14 May 2016

ప్రాజెక్టుల మీద బహిరంగ చర్చకు సిద్ధమా

  • టీడీపీ వి చిల్లర రాజకీయాలు అని బీజేపీ యే చెప్పింది
  • ఏరోజూ చంద్రబాబు ప్రత్యేక హోదా ఇవ్వమని అడగలేదు
  • టీడీపీ తీరుని ఎండగట్టిన అధికార ప్రతినిధి అంబటి రాంబాబు

హైదరాబాద్: ప్రత్యేక హోదా, సాగునీటి ప్రాజెక్టుల విషయంలో చంద్రబాబు ప్రభుత్వ  నిర్తిప్తత, నిర్లక్ష్య వైఖరి మీద బహిరంగ చర్చకు రావాలని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు సవాల్ విసిరారు. ప్రాజెక్టుల మీద, ప్రత్యేక హోదా మీద పోరాడుతున్న వైయస్సార్సీపీ కి వెనుపోటు పొడుస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ లోటస్ పాండ్ లోని కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
        తెలుగుదేశం పార్టీవి చిల్లర రాజకీయాలు అని బీజేపీ తేల్చి చెప్పినప్పటికీ, టీడీపీ లో చలనం లేదని అంబటి మండిపడ్డారు. అయినప్పటికీ ప్రభుత్వంలో  ఏ విధంగా కొనసాగుతోందో తెలియటం లేదని ఆయన అన్నారు. బహుశా కేసుల బండారం బయట పడుతుందనే టీడీపీ మౌనం పాటిస్తోందని ఎద్దేవా చేశారు. ఒక లక్షా 40వేల కోట్ల రూపాయిలు కేంద్రం నుంచి సాయంగా అందిందని బీజేపీ చెబుతుంటే అ డబ్బంతా ఎక్కడకి పోయిందని అంబటి ప్రశ్నించారు. పప్పు, బెల్లాల కింద పంచేసుకొన్నారని వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని విజయవాడ నడిబొడ్డున బీజేపీ చెప్పేసిందని, మరి ఇప్పుడు టీడీపీ వైఖరి ఏమిటని ప్రశ్నించారు. పైగా చంద్రబాబునాయుడు ఇప్పటిదాకా ప్రత్యేక హోదా గురించి ప్రశ్నించలేదని మండిపడ్డారు. అయినప్పటికీ చంద్రబాబు ఎందుకు నాటకాలు ఆడుతున్నారని ఆయన నిలదీశారు. శంకుస్థాపన, ప్రారంభోత్సవాల సమయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉన్న వేదిక మీద కూడా ప్రత్యేక ప్యాకేజీని అడిగారు తప్పితే హోదా గురించి బాబు ప్రశ్నించలేదని, అదేమంటే మరిచిపోయానని బుకాయించారని పేర్కొన్నారు.
        ఇది తప్పని ప్రతిపక్షనాయకుడు వైయస్ జగన్ ఎలుగెత్తి పోరాటం చేస్తుంటే చంద్రబాబు నాయుడు, ఆయన అనుచరులు అడ్డుకొనేందుకు ఆరోపణలు చేస్తున్నారని అంబటి మండిపడ్డారు. ఇది ధర్మమా అని ఆయన నిలదీశారు. కేంద్రం మీద, పక్క రాష్ట్రం మీద పోరాడటం లేదని టీడీపీ ని ఆయన తప్పు పట్టారు. కానీ వైయస్సార్సీపీ పోరాడుతుంటే మద్దతిచ్చేందుకు బదులుగా వెన్నుపోటు పొడుస్తున్నారని ఆయన చెప్పారు. ఇది తమ పార్టీకి వెన్నుపోటు కాదని, తెలుగు ప్రజలు అందరికీ వెన్నుపోటు అని అంబటి అభివర్ణించారు.   తెలంగాణ ప్రాంతంలో వరుస పెట్టి నీటి ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాలు నిర్మిస్తున్నారని, అవన్నీ పూర్తయితే.. దిగువ ప్రాంతాలు ఎండిపోతాయని, వాటిని అడ్డుకొనేందుకు శక్తివంచన లేకుండా వైయస్సార్సీపీ పోరాడుతోందని ఆయన వెల్లడించారు. ఈ పోరాటంలో కూడా చౌకబారు ఆరోపణలు చేస్తున్నారని మంత్రులు దేవినేని ఉమ, కేఈ, ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీద మండిపడ్డారు. ప్రత్యేక హోదా, ప్రాజెక్టుల విషయంలో టీడీపీ అలసత్వం మీద బహిరంగ చర్చకు రావాలని ఆయన సవాల్ విసిరారు.
        పార్టీ మారిన ఎమ్మెల్యేలు ముందుగా పదవులకు రాజీనామా చేయాలని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు చెప్పటాన్ని అంబటి స్వాగతించారు. అదే విషయాన్ని చంద్రబాబుకి చెబితే బాగుంటుందని హితవు పలికారు. లేదంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఎటువంటి పరిస్థితి తలెత్తుతుందో ఉత్తరాఖండ్ ఎపిసోడ్ చూస్తేనే అర్థం అవుతుందని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఈ విషయం గమనించాలని సూచించారు. 

No comments:

Post a Comment