17 May 2016

కేసీఆర్ హిట్లర్ లా మాట్లాడడం తగదు

  • ఆంధ్రుల జీవితాలతో కేసీఆర్, బాబుల చెలగాటం
  • అక్రమ ప్రాజెక్ట్ లతో ఏపీకి అన్యాయం చేస్తున్న సీఎంలు
  • పాలమూరు-రంగారెడ్డి, డిండిలతో తాగునీటికీ కష్టాలే
  • నిలదీసే దమ్ము బాబు లేకపోవడం వల్లే ఈదుస్థితి

కర్నూలుః తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబులు ...ఐదు కోట్ల ఆంధ్రుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని వైయస్సార్సీపీ అధ్యక్షులు ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మండిపడ్డారు. కృష్ణా, గోదావరి నదులపై ఎలాంటి అనుమతులు లేకుండానే ఎడాపెడా తెలంగాణ రాష్ట్రం ప్రాజెక్ట్ లు నిర్మిచడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. పక్కరాష్ట్రం చేపడుతున్న ప్రాజెక్ట్ లపై చంద్రబాబు నోరుమెదపకపోవడం పట్ల జననేత ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ అవసరాలు తీరాక కిందకు నీళ్లు వదులుతామని కేసీఆర్ హిట్లర్ లా మాట్లాడటం తగదన్నారు. కేసీఆర్ వ్యాఖ్యలు చేస్తుంటే...బ్రహ్మంగారు చెప్పినట్లు నీళ్ల కోసమే యుద్ధాలు జరుగుతాయేమోనన్న భయాందోళన కలుగుతుందన్నారు. 

దాదాపు ఒకటిన్నర సంవత్సరాలుగా తెలంగాణ ప్రభుత్వం కళ్లెదుటే ఏపీకి అన్యాయం చేస్తున్నా అడిగే నాథుడే కరువయ్యాడని వైఎస్ జగన్ ఆగ్రహించారు. తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు చంద్రబాబు ఒక్క అడుగు కూడా ముందుకు వేయడం లేదని నిప్పులు చెరిగారు. కృష్ణా, గోదావరిలపై అక్రమంగా, అడ్డగోలుగా  ప్రాజెక్ట్ లు కడుతూ పోతే కిందకు నీళ్లు ఎలా వస్తాయని నిలదీసే దమ్ము ఏపీ సీఎంకు లేకపోయిందని ఫైరయ్యారు. దిగువకు నీళ్లు రాకపోతే మన పరిస్థితి  ఏమిటన్న ఆలోచన కూడా బాబుకు లేకపోవడం దురదృష్టకరమన్నారు. 


శ్రీశైలం ప్రాజెక్ట్ కు నీళ్లు రాకముందే మహబూబ్ నగర్ లోనే తెలంగాణ ప్రభుత్వం 120 టీఎంసీల నీళ్లు అటునుంచి అటే మలుపుకుంటోందని వైయస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణానదిలో దాదాపు 1750 టీఎంసీల నీళ్లు లైవ్ స్టోరేజీ  నిల్వ చేసే సామర్థ్యంతో పై  రాష్ట్రాల్లో ప్రాజెక్ట్ లు ఉన్నాయని చెప్పారు. అనధికారికంగా మరో 300 టీఎంసీల నీళ్లు స్టోర్ చేస్తున్నారన్నారు. ఇందులో దాదాపు 1300 టీఎంసీలకు సరిపడా కర్నాటక, మహారాష్ట్రలో డ్యామ్ లు కట్టుకున్నారని చెప్పారు. కృష్ణానదిలో మహారాష్ట్ర ప్రభుత్వం వాళ్ల అవసరాలు తీరాక కర్నాటకలోని ఆల్మట్టి, నారాయణ పూర్ కు నీరు విడుదల చేస్తుందని ...అవి నిండితే తప్ప చుక్క కూడా దిగువకు వదలట్లేదని ధ్వజమెత్తారు.

రోజుకు  రెండు టీఎంసీల నీళ్లు అుటునుంచి అటే తీసుకెళ్లేలా పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్ట్ లు కడితే రాయలసీమ జిల్లాలు,నెల్లూరు, ప్రకాశం జిల్లాలు ఎడారిగా మారుతాయని వైయస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. కల్వకుర్తి ప్రాజెక్ట్  ఇంతకుముందు 25 టీఎంసీలు ఉంటే దాన్ని 40 టీఎంసీలకు పెంచారని, దీనికే మరో 0.66 టీఎంసీల నీళ్లు పైకి తీసుకెళ్తున్నారని ఫైర్ అయ్యారు . కేసీఆర్ రోజుకు 2.66 టీఎంసీల నీళ్లు తీసుకుపోవడం ధర్మామా అని ప్రశ్నించారు. 

శ్రీశైలంలో 854 అడుగులు దాటితే తప్ప రాయలసీమకు నీళ్లు అందే పరిస్థితి లేదు. అలాంటిది 800 అడుగులుండగానే పంపింగ్ చేస్తే శ్రీశైలానికి నీళ్లు రాకుండా పైపైనే తోడేసుకుంటే తమకు తాగడానికైనా నీళ్లు దొరుకుతాయా అని వైయస్ జగన్ కేసీఆర్, బాబులను నిలదీశారు. శ్రీశైలంలో అవసరాలు తీరిన తర్వాత సాగర్ కు, ఆతర్వాత కృష్ణాడెల్టాకు నీళ్లు వస్తాయన్నారు. రాయలసీమ జిల్లాలు, నెల్లూరు, ప్రకాశంతో పాటు  గుంటూరు, కృష్ణా అదేవిధంగా తెలంగాణలోని నల్గొండ, ఖమ్మంలకు కేసీఆర్ అన్యాయం చేస్తున్నారన్నారు. ఏపీకి ఇంతగా నష్టం జరుగుతున్నా బాబు కేసీఆర్ ను కనీసం నిలదీయకపోవడం బాధాకరమన్నారు. 

No comments:

Post a Comment