28 July 2015

క‌లాంగారి మ‌ర‌ణ వార్త క‌న్నీటి స‌ముద్రంలో ముంచింది: వైఎస్ జ‌గ‌న్‌

మాజీ రాష్ట్ర‌ప‌తి, భ‌ర‌త‌మాత ముద్దుబిడ్డ డాక్ట‌ర్ అబ్దుల్ క‌లాం గారి మ‌ర‌ణ వార్త న‌న్ను క‌న్నీటి స‌ముద్రంలో ముంచింది. అలాంటి మ‌హానుభావులు యుగానికొక‌రు మాత్ర‌మే క‌నిపిస్తారు. వ్య‌క్తిగా ఆయ‌న వంద‌ల కోట్ల మందికి ఆత్మీయుడు, ఆరాధ్యుడు. ఈ దేశంలోని ప్ర‌తీ ఒక్క‌రికీ ఆయ‌న అర‌మ‌రిక‌లు లేకుండా క‌లిసిపోయే మ‌న ఇంటి మ‌నిషి లాంటి వాడు. మ‌న దేశాన్ని అంత‌రిక్ష‌, క్షిప‌ణి విజ్ఞానాల్లో మ‌హోన్న‌త స్థానంలో నిలిపిన మ‌హా శాస్త్ర‌జ్ఞుడు, దేశ భ‌క్తుడు, నిరాడంబ‌రుడు, నిలువెత్తు నిస్వార్థ ప‌రుడు, జ్ఞానాన్ని పంచుతూ చివ‌రి క్ష‌ణాల‌ను కూడా జాతికి అంకితం చేసిన మ‌హా మ‌నీషి అబ్దుల్ క‌లాం గారు. అట్ట‌డుగు స్థాయిలోని మ‌త్స్య‌కార కుటుంబంలో పుట్టి, పేప‌ర్ బాయ్ గా ప‌ని చేసి..రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వి వ‌ర‌కు ఎదిగి, ఆ ప‌ద‌వి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌రువాత ఉపాధ్యాయుడిగా మారిన క‌లాంగారి జీవితంలో ప్ర‌తీ అడుగు, ప్ర‌తీ అణువు సందేశాత్మ‌కం, స్ఫూర్తి దాయ‌కం. 84 ఏళ్ల వ‌య‌స్సులో కూడా భార‌త జాతిని త‌రువాతి త‌రం శాస్త్ర సాంకేతిక‌త‌కు స‌మాయ‌త్తం చేస్తూ, మ‌హోపాద్యాయుడిగా స్ఫూర్తి నింపుతూ, జ్ఞానాన్ని పంచుతూ మ‌ర‌ణించారాయ‌న‌. రాష్ట్రప‌తి అయినా సామాన్యుడిగానే బ‌తికారు. ఆ ప‌ద‌వి నుంచి దిగిపోయిన త‌రువాత ఎవ‌రికీ ద‌క్క‌నంత గౌర‌వాన్ని పొందారు. ఈ మ‌హ‌నీయుడు భార‌తీయ ఆత్మ‌కు అస‌లు సిస‌లు ప్ర‌తీక‌. భౌతికంగా మ‌న‌ల్ని వ‌దిలిపోయిన  ఆ మ‌హ‌నీయుడికి శిర‌సు వంచి అభివాదం చేస్తున్నాను. 
- వైఎస్ జ‌గ‌న్‌

No comments:

Post a Comment