16 May 2015

భూసేకరణపై రగులుతున్న పల్లెలు

బాబు సర్కారుపై సర్వత్రా ఆగ్రహావేశాలు
ప్రతిఘటిస్తామంటున్న అన్నదాతలు

ఆంధ్రప్రదేశ్ రాజధాని పేరుతో తెలుగుదేశం ప్రభుత్వం ఆడుతున్న భూ సమీకరణ, భూ సేకరణ నాటకాలపై అన్నదాతలు రగిలిపోతున్నారు. నిన్నటి వరకు భూ సమీకరణ, లాభసాటి ప్యాకేజీ అంటూ అంటూ రైతులను మభ్యపెట్టిన చంద్రబాబు సర్కారు ఇపుడు ఒక్కసారిగా జూలు విదిల్చింది. తన నిజస్వరూపాన్ని బయటపెట్టుకుంది.
  భూమిని స్వచ్ఛందంగా ఇవ్వడానికి రైతులు ముందుకు రాకపోతే వారి భూములను భూసమీకరణ చట్టం ప్రయోగించైనా సరే లాక్కునేందుకుగాను జీవో 166 జారీ చేసింది. రాష్ర్ట ప్రభుత్వ భూ సేకరణ కుట్రలపై రైతులు, రైతు కూలీలు, కౌలు రైతులు మండి పడుతున్నారు. ప్రతిపక్షాలు ముఖ్యంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన ఆందోళనలకు సమాయత్తమవుతున్నారు. ఇప్పటికే చాలా గ్రామాలలో  ఆందోళనలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుంటామని రైతులు స్పష్టం చేస్తున్నారు.
  మంగళగిరి నియోజకవర్గంలోని ఉండవల్లి, పెనుమాక, నిడమర్రు, బేతపూడి, యర్రపాలెం, కురగల్లు, రాయపూడి, వెంకటపాలెం తదితర గ్రామాల్లోని దాదాపు వెయ్యి ఎకరాల భూములను భూసేకరణ విధానంలో సేకరించాలని అధికారులు సిద్ధమవుతున్నారు. ఎక్కడెక్కడి భూములను సేకరించనున్నామో ఆ వివరాలతోపాటు రైతుల పేర్లు, భూమి విస్తీర్ణం తదితర వివరాలను సీఆర్‌డీఏ కమిషనర్ శ్రీకాంత్ వెల్లడించనున్నారు. మూడువేల ఎకరాలను సేకరించేందుకు ప్రభుత్వం భూములను గుర్తించినప్పటికీ గ్రామ కంఠాలు, డొంకలు, దారులు పోను రైతుల నుంచి వెయ్యి ఎకరాలను సేకరించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
  తమ భూములను బలవంతంగా లాక్కోవడానికి వీలుగా భూసేకరణకు ప్రభుత్వం జీవో జారీ చేయడంతో రైతుల్లో ఆగ్రహావేశలు కట్టలు తెంచుకున్నాయి. మూడు పంటలు పండే భూములను ఎలా ఇవ్వమంటారని రైతులు ప్రశ్నిస్తున్నారు. ప్రాణాలైనా ఇచ్చి భూములను కాపాడుకుంటామని వారు స్పష్టం చేస్తున్నారు. 166 జీవో కాపీ ప్రతులను దగ్ధం చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. రాజధాని రైతులకు అండగా వైఎస్‌ఆర్‌సీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిలుపు మేరకు శుక్రవారం విజయవాడ ప్రకాశం బ్యారేజీపై వినూత్న నిరసన జరిగింది. ఇందులో రైతులు, రైతుకూలీలు, కౌలు రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తమ పంట పొలాల్లో పండిన కూరగాయలను రైతులు స్వచ్ఛందంగా తీసుకువచ్చి దారిన పోయేవారికి పంచిపెట్టారు. బహుళపంటలు పండుతున్న తమ పంట భూములను చంద్రబాబును నమ్మి ఎలా ఇవ్వమంటారని రైతులు ప్రశ్నిస్తున్నారు. భూ సమీకరణ కోసం చట్టాలు, జీవోలు విడుదల చేసిన చంద్రబాబు ఇపుడు భూసేకరణ చట్టాన్ని ఎలా ప్రయోగిస్తారని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఒకేసారి ఒకే ప్రాంతంలో రెండు చట్టాలను ఎలా ప్రయోగిస్తారని రైతులు నిలదీస్తున్నారు.
  భూసేకరణ జీవోపై గ్రామాల్లోనే కాక గుంటూరు జిల్లా పరిషత్‌సర్వసభ్య సమావేశం కూడా అట్టుడికి పోయింది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, మాచర్చ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి, వైఎస్‌ఆర్ సీపీ జెడ్పీ ఫ్లోర్ లీడర్ దేవళ్ల రేవతి ఇంకా వైఎస్‌ఆర్ సీపీ జెడ్పీటీసీలు, ఎంపీపీలు జీవో 166ను గట్టిగా వ్యతిరేకించారు. భూ సమీకరణ, భూసేకరణలపై సమావేశంలో తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. భూసేకరణ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా తీర్మానం చేయాలన్న తమ డిమాండ్‌ను అధికార తెలుగుదేశం పార్టీ అంగీకరించకపోవడంతో వైఎస్‌ఆర్‌సీపీ సభ్యులంతా సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు.
  భూ సేకరణ జీవోను వ్యతిరేకిస్తూ తాడేపల్లి తహశీల్దార్ కార్యాలయం వద్ద సీపీఎం ఆధ్వర్యంలో వినూత్న రీతిలో నిరసన జరిగింది. నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని కార్యాలయం మెట్లపై బైఠాయించారు. అనంతరం భూసేకరణ ప్రక్రియ నిలుపుదల చేయాలంటూ తహశీల్దార్ కార్యాలయంలో అధికారులకు వినతపత్రం సమర్పించారు. భూసేకరణ జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం గుంటూరు జిల్లా కార్యదర్శి పాశం రామారావు ఆధ్వర్యంలో మంగళగిరి తహశీల్దార్‌కు వినతిపత్రం అందించారు. జీవో 166ను వ్యతిరేకిస్తూ సీపీఐ రాష్ర్ట కార్యదర్శి కె.రామకృష్ణ ఆధ్వర్యంలో మంగళగిరి పట్టణంలో ప్రదర్శన జరిగింది. అనంతరం జీవో ప్రతులను దగ్ధం చేశారు. భూసేకరణకు వ్యతిరేకంగా రానున్న కాలంలో పది వామపక్షాలను కలుపుకుని కార్యాచరణను ప్రకటిస్తామని రామకృష్ణ వెల్లడించారు.

No comments:

Post a Comment