14 May 2016

స్వప్రయోజనాలు తప్ప ప్రజల బాధలు పట్టవా

  • ఏపీని ఎడారిగా మార్చదల్చుకున్నావా బాబు
  • అక్రమ కట్టడాలను ఎందుకు అడ్డుకోవడం లేదు
  • మీ స్వార్థం కోసం పోలవరాన్ని పక్కనబెడతారా
  • ప్రభుత్వం కళ్లుతెరిపించేలా జననేత జలదీక్ష
హైదరాబాద్ః చంద్రబాబు రాష్ట్రాన్ని ఎడారిగా మారుస్తున్నారని వైయస్సార్సీపీ అధికార  ప్రతినిధి వేణుగోపాలకృష్ణ మండిపడ్డారు. ఏపీకి నష్టం చేకూరేలా తెలంగాణ నిర్మిస్తున్న అనుమతుల్లేని అక్రమ కట్టడాలను... బాబు ఎందుకు అడ్డుకోవడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబును చరిత్ర క్షమించదని హెచ్చరించారు. నదీజలాలను పరిరక్షించడంలో టీడీపీ ప్రభుత్వం చూపుతున్న అలసత్వానికి నిరసనగా కర్నూలు కేంద్రంగా వైయస్ జగన్ ఈనెల 16 నుంచి మూడ్రోజుల పాటు జలదీక్ష చేపడుతున్నట్లు గోపాలకృష్ణ తెలిపారు.  నీటికోసం ఆలోచన చేసే ప్రతి పౌరుడు వైయస్ జగన్ దీక్షకు మద్దతుగా నిలవాలన్నారు. ప్రభుత్వం కళ్లుతెరిపించేలా జననేత జలదీక్షకు సంఘీభావంగా అన్ని మండల కేంద్రాల్లో ఈనెల 17న నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. 

తాగునీటి కోసం ప్రజలు అల్లాడుతుంటే ముఖ్యమంత్రి సేదతీరడం కోసం విహారయాత్రలకు వెళ్లడం దారుణమన్నారు. ప్రజలు కష్టాల్లో ఉండాలి. మీరు మాత్రం సుఖంగా ఉండాలా బాబు అంటూ వేణుగోపాలకృష్ణ మండిపడ్డారు. బాబు ఎంతసేపు తనకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తున్నారు తప్ప ప్రజల బాధలే పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలను లాక్కోవడంపైన ఉన్న శ్రద్ధ బాబుకు ప్రజల అవసరాల్ని తీర్చడంలో లేదని దుయ్యబట్టారు. విభజన నేపథ్యంలో రాష్ట్ర హక్కులన్నీ సాధిస్తారని ప్రజలు ఓట్లు వేస్తే...ఈరెండేళ్ల కాలంలో ఏ ఒక్కటి అమలు చేయకపోగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలను నిర్వీర్యం చేయాలన్న కుట్రలు చేస్తున్నాడని ధ్వజమెత్తారు. 

చంద్రబాబు  రైతుల ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారని, ఐదుకోట్ల ఆంధ్రుల ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని వేణుగోపాలకృష్ణ విరుచుకుపడ్డారు. పరివాహక రివర్ బోర్డు, అథెక్స్ కమిటీ అనుమతులు లేకుండా తెలంగాణ  ప్రభుత్వం ప్రాజెక్ట్ లు కడుతుంటే బాబు ఏం చేస్తున్నారని నిలదీశారు. వైయస్ జగన్ జలదీక్ష చేస్తున్నారని తెలియగానే అప్పుడు కేంద్రానికి ఉత్తరం రాశారు.  అసలు మీ ఆలోచన విధానమేంటి..? రాష్ట్రాన్ని ఎడారిగా మార్చదల్చరా అంటూ టీడీపీపై నిప్పులు చెరిగారు. భవిష్యత్తులో తాగు, సాగునీరు కలలో చూసే మాదిరిగా చేస్తున్న బాబు ప్రయత్నానికి నిరసనగా వైయస్ జగన్ జలదీక్ష చేపడుతున్నట్లు వేణుగోపాల కృష్ణ చెప్పారు.  రాష్ట్ర ప్రజల ప్రయోజనాల పరిరక్షణ కోసం.... వైయస్ జగన్ ప్రతిసారి నిద్ర పోతున్నట్లు నటిస్తున్న ప్రభుత్వాన్ని మేలుకొల్పడంలో ప్రముఖ భూమిక పోషిస్తున్నారని చెప్పారు. 13 జిల్లాల్లో ప్రతిమనిషికి తాగునీరు, ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలన్నదే వైయస్ జగన్ ముఖ్యఉద్దేశ్యమని చెప్పారు. 
 
మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి ముందుచూపుతో పోలవరాన్ని చేపట్టి కాల్వలు పూర్తి చేసిన తరుణంలో కేంద్రం దాన్ని జాతీయ ప్రాజెక్ట్ గా స్వీకరించిందని వేణుగోపాలకృష్ణ చెప్పారు. సాగు, తాగునీటి అవసరాలు తీర్చే  బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అయిన పోలవరాన్ని, తామే నిర్మిస్తామని కేంద్రం ముందుకు వస్తున్నా....బాబు రెండేళ్లుగా దాన్ని జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు. పోలవరం నిర్మాణం పూర్తయితే వైయస్సార్ కు  పేరొస్తుందని బాబు భయపడుతున్నాడని అన్నారు.  పోలవరం రాష్ట్ర ప్రజల హక్కు అని, విభజన చట్టం ఆర్టికల్ 90లో రూపొందించారని వేణుగోపాల కృష్ణ చెప్పారు. దాన్ని పక్కనబెట్టి బాబు తన స్వ ప్రయోజనాలు చూసుకున్నాడని నిప్పులు చెరిగారు. దానిలో భాగంగానే  బాబు తన స్వార్థం, కమిషన్ ల కోసం  పట్టిసీమను తెరపైకి తీసుకొచ్చాడని మండిపడ్డారు. పట్టిసీమ కేవలం చంద్రబాబుకు, ఆయనకు వంతపాడే వారికి తప్ప ఎవరికీ ఎక్కడ కనిపించడం లేదని ఎద్దేవా చేశారు.  తాత్కాలికాలు పక్కనబెట్టి బాధ్యత గల ముఖ్యమంత్రిగా శాశ్వతంగా ప్రయోజనం కలిగించే పోలవరాన్ని సత్వరమే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.  

No comments:

Post a Comment