24 May 2016

బాబు సర్కార్ పై తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి

 • బాబు చేసిన మోసాలు, అన్యాయాలపై కోర్టుకు వెళదాం
 • పులివెందులలో ప్రజలతో మమేకమైన వైయస్ జగన్
 • ఈసందర్భంగా వారి సమస్యలు అడిగి తెలుసుకున్న జననేత
 • వైయస్ రాజారెడ్డి వర్థంతి కార్యక్రమాలకు హాజరు
 • పలు కుటుంబాలకు పరామర్శ

వైయస్సార్ జిల్లా(పులివెందుల): ఏపీ ప్రతిపక్ష నేత వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ పులివెందులలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. రెండ్రోజులుగా జిల్లాలో పర్యటిస్తూ పలు కార్యక్రమాల్లో బిజీబిజీగా గడుపుతున్నారు. ఈసందర్భంగా మాట్లాడుతూ... వైయస్ జగన్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై నిప్పులు చెరిగారు. ‘ఒకటి కాదు.. రెండు కాదు.. లెక్కలేనన్ని హామీలు ఇచ్చారు. నెరవేర్చడం చేతకాక తోకముడిచి ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారు.  సంక్షేమ పథకాల్లో కోత పెట్టిన చంద్రబాబు సర్కార్‌పై ప్రజలు తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని వైయస్ జగన్ మండిపడ్డారు. బాబు చేసిన మోసాలు, ప్రజలకు చేసిన అన్యాయంపై కోర్టును ఆశ్రయించి న్యాయం పొందుదాం’ అని అన్నారు.

పులివెందుల నియోజకవర్గంలోని లావనూరు, బలపనూరులలో వైయస్ జగన్ వృద్ధులను దగ్గరకు తీసుకొని ఆప్యాయంగా పలకరించారు.  ఈసందర్భంగా వారు తమ సమస్యలను జననేతకు మొరపెట్టుకున్నారు.  తెలుగుదేశం నేతలు తమ పింఛన్లు తీసేశారని వాపోయారు.  దీనిపై స్పందించిన జననేత.... ‘అవ్వా.. నీ పేరేమిటి.. ఎప్పటినుంచి పింఛన్ రావడంలేదు.. అంటూ అడిగారు. పండు వయసులో ఉన్న వారికి అంతో... ఇంతో వచ్చే ఆర్థిక వనరులను కూడా దెబ్బతీశారని బాబు తీరుపై వైయస్ జగన్ మండిపడ్డారు. అవ్వ,తాతల ఉసురు  తగలకుండాపోదని.. అన్యాయం చేసిన మోసాల బాబుపై కోర్టుకు వెళ్లి న్యాయం పొందుదామని.. అంతవరకు ఓపికపట్టండి అని వైయస్ జగన్ అన్నారు.

 
వైయస్ రాజారెడ్డి వర్ధంతి కార్యక్రమాల్లో..
పులివెందులలో సోమవారం ఉదయాన్నే లయోలా డిగ్రీ కళాశాల రోడ్డులో ఉన్న వైయస్‌రాజారెడ్డి  ఘాట్‌ను వైయస్ జగన్ సందర్శించి నివాళులర్పించారు. అనంతరం నానమ్మ వైయస్ జయమ్మ, పెదనాన్న వైయస్ జార్జిరెడ్డిల సమాధుల వద్ద కూడా నివాళులర్పించారు. అనంతరం వైయస్ రాజారెడ్డి పార్కులో విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అలాగే భాకరాపురంలో ఉన్న వైయస్‌ఆర్ ఆడిటోరియంలో వైయస్ జగన్ ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్నారు. పాస్టర్లు రెవరెండ్ బెనహర్, మృత్యుంజయరావు, నరేష్‌బాబులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించగా.. పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ, షర్మిలమ్మ, వైయస్ భారతిరెడ్డి, పురుషోత్తమరెడ్డి, ఎంపీ వైయస్ అవినాష్‌రెడ్డి, విమలమ్మ, సుగుణమ్మ, వైయస్ వివేకానందరెడ్డి, వైయస్ సుధీకర్‌రెడ్డి, వైయస్ ప్రకాష్‌రెడ్డి, తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, వైయస్ మనోహర్‌రెడ్డి, ఈసీ గంగిరెడ్డి, వైయస్ భాస్కర్‌రెడ్డి సతీమణి లక్ష్మమ్మ, వైయస్ వివేకా సతీమణి సౌభాగ్యమ్మ, వైయస్ మనోహర్‌రెడ్డి సతీమణి, మున్సిపల్ చైర్ పర్సన్ వైయస్ ప్రమీలమ్మ, ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, వైయస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి పాల్గొన్నారు. వైయస్ రాజారెడ్డి చేసిన సేవలతోపాటు ఆయనతో ఉన్న అనుబంధాన్ని సోదరి విమలమ్మ వివరించారు.

