25 May 2015

ఓటు వేసిన వారికే ముఖ్యమంత్రా!?

కర్నూలు జిల్లాలో ఫ్యాక్షనిజం ఉందని అక్కడ టీడీపీ నేతలు అభిప్రాయపడ్డారట. ఫ్యాక్షనిజానికి నిర్వచనం ఏమిటో ఒక్కసారి డిక్షనరీలో చూడండి. అధికారాన్ని చేతులో పెట్టుకుని రాజకీయంగా బెదిరించి, భయపెట్టి పబ్బం గడుపుకోవడమే సిసలైన ఫ్యాక్షనిజం.
  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు చేసిన ప్రకటనను చూస్తే ఫ్యాక్షనిజం ఎక్కడ ఉందో ఈ రాష్ట్ర ప్రజలు తమకు తామే నిర్ణయించుకోవచ్చు. తమకు ఓటు వేయని జిల్లాల అభివృద్ధికి నిధులు ఇవ్వం... అని ముఖ్యమంత్రే పరోక్షంగా చెబుతున్నారు. తమకు అనుకూలంగా ఓటు వేసిన ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం అని అప్పుడే తమ అభ్యర్థుల్ని ఓడించిన వారికి తెలిసి వస్తుందని ముఖ్యమంత్రే వ్యాఖ్యానించారంటే- ఆయన ముఖ్యమంత్రా..? లేక ఫ్యాక్షనిస్టా అన్నది ఈ రాష్ట్ర ప్రజలంతా తేల్చుకోవాలి.
  అదీగాక తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గాన్ని, తన సొంత జిల్లా చిత్తూరునే తాను అధికారంలో ఉన్న 9 ఏళ్ళలో అభివృద్ధి చేయలేక చతికిలపడిన చంద్రబాబు ఇప్పుడేదో తనకు ఓటు వేసిన ప్రాంతాలు, ఓటు వేయని ప్రాంతాలు అని మాట్లాడటం విడ్డూరంగా ఉంది.  అదీగాక తాను తనకు ఓటు వేసిన వారికి మాత్రమే ముఖ్యమంత్రినని చంద్రబాబు గారు అధికారికంగా ఒక జీవో ఇస్తే మరీ బాగుంటుంది. అలాంటి ఆలోచన ఏదైనా చేయండి చంద్రబాబు గారూ. రాజకీయ విభేదాలను ఎన్నికలు అయిన మరనాడే పక్కనబెట్టి రాష్ట్రాభివృద్ధికి పనిచేసే వాడు మహానేత అవుతాడు. ఎన్నికలు అయి ఏడాది అయినా తన పేరిట ఒక్క స్కీము కూడా ప్రవేశపెట్టుకోలేక, చెప్పిన వాగ్దానాలను అమలు చేయలేక ఇప్పటికి కూడా నా పార్టీ... నీ పార్టీ అంటూ మాట్లాడే వ్యక్తి సీఎం అయినా, ఇంకెవరైనా మహానేత కాలేడు, ప్రజా నేత కాలేడు. మరుగుజ్జే అవుతాడు. 

No comments:

Post a Comment