9 July 2015

వాడుకుని వదిలేయడం బాబు నైజం

తాజా ఉదాహరణ పవన్ కల్యాణ్
 రేవు దాటిన తర్వాత తెప్ప తగలేయడం... అక్కర తీరిన తర్వాత అల్లుడ్ని అదేదో అనడం.. ఓడమీద ఉన్నపుడు ఓ ఓడమల్లయ్య - ఓడ దిగిన తర్వాత బోడి మల్లయ్య అనడం.... అవసరం వచ్చినపుడు కాళ్లు పట్టుకోవడం - అవసరం తీరిపోయాక జుట్టు పట్టుకోవడం... ఇవి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నైజానికి సరిగ్గా సరిపోలుతాయి. ఆయన నిజస్వరూపానికి ఇవి దగ్గరగా ఉంటాయి. ఇందుకు తాజా ఉదాహరణ పవన్ కల్యాణ్ ఉదంతం.
  పవన్ కల్యాణ్ పాపం ఎట్టకేలకు 35 రోజుల తర్వాత ఓటుకు కోట్లు వ్యవహారంపై స్పందించారు. కోర్టులో ఉన్న కేసుపై ప్రత్యక్షంగా స్పందించనంటూ దాటవేసినా పార్లమెంటు సభ్యులు తమ బాధ్యత నిర్వహించడం లేదని పవన్ వ్యాఖ్యానించారు. అయితే ఆ వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీ ఎంపీలకు, నాయకులకు ఎంతో కోపం తెప్పించాయి. పవన్ కల్యాణ్ ఏమన్నా ప్రతిపక్ష నాయకుడా? ఆయన తెలుగుదేశం పార్టీ అధినాయకుడికి ఆప్తుడే కదా? ఎన్నికలకు ముందు నారా చంద్రబాబు నాయుడు స్వయంగా పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్లి ఆయన కాళ్లూ గడ్డం పట్టుకుని పార్టీకి ప్రచారం చేయమని అడిగిన సంగతి తెలుగుదేశం ఎంపీలు, నాయకులు మర్చిపోయారా? ఒకే వేదికపై నుంచి పవన్‌తో ప్రచారం చేయించుకున్న సంగతి మర్చిపోయారా? చంద్రబాబు ఇచ్చిన హామీలన్నిటికీ తానే పూచీ అని పవన్ కల్యాణ్ చెప్పిన విషయాన్ని మర్చిపోయారా? ఇపుడు అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ ఒక మాట అన్నాడని తెలుగుదేశం నాయకులు, ఎంపీలు రెచ్చిపోతున్నారు. పవన్ టీఆర్‌ఎస్‌తో కలసిపోయాడని ప్రచారం చేసేవరకు వెళ్లిపోయారు. పవన్ - కేసీఆర్ ఒక్కటైపోయారని ప్రచారం చేసేవరకు వెళ్లారు. తెలుగుదేశం పార్టీ ఎంపీలను గానీ, ప్రభుత్వాన్ని గానీ ఎవరూ విమర్శించకూడదా? ఎవరు విమర్శిస్తే వారు కేసీఆర్‌కు అనుకూలమని ప్రచారం చేస్తారా? ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయిన ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని ఎందుకు సస్పెండ్ చేయలేదని వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ ప్రశ్నిస్తే మీరు కేసీఆర్‌తో కలసిపోయారంటూ దుష్ర్పచారానికి తెలుగుదేశం పార్టీ వారు దిగజారారు. తెలుగుదేశం పార్టీ అధినాయకుడు ఆరోజు ఎందుకు పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్లి కాళ్లు పట్టుకున్నారు... ఈరోజు తెలుగుదేశం నాయకులు ఎందుకు పవన్ కల్యాణ్ జుట్టు పట్టుకుంటున్నారు? ఈ ప్రశ్నలకు ప్రత్యేకంగా జవాబులు వెతకనవసరం లేదు. తెలుగుదేశం పార్టీ నైజమే అది. ఆ పార్టీ అధినాయకుడి నైజమే అది. ఆయన దగ్గర నుంచి కింది స్థాయి వరకు నాయకులంతా ఆ నైజాన్ని పుణికి పుచ్చుకున్నారు.
 నారావారి వాడుకుని వదిలేసే నైజానికి అనేక ఉదాహరణలు... ః
