7 July 2015

అపర భగీరథుడిపైనే అభాండాలా?

 అసాధ్యాన్ని సుసాధ్యం చేయడమే వైఎస్ ఘనత
 పొలిటికల్ విల్ ఉన్న నేత వైఎస్‌ఆర్
 ప్రాణహిత వైఎస్‌ఆర్  మానసపుత్రిక
 ఆయనే ఉంటే ప్రాజెక్టు పూర్తి చేసి చూపేవారు
 ద్వేషించినవారే తెలంగాణ కాటన్ అంటూ పొగడలేదా?

  వైఎస్‌ఆర్... ఈ మూడు అక్షరాలకు ఎంతో ప్రత్యేకత ఉంది. భారాలు, కరువు కాటకాలతో అల్లాడిపోయిన ఆంధ్రప్రదేశ్‌ను సంక్షేమబాట పట్టించిన కృషీవలుడు దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి. రైతులు పదిమందికి అన్నంపెట్టే స్థాయిలో ఉండాలని, ఆడపడుచులు కంటతడి పెట్టే పరిస్థితి రాకూడదని, పేదలకు కూడు గూడు గుడ్డకు అలమటించే దుస్థితి ఉండకూడదని ఆయన అనుక్షణం తపించారు.  ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ పథకానికి రూపకల్పన చేసినా ఆ దిశగానే ఆలోచించారు. మాట తప్పడం మడమ తిప్పడం ఆయనకు తెలియదు. మాట ఇస్తే అది శిలాశాసనమే. ప్రభుత్వానికి ఎంత భారమైనా ప్రత్యామ్నాయాలు ఆలోచించుకోవలసిందే తప్ప మాట తప్పడం ఆయన డిక్షనరీలోనే లేదు. ఆయన హయాంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య తరచూ చెప్పిన మాటలివి. ఉచిత విద్యుత్ అయినా, జలయజ్ఞమైనా, రెండు రూపాయలకు కిలో బియ్యమైనా, ఫీజు రీయింబర్స్‌మెంట్ అయినా, ఆరోగ్య శ్రీ అయినా కులాలకతీతంగా, మతాల కతీతంగా, ప్రాంతాలకతీతంగా, పార్టీలకతీతంగా అర్హులందరికీఅందాలని వైఎస్ ఆశించేవారు. అందుకు అవసరమైన చర్యలు తీసుకున్నారు. ఎన్నో అసాధ్యాలను సుసాధ్యం చేసిన చరిత్ర ఆయనది. ఉచిత విద్యుత్ దేశంలో ఎక్కడా అమలు చేయలేకపోయారు. తీగలపై బట్టలారేసుకోవాల్సిందేనని ఎద్దేవా చేసిన వారు చివరకు ఆయన అడుగుజాడలను అనుసరించాల్సిన పరిస్థితి. అంతటి దార్శనికుడు వైఎస్‌ఆర్. ఆయన జీవించి ఉండగానే గుడ్డుపై ఈకలు పీకినవారు, అవాకులు చెవాకులు పేలినవారు, రాసినవారు, ప్రసారం చేసినవారు మరణించిన తర్వాత కూడా వాటిని ఆపలేదు. 85 కొత్తప్రాజెక్టులు నిర్మించి కోటి ఎకరాలకు సాగునీరందించాలన్న లక్ష్యంతో, రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలన్న ముందుచూపుతో అపరభగీరధుడు వైఎస్ ప్రారంభించిన బృహత్‌పథకం జలయజ్ఞంలో చిన్నచిన్న లోపాలపై అలాంటి ప్రచారాలే అప్పుడు జరిగాయి. ఇప్పుడూ జరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు గురించి వైఎస్‌పై అభాండాలు వేయడానికి, రాయడానికి చాలామంది ఉత్సాహపడుతున్నారు. అలాంటి వారికి ఇదే సమాధానం.

 - పెద్ద మనుషుల గురించి, చనిపోయిన వ్యక్తుల గురించి మాట్లాడేటప్పుడు ఎవరైనా కనీస మర్యాదలు, సంస్కారాలు పాటించాలని ఆశిస్తాం. తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ గారు ప్రాణహిత-చేవెళ్ళ పథకాన్ని కట్టగలరా? కట్టలేరా? దాని డిజైన్ మారుస్తారా? లేక పూర్తిగా పక్కనపెడతారా? అన్నది ఆయన ఇష్టం. అయితే, మహానేత డాక్టర్ వైయస్సార్ గురించి కేసీఆర్ మాట్లాడిన తీరు సరైనది కాదు.

