28 July 2015

బాబు నమ్మినందుకు పరువు పోయింది

 కుమిలిపోతున్న అన్నదాతలు
 ---------------------------
 పత్రికల్లో రోజూ వేలం ప్రకటనలు
 మూడేళ్లు దాటిన బంగారు నగలు వేలం
 తలెత్తుకోలేకపోతున్నామని రైతుల వేదన
 అధికవడ్డీకి తెచ్చి నగలు విడిపించుకుంటున్న వైనం
 మరలా అవి తాకట్టుపెట్టినా పరిమితంగానే రుణం
 స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌తో అన్నదాత తిప్పలు
 రుణమాఫీని నమ్ముకున్నందుకే ఈ దుస్థితి
 బాబును నమ్మినందుకు నట్టేట్లో ముంచారంటున్న రైతులు
 --------------------------------

 చంద్రబాబు నాయుడును నమ్ముకున్నందుకు పరువు పోయిందని అన్నదాతలు కుమిలిపోతున్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు ఎన్నో హామీలిచ్చారు. అందులో రైతు రుణమాఫీ ఒకటి. రుణాలను బేషరతుగా మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు ఎన్నికలు ముగిసిన తర్వాత చాలా కాలం ఆ హామీని అటకెక్కించారు. ప్రతిపక్షం పోరు పడలేక చివరకు రుణమాఫీ పథకాన్ని ప్రకటించారు. అయితే అందులో ఎన్నో కొర్రీలు. లబ్దిదారులను పరిమితం చేశారు. మాఫీ మొత్తాన్నీ మాయచేశారు. రుణమాఫీ పథకాన్ని నమ్ముకున్నందుకు చంద్రబాబు తమ పరువును నడిబజార్లో నిలిపారని రైతులు వాపోతున్నారు. పంట రుణాల కోసం బ్యాంకుల్లో కుదువపెట్టిన బంగారు నగల వేలానికి సన్నాహాలు జరుగుతుండడంతో రైతులు పరువు పోతోందని భయపడుతున్నారు.

 పత్రికలలో వేలం ప్రకటనలు
 బకాయిదారులుగా రైతుల పేర్లను బ్యాంకులు వివిధ పేపర్లలో ప్రకటనలిస్తున్నాయి. తమ పేర్లు పత్రికల్లో ఎక్కడాన్ని అవమానంగా భావిస్తున్న రైతులు ప్రభుత్వ నిర్వాకంపై మండిపడుతున్నారు.  చిత్తూరు జిల్లా వరదాయపాళెం సప్తగిరి గ్రామీణ బ్యాంకు బ్రాంచికి సంబంధించి 241 మంది రైతుల పేర్లతో బంగారు నగల వేలం ప్రకటన పత్రికలలో ప్రచురితమయ్యింది.అంతకుముందు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నారాయణవనం బ్రాంచి కూడా 294 మంది పేర్లతో ఇలాంటి ప్రకటనే ఇచ్చింది. ఇలాంటి ప్రకటనలు రాయలసీమ జిల్లాల్లో ప్రతి రోజూ పత్రికలలో వస్తూనే ఉన్నాయి. ఫలానా తేదీలోపు అప్పు చెల్లించకపోతే నగలు వేలం వేస్తామని ఆ ప్రకటనలలో స్పష్టంగా ఉంటోంది.

