5 May 2016

రెండు పార్టీలవి మ్యాచ్ ఫిక్సింగ్ డ్రామాలా !!

  • కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేశాయి
  • తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని బాబు ఢిల్లీకి తాకట్టుపెట్టాడు
  • బాబు నోరు తెరవాలి..ప్రజలకు సమాధానం చెప్పాలి
  • టీడీపీ సర్కార్ పై ధ్వజమెత్తిన వైఎస్సార్సీపీ నేతలు
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదా ఇచ్చే అవ‌కాశ‌మే లేద‌ని పార్ల‌మెంటు సాక్షిగా కేంద్ర ఆర్థిక శాఖ స‌హాయ మంత్రి జ‌యంత్ సిన్హా లిఖిత పూర్వ‌కంగా కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్లు చెప్పిన త‌ర్వాత అయినా చంద్ర‌బాబు త‌న వైఖ‌రి ఏమిటో ఎందుకు చెప్ప‌డం లేద‌ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సూటిగా ప్ర‌శ్నిస్తోంది. ఇప్ప‌టికైనా బాబు కేంద్రానికి ఎందుకు అల్టిమేటం ఇవ్వ‌ర‌ని ప్ర‌శ్నిస్తోంది. 5 కోట్ల ప్ర‌జ‌ల భ‌విష్య‌త్తు కంటే చంద్ర‌బాబు గారికి త‌న‌పై ఉన్న కేసులు, కేంద్రంలో మంత్రి ప‌ద‌వులు, త‌న స్వార్థ రాజ‌కీయాలే ముఖ్య‌మా? అని పార్టీ నేత‌లు అంబ‌టి రాంబాబు, వాసిరెడ్డి ప‌ద్మలు నిల‌దీశారు. 

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదా కోసం బాబు పోరాటం అయినా చేయాలి... లేదా రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా అవ‌స‌రం లేద‌ని, దానిని సాధించ‌లేన‌ని ప్ర‌జ‌ల ముందుకు వ‌చ్చి చెంప‌లేసుకోవాల‌ని వారు సూచించారు. ప్ర‌త్యేక హోదా రాక‌పోవ‌టానికి చంద్ర‌బాబు మెత‌క వైఖ‌రే కార‌ణ‌మ‌న్నారు. బాబు మొద‌టి నుంచీ ప్ర‌త్యేక హోదాపై నిర్దిష్టంగా మాట్లాడ‌కుండా.... పూట‌కో ప్ర‌క‌ట‌న చేస్తూ రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను కేంద్రం వ‌ద్ద తాకట్టు పెట్టార‌న్నారు. గ‌త రెండేళ్లుగా ప్ర‌త్యేక హోదాపై అటు బీజేపీ.... ఇటు టీడీపీలు దాగుడు మూత‌లు ఆడుతూ ప్ర‌జ‌ల్ని దారుణంగా మోస‌గించాయ‌న్నారు. ప్ర‌త్యేక హోదా నిర్ణ‌యం ఇంత‌కాలం నీతి ఆయోగ్ ప‌రిశీల‌న‌లో ఉంద‌ని న‌మ్మ‌బ‌లుకుతూ వ‌చ్చిన వెంక‌య్య నాయుడు, చంద్ర‌బాబు ఇప్పుడు ఏం స‌మాధానం చెబుతార‌ని ప్ర‌శ్నించారు. 

వాస్త‌వానికి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌లేమ‌ని చెప్పే ధైర్యం చాల‌కే అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఇంత‌కాలం ర‌క‌ర‌కాలుగా ప్ర‌జ‌ల్ని మ‌భ్య‌పెడుతూ వ‌చ్చాయ‌న్నారు. రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు బీజేపీనే దిక్కు అన్న‌ట్టుగా భ్ర‌మ‌లు క‌ల్పించే విధంగా రాజ్య‌స‌భ‌లో వెంక‌య్య‌నాయుడు మాట్లాడార‌ని, ఆ త‌ర్వాత ఎన్నిక‌ల్లో కూడా కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ వ‌స్తేనే రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా వ‌స్తుంద‌ని ప్ర‌క‌ట‌న‌లు గుప్పించి, తీరా అధికారంలోకి వ‌చ్చాక రెండు పార్టీలూ ప్ర‌జ‌ల‌ను దారుణంగా మోస‌గించాయ‌న్నారు. ఎన్నిక‌ల ముందు ర‌కర‌కాల వాగ్ధానాల‌తో ప్ర‌జ‌ల‌కు ఆశ‌లు క‌ల్పించి, అధికారంలోకి వ‌చ్చాక వాటికి విరుద్ధంగా ప్ర‌వ‌ర్తించ‌టం అంటే ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌లో అంత‌కంటే పెద్ద నేరం మ‌రొకటి ఉండ‌ద‌న్నారు.  ప్ర‌త్యేక హోదా వ‌స్తే అంతా అయిపోతుందా? అదేమైనా సంజీవ‌నా? అన్న సీఎం చంద్ర‌బాబు ఇప్పుడు ప్ర‌జ‌ల‌కు ఏం స‌మాధానం చెబుతార‌ని నిల‌దీశారు. 

ఒకవైపు కేంద్ర ప్ర‌భుత్వంలో త‌న పార్టీకి చెందిన ఇద్ద‌రు మంత్రుల్ని కొన‌సాగిస్తూ... మ‌రోవైపు బీజేపీకి చెందిన ఇద్ద‌ర్ని రాష్ట్రంలో త‌న మంత్రివ‌ర్గంలో కొన‌సాగిస్తున్న చంద్ర‌బాబు కేంద్రంపై రాజీలేని పోరాటం ఎలా చేస్తారో ప్ర‌జ‌ల‌కు చెప్పాల‌ని డిమాండ్ చేశారు. అక్క‌డా, ఇక్క‌డా ఒక‌రి ప్ర‌భుత్వంలో మ‌రొక‌రు క‌లిసి మెలిసి అధికారాన్ని పంచుకుంటూ ఒక‌రిపై ఒక‌రు పోరాటం ఎలా చేస్తారో ప్ర‌జ‌ల‌కు అర్థ‌మ‌య్యే విధంగా చెబితే బాగుంటుంద‌న్నారు. కేంద్రాన్ని ఏనాడూ ప్ర‌శ్నించ‌కుండా... ప్ర‌త్యేక హోదాపై కేంద్రాన్ని నిల‌దీసే ధైర్యం లేని చంద్ర‌బాబు మీడియా, మంత్రి వ‌ర్గ స‌మావేశాల్లో, తెలుగుదేశం పొలిట్‌బ్యూరో స‌మావేశాల్లో మీడియాకు లీకులు ఇస్తూ ఎంత‌కాలం కాలం వెళ్లదీస్తార‌ని ప్ర‌శ్నించారు. ఒక‌రినొక‌రు నిల‌దీసుకుంటున్న‌ట్టుగా న‌డుపుతున్న మ్యాచ్ ఫిక్సింగ్ డ్రామాలు ఆపాల‌న్నారు.  ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాల‌క‌న్నా, టీడీపీ ప్ర‌యోజ‌నాలు ముఖ్య‌మా?  కాదా? అన్న‌ది ఈ విష‌యంలోనే తేలిపోతోంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. అల్టిమేటం ఇవ్వ‌ని ప‌క్షంలో చంద్ర‌బాబు ఆడుతున్న‌ది ఒక డ్రామా అని అంద‌రికీ అర్థ‌మ‌వుతోంద‌న్నారు.


ప్రత్యేకహోదాపై కేంద్రం విస్పష్టమైన ప్రకటన చేశాక-చంద్రబాబు ఇప్పుడు ఏం చేయబోతున్నారన్నదానిపైనే 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు. బీజేపీ తమ మిత్రపక్షం కాబట్టి ఇంకా కేంద్రం హోదా ఇస్తుందని ఆశగా ఉన్నామని కల్లబొల్లి కబుర్లు  చెబుతారా? లేక కేంద్రానికి అల్టిమేటం జారీ చేస్తారో? ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీకే దిక్కులేకపోతే చంద్రబాబు నాయుడు ఎందుకు మౌనంగా కూర్చుంటున్నారని ప్రశ్నించారు. 

రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన ఈసమస్యను చంద్రబాబు నాయుడు ఎన్డీఏ పక్షాలు, కేంద్రంలోని ఇతర రాజకీయ పక్షాల దృష్టికి ఎందుకు తీసుకెళ్లటం లేదని ప్రశ్నించారు. ఇది నూటికి నూరు పాళ్లూ చంద్రబాబు వైఫల్యమేనని అన్నారు. ఏపీ అంటే ఎవరికీ తలవంచని రాష్ట్రం అని ఇంతకాలం దేశం యావత్తూ భావించారని, చంద్రబాబు నాయుడు ఇవాళ తన కేసుల కోసం, తన రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర పరువును ఢిల్లీ నడివీధుల్లో తాకట్టుపెట్టారని ధ్వజమెత్తారు. తెలుగు ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చటానికే పుట్టామని పదే పదే చెప్పుకునే ఆ పార్టీనేతలు, కేంద్రంలోని మంత్రులు ఈరోజు కేంద్రం చెప్పినదానికల్లా డూడూ బసవన్నలా తలూపుతున్నారని ఫైరయ్యారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్నితాకట్టు పెట్టిన తెలుగుదేశం పార్టీకి పుట్టగతులు ఉండవని, ఆపార్టీ నేతలు, కార్యకర్తలే చంద్రబాబు నాయుడుని నమ్మని పరిస్థితి త్వరలోనే వస్తుందన్నారు. ప్రత్యేకహోదాపై తన వైఖరేంటో ఇప్పటికైనా చంద్రబాబు నోరు తెరిచి మాట్లాడాలని డిమాండ్ చేశారు. 

No comments:

Post a Comment