 - ప్రాణహిత నుంచి చేవెళ్ళకు 600 కిలో మీటర్లు. కొండలు, గుట్టల మధ్య నీరు ఎలా తీసుకువస్తారని కేసిఆర్ ప్రశ్నించారు. ఈ ప్రశ్న ఆయన ప్రాణహిత-చేవెళ్ళకు డాక్టర్ వైయస్సార్ ముఖ్యమంత్రిగా శంఖుస్థాపన చేసిన నాడు ఎందుకు అడగలేదో ముందు చెప్పాలి. 2008 డిసెంబరులో, అంటే మహానేత మరణానికి పది నెలల ముందు ఈ ప్రాజెక్టుకు శంఖుస్థాపన చేస్తున్నప్పుడు డాక్టర్ వైయస్సార్‌ను జీవితాంతం ద్వేషించిన వెంకటస్వామి వంటి వారు కూడా ఏం మాట్లాడారో గుర్తు చేసుకోవాలి. తెలంగాణ కాటన్ వైయస్ అని వెంకటస్వామి చెప్పటమే కాకుండా ఈ ప్రాజెక్టుతో తెలంగాణకు ప్రాణం వస్తుందని కీర్తించారు. మరి ఆరోజున కేసీఆర్ ఈ ప్రాజెక్టును ఎందుకు వ్యతిరేకించలేదు?

 - ఏ ప్రాజెక్టు అయినా నాయకుడి పొలిటికల్ విల్ మీద ఆధారపడి ఉంటుంది. దాని డిజైన్ ఇంజినీరింగ్ నమూనాల మీద ఆధారపడి ఉంటుంది. 600 కిలో మీటర్లు మేర ప్రాణహిత నుంచి నీరు తీసుకురావటం అన్నది ఇంజినీరింగ్ డిజైన్‌కు సంబంధించిన అంశం. చేవెళ్ళ వరకు కూడా గోదావరి జలాలు తప్ప మరోరకంగా నీటిని తీసుకురాలేం కాబట్టి లిఫ్ట్‌లు పెట్టైనా, ఆపని పూర్తి చేయాలి అన్నది ఒక నాయకుడి పొలిటికల్ విల్‌కు సంబంధించిన అంశం. 600 కిలో మీటర్లు తీసుకు రాగలను అన్నది వైయస్సార్‌గారి నమ్మకం. తీసుకురాలేను అన్నది కేసీఆర్ అభిప్రాయం.

 - తెలంగాణకు జీవం తీసుకురావాలంటే ఏటా నీరు వృధా పోతున్న గోదావరి నుంచి ఆ పని చేయగలమా? లేక మరోమార్గం ఉందా? ఒక్క తెలంగాణలోనే గోదావరికి చెందిన అనేక ఉపనదులు కలుస్తున్నాయి. ఈ ఉపనదుల నీరు అంతా చివరికి ఏపీ నుంచి ప్రవహించి ఉప్పు సముద్రంలో కలిసిపోతుంది. ప్రాణహిత నుంచే ఎక్కువ నీరు గోదావరిలో కలుస్తోంది. ఇవన్నీ అందరూ అంగీకరించే వాస్తవాలే. అలాంటప్పుడు ప్రాణహితను కేవలం అదిలాబాద్ వరకు మాత్రమే పరిమితం చేయాలన్న కేసీఆర్ ఆలోచన ఎంతవరకు సమంజసం?

 - 1983 నుంచి 2001 వరకు కేసీఆర్ టీడీపీలో ఉన్నారు. టీడీపీలో ఉన్న 18 ఏళ్ళలో టీడీపీ తెలంగాణ ప్రాజెక్టుల కోసం ఏం చేసిందో కేసీఆర్ చెప్పగలరా? ఒక్క మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టు అయినా ఆరోజుల్లో టీడీపీ తెలంగాణలో నిర్మించిందా? పోనీ కేసీఆర్ అభిమానించే నాయకుడు ఎన్టీఆర్ అయినా తెలంగాణలో ఒక్క మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టు అయినా చేపట్టాడా?

 - అంతకన్నా దారుణం ఏమిటంటే-ఆరోజుల్లోనే తెలుగుదేశం పార్టీ రైతులకు ఇచ్చే వ్యవసాయ విద్యుత్ మీద చార్జీలు పెంచుతూ పోయిన మాట వాస్తవం కాదా?

