26 May 2015

ఇదేనా బాబూ మీ అనుభవం?

అనుభవజ్ఞుడినంటూ మేనిఫెస్టోలో గొప్పలు...
త్యాగాలు చేయాలంటూ ప్రజలకు వాతలు
 అందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే అద్భుత ఫలితాలు వస్తాయన్న చంద్రబాబు నాయుడు గారు- ఎన్నికలకు ముందు ఏం చెప్పారో ప్రజలందరికీ తెలుసు. తనకు అపార అనుభవం ఉందన్నారు. తాను ఒంటి చేత్తో ప్రపంచ స్థాయి రాజధాని కడతానన్నారు. సింగపూర్‌ను నిర్మిస్తామన్నారు. పారిశ్రామిక కారిడార్లు, ప్రపంచస్థాయి విద్యా సంస్థలు ప్రపంచంలో ఉన్న ఐటీ కంపెనీలు, మాన్యుఫాక్చరింగ్ పరిశ్రమలు అన్నీ రెక్కలు కట్టుకుని వచ్చి  సీమాంధ్రలో వాలతాయన్నారు. తాను నరేంద్ర మోడీ కలిసి దేశంలోనే అత్యున్నతమైన రాష్ట్రాన్ని నిర్మించబోతున్నామన్నారు. అనుభవం అనే పదాన్ని నిర్మాణం అనే పదాన్ని పదే పదే వల్లె వేశారు. చివరికి తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో 10వ పేజీలో ఏం చెప్పారో చూడండి.
 ‘‘కొత్త రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధులను కేంద్రం నుంచి సాధించడంతోపాటు ఒక సమగ్ర ఆర్థిక, సామాజిక కేంద్రంగా నూతన రాజధానిని ప్రపంచ నగరాలకు దీటుగా నిర్మిస్తాం’’- అని చెప్పారు.
 ‘‘రాష్ట్రానికి అవసరమైన వైద్య, విద్య పరిశోధనా సంస్థల ఏర్పాటుకు అవసరమైన ప్రోత్సాహకాలు, నిధులు సమకూరుస్తాం’’ అని చెప్పారు.
 ‘‘ముందు చూపు, నిధులు సేకరించగలిగిన సత్తా, బాధ్యతాయుతంగా పనిచేయించగలిగిన నాయకత్వం, అంతర్జాతీయంగా పలుకుబడి, పరిచయాలు కల్గిన వ్యక్తి(చంద్రబాబు నాయుడు) నాయకుడుగా ఉన్నప్పుడే ఇవన్నీ సాధ్యం అవుతాయి’’ - అని మేనిఫెస్టోలో చెప్పారు.
 పోనీ డ బ్బులు గురించి వదిలేశారా అంటే అది లేదు. డబ్బులు వస్తాయి. డబ్బులు ఉన్నాయి.. అని చెప్పారు. వారు ఇంకా ఏం చెప్పారో... చూడండి.
 ‘‘ఈ మేనిఫెస్టోలో ప్రకటించిన వివిధ హామీల అమలుకు కావాల్సిన ఆర్థికపరమైన అన్ని అంశాలను పరిగణించాం కొత్త రాష్ట్రానికి ఉన్న అపార అభివృద్ధి అవకాశాలు, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రాయితీలు, రాబోయే పెట్టుబడుల ద్వారా వేగవంతమైన ఆర్థిక వృద్ధి సాధించటం ద్వారా హామీలన్నీ అమలు చేయటానికి కావాల్సినంత నిధులు సమకూరుతాయి’’ - అని తెలుగుదేశం మేనిఫెస్టోలో చెప్పారు.
 అంతేతప్ప జనం అంతా ఇటుకలు ఇస్తే రాజధాని కడతామని, సెక్రటేరియేట్‌లో హుండీలు పెడతామని, ప్రజలంతా త్యాగాలు చేయాలని 1999కి ముందు ఛార్జీలన్నీ పెంచినా ప్రజలే అర్థం చేసుకున్నారు కాబట్టి 2014 తర్వాత కూడా అదే తరహాలో ప్రజలకు వాతలు పెడతామని మీ మేనిఫెస్టోలో ఎక్కడా చెప్పలేదు.  అన్యాయం చేసింది కేంద్ర ప్రభుత్వం అయితే త్యాగాలు చేయాల్సింది ఆంధ్రా ప్రజలా? ఈ ఆర్గ్యుమెంట్ చేయటానికి సిగ్గుండాలి.

No comments:

Post a Comment