పలువురిని పరామర్శించిన ప్రతిపక్షనేత  
పులివెందులలో వైయస్ జగన్ చిన్నాన్న వైయస్ జోసఫ్‌రెడ్డి బావ బాలజోజిరెడ్డి ఇటీవల అనారోగ్యంతో మృతిచెందడంతో వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను కలిశారు.  పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ, వైయస్ జగన్ సతీమణి వైయస్ భారతిరెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ వైయస్ ప్రమీలమ్మ కూడా జోసఫ్‌రెడ్డి ఇంటికి వెళ్లి పరామర్శించారు. అలాగే శేషారెడ్డి స్కూలు సమీపంలో నివసిస్తున్న ట్రాన్స్‌కో ఏఈ శివనారాయణరెడ్డి ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన నేపథ్యంలో.. కుమారుడు ధర్మేంద్రను వైయస్ జగన్‌ పరామర్శించారు. అనంతరం సింహాద్రిపురం మండలంలోని కోవరంగుంటపల్లెలో యువజన విభాగం కన్వీనర్ శివారెడ్డి తండ్రి రాచమల్లు రామలింగేశ్వరరెడ్డి ఇటీవలే అనారోగ్యంతో తనువు చాలించడంతో అక్కడకు వెళ్లి శివారెడ్డి కుటుంబసభ్యులను పరామర్శించారు. 

బలపనూరులో ప్రణవ్‌కుమార్‌రెడ్డి ఇటీవల బావికి ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతిచెందాడు. నేపథ్యంలో ప్రణవ్ ఇంటికి వెళ్లి తండ్రి రామగోపాల్‌రెడ్డి, తల్లి అమరావతిలను ఓదార్చారు. ఈ సందర్భంగా బావిలో పడి చనిపోయిన ప్రణవ్‌కు ఇటీవల పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో 9.8 పాయింట్లు వచ్చాయని తల్లిదండ్రులు వైయస్‌ జగన్‌కు చెప్పి కన్నీటి పర్యంతమయ్యారు. అలాగే గ్రామానికి చెందిన వెంకట్రామిరెడ్డి, రవీంద్రనాథరెడ్డిల ఇళ్లకు వెళ్లి కుటుంబసభ్యులతో ముచ్చటించారు. అనంతరం చవ్వారిపల్లెకు వెళ్లి సర్పంచ్ హరికిశోర్‌రెడ్డిని పరామర్శించారు. హరికిశోర్‌రెడ్డికి గతంలో ఎన్నికల సందర్భంగా ఒక కన్ను దెబ్బతినగా.. ఇటీవలే రోడ్డు ప్రమాదం జరిగి మరో కన్నుకు కూడా గాయం కావడంతో చూపును కోల్పోయారు. వైయస్ జగన్‌ను చూడగానే కిశోర్‌రెడ్డి తల్లిదండ్రులు గంగిరెడ్డి, వెంకటనారాయణమ్మ, కిశోర్‌రెడ్డి భార్య సుమతిలు కన్నీటి పర్యంతమవ్వగా.. వైయస్ జగన్ వారిని ఓదార్చారు.

లావనూరులో ఘన స్వాగతం :  
జమ్మలమడుగు నియోజకవర్గంలోని లావనూరులో వైయస్ జగన్‌కు ఘన స్వాగతం లభించింది. భారీగా తరలి వచ్చిన కార్యకర్తలు బాణసంచా పేల్చుతూ.. జైజగన్ నినాదాలతో హోరెత్తించారు. నూతనంగా నిర్మించిన పెద్దమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత ఎమ్మెల్యే ఆది ముఖ్య అనుచరుడు నిరంజన్‌రెడ్డి కోరిక మేరకు జగన్ వారి ఇంటికి వెళ్లి కొద్దిసేపు గడిపారు.

 వైయస్ జగన్‌ను కలిసిన వైయస్‌ఆర్‌సీపీ నేతలు :
ఎప్పటికప్పుడు సమస్యలపరంగా కడప ఎంపీ వైయస్ అవినాష్‌రెడ్డితో వైయస్ జగన్ చర్చిస్తూ పరిష్కారం చూపగా.. పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి, ఎమ్మెల్యేలు అంజాద్‌బాషా, రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, శ్రీనివాసులు, తిరుపతి మాజీ ఎమ్మెల్యే కరుణాకర్‌రెడ్డి, డాక్టర్ ఎస్.పురుషోత్తమరెడ్డి, కడప మేయర్ సురేష్‌బాబు, జమ్మలమడుగు వైయస్‌ఆర్‌సీపీ నేత సుధీర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, వైయస్‌ఆర్‌సీపీ నేత వైఎస్ మనోహర్‌రెడ్డి, మున్సిపల్ వైస్ చెర్మైన్ చిన్నప్ప, తాళ్లప్రొద్దుటూరు సర్పంచ్ రామసుబ్బారెడ్డి కలిసి అనేక అంశాలపై చర్చించారు.

1 comment:

 1. >బాబు సర్కార్ పై తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి
  కలలుగనే వేళ యిదే కన్నయ్యా....
  నిదురలో ఎంతోహాయి చిన్నయ్యా.........

  ReplyDelete