28 July 2015

ముల్లుకర్రతో పొడిస్తేనే కదులుతున్న బాబు!

 జగన్ ఉద్యమిస్తేనే సమస్యల పరిష్కారం
 తోలుమందం సర్కారుతో జనం సతమతం

 జగన్ మూడోవిడత భరోసాయాత్రకు బయల్దేరితేనే రు.692 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ
 జగన్ అల్టిమేటమ్ జారీ చేస్తేనే మునిసిపల్ కార్మికుల డిమాండ్లకు పరిష్కారం
 జగన్ భరోసాయాత్రకు దిగితేనే ఆత్మహత్యలను గుర్తించి పరిహారం ప్రకటన
 జగన్ జోక్యం చేసుకుని బహిరంగ లేఖ రాస్తేనే ఆర్టీసీ కార్మికులకు ఫిట్‌మెంట్ బెనిఫిట్
 జగన్ తణుకు దీక్ష చేపడితేనే తొలివిడత రైతు రుణమాఫీ నిధుల విడుదల
 జగన్ మంగళగిరి సమరదీక్షకు దిగితేనే డ్వాక్రా మహిళలకు రు.3వేల చెల్లింపు
 జగన్ గట్టిగా నిలదీస్తేనే అసెంబ్లీ సమావేశాల ముందు కరువు మండలాల ప్రకటన

  ఆంధ్రప్రదేశ్‌లో అరాచకత్వం రాజ్యమేలుతోంది. అన్ని వర్గాల ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ప్రజా సమస్యల విషయంలో చొరవచూపించి ఎప్పటికప్పుడు వాటిని పరిష్కరించి ప్రజలకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం చేతులు ముడుచుకుని కూర్చుంటోంది. సమస్యలు తీర్కండి మహాప్రభో అని ప్రజలు మొత్తుకుంటున్నా చంద్రబాబు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. అలవికాని హామీలిచ్చిన చంద్రబాబు ఎన్నికల అవసరం తీరిపోగానే మేనిఫెస్టోని చెత్తబుట్టలో పడేశాడు. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి వంటి ముఖ్యమైన హామీలను తుంగలో తొక్కాడు. అరకొర రుణమాఫీ, అనేక షరతుల మాయాజాలంతో అన్నదాతల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పాతరుణాలు తీరిస్తేనే కొత్తరుణాలిస్తామని బ్యాంకులు తెగేసి చెబుతున్నాయి. మోసపోయామని తెలిసి ఇపుడు రైతులు, మహిళలు, నిరుద్యోగులు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉసూరుమంటున్నారు. కొత్త ఉద్యోగాలివ్వక పోగా ఉన్న ఉద్యోగాలను ఊడబీకుతున్న బాబుపై జనం ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఇక రోజుకో కొత్త సమస్యను సృష్టిస్తూ, త్రిశంకు రాజధాని ఊహలలో తేలిపోతూ ఆకాశంలో తప్ప కింద తిరగడానికి ఇష్టపడని చంద్రబాబును భూమార్గం పట్టించి ప్రజల సమస్యల పరిష్కారం దిశగా మళ్లించడానికి ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి అహరహం పోరాడాల్సి వస్తున్నది. ముల్లుగర్రతో పొడిస్తే గానీ దున్నపోతు మాట వినదన్నట్లుగా ప్రతి అంశం లోనూ జగన్‌మోహన్‌రెడ్డి పోరాడితే గానీ పనులు జరగడం లేదు. జగన్ అల్టిమేటమ్ జారీ చేస్తేనే చంద్రబాబు ప్రభుత్వం కదులుతోంది. జగన్‌మోహన్‌రెడ్డి దీక్షకు దిగితేనే బాబు సర్కారు జనం సమస్యలపై దృష్టి సారిస్తోంది. అలాంటి కొన్ని ఉదాహరణలు చూద్దాం...

 జగన్  మూడో విడత భరోసాయాత్ర ఆరంభం
 692 కోట్ల ఇన్‌పుట్‌సబ్సిడీ మంజూరు
  ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాగానే రైతులకు అవసరమైన అన్ని అవసరాలను రాష్ర్ట ప్రభుత్వం దగ్గరుండి చూసుకోవాలి. అన్నదాతకు అవసరమైన అన్ని అవసరాలను తీర్చడానికి ప్రయత్నించాలి. అందులోనూ కరువు పీడిత ప్రాంతాలంటే వాటి కష్టాలే వేరు. ఆ ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాల్సి ఉంటుంది. కానీ చంద్రబాబు ఓటుకు కోట్లు, పట్టిసీమ కమీషన్లు వంటి ‘అతి ముఖ్యమైన’ లావాదేవీల్లో కూరుకుపోయారాయె. ఇక పత్తిపాటి పుల్లారావు వంటి వ్యవసాయ శాఖామాత్యులకూ రాజధాని రియల్‌ఎస్టేట్ వ్యవహారాలలో తలమునకలుగా ఉన్నారు. వారికీ తీరుబడి కావడం లేదు. దాంతో జగన్ రంగంలోకి దిగారు. ఈనెల 21న మూడో విడత భరోసాయాత్రకు శ్రీకారం చుట్టారు. అనంతపురం రైతు ఆత్మహత్యలతో పాటు రైతుల సమస్యలపై జగన్ నిలదీస్తుండడంతో ప్రభుత్వం వెంటనే చర్యలు ప్రారంభించింది. కరువు పీడిత ప్రాంతాలకు రు.692 కోట్ల ఇన్‌పుట్‌సబ్సిడీని విడుదల చేస్తూ జులై 22న జీవో జారీ చేసింది.

