27 May 2015

అక్కచెల్లెమ్మలకు మాఫీ టోపీ

‘‘రుణాలు చెల్లించకండి.. మేం అధికారంలోకి రాగానే అన్నీ మాఫీ చేసేస్తాం’’ అంటూ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఊరూవాడా ఊదరగొట్టారు. ఆ మాటలు నమ్మిన అక్కచెల్లెమ్మలు ఓట్లేసి అధికారాన్ని కట్టబెట్టారు. చంద్రబాబు గద్దెనెక్కి ఏడాది పూర్తయింది. రుణమాఫీ చేస్తారని, దాంతో తమ బతుకులు బాగుపడతాయని మహిళలు ఆశగా ఎదురుచూశారు. బేషరతుగా డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తానన్న మాటలు నీటి మూటలయ్యాయి. మాఫీ హామీని అమలు చేయకపోగా డ్వాక్రా సంఘాలలోని ఒక్కో సభ్యురాలికి మూడువిడతలుగా రు. 3 వేల చొప్పున మూల నిధికి జమ చేస్తామని చంద్రబాబు చెబుతున్నారు. అంటే ఇది రుణమాఫీ కోసం ఇస్తున్నది కాదు. దానిని డ్వాక్రా సంఘాలు ఉపయోగించుకోవడానికి లేదు.  ఇచ్చేది మూలధనం కిందే అయినా రుణాలన్నీ మాఫీ చేసేస్తున్నామంటూ తమను చంద్రబాబు నిలువునా దగా చేశారని మహిళలు దుమ్మెత్తి పోస్తున్నారు. రుణమాఫీతో సంబంధం లేకుండా బకాయిలున్నా లేకున్నా 2014 మార్చి 31 వరకు ఉన్న సంఘాల్లోని సభ్యులందరికీ రు.3వేల చొప్పున ఖాతాలో వేస్తామని ప్రభుత్వం చెబుతోంది. దీనివల్ల తమకు ఎలాంటి ప్రయోజనమూ లేదని, బ్యాంకులకు మాత్రమే ఉపయోగమని మహిళలు మండిపడుతున్నారు. చంద్రబాబును నమ్ముకున్నందుకు తమకు తగిన శాస్తి జరిగిందని మహిళలు తమను తామే తిట్టుకుంటున్నారు. మాఫీపై తమ ఆశలు ఆవిరైపోయాయని వారు ఆవేదన చెందుతున్నారు. బాబు గద్దెనెక్కాక బకాయిలు చెల్లించాలంటూ బ్యాంకర్లు తెచ్చిన ఒత్తిళ్లు భరించలేక మహిళలు అప్పో సప్పో చేసి తమ బకాయిలు మూడొంతులకు పైగా తిరిగి కట్టేశారు. తమ బకాయిలతో పోలిస్తే బాబుగారు చెబుతున్న మూడువిడతల ముల్లె ఏ మూలకు వస్తుందని మహిళలు వాపోతున్నారు. అయినా ఈ మూడువిడతల వ్యవహారాన్ని కూడా డ్వాక్రా మహిళలు విశ్వసించలేకపోతున్నారు. దానికి చంద్రబాబు ప్రభుత్వ వ్యవహార శైలే కారణం. అధికారంలోకి రాగానే అణాపైసలతో సహా డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తామని అన్నారు. తీరా అందలమెక్కాక రు. 10 వేలు రివాల్వింగ్ ఫండ్ ఇస్తామని నమ్మబలికారు. ఏడాది కాలంగా నాన్చుతూ చివరకు తొలి విడత రు. 3 వేల చొప్పున ప్రకటించిన చంద్రబాబు సర్కార్ ఆ మొత్తాన్ని జమ చేసేందుకు సవాలక్ష నిబంధనలు పెట్టింది. ఆధార్‌తో ఖాతాలు అనుసంధానించి ఉండాలి. క్రమం తప్పకుండా రుణాలు తిరిగి చెల్లిస్తూ ఉండాలి. అసలు వారు బతికి ఉన్నట్లు నిరూపించుకోవాలి... ఈ షరతులన్నీ నెరవేర్చితేనే రు.10వేలు మూడు విడతలుగా మూలధన ఖాతాకు జమ అవుతాయి. అంటే బాబుగారు డ్వాక్రా రుణాలు మాఫీ చేయలేదు.... సరికదా... అక్కచెల్లెమ్మలందరికీ కుచ్చుటోపీ పెట్టారన్నమాట....

No comments:

Post a Comment