20 July 2015

అట్లాంటాలో ఘనంగా వైఎస్‌ఆర్ జయంతి వేడుకలు


మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 66వ జయంతి వేడుకలు అమెరికాలోని అట్లాంటాలో శనివారం రాత్రి ఘనంగా జరిగాయి. వైఎస్‌ఆర్‌సీపీ అమెరికా ఎన్‌ఆర్‌ఐ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో వైఎస్‌ఆర్ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు, నాయకులు భూమన కరుణాకర్‌రెడ్డి, అంబటి రాంబాబు, కొరుముట్ల శ్రీనివాసులు, ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఆదిమూలపు సురేష్, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, చలమలశెట్టి సునీల్, రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి, గుడివాడ అమర్నాథ్, మేడపాటి వెంకట్, శ్రీనివాస్ కలబంద, యాదం బాలాజి తదితరులు పాల్గొన్నారు. ఈ జయంతి వేడుకల్లో వైఎస్‌ఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని వైఎస్‌ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. క్లాసికల్ సింగర్ పద్మశ్రీ శోభారాజు భక్తి పాటలతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అమెరికాలోని వైఎస్‌ఆర్‌సీపీ ఎన్‌ఆర్‌ఐ విభాగ కన్వీనర్ గురవారెడ్డి గౌరవ అతిథులను ఆహ్వానించారు. అనంతరం గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రి వద్ద మృతిచెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారు రెండు నిమిషాలు మౌనం పాటించారు. 600 మందికి పైగా ప్రవాస భారతీయులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో డాక్టర్ వైఎస్‌ఆర్‌తో తమకు ఉన్న అనుభవాలను అందరూ పంచుకున్నారు. వైఎస్‌ఆర్ విశిష్ట నాయకత్వం నుంచి తాము ఎలా స్ఫూర్తి పొందారో వివరించారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉచిత విద్యుత్, పావలా వడ్డీ వంటి సంక్షేమ పథకాలతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలోని ప్రజలను డాక్టర్ వైఎస్‌ఆర్ ఎలా అభివృద్ధి పథం వైపు నడిపించారో పలువురు వక్తలు సోదాహరణంగా వివరించారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వానికి మద్దతు పలకడం ద్వారానే స్ఫూర్తివంతమైన డాక్టర్ వైఎస్‌ఆర్ వారసత్వాన్ని, విజన్‌ను కొనసాగించడం సాధ్యమవుతుందని వక్తలు అభిప్రాయపడ్డారు.

No comments:

Post a Comment