు. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. రెతు పురుగుమందు తాగటాన్ని చంద్రబాబు చూడలేదా? అంటే చూశారు. దగ్గర నుంచి కాకపోయినా వేదిక మీద నుంచి ఆయనకు అర్థం అయ్యింది. వెంటనే చంద్రబాబు ఏం అన్నారో అన్ని టీవీల్లోనూ వచ్చింది. ఏం లేదు... ఏం లేదు... కూర్చొండి.. కూర్చొండి... అంటూ చంద్రబాబు సర్దేశారు. తెలుగుదేశం కార్యకర్తలు, పోలీసులు, అధికారులు అంతా తలో చెయ్యి వేసి రైతు ఆత్మహత్యా ప్రయత్నాన్ని తగ్గించి చూపేందుకు ఎవరి ప్రయత్నం వారు చేశారు. నిన్న, ఈరోజు కూడా తెలుగుదేశం అనుకూల పత్రికలు, ఛానెళ్ళు ఈ విషయాన్ని మరుగుపరచటానికి లేదా తక్కువ చేసి చూపటానికి విశ్వ ప్రయత్నం చేశాయి. అదే రాజశేఖరరెడ్డిగారి సభలోనో, జగన్ మోహన్ రెడ్డిగారి సభలోనో ఇలాంటి సంఘటనే జరిగి ఉంటే ఇదే మీడియా ఎలా స్పందించేదో అందరికీ తెలుసు. 
ఆత్మహత్య చేసుకుంటున్నా చలించరా..?
కళ్ళ ఎదురుగ్గా ఒక రైతు పురుగు మందు తాగినా, అతని నోటి వెంట నురగ వస్తున్నా... చంద్రబాబు గారు చలించలేదు. అయ్యో అనలేదు. స్టేజీ దిగి రాలేదు. కనీసం... ఆ రైతు బతికాడా.. చచ్చాడా.. అని కూడా కనుక్కోలేదు. వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకోండి అని అధికారులను ఆదేశించలేదు. వైద్య సిబ్బందికి కూడా చెప్పలేదు. మరేం చెప్పారు? ఏం లేదు... ఏం లేదు... కూర్చొండి.. కూర్చొండి.. అని చెప్పారు. తన కళ్ళ ఎదుట రైతు ఆత్మహత్య చేసుకుంటున్నా చలించని ఈ పెద్ద మనిషికి మానసిక లోపం అన్నా ఉండి ఉండాలి. లేదా రైతుల మీద చిన్నచూపు అయినా ఉండి ఉండాలి. రైతుల సమస్యల మీద చిన్నచూపు ఉండబట్టే- గతంలో ముఖ్యమంత్రిగా ఉండగా కూడా రైతులపై ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. వ్యవసాయం దండగ అన్నారు. ఒకసారి మీ పంటలన్నీ ఎండిపోతే తప్ప మీకు బుద్ధి రాదు అన్నారు. రెండో పంట మిమ్మల్ని ఎవరు వేయమన్నారని ప్రశ్నించారు. ఉచిత విద్యుత్ ఇస్తే కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవాలన్నారు. వ్యవసాయానికి అనుమతి లేకుండా కరెంటు వాడుకున్న రైతుల్ని దొంగలుగా సంబోధిస్తూ మరో దేశంలో అయితే ఇలాంటి వారిని ఉరి తీసేవారు అని వ్యాఖ్యానించారు. ఇప్పుడు రైతు తన కళ్ళ ఎదుట ఆత్మహత్యాయత్నం చేస్తే ఏం లేదు... ఏం లేదు... కూర్చొండి.. కూర్చొండి.. అని చెప్పాడు. 
