13 May 2015

సర్కారుకు పట్టని సాక్షర భారత్!

ఇచ్చిన హామీలను నెరవేర్చని చంద్రబాబు నాయుడు సర్కారుకు ఇతర పథకాలను అమలు చేసే తీరికెక్కడిది? బాబుగారి ఆలోచనలన్నీ సింగపూర్, జపాన్, చైనాల చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. వయోజనులకు అక్షరాలు నేర్పేందుకు ఉద్దేశించిన సాక్షర భారత్ సర్కారు నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం కారణంగా కునారిల్లుతోంది. క్షేత్రస్థాయిలో అధికారులు ఈ కార్యక్రమాన్ని పట్టించుకోవడం లేదు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కూడా పూర్తిగా కొరవడింది. ఈ పథకానికి కేంద్రం, రాష్ర్ట ప్రభుత్వాల నుంచి కోట్ల రూపాయల నిధులు వెచ్చిస్తున్నా అవి నిరుపయోగంగా మారుతున్నాయి. అసలు వయోజనులకు అక్షరాస్యత కార్యక్రమం అనేది ఒకటి కొనసాగుతున్న విషయం గ్రామీణులకు తెలియదంటే అతిశయోక్తి కాదు. అయితే వయోజనులకు విద్య పేరుతో నోటు పుస్తకాలు, పేపర్లు, పెన్నులు, పెన్సిళ్ల కోసం కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు. ఒక్కో జిల్లాకు 6 నుంచి 8 కోట్ల వరకు వ్యయమవుతున్నాయి. ఇందులో కేంద్ర ప్రభుత్వం 75శాతం భరిస్తుండగా రాష్ర్ట ప్రభుత్వం 25శాతం ఖర్చు చేస్తున్నది. నెలకు రు.2వేలు గౌరవ వేతనం తీసుకుంటున్న వీసీవోలు వయోజనులకు అక్షరాలు నేర్పాల్సి ఉంటుంది. అయితే అసలు వారు గ్రామాలకు వెళుతున్న దాఖలాలే ఉండడం లేదు. వీరిని పర్యవేక్షించి సరిగా పనిచేయించాల్సిన ఎంసీఓలదీ అదే పరిస్థితి. వేల రూపాయల గౌరవవేతనాలు తీసుకుంటున్నా గ్రామీణ నిరక్షరాస్యులను పట్టించుకున్న పాపాన పోవడం లేదు. అన్ని గ్రామాలలోనూ ఇదే పరిస్థితి. 

No comments:

Post a Comment