13 May 2015

ఆర్టీసీ కార్మికులకు వైఎస్‌ఆర్‌సీపి అభినందనలు

హైదరాబాద్ : పోరాడి తమ న్యాయబద్ధమైన డిమాండ్‌ను సాధించుకున్న ఆర్టీసీ కార్మికులకు వైఎస్‌ఆర్‌సీపీ అభినందనలు తెలియజేసింది.  ఈనెల 6న సమ్మె ప్రారంభం కాకముందే రెండు రాష్ర్ట ప్రభుత్వాలు ఆర్టీసీ కార్మికులు అడిగిన ఫిట్‌మెంట్‌కు ఒప్పుకుని ఉంటే రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రజలకు ఇంత భారీగా కష్టనష్టాలు సంభవించేవి కావని పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. ఆమె బుధవారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆర్టీసీ కార్మికులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 43 శాతం, తెలంగాణ ప్రభుత్వం 44శాతం ఫిట్‌మెంట్ బెనిఫిట్ ఇచ్చేందుకు ఒప్పుకున్న సంగతి తెల్సిందే. ఫిట్‌మెంట్ బెనిఫిట్ ఇచ్చేందుకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ముందే ఎందుకు అంగీకరించలేదో సమాధానం చెప్పాలని పద్మ డిమాండ్ చేశారు. సమస్యను కోర్టుకు ఎందుకు లాగారో చెప్పాలని, ఆర్టీసీ కార్మికులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసే వరకు సమస్యను ఎందుకు నాన్చారో కూడా చంద్రబాబు నాయుడు, కేసీఆర్ సమాధానం చెప్పాలని ఆమె కోరారు. చివరికి ఎమ్‌సెట్, ఇతర పోటీ పరీక్షలు జరుగుతున్నా ప్రభుత్వం మొండిగా వ్యవహరించిందని, విద్యార్థులు నష్టపోయిన విలువైన కాలాన్ని ఎవరు తీసుకు వస్తారని పద్మ అన్నారు. ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేస్తానని గతంలో హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు ఇపుడు దానిపై ఏంచెబుతారని పద్మ ప్రశ్నించారు. రెండు తెలుగు రాష్ట్రాలలో ఆర్టీసీకి నష్టాలు రావడంలో ప్రభుత్వాల పాత్ర ఎంత వరకు ఉందో ఇద్దరు ముఖ్యమంత్రులు సమీక్షించుకోవాలని ఆమె పేర్కొన్నారు. ఆర్టీసీకి ఉపయోగించే డీజిల్ మీద వ్యాట్‌ను పూర్తిగా తొలగించాలని లేదా ఆ వ్యాట్ సొమ్ము మేరకు ఆర్టీసికి రీయింబర్స్ చేయాలని పద్మ డిమాండ్ చేశారు. ఆర్టీసి చార్జీలు పెంచే ప్రతిపాదనల్ని వచ్చే నాలుగేళ్లలో ఈ రెండు ప్రభుత్వాలు చేయడానికి వీల్లేదని, ఆర్టీసీ నష్టాలకు ప్రభుత్వ విధానాలే కారణం తప్ప ప్రజలు కాదన్న వాస్తవాన్ని ముఖ్యంగా చంద్రబాబు గుర్తించాలని అన్నారు. సమ్మె సమయంలో కార్మికులకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి సంపూర్ణ మద్దతు ప్రకటించారని, అలాగే పార్టీ శ్రేణుల్ని కూడా ఈ సమ్మెలో పాల్గొనాల్సిందిగా పిలుపునివ్వడం ద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకువచ్చారని ఆమె వివరించారు. ప్రభుత్వాలు దిగిరాకపోతే రాష్ర్ట వ్యాప్త బంద్‌కు పిలుపునిస్తామని కూడా జగన్ హెచ్చరించారని పద్మ గుర్తు చేశారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక మీదట కూడా కార్మికలోకానికి ఇదే మద్దతును కొనసాగిస్తుందని తెలిపారు.

No comments:

Post a Comment