9 May 2015

ఆర్టీసీ సమ్మెపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలకు జగన్ బహిరంగ లేఖ

ఆర్టీసీ సమ్మె కారణంగా కోట్లాదిమంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను సామరస్య పూర్వకంగా పరిష్కరించడం ద్వారా సమ్మెకు వెంటనే స్వస్తి పలకాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు రెండు రాష్ర్ట ప్రభుత్వాలకు ఆయన బహిరంగ లేఖ రాశారు. లేఖ పూర్తి పాఠం ఇలా ఉంది....

ఆర్టీసీ సమ్మెను విరమింపజేసే విధంగా నేరుగా కార్మిక సంఘాలతో తక్షణం చర్చలు జరిపి సమస్యను సామరస్య వాతావరణంలో పరిష్కరించాలని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరుతున్నా. కార్మికుల మీద ప్రభుత్వం కక్షసాధింపు చర్యలను, రెచ్చగొట్టే ప్రకటనలను, పోలీసు చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నా. ఆర్టీసీ కార్మికులు సమ్మె వరకు రావటంలో నాలుగు రోజులుగా సమ్మె కొనసాగటంలో తమ పాత్రను గుర్తించాల్సిందిగా ఇరువురు ముఖ్యమంత్రులకూ విజ్ఞప్తి చేస్తున్నాను. నాయకులు గతంలో ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటే ఈ పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదు. ఆ ప్రయత్నం చేయకపోవటం వల్లే రెండు రాష్ట్రాల్లో ఆర్టీసీ కార్మికులు ఆందోళన బాట పట్టారన్న నిజాన్ని మా పార్టీ గుర్తిస్తోంది. ఈ విషయంలో ఆర్టీసీ కార్మికుల ఆందోళనకు నా పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాను. ఆర్టీసీ కార్మికుల న్యాయబద్ధమైన డిమాండ్లకు మద్దతుగా శాంతియుతమైన వారి ప్రత్యక్ష కార్యాచరణలో వైఎస్సార్ కాంగ్రెస్ భాగం పంచుకుంటుంది. అలా భాగం పంచుకోవాల్సిందిగా పార్టీ శ్రేణులకు పిలుపునిస్తున్నాను.

2014 ఏప్రిల్ 6న శ్రీ చంద్రబాబునాయుడు స్వయంగా ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి. ప్రభుత్వోద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తాం అని ఇచ్చిన హామీని కూడా ఆయన నిలబెట్టుకోవాలి. ఆర్టీసీ నష్టాలకు తన బాధ్యత ఎంత ఉందో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుర్తించాలి. కేవలం ప్రైవేటు వాహనాల కారణంగా ఏపీఎస్‌ఆర్‌టీసీకి ఏటా రు.1000 కోట్లకు పైగా నష్టం వాటిల్లుతోందని తెలిసినా వారిని ఎందుకు ప్రోత్సహిస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలి. డీజిల్ మీద వ్యాట్ రూపంలోనే ఆర్టీసీ ఏడాదికి రు.541 కోట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెల్లించాల్సిన పరిస్థితి. అలాగే, విడి భాగాల కొనుగోలు మీద చెల్లించేది మరో రు. 150 కోట్లు. వ్యాట్ భారాన్ని ఏపీ రాష్ర్ట ప్రభుత్వం రద్దు చేస్తే ఆర్టీసీ దర్జాగా బతుకుతుందని తెలిసినా చంద్రబాబు నాయుడుగారు ఆ పని ఎందుకు చేయటం లేదో ప్రజలకు చెప్పాలి. వ్యాట్‌ను రద్దు చేసి, ప్రైవేటు రవాణాను అరికట్టగలిగితే ఆర్టీసీ కార్మికులు అడుగుతున్న జీతాలు ఇవ్వటం పెద్ద సమస్య కాదని ప్రజలందరికీ అర్ధమౌతోంది. అలాగే, తెలంగాణ ప్రభుత్వం కూడా డీజిల్ మీద వ్యాట్‌పై వెంటనే వెనక్కు తగ్గాలి.

దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అతి గొప్ప ప్రజా రవాణా వ్యవస్థల్లో ఒకటిగా పేరు తెచ్చుకున్న మన ఆర్టీసీని ప్రైవేటీకరించే ఎత్తుగడలకు ప్రభుత్వాలు స్వస్తి పలకాలి. సమ్మె కారణంగా కోట్లాది ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్ర ఇబ్బందులకు ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను సామరస్య పూర్వకంగా పరిష్కరించడం ద్వారా వెంటనే స్వస్తి పలకాల్సిందిగా మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను.

No comments:

Post a Comment