3 May 2016

కేసీఆర్ కాళ్ల వద్ద రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టింది ఎవరు

  • ఐదు కోట్ల ఆంధ్రుల గొంతుకోస్తున్న చంద్రబాబు
  • ప్రాజెక్ట్ లను అడ్డుకోకుండా సన్నాయి నొక్కులు
  • టీఆర్ఎస్ కు అనుకూలంగా పనిచేస్తున్న చంద్రబాబు
  • టీడీపీ సర్కార్ పై ధ్వజమెత్తిన భూమన
హైదరాబాద్ః ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు కేసీఆర్ కు లొంగిపోయి...ఐదు కోట్ల ఆంధ్రుల గొంతు కోస్తున్నాడని  వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. ఏపీ ప్రజలకు నష్టం జరిగేలా  కేసీఆర్ ప్రాజెక్ట్ లు కడుతుంటే....దాన్ని ప్రతిఘటించకుండా బాబు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని ధ్వజమెత్తారు. పాలమూరు-రంగారెడ్డి-డిండి ప్రాజెక్ట్ లను అడ్డుకోవాల్సింది పోయి...అనుమతులు తీసుకొని కట్టుకోవాలంటూ బాబు మాట్లాడడం దుర్మార్గమన్నారు. అలా కట్టుకుంటే మాకు ఏ నష్టమూ లేదన్న విధంగా బాబు వ్యవహరించడం దారుణమన్నారు. హైదరాబాద్ లో పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో భూమన మాట్లాడారు. 

చంద్రబాబు టీఆర్ఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా  పనిచేస్తూ...ఏపీ ప్రజల ప్రయోజనాలను పణంగా పెట్టారని భూమన ఆగ్రహించారు. ఏపీకి జరుగుతున్న అన్యాయంపై పోరాడేందుకు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కర్నూలులో ఈనెల 16 నుంచి మూడ్రోజుల పాటు దీక్ష చేపడుతున్నట్లు పేర్కొన్నారు. వైఎస్ జగన్ దీక్ష ప్రకటన చేసేవరకు కూడా బాబు తెలంగాణ కడుతున్న ప్రాజెక్ట్ లపై గానీ, కేసీఆర్ పై గానీ మాట కూడా మాట్లాడకపోవడం ఘోరమన్నారు. వైఎస్ జగన్ దీక్షతో ఆయనపై ప్రజల్లో ఆదరాభిమానాలు పెరుగుతాయనే బాబు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని భూమన ఫైరయ్యారు. 

ఏపీ, తెలంగాణలో కొత్తగా ప్రాజెక్ట్ లు కట్టాలంటే జలవనరుల శాఖ అనుమతులుండాలని, కానీ తెలంగాణ ప్రభుత్వం అవేమీ పట్టించుకోవడం లేదని భూమన విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న జలదోపిడీకి బాబు వంత పాడడం క్షమించరాని నేరమని నిప్పులు చెరిగారు. పోలవరాన్ని వదిలి పట్టిసీమను కట్టడంతోనే చంద్రబాబు కేసీఆర్ కు లొంగిపోయిన విషయం తేటతెల్లమయ్యిందన్నారు.  రాష్ట్రాన్నిఎడారి చేసుకునే పరిస్థితులో తాము లేమని, కచ్చితంగా అక్రమ కట్టడాలను నిలువరించే ప్రయత్నం చేస్తామన్నారు. ప్రజల ప్రయోజనాలే తమకు ముఖ్యమని భూమన తేల్చిచెప్పారు. ప్రజల తరపున పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు. భవిష్యత్తులో కూడా వైఎస్సార్సీపీ అనేక విధాలుగా పోరాటాల ఉధృతి కొనసాగిస్తుందని చెప్పారు. 

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోళ్లు చేసి... పార్టీని నిర్వీర్యం చేయడం ద్వారా ఏపీ ప్రజల ప్రయోజనాల్ని తాకట్టుపెట్టాలని చంద్రబాబు చూస్తున్నారని భూమన ఫైరయ్యారు. కొద్దిమంది ఎమ్మెల్యేలు పోయినంత మాత్రాన ప్రతిపక్షం బలహీనమవుతుందనుకోవడం భ్రమేనని టీడీపీని హెచ్చరించారు. కరవుపై ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా చేపట్టిన ధర్నాలో... మాచర్లలో 47 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నా 27వేల మందికి పైగా ప్రజలు పాల్గొన్నారంటే  వైఎస్ జగన్ మీద ఎంత ప్రజాభిమానం ఉందో అర్థమవుతోందన్నారు. తమ ప్రయోజనాలకు భంగం కలిగించే ఏ చర్యనైనా ప్రతిఘటిస్తామని భూమన స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఆగడాలను చూస్తూ ఊరుకోబోమన్నారు.  అమ్ముడుపోయిన ఎమ్మెల్యేల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. ప్రజల ప్రయోజనాలు ఛిన్నాభిన్నం గాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, కానీ చంద్రబాబు కేసీఆర్ కాళ్లు పట్టుకొని రాష్ట్ర ప్రజల హక్కులు కాలరాస్తున్నారని దుయ్యబట్టారు. 

No comments:

Post a Comment