4 May 2016

మహిళా కార్మికులకు కనీస వేతనాలు కల్పించాలి

  • న్యాయబద్దమైన డిమాండ్లను పరిష్కరించాలి
  • అవసరమైతే దీక్షకు సైతం సిద్ధం
  • బ్రాండిక్స్ కార్మికుల దీక్ష లో వైఎస్ జగన్

హైదరాబాద్: మహిళా కార్మికుల ముఖాల్లో సంతోషం కోసం తాము పోరాటానికైనా సిద్ధమని ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ వెల్లడించారు. బ్రాండిక్స్ కార్మికుల న్యాయపరమైన డిమాండ్లకు ఆయన మద్దతు పలికారు. అవసరమైతే తాము కూడా నిరాహార దీక్ష కు దిగి డిమాండ్లను సాధించుకొంటామని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. విశాఖపట్నం జిల్లా పర్యటనలో భాగంగా ఆయన అచ్యుతాపురం ఎస్ ఈ జడ్ ప్రాంతానికి వెళ్లి అక్కడ బ్రాండిక్స్ మహిళా కార్మికుల పోరాటానికి మద్దతు పలికారు. అనంతరం అక్కడ వారితో ముఖాముఖి మాట్లాడారు.
          బ్రాండిక్స్ కర్మాగారంలో మహిళా కార్మికులు పడుతున్న కష్టాల్ని ప్రజలకు తెలియ చేసేందుకే అక్కడ పర్యటిస్తున్నట్లు ఆయన చెప్పారు. అక్కడ పరిస్థితుల గురించి స్థానిక మహిళా సిబ్బందిని ఆయన ఆరా తీశారు. అప్పుడు ఫ్యాక్టరీలో నెలకొన్న పరిస్థితుల గురించి సిబ్బంది పూసగుచ్చినట్లు వివరించారు. యాజమాన్యం అనుసరిస్తున్న వేధింపుల వైఖరిని వివరించారు. కనీస వేతనాలకు కూడా నోచుకోవటం లేదని వాపోయారు. దీని మీద ఆయన మండిపడ్డారు. వైఎస్ జగన్ ప్రసంగం సారాంశం ఆయన మాటల్లోనే చూద్దాం.
          అయిదేళ్లకు ఒకసారి వేజ్ బోర్డ్ ఏర్పాటు అవుతుంటుంది. గతంలో వేసిన వేజ్ బోర్డు సిఫార్సులు 2011 లో ఇచ్చింది. అందులో ఉద్యోగులు, సిబ్బందికి వేతనాలు నిర్ధారించింది. కానీ అవేమీ ఇక్కడ అమలు కావటం లేదు. అయిదేళ్లకు ఒకసారి 10 శాతం, లేదా 20 శాతం మేర వేతనాలు పెంచాలని వేజ్ బోర్డు చెబుతుంది. కానీ అవి కూడా పూర్తిగా అమలు కావటం లేదు. ఇంతకన్నా దారుణం మరోటి ఉండదు. అదే నష్టాలో ఉన్న పరిశ్రమో, ప్రభుత్వ సాయం ఏమాత్రం అందని పరిశ్రమో అయితే మనం అర్థం చేసుకోవచ్చు.
          గతంలో ఇక్కడ ఎస్ ఈ జడ్ ఏర్పాటు చేసినప్పుడు బ్రాండిక్సు యాజమాన్యానికి ఎకరా కు ఒక్క రూపాయి చొప్పున వెయ్యి ఎకరాల స్థలాన్ని దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి లీజుకి ఇప్పించారు. అప్పుడు ఆ పరిశ్రమ యాజమాన్యాన్ని ఆయన అడిగింది ఒకటే. అక్క చెల్లెమ్మలకు మంచి జీతాలు ఇవ్వండి అని మాత్రమే అడిగారు. అంతకు మించి ఏమీ కోరలేదు. 60వేల మందికి ఉద్యోగాలు కల్పించాలని అడిగారు. 18 వేల మంది కి ఉద్యోగాలు ఇచ్చారు. అంత వరకు బాగానే ఉంది. కానీ మెరుగైన వేతనాలు ఇవ్వక పోవటం మాత్రం బాధాకరం.
