6 May 2016

స్వలాభం కోసం అర్రులు చాస్తున్న చంద్రబాబు

  • మంత్రులను తొలగించకుండా గావు కేకలు
  • మళ్లీ ఢిల్లీ అంటూ మభ్యపెట్టే ప్రయత్నాలు
  • జైలు భయంతో మోడీ, కేసీఆర్ ల మాటెత్తని వైనం
  • ప్రత్యేకహోదాపై బాబుకు చిత్తశుద్ధి లేదు
  •  వైఎస్సార్సీపీ ధర్నాకు మద్దతుగా కదలిరావాలిః అంబటి 
హైదరాబాద్ః  ప్రత్యేకహోదా ఇవ్వమని కేంద్రం చెబుతుంటే... బీజేపీని విమర్శించొద్దంటూ చంద్రబాబు మాట్లాడడం హాస్యాస్పదమని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. కేంద్రంలో మంత్రులను ఉపసంహరించుకోకుండా...మళ్లీ ఢిల్లీ వెళ్లి పోరాడుతామంటూ చంద్రబాబు చెప్పడం విడ్డూరమన్నారు. బాబు తన స్వార్థ రాజకీయాల కోసం తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీకి తాకట్టుపెట్టాడని అంబటి ఆగ్రహించారు. ఓటుకు నోటు కేసులో జైలుకు పోతాడన్న భయంతోనే చంద్రబాబు నోట మోడీ, కేసీఆర్ ల మాట రావడం లేదని ఎద్దేవా చేశారు. భయాన్ని వీడి ఏపీ ప్రజల ప్రయోజనాల కోసం పోరాడుతున్న తమతో కలిసి రావాలని సూచించారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే వైఎస్సార్సీపీకి ముఖ్యమని మీరు పోరాటం చేస్తారా...పోరాటం చేస్తున్న తమతో కలిసివస్తారో తేల్చుకోవాలన్నారు. 

పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో అంబటి మాట్లాడారు. బీజేపీ అన్యాయం చేసిందని గావు కేకలు పెడుతున్న టీడీపీ  నేతలు, బీజేపీతో ఎందుకు తెగదెంపులు చేసుకోవడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే కేంద్రంపై ఉద్యమం చేయాలని డిమాండ్ చేశారు. ఇది తెలుగు ప్రజల భవిష్యత్ కోసం చేస్తున్న పోరాటమని అంబటి అన్నారు.  రాష్ట్రం విడిపోవడానికి మొదటి ముద్దాయి చంద్రబాబేనని దుయ్యబట్టారు.  చంద్రబాబు అవినీతి చిట్టా మోడీ, కేసీఆర్ ల వద్ద ఉన్నందునే .. స్వలాభం కోసం చంద్రబాబు ప్రత్యేక హోదా విషయంలో ముందడుగు వేయడం లేదని అంబటి విమర్శించారు. కాంగ్రెస్ తల్లిని చంపేస్తే, బీజేపీ 20 నెలల బిడ్డను చంపేసిందని ...ఏపీకి ఆరెండు పార్టీలు చేసిన అన్యాయాన్ని అంబటి ఎండగట్టారు. 

తెలుగువారి పౌరుషం చూపించాల్సిన సమయం ఆసన్నమైందని,  ఈ నెల 10న వైఎస్ఆర్ సీపీ నిర్వహించే ధర్నాలకు అందరూ మద్దతివ్వాలని అంబటి కోరారు. రాష్ట్రానికి హోదా లేకపోతే చీలిపోయిన రాష్ట్రం అధోగతి పాలవుతోందని అంబటి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజానీకం ఉద్యోగాలు, ఉపాధి కోసం ఎదురుచూస్తున్నారని...హోదాతోనే అది సాధ్యమవుతుందని అంబటి చెప్పారు. మోడీ, వెంకయ్యనాయుడు, చంద్రబాబు నాయుడులు అందరూ కలిసి ఎన్నికల ముందు హోదా ఇస్తామని హామీ ఇచ్చారని, మేనిఫెస్టోలో కూడా ఈ అంశాన్ని పెట్టారని గుర్తు చేశారు. ఇచ్చిన హామీని విస్మరించి ప్రజలను మోసం చేయడం దురదృష్టకర పరిణామమన్నారు. 

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలుగు ప్రజల ఉపయోగాల కోసం ఉద్యమం చేస్తుందని అంబటి చెప్పారు. దీన్ని రాజకీయ దృక్పథంతో చూడొద్దని,  తెలుగు ప్రజల భవిష్యత్తు కోసం చేస్తున్న పోరాటంగా చూడాలన్నారు. బీజేపీ అలసత్వం, చంద్రబాబు చేస్తున్న మోసాలకు వ్యతిరేకంగా పోరాడుదామని రాష్ట్ర ప్రజానీకానికి పిలుపునిచ్చారు. ధర్నాలకు పర్మిషన్ ఇవ్వకపోవడం, అడ్డుకోవడం లాంటి కార్యక్రమాలు చేసి అభాసుపాలు కావొద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రత్యేకహోదా కోసం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేస్తున్న పోరాటాలను అణచడం కోసం ప్రయత్నిస్తున్నారు తప్ప...ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు ఏనాడు చిత్తశుద్ధితో పనిచేయలేదని అంబటి దుయ్యబట్టారు. 
 
రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టి వ్యక్తిగత ప్రయోజనాల కోసం బాబు  అర్రులు చాస్తున్నాడని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు.  ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చే బాధ్యత ముఖ్యమంత్రికి  లేదా అని  అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఇంకా కూడా కేంద్రంలో కొనసాగడం సిగ్గు చేటని ధ్వజమెత్తారు.  హోదా ఇస్తామని టీడీపీ, బీజేపీలు హామీ ఇచ్చి మోసం చేయడం తగునా..? అని అంబటి నిలదీశారు. రెండేళ్లలోనే దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని ఘోరాలు చంద్రబాబు చేశాడని మండిపడ్డారు. 

 ఏపీకి నష్టం జరిగేలా తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్ట్ లు నిర్మిస్తుంటే ప్రభుత్వం,  రైతులు కోర్టులకు వెళ్లి పిటిషన్ లు వేసుకునే పరిస్థితి రావడం శోచనీయమన్నారు. దానికి  కారణం బాబుకు ఓటుకు నోటు భయమేనని చెప్పారు. చంద్రబాబు తెలంగాణలో స్టింగ్ ఆపరేషన్ లో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయినా ఆయనపై సీబీఐ ఎంక్వైరీ ఎందుకు వేయరని విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. ప్రత్యేకహోదా, రైల్వే జోన్, రాష్ట్ర నిధుల గురించి పోరాడరు గానీ ....చర్చల పేరుతో ప్రధాని రేంజ్ లో ప్రత్యేక విమానాల్లో దేశాలు పట్టుకు తిరుగుతున్నారంటూ బాబుపై అంబటి తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. హోదా తీసుకురాకపోతే చంద్రబాబు చరిత్రహీనుడుగా మిగిలిపోతాడని హెచ్చరిచారు. 

No comments:

Post a Comment