 జగన్ అల్టిమేటమ్
 మునిసిపల్ కార్మికుల డిమాండ్లు పరిష్కారం
 మునిసిపల్ కార్మికులు, ఉద్యోగులు రెండు వారాలుగా సమ్మె చేస్తున్నా చంద్రబాబు సర్కారుకు చీమకుట్టినట్లయినా లేదు. పురపాలక సంఘాలలో చెత్త పేరుకుపోయింది. వ్యాధులు ప్రబలుతున్నాయి. అయినా ఈ సర్కారు మొద్దు నిద్ర వీడలేదు. మంత్రిమండలి సమావేశంలో సమ్మెను అణచేయడానికి పథకాలు రచించారు. కార్మికులపై బెదిరింపులకు దిగారు. కచ్చితంగా నాలుగురోజుల్లో మునిసిపల్ కార్మికుల సమ్మెను పరిష్కరించకపోతే రాష్ర్ట బంద్‌కు పిలుపునిస్తానని, రాష్ట్రాన్ని స్తంభింపజేస్తామని జగన్ అల్టిమేటమ్ జారీ చేశారు. అనంతపురంలో జగన్ ఈనెల 23న ప్రకటించగానే 25న రాష్ర్టప్రభుత్వం కార్మికసంఘాలతో చర్చలు జరిపింది. వారి వేతనాన్ని పెంచి సమ్మెను విరమింపజేసింది. కార్మిక సంఘాల జేఏసీ నేతలు జగన్‌ను కలుసుకుని మిఠాయిలు తినిపించారు. జగన్ చొరవచూపించబట్టే తమ సమస్యలు పరిష్కారమయ్యాయని హర్షం వ్యక్తం చేశారు.

 రైతు భరోసాయాత్రకు జగన్ శ్రీకారం
 ఆత్మహత్యలను గుర్తించిన ప్రభుత్వం.. ఐదులక్షల పరిహారం
 అనంతపురం జిల్లాలో రైతుల ఆత్మహత్యలపై జగన్ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆ రైతు కుటుంబాలను ఆదుకోవాలని చంద్రబాబు సర్కారుకు విజ్ఞప్తి చేశారు. అయితే రైతుల ఆత్మహత్యలే లేవని, తమ ఏలుబడిలో రైతులు సంతోషంతో ఉన్నారని, సంబరాలు చేసుకుంటున్నారని చంద్రబాబు వాదించారు. అనంతపురం వెళ్దాం రండి ఆత్మహత్యలు ఉన్నాయో లేవో చూపిస్తాను అని జగన్ సవాల్ విసిరారు. అంతేకాదు రైతు భరోసా యాత్ర చేపడతానని ప్రకటించారు. దాంతో ప్రభుత్వం దిగివచ్చింది. అనంతపురం జిల్లాలో 40 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని నివేదిక ఇచ్చింది. వారికి ఐదు లక్షల రూపాయల చొప్పున పరిహారాన్ని ప్రకటించింది.

 జగన్ బహిరంగ లేఖ
 ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు పరిష్కారం
 తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలంటూ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చినట్లుగానే తమకూ ఫిట్‌మెంట్ బెనిఫిట్ ఉండాలన్న ప్రధాన డిమాండ్‌తో వారు సమ్మెను ఉధృతం చేశారు. ప్రజారవాణా స్తంభించి పోయింది. ప్రజలు అష్టకష్టాలు పడ్డారు. కానీ చంద్రబాబు సర్కారుకు మాత్రం అవేవీ కనిపించలేదు. ఆర్టీసీ కార్మికులపై ఎస్మా ప్రయోగిస్తామని, సమ్మెలో ఉన్న ఉద్యోగులను డిస్మిస్ చేసి ఇంటికి పంపించేస్తామని హూంకరింపులకు దిగారు. అంతేకాదు శిక్షణలేని ప్రయివేటు డ్రయివర్లతో వాహనాలను నడిపి అనేక ప్రమాదాలకు కారణమయ్యారు. దాంతో మే 9న రెండు తెలుగు ప్రభుత్వాలకు జగన్‌మోహన్‌రెడ్డి అల్టిమేటమ్ ఇస్తూ బహిరంగ లేఖరాశారు. రెండు ప్రభుత్వాలు చర్చలు జరిపి సమ్మెను విరమింపజేశాయి. తెలంగాణలో ఆర్టీసీ కార్మికులకు 44శాతం, ఆంధ్రప్రదేశ్‌లో కార్మికులకు 43శాతం ఫిట్‌మెంట్ బెనిఫిట్ దక్కింది.

