19 May 2015

బాబుగారి పాలనలో దళితులపై పెరిగిన దాడులు... దాష్టీకాలు

నారా చంద్రబాబు నాయుడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి కావస్తూ ఉంది. రాష్ర్టంలో దళితులు భయభ్రాంతులకు గురవుతున్నారు. దళితుల మీద దాడులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దళిత ఉద్యోగులకు భద్రత లేదు. ఎన్నికల సమయంలో దళితులకు రక్షణ కల్పిస్తామని వాగ్దానం చేసిన చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల తర్వాత దళితులను భక్షిస్తా ఉంది. దళితుల సంక్షేమాన్ని గాలికొదిలేసింది. దళితుల మీద దాడులు చేయిస్తూ ఈ రాష్ర్టంలో బ్రతకడానికి దళితులకు అవకాశం కూడా లేకుండా చేస్తోంది.  ఈ సంవత్సర కాలంలో దళితులపై జరిగిన దాడుల మీద సిట్టింగ్ జడ్జిని నియమించి విచారణ జరిపించాలని ప్రతిపక్షాలు, దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
  కర్నూలు జిల్లా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగ అధ్యక్షుడిని తెలుగుదేశం గూండాలు పథకం పన్ని హత్య చేశారు. శ్రీకాకుళం జిల్లాలో ఒక దళిత సబ్‌ఇన్‌స్పెక్టర్ ఆత్మహత్య చేసుకోవడానికి తెలుగుదేశం శాసనసభ్యుడు కారణమయ్యాడు. తెలుగుదేశం శాసనసభ్యుడి వల్లే గుంటూరు జిల్లాలోని పొన్నూరు నియోజకవర్గంలో ఒక సొసైటీ సీఈఓ కూచిపూడి గాంధీ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదయ్యింది కూడా. సత్తెనపల్లి నియోజకవర్గంలోని నకిరేకల్లులో దళితుల మీద దాడులు జరిగాయి. తెలుగుదేశం నాయకుల వత్తిళ్ల వల్ల నర్సరావుపేట నియోజకవర్గంలో ఒక ఫీల్డ్ అసిస్టెంట్ ఆత్మహత్య చేసుకున్నారు. అనంతపురం జిల్లాలో రాప్తాడు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నాయకుడు ప్రసాదరెడ్డిని హత్య చేసి అనంతరం జరిగిన ఆందోళనలకు పార్టీకి చెందిన దళితులను బాధ్యులను చేసి అరెస్టులు చేసి వేధిస్తున్నారు. తాడిపత్రి నియోజకవర్గంలో తొమ్మిది మంది దళితుల మీద తెలుగుదేశం గూండాలు అమానుషంగా దాడులు చేశారు. వీటికి తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏం సమాధానం చెబుతారు? 
  తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం దళితులకు ఏం న్యాయం చేసింది? అందుకే దళితులు భయపడుతున్నారు. ఈ రాష్ర్టంలో చదువుకున్నవాళ్లకి భద్రత లేదు. ఉద్యోగస్తులకు భద్రత లేదు. ఉద్యోగావకాశాలలో దళితులను ఇంకా అస్పృశ్యులుగానే చూసే పరిస్థితి ఉంది. శ్రీకాకుళం జిల్లాలో ఏ అధికారి అయినా మనవాడే రావాలి అంటూ మంత్రి అచ్చెన్నాయుడు అంటున్నారు. దళిత అధికారులను ప్రాధాన్యత లేని విభాగాలకు బదిలీ చేస్తున్నారు. సస్పెండ్ చేయిస్తున్నారు. వారు ఆత్మన్యూనతకు లోనై ఆత్మహత్య చేసుకునే పరిస్థితులను కల్పిస్తున్నారు. దళితులపై దాడులు జరిగిన కేసుల్లో ఎంత పురోగతి సాధించారు? ఎన్ని కేసుల్లో ఎఫ్‌ఐఆర్‌లు పెట్టి అరెస్టులు చేయించారు? వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పక్షాల నిలబడ్డారన్న దుగ్ధతోనే తెలుగుదేశం పార్టీ వారు దళితులపై దాడులు చేయిస్తున్నారన్న మాట నిజం కాదా? దళితులకు రాజ్యాంగ పరంగా అనేక రక్షణలున్నా తెలుగుదేశం ప్రభుత్వం వాటిని నిర్వీర్యం చేస్తున్నది. వాటికి ఏం సమాధానం చెప్తారు? 
  చట్టప్రకారం సబ్‌ప్లాన్ నిధులను ఖర్చు చేయడంలోనూ చంద్రబాబు అన్యాయం చేస్తున్నారు. నిధుల కేటాయింపులోనే 5 వేల కోట్ల మేర అన్యాయం చేశారు. 70శాతానికి పైగా ఖర్చు చేయకుండా ఉంచారు.
  బాబు వస్తే జాబు వస్తుందని ప్రచారం చేసుకుని ఎన్‌ఆర్‌జేలలో ఫీల్డ్ అసిస్టెంట్లు, అంగన్‌వాడీ టీచర్లు, ఆర్‌వీఎంలలో పనిచేసే ఉద్యోగులకు మంగళం పలుకుతున్నారు. అందులో మెజారిటీ భాగం ఎస్సీఎస్టీలే ఉన్నారు. ఆ కుటుంబాలన్నీ రోడ్డున పడుతున్నాయి. తెలుగుదేశం పార్టీకి సానుభూతిపరులుగా లేరన్న కారణంతోనే వారి ఉద్యోగాలను ఊడబీకుతున్నారు. ఇంటికో ఉద్యోగమన్నారు.. ఉద్యోగమివ్వలేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు.
  తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులమీద జరిగిన దాడులు, దళితుల సంక్షేమానికి తూట్లు పొడిచిన తీరు, దళితుల అభ్యుదయం కోసం చేపట్టిన స్కీముల అమలులో లోపాలు, దళితుల ఉద్యోగ భద్రతను కాలరాయడం వంటి అన్ని విషయాలలోనూ సిట్టింగ్ జడ్జిని నియమించిన నిజానిజాల నిగ్గు తేల్చాలని ప్రతిపక్ష పార్టీలు, దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. రానున్న రోజుల్లో దళిత వ్యతిరేక ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అవి పేర్కొంటున్నాయి. 

No comments:

Post a Comment