 బాబు మాటలు నమ్మి...
 తెలుగుదేశం అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు రుణమాఫీపై ఎన్నికల ముందు ఎన్నో సభల్లో హామీ ఇచ్చారు. మేనిఫెస్టోలోనూ ప్రముఖంగా ప్రస్తావించారు. దాంతో రైతులు పంట రుణాలను చెల్లించడం ఆపేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు రునమాఫీకి సవాలక్ష ఆంక్షలు విధించారు. బంగారు నగలు తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలను కూడా మాఫీ చేస్తామని, తామే బ్యాంకులకు చెల్లిస్తామని చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించింది. తొలిదశలో నామమాత్రంగా చెల్లించి మిగిలింది తర్వాత ఇస్తామని ప్రకటించారు. అయితే బ్యాంకులు మాత్రం ప్రభుత్వం కోసం ఆగడం లేదు. తమ పని తాము చేసుకుంటూ పోతున్నాయి. నిబంధనల ప్రకారం మూడేళ్లు దాటిన రుణ ఖాతాలలోని బంగారు నగలను వేలం వేస్తున్నాయి. 2013 మార్చి వరకు తీసుకున్న రుణాలకు సంబంధించిన నగలను వేలం వేస్తున్నట్లు పత్రికల్లో ప్రకటనలు వస్తున్నాయి. దీంతో ైరె తులు తీవ్ర ఆందోళనలో మునిగిపోతున్నారు. పరువు పోతోందని బాధపడుతున్నారు.

 పరువుపోతోందని విడిపించుకుంటున్నారు..
 సామాన్యంగా రైతులు చాలా అభిమానవంతులు. నలుగురికీ అన్నంపెట్టే రైతన్న పరువు కోసం ప్రాణమైనా ఇవ్వాలనుకుంటారు. చంద్రబాబును నమ్ముకుంటే తమ పరువును బజారుకు ఈడ్చాడని, ఊర్లో తలెత్తుకుని తిరగలేకపోతున్నామని రైతన్నలు వాపోతున్నారు. బ్యాంకుల వేలం ప్రకటనలు చూసిన కొందరు రైతులు ఎక్కువ వడ్డీకి అందిన చోటల్లా అప్పులు తెచ్చి బంగారు నగలు విడిపించుకుంటున్నారు. నగల కోసం కాదని, పరువు పోతోందని విడిపించుకుంటున్నామని రైతులంటున్నారు. పంట ఖర్చుల కోసం, పిల్లల చదువుల కోసం తెచ్చుకున్న డబ్బును ఇప్పుడు బ్యాంకుల్లో నగలు విడిపించడానికి చెల్లిస్తున్నామని, అసలు, వడ్డీ కలసి తడిసి మోపెడయ్యాయని రైతులు భోరుమంటున్నారు.

 కొత్తరుణాలు పుట్టడం లేదు...
 అప్పుచేసి ఎలాగోలా విడిపించుకున్న నగలను మరలా తాకట్టు పెట్టి రుణం తీసుకుందామంటే కుదరడం లేదు. చంద్రబాబు మాఫీ మోసం వల్ల రైతులు ఇపుడు కొత్త రుణాలకు అనర్హులుగా మారిపోయారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌ను కచ్చితంగా పాటించాలని బ్యాంకులు నిర్ణయించుకున్నాయి. గతంలో రైతులకు ఉదారంగా రుణాలు మంజూరు చేసిన బ్యాంకులు ఇపుడు రుణమాఫీ నిబంధనలు, ఆంక్షలతో స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌ను తప్పనిసరిగా అమలు చేయాలని నిర్ణయించుకున్నాయి. అందుకే విడిపించుకున్న నగలను మరలా తాకట్టు పెట్టడానికి రైతులు సిద్ధమైనా ఆ బంగారానికి పరిమితంగానే రుణం వస్తోంది. పంటను బట్టి నింబధనలను బట్టి పరిమితంగా రుణం ఇస్తున్నామని, అనవసరమైన రిస్క్ తీసుకోదలచుకోలేదని బ్యాంకు అధికారులంటున్నారు.  ఇపుడు ఏ బ్యాంకులోనైనా ఇదే పరిస్థితి. రైతులకు అప్పులు పుట్టని దుస్థితి. ఒకప్పుడు గౌరవంగా బతికిన తమకు చంద్రబాబు వల్లే ఈ దురవస్థ దాపురించిందని రైతులు వాపోతున్నారు.

No comments:

Post a Comment