 - తెలుగు ప్రజల ఆరాధ్య నటుడు, వెండితెర వేలుపు నందమూరి తారకరామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించిన వ్యక్తి. ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన నేత. ఆయన్ని వాడుకున్నారు వెన్నుపోటు పొడిచి వదిలేశారు.
 - ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుడిని చేసిన వెంటనే ఆయన కుటుంబంలో ఎక్కడా వ్యతిరేకత రాకుండా ఆయన కుమారుడు నందమూరి హరికృష్ణను తీసుకొచ్చి అందలమెక్కించారు. ఎమ్మెల్యే కాకపోయినా ట్రాన్స్‌పోర్ట్ మినిస్టర్‌ను చేశారు. ఆ తర్వాత పక్కకు నెట్టేశారు. వాడుకుని వదిలేశారు.
 - తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావుదీ అదే కథ. తెలుగుదేశం పార్టీని స్థాపించడానికి పూర్వమే ఎన్టీఆర్ అడుగులో అడుగువేసి నడిచిన వ్యక్తి ఆయన అల్లుడు దగ్గుబాటి. ఎన్టీఆర్‌ని దించేసేటపుడు దగ్గుబాటిని తీసుకొచ్చి ఆయన సలహాలను ఆలోచనలను వాడుకున్నారు. ఆ తర్వాత ఆయన్ను కూడా వదిలేశారు. ఆయన ఇపుడు కాంగ్రెస్, బీజేపీల చుట్టూ తిరుగుతున్నారు.
 - ఎన్టీఆర్ కుటుంబంలోనే మరో వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్. పెద్ద ఎన్టీఆర్‌ను పోలి ఉంటాడని, కొన్ని సినిమాలు సక్సెస్ అయ్యాయని చూసుకుని ఆయన్ను తీసుకువచ్చారు. 2009 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్‌ను రాష్ర్టమంతా ప్రచారం కోసం తిప్పారు. ఆ తర్వాత ఆయన్నీ వదిలేశారు. అంతేకాదు అసలు ఆయన సినిమాలు కూడా మన తెలుగుదేశం కార్యకర్తలు చూడకూడదని హుకుం జారీ చేశారు. లోకేశ్ కోసమే జూనియర్ ఎన్టీఆర్‌ను పక్కకు నెట్టేశారు.
 - అలనాటి అందాలనటి జయప్రద. ఆమెనూ అంతే. పార్టీలో ఆమెను సాధ్యమైనంతగా వాడుకున్నారు. ఆ తర్వాత వదిలేశారు.
 - ఇలా చెప్పుకుంటూ పోతే కొండవీటి చాంతాడంత ఉంటుంది జాబితా. ఆ జాబితాలో తాజా ఉదాహరణ పవన్ కల్యాణ్. ఆయన్ని 2014 ఎన్నికల్లో ప్రచారం కోసం వాడుకున్నారు. ఇపుడు వదిలించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
  ఎన్నికలకు ముందు పవన్ కల్యాణ్‌నుకాళ్లు పట్టుకుని తీసుకొచ్చిన చంద్రబాబు ఇపుడు తమ నాయకుల చేత ఆయన్ని తిట్టిస్తున్నారు. సినిమాలు చూసుకోండి మీకు రాజకీయాలెందుకు అని చెప్పిస్తున్నారు. మళ్లా ఎన్నికల ముందు వచ్చి సపోర్ట్ చేస్తే చాలు ఆయనకి. మిగిలిన సమయమంతా ఎవరు పని వాళ్లు చేసుకోవాలి. ఏం చేసినా చంద్రబాబును, ఆయన పార్టీ నాయకులను ఎవరూ ఏమీ అనకూడదు. అదే మని నిలదీయకూడదు. ఇలాంటి దౌర్భాగ్యమైన రాజకీయాలు నడపడంలో చంద్రబాబు నాయుడు దిట్ట. దీన్నంతటినీ ప్రజలు గమనిస్తున్నారు. వాడుకుని వదిలేయడమనే చంద్రబాబు పాలసీని చూస్తున్నారు. పాపం ఈ విషయం తెలియక పవన్ కల్యాణ్ చంద్రబాబు చెంతకు వెళ్లాడు. ఇపుడు ఆయన చేతులు కాలుతున్నాయి. ఆకుల కోసం వెతుక్కుంటున్నాడు. ఈ విషయాన్ని పవన్ కల్యాణ్ అభిమానులు కూడా గ్రహించారు. తెలుగుదేశం పార్టీ కుట్రను, ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుయుక్తులను, నైజాన్ని రాష్ర్ట ప్రజలు మరీ ముఖ్యంగా పవన్ కల్యాణ్ అభిమానులు గ్రహిస్తున్నారు. 

No comments:

Post a comment