 దీక్షకు సిద్ధమైన జగన్
 తొలివిడత రుణమాఫీ నిధులు విడుదల
 అలవికాని హామీలతో రైతులను, మహిళలను మోసం చేసిన చంద్రబాబు నాయుడు పదవి చేపట్టిన తర్వాత రుణమాఫీపై ఎన్నో నాటకాలాడారు. రిజర్వు బ్యాంకును, కేంద్రప్రభుత్వాన్ని నిందిస్తూ తప్పంతా వారిదే అయినట్లు ప్రజల దృష్టిని మళ్లించాలని చూశారు. అసెంబ్లీలోనూ, వెలుపలా జగన్‌మోహన్‌రెడ్డి నిలదీస్తుండడంతో విధిలేని పరిస్థితుల్లో రుణమాఫీ చేయడానికి సిద్ధమయ్యారు. అయితే అనేక షరతులు విధించి రుణమాఫీ లబ్దిదారులను కుదించేశారు. రుణమాఫీ మూడువిడతల్లో చేస్తామని, ఒకసారి, బాండ్లు ఇస్తామని మరోసారి మోసగిస్తూవచ్చారు. దాంతో జనవరి 31, ఫిబ్రవరి 1న తణుకులో రైతు దీక్ష చేస్తానని జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించడంతో తొలివిడత రుణమాఫీ నిధులను విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

 సమరదీక్షకు జగన్ సన్నద్ధం
 డ్వాక్రా మహిళలకు మూడువేలు విడుదల
 రైతులను మోసగించినట్లే చంద్రబాబు నాయుడు డ్వాక్రా అక్కచెల్లెమ్మలను కూడా మోసగించారు. బేషరతుగా డ్వాక్రా రుణాలన్నిటినీ మాఫీ చేస్తానని ఎన్నికల ముందు ప్రకటించిన చంద్రబాబు పదవినధిష్టించగానే దానిని అటకెక్కించారు. డ్వాక్రా రుణాల మాఫీపై అసెంబ్లీలో గట్టిగా నిలదీసిన జగన్‌మోహన్‌రెడ్డి వెలుపల ఉద్యమానికి సిద్ధమయ్యారు. ఆందోళనలు చేస్తున్న డ్వాక్రా మహిళలకు పార్టీ శ్రేణులు గట్టిగా మద్దతిచ్చాయి. చివరకు ఒక్కో మహిళకు రు.10 వేల చొప్పున మాఫీ చేస్తామని, సంఘంలో పదిమంది మహిళలు ఉంటే మొత్తానికి లక్ష రూపాయలు మాఫీ అవుతాయని చంద్రబాబు ప్రకటించారు. అయితే ఆ పదివేలను కూడా మూడు విడతలుగా ఇస్తామని చెప్పారు. కానీ ఆ మూడువేలను విదిల్చడానికి కూడా మీనమేషాలు లెక్కించారు. చంద్రబాబు ఏడాది పాలనలో చేసిన మోసాలపై మంగళగిరిలో సమరదీక్ష చేస్తున్నట్లు జగన్ ప్రకటించగానే హడావిడిగా డ్వాక్రా సంఘాలకు తొలివిడత మూడువేలు విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

 కరువుమండలాలపై నిలదీసిన జగన్
 అసెంబ్లీ సమావేశాల ముందు కరువు మండలాల ప్రకటన
 రాష్ర్టంలో ఒకవైపు అతివృష్టి మరోవైపు అనావృష్టి పరిస్థితులు నెలకొన్నాయి. అనేక సమస్యలతో రైతులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వారికి సకాలంలో అందించాల్సిన సహాయంపై చంద్రబాబు ఎప్పుడూ స్పందించిందే లేదు. తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్న ప్రాంతాలను, మండలాలను గుర్తిస్తే ఆయా ప్రాంతాలలో ప్రత్యేక చర్యలు చేపట్టేందుకు అధికార యంత్రాంగానికి వీలవుతుంది. అలా కరువు మండలాలు ఏవి అనే దానిపై అధికారులు అనేక నివేదికలు సిద్ధం చేసి ప్రభుత్వానికి అందిస్తారు. ఆ మండలాలను నిర్ణయించి ఆ విషయాన్ని ప్రకటించడానికి కూడా చంద్రబాబు ప్రభుత్వానికి తీరలేదు. కరువు మండలాలను ఎందుకు ప్రకటించలేదని జగన్ ప్రశ్నించడంతో ఆ విషయం అసెంబ్లీలో రచ్చ అవుతుందనే భయంతో అసెంబ్లీ సమావేశాల ముందు రోజు రాత్రి హడావిడిగా కరువు మండలాలను చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించింది.

No comments:

Post a Comment