2 July 2015

పొగాకు రైతులపై కనికరం లేదా? కష్టకాలంలో చేతులెత్తేసిన చంద్రబాబు

మద్దతు ధర లేక, కొనుగోళ్లు జరక్క పొగాకు రైతులు విలవిల్లాడుతున్నారు. అన్నదాత సంక్షేమం గురించి అనర్గళమైన ఉపన్యాసాలు దంచే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పొగాకు రైతుల గురించి అసలు పట్టించుకోవడమే లేదు. అంతర్జాతీయ మార్కెట్‌లో ఒడిదుడుకులను సాకుగా చూపుతూ పొగాకు బోర్డు చేతులెత్తేసింది. కేంద్ర ప్రభుత్వం కూడా నీళ్లు నములుతోంది. చంద్రబాబు సర్కారు ఆదుకోవడానికి బదులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. దీంతో దిక్కుతోచని రైతులు రోడ్డునపడుతున్నారు. రహదారులను దిగ్బంధించి పంటను తగులబెట్టి తమ నిరసనను తెలియజేస్తున్నారు.
  మన రాష్ర్టంలో తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పొగాకును విరివిగా పండిస్తున్నారు. జూన్ నెలాఖరుకు 80 నుంచి 90శాతం వరకు పొగాకు అమ్మకాలు జరగాల్సి ఉండగా ఈ ఏడాది ఇప్పటి వరకు 25శాతం కూడా అమ్మకాలు జరగలేదు. రాష్ర్టంలోని ఈ ఐదు జిల్లాల నుంచి 172 మిలియన్ కిలోల వర్జీనియా పొగాకును కొనుగోలు చేయాలని పొగాకు బోర్డు అధికారికంగా నిర్ణయించుకుంది. అయినా ఇప్పటి వరకు 45 మిలియన్ కిలోల పొగాకును మాత్రమే కొనుగోలు చేసింది. గత ఏడాది సగటున కిలోకి రు.118.90 పలుకగా ఇపుడు రు.80 కూడా లేకపోవడంపై రైతులు తీవ్ర ఆందోళనతో ఉన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనపుడు రాష్ర్ట ప్రభుత్వమే రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దాలి. కొనుగోళ్లు జరిగేలా చూడడం, కనీస మద్దతు ధర లభించేలా చూడడం ప్రభుత్వ బాధ్యత. కానీ చంద్రబాబు సర్కారు ఆ బాధ్యతను పూర్తిగా విస్మరించింది. కనీసం పరిస్థితిని కేంద్రానికి వివరించి పొగాకు రైతును ఆదుకునేలా వత్తిడి కూడా చేయకపోవడం చంద్రబాబు మార్కు నిర్లక్ష్యానికి నిదర్శనం. రైతుల నుంచి వివిధ రూపాలలో వసూలు చేసిన సుమారు. రు.500 కోట్లు బోర్డు వద్ద మూలుగుతున్నాయి. కనీసం ఆ నిధులతోనైనా పొగాకును బోర్డు నేరుగా కొనుగోలు చేసేతా వత్తిడి తీసుకురావాలని ముఖ్యమంత్రికి రైతులు మొరపెట్టుకుంటున్నా చెవిటివాని ముందు శంఖమూదిన చందంలా మారింది.

 సంక్షోభసమయంలో ఆదుకున్న వైఎస్
 {పజాప్రస్థానం పాదయాత్ర సందర్భంగా 2003 చివర్లో అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ రాజశేఖరరెడ్డి పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లి పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించి రైతుల ఇబ్బందులను తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి కాగానే 2004లో సంక్షోభ నివారణకు చర్యలు చేపట్టారు. వ్యాపారులంతా కుమ్మక్కై ధర పెరగకుండా చేస్తున్న తరుణంలో పొగాకు ఉత్పత్తిదారుల సహకార సమాఖ్యలను, కోల్ సొసైటీలను రంగంలోకి దింపారు. ఈ సంస్థలకు రు.10 కోట్ల రుణమిచ్చి పొగాకు కొనుగోలు చేయించారు. వరుసగా రెండేళ్లు ఈ విధంగా చేయడంతో ఓ దశలో కిలో పొగాకు ధర రు.199కి కూడా చేరింది. దాంతో పోటీ పెరిగి పొగాకు కంపెనీలు అనివార్యంగా కొనాల్సి వచ్చింది. ముఖ్యమంత్రి స్థానంలో ఉండే వ్యక్తికి ఇలాంటి సమగ్ర దృష్టి, సమస్యల పట్ల అవగాహన, ఆదుకునే మనస్తత్వం ఉండాలి. కానీ చంద్రబాబుకు అవేవీ లేకపోవడమే సమస్య. అందుకే ఆయన ఢిల్లీపై భారం వేసి చేతులెత్తేశారు.

No comments:

Post a Comment