22 May 2015

బాబు మోసాలపై సమరశంఖం

జూన్ 3,4 తేదీల్లో వైయస్ జగన్ నిరశన దీక్ష
గుంటూరుజిల్లా మంగళగిరి వేదిక
ఐదు అంశాలపై ప్రధానంగా దృష్టి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏడాది పాలన అంతా మోసాల మయం. ప్రతి వాగ్దానం మోసం. ప్రతి హామీ మోసం. రైతులను మోసం చేశాడు. ఆడపడుచులను మోసం చేశాడు. నిరుద్యోగులను మోసం చేశాడు. చివరకు పింఛన్ తీసుకునే వృద్ధులనూ వదిలిపెట్టలేదు. రాజధాని రైతుల వ్యథకు అంతేలేదు. మొత్తంగా రాష్ర్ట ప్రజలందరినీ వంచించాడు. ఏడాదిలోనే ఎంత వంచన... అంటూ ప్రజలు వాపోతున్నారు. మరో నాలుగేళ్లపాటు ఈ మోసాలను భరించాలా అంటూ వేదన చెందుతున్నారు. చంద్రబాబు మోసాలపై బాధ్యతగలిగిన ప్రతిపక్ష నాయకునిగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమరశంఖం పూరించారు. బాబు మోసాలను ఎండగడుతూ, నిరసిస్తూ జూన్ 3, 4 తేదీల్లో జగన్ మోహన్ రెడ్డి రెండు రోజుల నిరశన దీక్ష  చేపడుతున్నారు.

బాబు చేసిన మోసాలలో ప్రధానమైనవివీ.....
ప్రధానంగా 5 అంశాల మీద దృష్టి సారించి జగన్ దీక్ష చేస్తున్నారు. చంద్రబాబు చేసిన ఐదు మోసాలను ఎండగట్టడానికే ఈ దీక్ష ఉద్దేశించినది.
1) వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు రైతుల్ని మోసగించాడు.
2) డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తానని మహిళల్ని మోసగించాడు.
3) ఇంటికో ఉద్యోగం ఇస్తానని లేనిపక్షంలో రూ. 2000 నిరుద్యోగ భృతి ఇస్తానని నిరుద్యోగ యువతను మోసగించాడు.
4) రాజధాని పేరు చెప్పి భూములు బలవంతంగా లాక్కొని సింగపూర్ కంపెనీలకు కట్టబెట్టడానికి, తన బినామీలకు అప్పగించటానికి రైతుల్ని మోసగించాడు. 13 జిల్లాల్లో ఏకంగా 10 లక్షల ఎకరాలు భూమిని లాక్కుంటాం అని పారిశ్రామిక విధానాన్ని గత నెల ఆఖరు వారంలో బహిరంగంగా ప్రకటించి, ఇకమీదట రైతులకు మరింత అన్యాయం చేయబోతున్నానని వెల్లడించాడు.
5) రాష్ట్రానికి తానే ప్రత్యేక హోదా తీసుకువస్తానని, తాను నరేంద్ర మోడీ కలిసి కొత్త రాష్ట్రానికి దేశంలోనే మరే రాష్ట్రానికీ లేనంతగా నిధులు, పరిశ్రమలు, ప్రత్యేక హోదా, ఉద్యోగాలు తీసుకువస్తాం అని ఎన్నికల ముందు చెప్పి, ప్రకటనలు ఇచ్చి ఇప్పుడు ప్రత్యేక హోదా వల్ల పెద్దగా ప్రయోజనం లేదంటూ మొత్తంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసగించాడు.

300 వాగ్దానాలేమయ్యాయి?
చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు దాదాపు 300 వాగ్దానాలు చేశాడు. వాటిని ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందుపరిచాడు. అయితే అందులో ఒక్కటంటే ఒక్కటి నెరవేరలేదు. అలవికాని హామీలిస్తున్నారు... వాటిని అమలు చేయడం సాధ్యం కాని పని అని ఆనాడే విమర్శలు వచ్చాయి. వాటిపై ఎన్నికల కమిషన్ చంద్రబాబును వివరణ అడిగింది కూడా. అయితే తనకు అపారమైన అనుభవం ఉందని, హామీలన్నిటినీ అమలు చేయడానికి అవసరమైన వనరుల సమీకరణ వంటి వన్నీ తనకు తెలుసునని చంద్రబాబు ఎన్నికల కమిషన్‌కు వివరణ ఇచ్చాడు. అయితే ప్రజలను మోసం చేయడంలోనే చంద్రబాబుకు అనుభవం ఉన్నది తప్ప వాగ్దానాలను అమలు చేసే విషయంలో కాదని తేలిపోయింది.  చంద్రబాబు నాయుడు వంచన, మోసం, దగా, కుట్ర, వెన్నుపోటు వంటి అంశాల్లో మాత్రమే బాగా ఎక్స్‌పీరియన్స్ ఉన్న నాయకుడు అని ఈ ఏడాదిలోనే రుజువు అయింది. మరో నాలుగేళ్ళ పాటు ఇలాంటి పాలనని భరించాలా అని ప్రజలంతా అనుకుంటున్న సమయంలో ఆ ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా జగన్ ఈ దీక్షను చేపట్టబోతున్నారు.

