28 May 2015

ఎవరైనా చనిపోతేనే కొత్తవారికి పెన్షన్!

 బాబు జమానాలో ఇది మామూలే
 పింఛన్ కోసం నిరుపేదలు, వృద్ధులు, వికలాంగులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. కొత్త పింఛన్ల కోసం లక్షలాది మంది దరఖాస్తు చేసుకుంటున్నారు. అయితే కొత్తగా ఎవరికైనా పింఛన్ ఇవ్వాలంటే ప్రస్తుతం ఉన్న లబ్ధిదారుల్లో ఎవరైనా మృతి చెందితేనే కొత్తవారికి ఇవ్వాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు జిల్లాలకు ఆదేశాలు కూడా జారీ అయిపోయాయి.
  చంద్రబాబు సర్కారు నిర్ణయం వల్ల చాలామంది అర్హులకు అన్యాయం జరుగుతోంది. అర్హులందరికీ పింఛన్లు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం చివరకు చేతులెత్తేయడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం మండలంలో 1000 మంది అర్హులు పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వం 186 మందికి మాత్రమే పింఛన్ మంజూరు చేసింది. దాంతో మిగిలినవారందరూ ఉసూరుమంటున్నారు. జన్మభూమి, మండల కమిటీలు కొత్త పింఛన్‌దారులను ఎంపిక చేస్తున్నాయి. ఆ కమిటీలలో అధికారపార్టీ వారే ఉంటున్నారు. వారు తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులకు మాత్రమే అవకాశమిస్తున్నారు. దాంతో ఇతర పార్టీలకు ఓట్లేసిన వారు అనర్హులుగా సామాజిక పథకాలకు దూరంగా ఉండిపోవలసి వస్తున్నది.
  ఒకరు చనిపోతేనే కొత్తవారికి పింఛన్ అవకాశమివ్వాలన్న చంద్రబాబు నిర్ణయం  ఆశ్చర్యకరమైనదేమీ కాదు. కొత్తది అంతకన్నా కాదు. గతంలో తొమ్మిదేళ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఇదే విధానాన్ని అనుసరించారు. కొత్తగా ఎవరికైనా పింఛన్ ఇవ్వాలంటే ఉన్నవారిలో ఎవరైనా చనిపోవలసిందే. 1995-96లో వితంతు, వృద్ధాప్య పింఛన్ లబ్ధిదారుల సంఖ్య మొత్తం 9.68 లక్షలు. అపుడు వృద్ధులకు రు.75, వితంతువులకు రు.50 పింఛన్ ఉండేది. 2004లో చంద్రబాబు దిగిపోయే నాటికి రాష్ర్టంలో వృద్ధాప్య, వితంతు,చేనేత, వికలాంగ పింఛన్లు మొత్తం 18.97 లక్షల మంది ఉన్నారు. వీటికయ్యే మొత్తం ఖర్చు 163.90 కోట్లు. అప్పట్లో పింఛన్లు 3 నెలలకోమారు గ్రామసభల్లో ఇచ్చేవారు. కొత్త పెన్షన్ కావాలంటే ఉన్న పెన్షన్‌దారుల్లో ఎవరైనా ఒకరు మరణించాల్సిందే. దివంగత మహానేత రాజశేఖరరెడ్డి 2004లో అధికారం చేపట్టాక 2004లో రు.75 పింఛన్‌ను రు.100కు, రు.50 పింఛన్‌ను రు.75కు పెంచారు. 2005-06లో ఆ పింఛన్‌ను రు.200కు పెంచారు. 2006లో శాచురేషన్ పద్ధతిన పెన్షన్లను మంజూరు చేశారు. 21 లక్షలు ఉండే పెన్షన్లను 71 లక్షల వరకు పెంచారు. అంతేకాదు వైఎస్‌ఆర్ ప్రతినెల 1వ తేదీన ఠంచన్‌గా పెన్షన్ ఇప్పించారు.

No comments:

Post a Comment