16 May 2015

పెంచిన పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించండి

వైఎస్‌ఆర్‌సీపీ డిమాండ్
హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోలు, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. పెట్రో ఉత్పత్తులపై వ్యాట్ వల్ల నిత్యావసర సరుకులపై తీవ్ర ప్రభావం పడుతున్నదని, దానిని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు తక్షణం ఉపసంహరించుకోవాలని పార్టీ కోరింది. ‘‘అంతర్జాతీయంగా ముడి చమురు ధరలలో వస్తున్న మార్పుల ప్రకారం పెట్రో ఉత్పత్తుల ధరలు మారుతున్నాయి. అయితే అంతర్జాతీయంగా ముడి చమురు ధర బ్యారెల్‌కు 110 డాలర్ల నుంచి 48.63 డాలర్లకు పడిపోయినా అంతే స్థాయిలో తెలుగురాష్ట్రాలలో పెట్రో ఉత్పత్తుల ధరలు తగ్గలేదు’’ అని పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. ‘‘టీఆర్‌ఎస్, ఎన్డీయే సంకీర్ణ భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ, పెట్రో ధరల పెంపుపై నోరు మెదపడం లేదు.  పెట్రో ఉత్పత్తుల ధరలు పెరగడం వల్ల రవాణా చార్జీలు పెరుగుతాయి. దానివల్ల నిత్యావసర సరుకుల ధరలు కూడా పెరిగిపోతాయి. రెండు రాష్ట్రాలు ఇప్పటికైనా మౌనాన్ని వీడి కేంద్రం వద్ద తమ నిరసనను వ్యక్తం చేయాలి’’ అని పద్మ కోరారు. వ్యాట్, పెట్రో ఉత్పత్తుల ధరల పెంపు చాలా ఎక్కువగా ఉన్నాయని, వెంటనే వాటిని ఉపసంహరించాలని పద్మ డిమాండ్ చేశారు. రాహుల్‌గాంధీ రైతు ఓదార్పు యాత్ర గురించి మాట్లాడుతూ..‘‘ వైఎస్‌ఆర్ మరణం తర్వాత ఓదార్పు యాత్ర చేస్తుంటే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కాంగ్రెస్ పార్టీ అనుమతించలేదు. కానీ రాహుల్ గాంధీ ఇపుడు జగన్‌మోహన్ రెడ్డిని అనుసరిస్తున్నారు..’’ అని పద్మ పేర్కొన్నారు.

No comments:

Post a Comment