 - వైయస్సార్  గురించి నోరు తూలినంత మాత్రాన నిజాలు అబద్ధాలు అయిపోవు. 1956లో ఆంధ్రప్రదేశ్ అవతరించే సమయానికి తెలంగాణలో మొత్తంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి 13.78 లక్షల టన్నులు. 2003-04 నాటికి అది 57.99 లక్షల టన్నులకు చేరింది. అంటే దాదాపు 44 లక్షల టన్నులు పెరిగింది.  1994-95లో అంటే తెలుగుదేశం పార్టీ మరోసారి పరిపాలన చేపట్టిన సంవత్సరంలో తెలంగాణలో ఆహార ధాన్యాల ఉత్పత్తి 41.60 లక్షల టన్నులు అయితే 2003-04 నాటికి అది 57.99 లక్షల టన్నులకు చేరుకుంది. అంటే చంద్రబాబు నాయుడు హయాంలో 16.39 లక్షల టన్నులు మాత్రమే పదేళ్ళలో పెరిగింది. ఆతర్వాత పదేళ్ళలో, అంటే ప్రధానంగా వైయస్సార్ పరిపాలనలో అప్పటికప్పుడు భారీ ప్రాజెక్టులు పూర్తి కాకపోయినా, కేవలం లిఫ్ట్‌లు, బోర్లకు ఉచిత విద్యుత్ అందించటం ద్వారా తెలంగాణలో ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగిపోయింది. 2013-14 వచ్చే సరికి అది 107 లక్షల టన్నులకు చేరింది. అంటే కేవలం పదేళ్ళలోనే రైతులకు డాక్టర్ వైయస్సార్ ద్వారా అందిన ఉచిత విద్యుత్ వల్ల అయితేనేమి, లిఫ్ట్‌ల ద్వారా అందించిన నీటి వల్ల అయితేనేమి ఏకంగా 50 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు అదనంగా పండించే శక్తి లభించింది.
 1956 నుంచి 2004 వరకు కేవలం 44 లక్షల టన్నుల పెరుగుదల నమోదు అయితే, గత పదేళ్ళలోనే 50 లక్ష ల టన్నులు అదనంగా తెలంగాణ రైతు ఉత్పత్తి చేయగలిగాడు. ఇది డాక్టర్ వైయస్సార్ పొలిటికల్ విల్ ఫలితంగానే సాధ్యం అయ్యింది.

 - 2013-14 డేటానే తీసుకుంటే విడిపోయిన ఆంధ్రప్రదేశ్‌లో 115 లక్షల టన్నులు ఆహార ధాన్యాలు ఉత్పత్తి అయ్యాయి. పంట భూమి 60 శాతం ఏపీలో ఉంటే, 40 శాతం మాత్రమే తెలంగాణలో ఉంది. అయినా ఈ 40 శాతానికి ఉచిత విద్యుత్, లిఫ్ట్‌ల ద్వారా అందించిన నీటి సదుపాయం వల్ల 2013-14లో తెలంగాణలో ఏకంగా 107 లక్షల టన్నులు ఉత్పత్తి అయ్యింది.

 - ఈ డేటా అంతా కేసీఆర్ ఆయన స్వహస్తాలతో తెలంగాణ అసెంబ్లీకి ఈ ఏడాది సమర్పించుకున్న సోషియో ఎకనమిక్ అవుట్ లుక్ 2015లో పేజీ నంబరు 175లో ఉంది. కావాలంటే వెరిఫై చేసుకోవచ్చు.

 - మహానేత వైయస్సార్ గురించి మాట్లాడటప్పుడు ఆలోచించి మాట్లాడాలి. తెలంగాణ రైతుకి ఉచిత విద్యుత్ ఇవ్వాలని ఉద్యమించిన వ్యక్తి ఎవరు అంటే- ఏ ఒక్కరూ కేసీఆర్ పేరు చెప్పరు. వైయస్సార్ పేరే చెబుతారు. తెలంగాణలో పెద్ద ప్రాజెక్టులు కట్టడానికి ఒక్క పైసా పన్నులు గానీ, చార్జీలు గానీ పెంచకుండా మహా నిర్మాణాలు ప్రారంభించింది ఎవరంటే- కేసిఆర్ పేరు ఎవరూ చెప్పరు. వైయస్సార్ పేరే చెబుతారు.

 - కేసీఆర్ ప్రాజెక్టులు కట్టాలి. తెలంగాణలో ప్రతి ఎకరానికి నీటి సదుపాయం కల్పించాలి. చేతలలో చేసి చూపాలి. మాటలు మీరకూడదని వైఎస్‌ఆర్ అభిమానులు, ప్రజలు కోరుకుంటున్నారు.

 - జులై -8 ఆ మహానేత 66వ జయంతి. తెలంగాణలో లక్షల ఎకరాల్లో పంటలు పండిస్తున్న రైతు, రైతాంగం, 108, ఫీజు రీయింబర్స్‌మెంటు, పక్కా గృహాలు వంటి అనేక పథకాల ద్వారా వైయస్సార్‌ను గుండెల్లో పెట్టుకున్న ప్రజానీకం ఆయన్ను గుర్తు చేసుకునే శుభదినం. వైయస్సార్ భౌతికంగా లేకపోయినా తెలంగాణ పాడి పంటల్లోనూ, ప్రతి ఇంటిలోనూ, ప్రతి సంక్షేమ పథకంలోనూ ఎప్పటికీ జీవించి ఉంటారన్న సత్యాన్ని కేసిఆర్ గానీ, మరో నాయకుడు గానీ వైయస్సార్‌ను విమర్శించే ముందు గుర్తుంచుకోవాలి.

No comments:

Post a comment