25 May 2015

మంత్రులా... ముసుగేసుకున్న రౌడీలా..?

పోలీసు అండతో ప్రతిపక్ష పార్టీని ఎలా అణగదొక్కాలి... అనే అంశం మీదే కేంద్రీకరించి తెలుగుదేశం పార్టీ మినీ మహానాడులు నిర్వహించుకుంటోంది. సాక్షాత్తూ ఉప ముఖ్యమంత్రి కె. ఈ. కృష్ణమూర్తి, మంత్రి అచ్చన్నాయుడు నిన్న కర్నూలులో ఏం మాట్లాడారో... చూస్తే ఆశ్చర్యం, అసహ్యం ఏకకాలంలో కలగడం సహజం. ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ అంటూ ఉంటే,  ఈ రాష్ట్రంలో కూడా రా.జ్యాంగం అనేది పని చేస్తుంటే వీరిద్దర్నీ వెంటనే అరెస్ట్ చేసి జైల్లో పడేయాలి. కోర్టు ముందు హాజరు పరచాలి. వారిని తక్షణం మంత్రి పదవుల నుంచి తొలగించాలి. వారిని పదవుల నుంచి తొలగిస్తారో... తొలగించరో చంద్రబాబు నిర్ణయించుకోవాలి. ప్రజలు మాత్రం ఇలాంటివారిని మంత్రులుగా చూడాల్సి వచ్చినందుకు ముక్కున వేలేసుకుంటున్నారు.

 వైయస్‌ఆర్‌సీపీని అణిచివేసేందుకు పోలీసుల సహాయం కావాలి అని ఉప ముఖ్యమంత్రి అడిగారట. తమ జిల్లాలో వైయస్‌ఆర్‌సీపీ బలంగా ఉందని, అక్కడి 11 మంది ఎమ్మెల్యేలను, ఇతర నాయకులను అణగదొక్కే విషయంలో పోలీసుల సహాయం ఎలా తీసుకోవాలా అన్న అంశంపై చంద్రబాబును సంప్రదించాలని నిర్ణయించారట. పక్కనే ఉన్న అచ్చన్నాయుడు అనే మంత్రిగారు ముఖ్యమంత్రిగారు కూడా వైయస్‌ఆర్‌సీపీ నేతల్ని అణగదొక్కేందుకు సహకరించాలని, టీడీపీకి అనుకూలంగా ఏఏ ట్రాన్స్‌ఫర్లు చేయాలో ఆయా ట్రాన్స్‌ఫర్లు చేస్తానని మాట ఇచ్చారట. వీళ్ళు క్యాబినెట్ మంత్రులా లేక మంత్రుల ముసుగులో ఉన్న గూండాలు, రౌడీలా? వీరికి మించిన యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఇంకెవరైనా ఉన్నారా?

 బహిరంగంగా, పార్టీ సమావేశంలో చేసిన ఈ వ్యాఖ్యల్ని సూమోటోగా నమోదు చేసి వారి ఇద్దరిపై రౌడీషీట్ ఓపెన్ చేయాల్సిన బాధ్యత ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థకు ఉంది.

  తెలుగులో ఒక సామెత ఉంది. ఆవు చేలో మేస్తుంటే.. దూడ గట్టున మేస్తుందా అని. ముఖ్యమంత్రి అయిన వెంటనే విజయవాడలో ఐఏఎస్‌లు, ఐపీఎస్‌ల కాన్ఫరెన్స్‌లో చంద్రబాబు నాయుడు ఏం చెప్పారో... ఇప్పుడు మంత్రుల ఏం చెబుతున్నారో చూస్తే ఇదే అభిప్రాయం కలుగుతుంది. పాముకు విషం ఉంటే పాము పిల్లలకు కూడా విషం ఉంటుంది. ముఖ్యమంత్రి ఆలోచనల్లోనే విషం ఉంటే మంత్రులకీ అదే అలవాటు అవుతుంది.
  విజయవాడలో జరిగిన సివిల్ సర్వెంట్ల కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ తమ పార్టీ నాయకుల పట్ల చూసీ చూడనట్లుగా వ్యవహరించాల్సిందిగా విజ్ఞప్తి చేసిన రోజునే ఈ రాష్ట్రం అవాక్కైంది. అంత చదువులు చదువుకున్న ప్రజా సేవకులు అంటే సివిల్ సర్వెంట్లు మౌనంగా ఉండటం రాష్ట్ర ప్రజలందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. సాక్షాత్తూ ముఖ్యమంత్రే సివిల్ సర్వెంట్లను తమ పార్టీ నేతలకు ఊడిగం చేయమంటుంటే- ఆరోజే ముఖ్యమంత్రిపై చట్టాన్ని ప్రయోగించి ఉంటే లేదా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అది సాధ్యం కాదని తెగేసి చెప్పి ఉంటే, తాము రాజ్యాంగానికి, చట్టానికి జవాబుదారే తప్ప తెలుగుదేశం పార్టీకి, ఆ పార్టీలో ఉన్న గూండా, రౌడీ శక్తులకు, అందులో దురదృష్టవశాత్తు మంత్రులు, ఎమ్మెల్యేలు అయిన ఎలిమెంట్లకు తాబేదార్లం కాదని స్పష్టం చేసి ఉంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఇంతగా దిగజారి పోయేవి కాదు.

  పోలీసు బాసులు వేసుకోవాల్సింది ఖాకీ దుస్తులా లేక ఎల్లో దుస్తులా? అన్న చర్చ మొన్న అనంతపురం జిల్లాలో హత్య సందర్భంగా రాష్ట్రమంతటా జరిగింది. పోలీసు వ్యవస్థ నిజాయితీగా వ్యవహరించాలి. కేఈ కృష్ణమూర్తి, అచ్చన్నాయుడు వ్యాఖ్యల్ని సీరియస్‌గా తీసుకుని వారి కదలికల మీద నిఘా పెట్టాల్సిన అవసరం కూడా ఉంది. 

No comments:

Post a Comment