రైతు ఆక్రందనలు... సర్కారు వారి బూటకపు ప్రకటనలు
చంద్రబాబు అధికారంలోకి వచ్చే నాటికి బ్యాంకు రుణాలు రూ. 87 వేల కోట్లు అయితే, ఇప్పుడు అవి రూ. 97 వేల కోట్లకు పెరిగాయి. అయినా ఏం లేదు.. ఏం లేదు..  రుణ మాఫీ చేసేశానని చెబుతున్నాడు. విజయ యాత్రలు చేస్తానంటున్నాడు. తన మెడలో దండలు వేసి శాలువాలు కప్పి సన్మానించాలన్నట్టు పత్రికల్లో ప్రకటనలు ఇచ్చుకుంటున్నాడు. అలాగే తుళ్ళూరు రైతులు, సీఆర్‌డీఏ పరిధిలో ఉన్న గ్రామాల రైతులు ఆక్రందనలు చేస్తుంటే తమ పొలాలు ఇవ్వం అని చెబుతుంటే- ఏం లేదు.. ఏం లేదు... అందరూ ల్యాండ్ పూలింగ్‌కు పొలాలు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారంటూ తన అధికారులు, పోలీసుల ద్వారా రైతుల మెడపై తుపాకీ పెట్టి మరీ బెదిరించి భయపెట్టి ప్రలోభపెట్టి తప్పుడు సమాచారం ఇచ్చి ల్యాండ్ పూలింగ్ డ్రామా కొనసాగించారు. ఇప్పుడు ఆ రైతులంతా తమ భూములు తమకు ఇవ్వాల్సిందిగా హైకోర్టుకు ఎక్కుతున్నారు. వాస్తవానికి ఈ 11 నెలల పరిపాలనలో ఏముంది అంటే- తెలుగుదేశం పార్టీకి తెలిసో, తెలియకో ఓటు వేసినవారంతా ఏం లేదు... ఏం లేదు.. అని చెప్పే పరిస్థితి వచ్చింది. 
ఆత్మహత్యలు... హత్యలే 11 నెలల ఘనత
ఈ 11 నెలల పరిపాలనలో ఏముంది అంటే- ఆత్మహత్యలు ఉన్నాయి. ప్రభుత్వమే, ముఖ్యమంత్రే శ్రద్ద తీసుకుని చేయించిన హత్యలు ఉన్నాయి. రైతులకు చరిత్రలో ఏనాడు లేనంత అప్పులు ఉన్నాయి. డ్వాక్రా మహిళల ఉద్యమం సర్వనాశనమై డ్వాక్రా సంఘాలకు పీకలలోతున అప్పులు ఉన్నాయి. నేతన్నలకు రుణ మాఫీ కాక ఆకలిదప్పులు ఉన్నాయి. లోకేష్‌కు, నారాయణకు, సుజనా చౌదరికి, సీఎం రమేష్‌కి, మురళీ మోహన్‌కి, నారా భువనేశ్వరికి ప్రతి నియోజకవర్గంలో ఉన్న పచ్చ తమ్ముళ్ళకు మాత్రం సగటు పౌరుడితో పోలిస్తే లక్ష రెట్ల ఆస్తులు ఉన్నాయి. ఈ 11 నెలల పరిపాలనలో ఈ సమాజంలోని రైతులకు, మహిళలకు, నేతన్నలకు, బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు, మధ్యతరగతికి, నిరుద్యోగులకు, కూలీలకు, అసంఘటిత కార్మికులకు.... ఏ ఒక్క వర్గానికీ మేలు జరగలేదు. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో దాదాపు 300 వగ్దానాలు చేశారు. ఒక్కటంటే ఒక్కటి కూడా ఈ 11 నెలల కాలంలో అమలు కాలేదు. ఈ విషయం అందరికంటే బాగా తెలుగుదేశం నాయకులకు, చంద్రబాబుకు తెలుసు. ప్రజలను మేనేజ్ చేయలేమని కూడా తెలుసు. 
నిజాలకు ముసుగేస్తారా?
అందుకే చంద్రబాబు నాయుడు, ఆయన పార్టీ అధికార బలాన్ని, ధన బలాన్ని, మీడియా బలాన్ని ఉపయోగించి నిజాలకు ముసుగులు కప్పుతోంది. విజయనగరం జిల్లాలో రైతు ఆత్మహత్యా ప్రయత్నం, ఆ సమయంలో చంద్రబాబు ప్రవర్తన అన్నవి చాలా తీవ్రమైన అంశాలు. మనసు లేని పాలకుడు మరో నాలుగేళ్ళు రాజ్యాధికారం కొనసాగిస్తే తెలుగు తల్లి బిడ్డలు ఇంకెన్ని కష్టాలు, నష్టాలు, కడగండ్లు ఎదుర్కోవాలో, ఇంకెన్ని ఆత్మహత్యలు, అరాచకాలు చూడాలో అని ఆలోచన గల ప్రజలంతా ఆందోళన చెందుతున్న సమయం ఇది. 

No comments:

Post a Comment