మోసాలు, వంచనలే ఏడాది పాలన...
 వ్యవసాయ రుణాలు మాఫీ కాలేదు. రూ. 10 వేల కోట్ల మేరకు ఈ ఏడాది కాలంలోనే పెరిగాయి. రుణ మాఫీ జరిగితే రుణాలు ఎలా పెరిగాయి? కొత్త రుణాలు రైతులకు అందనేలేదుగదా? రుణ మాఫీ ఎవరికి అందింది? మొత్తంగా రుణాలు మాఫీ చేస్తానన్న చంద్రబాబు ఈ ఏడాదిలో ఎన్ని ప్లేట్లు ఫిరాయించారు? అలాగే డ్వాక్రా రుణాలు ఒక్క రూపాయి కూడా ఈరోజుకూ ఎందుకు మాఫీ కాలేదు? డ్వాక్రా సంఘాలు సగానికి సగం చంద్రబాబు గారి దెబ్బకు మూతపడ్డాయి. రాజధాని పేరిట అత్యంత దుర్మార్గంగా రైతుల నుంచి భూములు లాక్కుంటున్నారు. ఇలా మోసాలు, వంచనలు తప్ప మంచి పనులు చేసిందెక్కడ?

ప్రజలకు ఒక్క ఇల్లన్నా కట్టి ఇచ్చారా?
 తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే పత్రికల్లోనే రాస్తున్నారు. ఇళ్ళ కోసం, ఇళ్ళ స్థలాల కోసం, రేషన్ కార్డుల కోసం ప్రజలు పడిగాపులు పడుతున్నారు. మొత్తంగా 61 లక్షల మందికి రేషన్ కార్డులు, ఇళ్ళు, స్థలాలు అందక అర్జీలు పెట్టుకున్నారని చెబుతున్నారు. సీమాంధ్రలో ఈ ఏడాది కాలంలో ఒక్కటంటే ఒక్క ఇల్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయలేదు. నిధులు ఇవ్వలేదు. నిర్మాణాల్లో ఉన్న పాత ఇళ్ళను కూడా ఆపేశారు. మరి ఈ ఏడాది కాలంలో గృహ నిర్మాణానికి చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకోలేదా అంటే తీసుకున్నారు. కాకపోతే అది ప్రజల గృహ నిర్మాణానికి కాదు. తన గృహ నిర్మాణానికి. అదికూడా సీమాంధ్రలో ముఖ్యమంత్రిగా ఉంటూ హైదరాబాద్‌లో తన ఇంటికి శంఖుస్థాపన చేశారంటే చంద్రబాబు గారి మనస్తత్వాన్ని ఎవరైనా అర్థం చేసుకోవచ్చు.

పారిశ్రామికవేత్తల రుణాల మాఫీ
 చేస్తానన్న రుణాల మాఫీ రైతులకు, డ్వాక్రా మహిళలకు అయితే చేసిన రుణ మాఫీ ఎవరిది అంటే దాదాపు రూ. 2600 కోట్ల మేరకు పారిశ్రామిక వేత్తలకు రుణాలు మాఫీ చేశారు. ప్రధానంగా తనకు కావాల్సిన వారి నుంచి దాదాపు 30 శాతం ముడుపులు పుచ్చుకుని ఒక డీల్‌లో భాగంగా ఈ రుణ మాఫీ చేశారు. వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తే, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తే చంద్రబాబు గారి జేబులోకి వచ్చేదేమీ ఉండదు. అదే పారిశ్రామికవేత్తలకు మాఫీ చేస్తే... తాను మేనిఫెస్టోలో రాయకపోయినా, వాగ్దానం చేయకపోయినా తన జేబు నిండుతుంది కాబట్టి పారిశ్రామికవేత్తల రుణాలు మాఫీ చేశారు.

బాబు జేబునింపే పట్టిసీమ
 మిత్రపక్షమైన బీజేపీ మీద ఒత్తిడి తీసుకువచ్చి తెలుగుదేశం పభుత్వం పోలవరం ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం చేత కట్టిస్తే చంద్రబాబు గారి జేబులోకి వచ్చేదేమీ ఉండదు. అదే పట్టిసీమ ప్రాజెక్టు కడితే పొలాల్లోకి నీరు వచ్చినా రాకపోయినా చంద్రబాబు నాయుడు గారి జేబులు మాత్రం దండిగా నిండుతాయి. ఇలాంటి వంచనలు, మోసాలు రోజుకొకటి బయటకు వస్తున్న సమయం ఇది. గత ఏడాది కాలంలో టీడీపీ విఫలమైంది అని చెప్పే కన్నా ఘోరంగా వంచించింది, మోసగించిందీ అని చెప్పటమే కరెక్టు. ఏడాదిలోగానే బోర్డు తిప్పేసే పరిస్థితి వచ్చింది కాబట్టే రోజుకు నలుగురు ఐదుగురు మంత్రులకు ఆదేశాలు ఇచ్చి జగన్‌ను తిట్టించే కార్యక్రమం చేస్తున్నాడు.

No comments:

Post a Comment