28 May 2015

జాబులెక్కడ బాబూ...

ఏడాది పాలనలో ఒక్క ఉద్యోగమూ లేదు 
 ఇంటికో ఉద్యోగమన్నారు... ఉద్యోగం లేకపోతే నెలకు రెండువేల రూపాయల భృతి ఇస్తామన్నారు. జాబు కావాలంటే బాబు రావాలని ఊరూవాడా ఊదరగొట్టారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని, అది తమ ప్రధమ ప్రాధాన్యత అని ఎక్కడ బడితే అక్కడ పెద్దపెద్ద హోర్డింగ్‌లు, బ్యానర్లు, గోడలపై రాతలు రాయించారు. ఎన్నికలు ముగిసి పీఠం దక్కగానే అన్ని హామీలను కట్టకట్టి అటకపై పడేశారు. కొత్త ఉద్యోగాలివ్వక పోగా ఉన్న ఉద్యోగాలనే ఊడబీకుతున్నారు. ఏడాది ఏలుబడిలో ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ మినహా ఎలాంటి ఉద్యోగ ప్రకటనా లేదు. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవడం చంద్రబాబుకు కొత్తేమీ కాదు. గత తొమ్మిదేళ్ల పాలనలో నిరుద్యోగులకు, చిరుద్యోగులకు ఆయన నరకం చూపించారు.
  నిరుద్యోగులు ఉద్యోగ నోటిఫికేషన్ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. విడుదలైన ఒకేఒక్క నోటిఫికేషన్ డీఎస్సీ ఉద్యోగాల భర్తీది. అయితే అందులో బీఈడీ అభ్యర్థులకు అర్హత లేకపోవడం నిరుద్యోగులను తీవ్రంగా నిరాశపరిచింది. డీఎస్సీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులను అర్హులుగా చేస్తామని ఎన్నికలముందు చంద్రబాబు అనేకమార్లు హామీ ఇచ్చారు. ఎన్నికల తర్వాత ఆ విషయమే మరిచిపోయారు. గడువు ముగిసిపోయే వరకు తాత్సారం చేసి ఆ తర్వాత నెపం కేంద్రంపై నెట్టివేశారు. ఎన్‌సీఈఆర్‌టీ అడ్డుచెబుతోందని కబుర్లు చెబుతున్నా పశ్చిమబెంగాల్ వంటి రాష్ట్రాలు పోరాడి సాధించుకున్నాయి. అలాంటి ప్రయత్నమేదీ చంద్రబాబు సర్కారు చేసిన పాపాన పోలేదు. నిరుద్యోగుల విషయంలో చంద్రబాబు నిర్లక్ష్య వైఖరికి ఇదో నిదర్శనం.
  పోలీసు కానిస్టేబుల్, ఎస్‌ఐ, గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్ - 4 పరీక్షలకు నిరుద్యోగులు ముమ్మరంగా సన్నద్ధమవుతున్నారు. కానీ ఏడాది కాలంగా ఒక్క నోటిఫికేషన్ కూడా లేకపోవడంతో నిరుద్యోగుల్లో అనుమానాలు మొదలయ్యాయి. చంద్రబాబు మునుపటిలా మరలా మోసం చేస్తారా అని వారిలో గుబులు రేగుతోంది. వేలకు వేలు ఖర్చు చేసి కోచింగ్ తీసుకని నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది నిరుద్యోగులు ఆందోళనతో ఉన్నారు.
  {పభుత్వ ఉద్యోగాల ఊసే లేదు. కనీసం ఔట్ సోర్సింగ్ ఉద్యోగమైనా దక్కుతుందా అని నిరుద్యోగులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. ఉన్నత చదువులు చదివినా ప్రయోజనం ఏమిటంటూ యువత నిరుత్సాహంలో కూరుకుపోతోంది. పశ్చిమగోదావరి జిల్లాలో 58,300 మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఉపాథి కార్యాలయంలో పేర్లు నమోదుచేసుకున్నారు. ఇంకా ఉపాథి కార్యాలయాల్లో పేర్లు నమోదుచేయించుకోని నిరుద్యోగుల సంఖ్య ఇంకా భారీగానే ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. కర్నూలు జిల్లాలో 8లక్షలకు పైగానే నిరుద్యోగులున్నారు. ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్ఛేంజిలలో 92 వేల మంది నిరుద్యోగులు పేర్లను నమోదు చేసుకున్నారు. ఇటీవల రాష్ర్టప్రభుత్వం జన్మభూమి కమిటీల ద్వారా చేయించిన సర్వేలో నిరుద్యోగుల సంఖ్య 1,03,000 మందిగా తేలింది. వీరంతా రకరకాల పరీక్షలకు ప్రిపేరవుతున్నారు. కానీ రాష్ర్ట ప్రభుత్వమే ఉద్యోగాల భర్తీకి ఎలాంటి నోటిఫికేషనూ విడుదల చేయడం లేదు.
  ఉద్యోగాల మాట దేవుడెరుగు... చంద్రబాబు ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్లుగా కనీసం తమకు నిరుద్యోగ భృతి అయినా ఇప్పించాలని నిరుద్యోగులు కోరుతున్నారు.

No comments:

Post a Comment