          2016 లో తిరిగి వేతనాలు పెంచే కార్యక్రమం చేపడుతున్నారు. ఇప్పుడైనా మెరుగైన జీతం పడుతుందా అని ఎదురు చూస్తున్నాం. కనీసం 10వేల రూపాయిలు లేనిదే ఒక కుటుంబం గౌరవంగా బతికే పరిస్థితి లేదు. అటువంటప్పుడు అంతటి జీతాలు ఇస్తేనే బాగుంటుంది. అందుకే ఈ యాజమాన్యానికి ఒకటి చెప్పదలచుకొన్నాను. ఇక్కడ తయారుచేసిన దుస్తుల్ని అమెరికా, యూరప్ దేశాలకు ఎగుమతి చేస్తారు. అక్కడ పనిచేసే సిబ్బందికి నెలకు తక్కువలో తక్కువ చూసుకొన్నా లక్ష రూపాయిలు జీతం ఇస్తారు. కానీ వాటిని తయారుచేస్తున్న సిబ్బందికి మాత్రం నెలకు పదివేలుకూడా ఇవ్వటం లేదు. ఆ పదివేల కోసం అందరినీ అడగాల్సి వస్తోంది. దీని కోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మీద ఒత్తిడి తీసుకొని రావాల్సిన పరిస్థితి నెలకొంది.
          నేను కోరుకొనేది ఒకటే. ఇక్కడ పనిచేస్తున్న అక్క చెల్లెమ్మల ముఖాల్లో చిరునవ్వులు నిండాలి. పనిచేసే వాతావరణం ఉండాలి. పనిచేసే చోట సక్రమంగా తాగేందుకు నీరు కూడా దొరకటం లేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈ వాతావరణం మారాలి. పనులు చేసేవాళ్లకు సంతోషకరమైన వాతావరణం ఉండాలి. పని చేసే వాతావరణం ఉండాలి. ఇక్కడ మాట్లాడితే ఉద్యోగాలు పోతాయి అని భయపడాల్సిన పనిలేదు. వచ్చేది మన ప్రభుత్వం. భయపడాల్సిన పనే లేదు. అక్క చెల్లెమ్మల మీద చర్యలు తీసుకొంటే మాత్రం ఊరుకొనేది లేదు.
          నాలుగు వేల రూపాయిలతో ఎలా బతకాలి. కంపెనీకి చూస్తే పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. అంతర్జాతీయంగా పెట్రోల్, డీజిల్, అల్యూమినియం అన్నింట్లో రేట్లు తగ్గుతున్నాయి. కానీ సిబ్బంది కుటుంబాలకు మాత్రం అన్నీ ఇబ్బందులు కనిపిస్తున్నాయి. అటువంటప్పుడు కనీసం 10వేల రూపాయిల నెల జీతం అన్నది న్యాయబద్దమైన కోరికే కదా.
          వాస్తవానికి ఐదేళ్లకు ఒకసారి వేతనాల్ని సవరించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అందుచేత ఈ ప్రభుత్వం మీద, చంద్రబాబు మీద ఒత్తిడి తీసుకొని వద్దాం. కనీసం పదివేల రూపాయిల కనీస వేతనం వచ్చేదాకా ఉద్రిక్తంగా పోరాడుదాం. అవసరమైతే మేం కూడా నిరాహార దీక్ష చేస్తాం. న్యాయబద్దంగా కోర్కెలు తీర్చమని అడుగుదాం. వాస్తవానికి జీతాలు పెంచమని ధర్నాలు చేస్తుంటే ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఏం చేయాలి... ఆందోళన చేస్తున్న వారిని పిలిపించి ఎందుకు ఆందోళన చేస్తున్నారనేది అడగాలి. సమస్యలు తీర్చేందుకు ప్రయత్నించాలి. కానీ ఆయన ఏం చేశారు. ధర్నా చేస్తున్నవారి గొంతు నొక్కేందుకు ప్రయత్నించారు. ఆడవాళ్లని చూడకుండా పోలీసులతో కొట్టించారు. ఒకటి కూడా కాదు రెండు పోలీసు స్టేషన్లకు తిప్పి హింసలు పెట్టారు. చంద్రబాబుకి మానవత్వం కూడా లేదు. గట్టిగా ఒత్తిడి తీసుకొని వద్దాం. అందరి ముఖాల్లో సంతోషం నిండే విధంగా పోరాటాన్ని కొనసాగిద్దాం
          అని వైఎస్ జగన్ భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీమంత్రి బొత్సా సత్యనారాయణ, విశాఖ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు గుడివాడ అమర్ నాథ్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment